Jump to content

ముంజేయి

వికీపీడియా నుండి
ముంజేయి
మెజెంటాలో చూపిన భాగం, ముంజేయి
Identifiers
TAA01.1.00.024
FMA9663
Anatomical terminology

మోచేయి, మణికట్టుల మధ్య ఉన్న భాగాన్ని ముంజేయి అంటారు. శరీర నిర్మాణ శాస్త్రంలో, ఇది చేతి దిగువ భాగాన్ని సూచిస్తుంది. ఎగువ భాగాన్ని దండచేయి అని దండ అనీ అంటారు. కాలికి సంబంధించి మోకాలికి, చీలమండ కీళ్లకూ మధ్య ఉండే భాగానికి ఇది సమానం.

నిర్మాణం

[మార్చు]

ముంజేతిలో రత్ని (రేడియస్), అరత్ని (అల్నా) అనే రెండు పొడవైన ఎముకలు ఉంటాయి. [1] ఈ రెంటిమధ్య మీదను, క్రిందను కీళ్ళు (రేడియో అల్నార్ జాయింట్స్) ఉంటాయి. రెండుకీళ్ళ మధ్య ఈ రెండు ఎముకలను ఎముకలనడిమి పొర (ఇంటర్సోసియస్ మెంబ్రేన్) అనే దృఢమైన తంతువుల పొర కలుపుతుంది. ఈ తంతువుల పొర ముంజేతిని ముందు, వెనుకల భాగములుగా వేఱు చేస్తుంది. ఈ పొరపైనా, ఎముకల పైనా ముంజేతి కండరములు ఉంటాయి. కండరములను కప్పుచు, తంతుకణజాలపు పొర (డీప్ ఫేషియా), ఆ పొరపై కొవ్వుపొర (సూపర్ఫిషియల్ ఫేషియా) ఉంటాయి. చివరగాగా, ముంజేయి చర్మంతో కప్పబడి ఉంటుంది. సాధారణంగా ముంజేతి ఉపరితలంపై వెంట్రుకలు వెనుకవైపు ఎక్కువగాను, ముందువైపు తక్కువగా ఉంటాయి.

కండరాలు

[మార్చు]

ముంజేతిలో మణికట్టును ముడుచు కండరాలు (ఫ్లెక్సార్స్), చాచు కండరాలు (ఎక్స్‌టెన్సార్స్), వేళ్ళ ముడుచు కండరాలు, చాపు కండరాలు, మోచేతిని ముడుచు కండరాలు (బ్రాఖియోరేడియాలిస్), చేతిని బోర్లా లేదా వెల్లకిలా తిప్పే ప్రొనేటర్‌లు, సూపినేటర్‌లతో సహా అనేక కండరాలు ఉంటాయి. అడ్డుకోతలో, ముంజేతిని రెండు అరలుగా (ఫేషియల్ కంపార్ట్‌మెంట్స్) విభజించవచ్చు. వెనుక (పృష్ఠ) భాగంలో చేతుల చాపు కండరాలు ఉంటాయి. వీటికి రేడియల్ నరాల ద్వారా నాడీప్రసరణ జరుగుతుంది. ముందు (పూర్వస్థ) భాగంలో ముడుచు కండరాలు ఉంటాయి. వీటికి ప్రధానంగా మధ్యస్థ నాడి (మీడియల్ నెర్వ్) ద్వారా నాడీప్రసరణ జరుగుతుంది. ముడిచే కండరాలు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తాయి కాబట్టి ఇవి‌ చాపే కండరాల కంటే భారీగా ఉంటాయి. ఇవి గురుత్వాకర్షణ వ్యతిరేక కండరాలుగా పనిచేస్తాయి. అల్నార్ నాడి కూడా ముంజేతి పొడవునా ఉంటుంది[2].

రక్తప్రసరణ

[మార్చు]

ముంజేతి వెలుపలి ధమని (రేడియల్ ఆర్టెరీ), ముంజేతి లోపలి ధమని (అల్నార్ ఆర్టెరీ), వాటి శాఖలు ముంజేతికి రక్తప్రసరణ చేస్తాయి. ఇవి సాధారణంగా రత్ని, అరత్నిల పూర్వ ముఖం మీద, మొత్తం ముంజేతి పొడవునా ఉంటాయి. ముంజేతి ఉపరితలములో ప్రధానంగా ఉండే సిరలు సెఫాలిక్, మధ్యస్థ యాంటీబ్రాకియల్, బేసిలిక్ సిరలు. ఈ సిరలను ద్రవాలు, ఔషధాలు, లేదా రక్తము ఎక్కించుటకై కృత్రిమ నాళికలు చొప్పించుటకు లేదా పరీక్షలకు రక్తము గ్రహించుటకోసం ఉపయోగిస్తారు. అయితే రక్తం తీయడానికి ముంజేతిగుంటను (క్యూబిటల్ ఫోసా) ఎక్కువగా వాడతారు.

