భారతి దేవి రంగా
భారతీ దేవి రంగా | |
---|---|
దస్త్రం:Bharati devi Ranga.jpg | |
జననం | భారతీ దేవి 1908 గుంటూరు జిల్లా మాచవరం |
మరణం | 1972 సెప్టెంబర్ 27 |
ప్రసిద్ధి | స్వాతంత్ర సమర యోధురాలు |
మతం | హిందూ |
భార్య / భర్త | ఎన్.జి.రంగా |
తండ్రి | సుబ్బయ్య, |
తల్లి | పిచ్చమ్మ |
భారతీ దేవి రంగా (1908 - 1972) గా పిలువబడే గోగినేని భారతీ దేవి గారు ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు ఎన్. జి, రంగా గారి ధర్మపత్ని. రైతాంగా శ్రేయస్సు కొరకు కృషి చేసిన మహిళా నాయకురాలు.[1]
బాల్యం, విద్య
[మార్చు]భారతీ దేవి గుంటూరు జిల్లా మాచవరం గ్రామానికి చెందిన వెలగా సుబ్బయ్య, పిచ్చమ్మ దంపతులకు 1908లొ జన్మించింది. వీరిది వ్యవసాయ కుటుంబం. ఈమె బాల్యంనందు చదివిన విద్య అతి సామన్యమైనది.ఇంటి వద్దే తెలుగు, ఇంగ్లీషు భాషలు నేర్చుకుంది.
1924 లో గోగినేని రంగనాయకులు (ఎన్.జి. రంగా) గారితో ఈమె వివాహం జరిగింది. ఆ తరువాత రంగా గారి సహచర్యంతో ఉన్నత చదువులు అభ్యసించింది, 1923 లో గుంటూరులో ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారి శారదా నికేతన్ లోనూ, 1925 లోమద్రాసు విద్యోదయ పబ్లిక్ స్కూల్ లో చదివింది, ఆ తరువాత రంగా గారితో ఇంగ్లండు వెళ్ళి 1926 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం చెందిన రస్కిన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్సులో విద్య అభ్యసించింది. రంగా గారితో దేశ, విదేశ పర్యటనలలో పాల్గొని ఒక ఉత్తమ మహిళా నాయకురాలుగా రూపొందింది.[2]
వ్యవసాయ కుటుంభాలలో విదేశీ విద్య గడించిన తొలి మహిళ భారతీ దేవి. ఆ తరువాత ఆమె ఎంతగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నా రైతు బిడ్డగా 1936 నుండి స్వయంగా నిడుబ్రోలలో తన గృహం గోభూమి లో ఉంటూ వ్యవసాయాన్ని చేసేవారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలలో కృషి చేయమని, ఆధునిక పద్ధతులను పాటించమని రైతులకు సలహలు ఇచ్చేది.
స్వాతంత్ర పోరాటంలో
[మార్చు]1930 లో మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి,తన భర్త అదుగుజాడలలో భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నది. అస్పృశ్యత నిర్మూలన కొరకు 1931 లో భజన సంఘాలను స్థాపించింది. 1932 లో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మూల్పూరి చుక్కమ్మ గారితో కలిసిమహిళా సత్యాగ్రహ శిభిరం నిర్వహించి 500 రూపాయలు జరిమానాతో పాటు ఒక సంవత్సరము కారాగారంలో ఉంది,
1933లో గాంధీజీ ఆంధ్ర పర్యటనలో రంగా గారితో కలిసి పాల్గోంది. 1935 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభురాలుగా ఏన్నికైంది. 1935 లో భారతీయ కిసాన్ సమ్మేళన్ సభురాలిగా ఏన్నికై 1940 లోనూ, తిరిగి 1954 లోనూ దానికి అద్యక్షురాలుగా పనిచేసింది.
