బొబ్బిలియుద్ధనాటకము
బొబ్బిలియుద్ధనాటకము | |
1934లో ప్రచురితమైన "బొబ్బిలియుద్ధం" రెండవ కూర్పు. | |
కృతికర్త: | వేదం వేంకటరాయశాస్త్రి |
---|---|
ముద్రణల సంఖ్య: | 5 |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | బొబ్బిలి యుద్ధం |
విభాగం (కళా ప్రక్రియ): | నాటకం |
ప్రచురణ: | వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్ |
విడుదల: | 1916 |
పేజీలు: | 113 |
బొబ్బిలి యుద్ధము సుప్రసిద్ధ తెలుగు నాటకం. దీనిని వేదం వెంకటరాయ శాస్త్రి గారు 1916 సంవత్సరంలో రచించారు. ఈ నాటకానికి ప్రధాన ఇతివృత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టం అయిన బొబ్బిలి యుద్ధం. 1757 జనవరి 24 తేదీన బొబ్బిలి సంస్థాన సైన్యానికి, ఫ్రెంచి, విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికీ మధ్య జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధంగా పేరుగాంచింది.
కథాసందర్భము
[మార్చు]గోలకొండ నైజాముగారు ఉత్తరసర్కారులలో జమీన్దారులవలన కప్పము తండు మని ఫ్రెంచివారి సేనాపతిని బుస్సీదొరను నియమించి, ఆతనికి అతని ఫ్రెంచి దండునకు దోడుగా గొప్ప గోలకొండ సైన్యము నిచ్చి, హైదర్జంగు అనువానిని దివానుగా నేర్పరించినారు. వారు వచ్చి రాజమహేంద్రవరముకడ విడిసి ఉత్తరమందలి జమీన్దారులకు తెలిపినారు. వెంటనే విజయనగరము నేలు విజయరామరాజు బూసీ దర్శనమునకు వచ్చెను. బొబ్బిలి జమీనును హరింపవలయు నని ఎప్పుడును కోరుచుండువాఁడు విజయరామరాజు గోలకొండవారి హర్కారాలకు లంచమిచ్చి వారు బొబ్బిలి రంగారాయనికై తెచ్చిన జాబును ఆయనకు చేరనీక ఆపివైచెను. అందువలన మొగలాయీల రాక తెలియక బొబ్బిలిదొర రాజమహేంద్రవరమునకు బూసీబేటికి రా లేదు. రాజు మొగలాయీల బేటికి రమ్మని రంగారాయనికి తాను జాబు పంపినట్లును, గర్వాంధుఁ డై యాతఁడు రానియట్లును బుస్సీని నమ్మించి, ఆయహంకారము నడంచుటకై వారు బొబ్బిలిని కొట్టవలసినట్లును, రంగారాయఁడు నిరంతరము తనకు ఉపద్రవములు చేయుచుండుటవలన తాను తన పేష్కస్సును ఇయ్యలేక పోయి నట్లును ఇప్పుడు వారు ఆతనిం గొట్టి యాతని జమీనును తన కిత్తురేని రెండు జమీనుల పైకమును నిలువలతో గూడ సమస్తమును తానేకట్టునట్లును, వారి నొడంబఱిచెను. ఆ ప్రకారము నెఱవేర్చునందులకై బుస్సీకి తెలియనీయక లక్షవరహాలు హైదరుజంగునకు లంచము ఇయ్యనొప్పుకొనెను.
బొబ్బిలివారు ఈవృత్తాంతము నేమియు నెఱుంగక 50 పెండ్లిండ్ల మహోత్సవములో మునింగి యుండిరి. రాత్రి కోటలో ఊరేగింపు ముగియుచుండగా, తెల్లవాఱఁ బోవుచుండగా, ఊరి బయట రాజును మొగలాయీలును ముట్టడి ముగించిరి. పగలు రాయబారములు. బూసీదూత వచ్చి రంగరాయని దర్శించి హైదర్జంగుమాటగా, తత్క్షణమే వీరు నౌబత్తును మాన్పవలసినట్లును, జాముసేపులో, కోట వెడలి పాలకొండకు పోవలసినట్లను తెలిపెను. వీరు అందులకు అంగీకరింపక బదులు రాయబారము పంపిరి, వీరి రాయబారిని హైదరు లోనగువారు తిరస్కరింపఁగా నాతడు అడ్డ మయినవారి నెల్ల తెగనఱకుకొని కోటకు వచ్చి తన పోక ఫలింప దాయెనని రాయనికిం జెప్పెను. అది మొదలు యుద్ధ నిశ్చయము, బొబ్బిలివారి సన్నాహము. ఆరాత్రి 12 గంటలప్పుడు కోటఁ గూల్చుటకు మొగలాయీల యారంభము. ఘోరయుద్ధము. కోమటి చెలువలు సయితము వైరులను బురు జెక్కనీయక పోరిరి. వెలమలు తెలగాలు బలిజెలు ఆయా బురుజులందు వైరులం జొరనీయక ప్రాణాంతము పోరాడిరి. పరాసులు ఈ బొబ్బిలి గడ్డలోని వీరుల పరాక్రమమునకు ఆశ్చర్యపడిరి, పలువురు మడిసిరి, అవశిష్టులు బురుజులం బట్టిరి.