ముంజేతిలోను, చేతిలోను సిరలు

ఎముకలు, కీళ్ళు

[మార్చు]

ముంజేతి లోని ఎముకలు రత్ని (రేడియస్) పార్శ్వాన ఉంటుంది. అరత్ని (అల్నా) మధ్యస్థంగా ఉంటుంది.

Bones of forearm, radius on left and ulna on the right
ముంజేయి ఎముకలు, ఎడమవైపు ఉన్నది రత్ని, కుడివైపు ఉన్నది అరత్ని

రత్ని

[మార్చు]

రత్ని (రేడియస్) ఎముకకు పైన పళ్ళెం వలె శీర్షం ఉంటుంది. ఆ శీర్షం, దండఎముక (హ్యూమరస్) క్రింది భాగపు పార్శ్వంలో బంతివలె ఉండు కాపిట్యులమ్ తో సంధానమై మోచేతి కీలులో ఒక భాగంగా ఉంటుంది. రత్ని శీర్షం మధ్యస్థంగా అరత్ని మీదిభాగంతో మీది రత్ని అరత్నీ కీలులో (ప్రాక్సిమల్ రేడియో అల్నార్ జాయింట్) సంధానమై ఉంటుంది. రత్ని అరత్నితో చలిస్తూ ఉంటుంది.

రత్ని క్రిందిచివర అరత్ని క్రింది భాగంతో, క్రింది రత్ని-అరత్నీ కీలులో (డిస్టల్ రేడియో అల్నార్ జాయింట్) సంధానమవుతుంది. ఇది మణికట్టు కీలులో భాగం.

అరత్ని

[మార్చు]

పైభాగాన, అరత్ని (అల్నా) యొక్క ట్రోక్లియార్ నాచ్ అనే గతుకు, దండయెముక (హ్యూమరస్) క్రిందిభాగంలో మధ్యస్థముగా డమరువు ఆకారంలో ఉండే ట్రోక్లియాతో కలిసి మోచేతి కీలులో ఒక భాగమై చలిస్తుంది. రేడియల్ నాచ్ మోచేయి వద్ద రత్ని శీర్షంతో కలిసి మీది రత్ని అరత్ని కీలులో చలిస్తుంది. [3]

రెండవ చివర, ఇది క్రింది రత్ని అరత్ని కీలులో (డిష్టల్ రేడియో అల్నార్ జాయింట్‌) భాగంగా ఉంటుంది. మణికట్టుతో కూడా కలిసి చలిస్తుంది. [4]

కార్యములు

[మార్చు]

మోచేతి వద్ద కదలిక ద్వారా ముంజేతిని మడిచి దండ చేతికి దగ్గరకు తీసుకురావచ్చు, సాచి, దానినుండి దూరంగా తీసుకురావచ్చు. ముంజేతిని తిప్పవచ్చు, తద్వారా చేతి అరచేతిని బోర్లాగా, వెల్లకిలా పెట్టవచ్చు. [5]

మూలాలు

[మార్చు]
  1. "Forearm". The Lecturio Medical Concept Library. Retrieved 2021-06-22.
  2. Mitchell, Brittney; Whited, Lacey (2020-08-15). "Anatomy, Shoulder and Upper Limb, Forearm Muscles". National Center for Biotechnology Information, U.S. National Library of Medicine. StatPearls Publishing LLC. Retrieved 22 June 2021.
  3. "Structure of The Forearm". The Lecturio Medical Concept Library. Retrieved 2021-06-22.
  4. Standring, Susan (2016). Gray's anatomy : the anatomical basis of clinical practice (Forty-first ed.). [Philadelphia]. ISBN 9780702052309. OCLC 920806541.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  5. Standring, Susan (2016). Gray's anatomy : the anatomical basis of clinical practice (Forty-first ed.). [Philadelphia]. ISBN 9780702052309. OCLC 920806541.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
"https://te.wikipedia.org/w/index.php?title=ముంజేయి&oldid=4186927" నుండి వెలికితీశారు