భారతీ దేవి 1936 లో గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలుగా ఎన్నికైంది.1940-42 మధ్య ఆంధ్ర కర్షక కాంగ్రెస్ కు అధ్యక్షురాలుగా పనిచేసింది. 1940లో ప్రకాశాం జిల్లా ఇడుపలపాడు లోను 1941లో కడప జిల్లా చెన్నూరు లోనూ రైతాంగ విద్యాలయాలు నిర్వహించారు.
1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గోంది. రంగా గారు కారాగారంలో ఉన్నప్పుడు రైతు విద్యాలయాన్ని తానే సమర్దవంతంగా నిర్వహించింది. 1946-47 లో మద్రాసు రాష్ట్రంలో విద్య విషయక సలహదారుల కమిటీలో సభ్యురాలిగా ఉంది.
రాజకీయ జీవితం
[మార్చు]భారతీ దేవి మంచి వక్త, అనేక రైతాంగ సదస్సులు, విద్యాలయాలు పెట్టి వాటిని నిర్వహించారు. పొదుపు ఉద్యమం చేపట్టి స్త్రీలలో ఆర్థిక స్వాలంబనకు దోహదపడింది. 1956లో కృష్ణా జిల్లా ఘంటసాలలో ఆంధ్ర మహిళా సంఘ అధ్యక్షురాలుగా పనిచేసింది. గోదావరి వరద సమయంలోనూ కన్నతల్లి వలె విశేష సేవలు చేసింది. 1952-53లో రాయలసీమ కరవు వచ్చినపుడు బాధితుల సహాయానికై శ్రమించింది. "అన్నపూర్ణ" అని కొనియాడబడింది.
1952లో కృషికార్ లోక్ పార్టీ తరుపున తెనాలి లోక్ సభా స్థానానికి పోటి చేసి ఓడిపోయారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలికి 1958 లో కృషికార్ లోక్ పార్టీ సభురాలుగా ఏన్నికై 1964 వరకు పనిచేసారు. రాష్ట్ర మంత్రి పదవిని ఇవ్వజూపగా నిరాకరించారు,
శాసన మండలిలో సహకార వ్యవసాయం పై 17 వ భారత రాజ్యంగ చట్ట సవరణ చేయరాదంటూ ఆమె చేసిన సుదీర్ఘీ ప్రసంగం చారిత్మాత్మకము. 1972లో ఒంగోలు లోక్ సభా స్థానానికి స్వతంత్ర పార్టీ తరుపున పోటి చేసి పరాజయం పొందారు.
సుదీర్ఘమైన రంగాజీ రాజకీయ ప్రస్థానంలో భారతీ దేవి ఆయన అడుగుజాడలలో చివరవరుకు కొనసాగింది.
చరమాంకం
[మార్చు]దేశ స్వాతంత్ర్యం కొరకు నిస్వార్దంగా పనిచేసానని చెప్పి స్వాతంత్ర్య యోధులకు ఇచ్చే ఫించన్ తీసుకోలేదు. 1972లో వినయాశ్రమం లో ఆమె చివరి ప్రసంగం చేసింది. శ్రీమతి భారతీదేవి రంగా 1972 సెప్టెంబరు 27 న చనిపోయింది. వీరికి సంతానం లేదు, పదవులు ఆశించకుండా నిస్వార్దంగా ప్రజాసేవలో తరించిన ధన్య జీవులు,ఆదర్శ దంపతులు ఆచార్య రంగా.భారతి దేవి రంగా గారులు.
మూలాలు
[మార్చు]- ↑ ఎన్ జి రంగా, ఆచార్య (1975). భారతతీ దేవి స్మృతులు - ఎన్, జి, రంగా. నిడిబ్రోలు: కిసాన్ పబ్లికేషన్. pp. 1–188. Archived from the original on 2021-06-24. Retrieved 2021-06-22.
- ↑ భారతీదేవి గోగినేని (2005). 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం. హైదరాబాదు: తెలుగు విశ్వవిద్యాలయం. pp. పేజీ 400-01.