ఈ సమయాన రంగరాయని తమ్ముడు వెంగళరాయఁడు కోట వెలువడి మొగలాయీలతో పోరి మడిసెను. ఇంతలో నిట మొగలాయీలును కోటను పలు పడగొట్టిరి. వారు లోనజొత్తు రనియు, శేషించియున్న పురుషులు మడిసిన యనంతరము ఆవైరులవలన తమకు మానరక్షకు లుండ రనియు, తలంచి, ఒక్కుమ్మడి వెలమదొరసానులు (పెండ్లికొమారితలును) తెలఁగాస్త్రీలు లోనగు ఘోషావర్ణముల మానవతులు వారి వరవుడులును కోటలోని యాఁడుఁబురుగెల్ల ఆబాలావృద్ధము పొడుచుకొని చచ్చిరి, తమ భర్తలచే నిహత లయిరి, చిచ్చుల జొచ్చిరి. కుమారులు తల్లులం జంపిరి, శిశువులను తండ్రులు కెడపిరి.
ఇట్లు గోహారయిన వెంటనే రంగారావు కోట వెలువడి మొగలాయి డేరాల మీఁదికి పోయి దుమికి, వీరలోకభయంకరముగా పోరి, జీవముతో వైరులకు పట్టువడక, సంధి కొడంబడక, అవయవములు ఆయుధహతులచే లుప్తములు కాఁగా కాఁగా సూర్యోదయ సమయమున వీరస్వర్గము నలంకరించెను.
ఈతనికుమారుని శిశువును చినవేంకటరాయని పినతల్లికడకు సామర్లకోటకు కొనిపోవుచు దాది యీ మొగలాయీలకు పట్టువడెను. బుస్సీదొర ఆశిశువును తగిన రక్షకపరివార మిచ్చి సామర్లకోటకు పంపెను.
ఈవృత్తాంత మెల్ల తెలియుడు రాజాము ఠాణాలో నున్న తాండ్ర పాపారాయఁడు రంగారాయని బావ, తనదివాను మిరియాలసీతన్నతోఁ గూడ, బొబ్బిలికి వచ్చి రాత్రిడేరాలో నిద్రితుని విజయరామరాజును నిద్ర లేపి, బొబ్బిలిరాణి మల్లమ్మదేవి పలికిన శాపముప్రకారము చిత్రవథ గావించి, తాను పొడుచుకొని చచ్చెను.
పిమ్మట సామర్లకోట నీలాద్రిరావు చినవేంకటరాయని నైజాముగారి దర్శనమునకుం గొనిపోయెను. ఈ లోపల ఉత్తరసర్కారు ఇంగ్లీషువారి ఏలుబడి లోనికి వచ్చినందున నైజామువారి సిఫారసుచేతను ధర్మ్యమగుటచేతను మదరాసు గవర్నమెంటు వారు బొబ్బిలి సంస్థానమును చినవేంకటరాయని వారికి జమీనుగా నొసంగిరి.
ప్రధాన పాత్రలు
[మార్చు]పురుషులు
[మార్చు]- పూసపాటి విజయరామరాజు, లేక, కళింగరాజు, లేక, రాజు - విజయనగరము రాజు, క్షత్త్రియుఁడు.
- గుండాల అప్పన్న (పంతులు) - రాజుగారి కార్యస్థుఁడు.
- బూసీ - గోలకొండ నైజాముగారి ఫ్రెంచి సేనానాయకుఁడు - ఈ రణము సర్వాధికారి.
- హైదరుజంగు - బూసీకి దివాను.
- నీలాద్రిరాయఁడు - సామర్లకోట జమీన్దారు, పిఠాపురము దొర.
- రంగారావు, లేక, రంగారాయనింగారు, లేక, రంగారాయఁడు - బొబ్బిలి జమీన్దారుఁడు.
- వెంగళరావు - రంగారాయని తమ్ముఁడు.
- ధర్మారావు - రంగారాయని బావమఱఁది. ఆతని దివాను.
- వేంకటరంగారావు, లేక, చిన్న వేంకటరాయఁడు - రంగారాయని కుమారుఁడు, బాలుఁడు.
- చెలికాని వెంకయ్య. - రాయనింగారి బంధువు.
- తాండ్ర పాపయ్య. - రంగారాయని బావ.
- మిరియాల సీతన్న. - పాపయ్యకు దివాను.
- నైజాము. - గోలకొండ ప్రభువు.
స్త్రీలు
[మార్చు]- మల్లమ్మ దేవి. - బొబ్బిలిరాణి.
- వేంకటలక్ష్మి. - బొబ్బిలివారి పెద్ద దాసి.
- సుందరమ్మ. - రంగారాయని కూఁతురు. (ఒకపెండ్లి కూఁతురు)
- అవ్వ. - బొబ్బిలిరాయనింగారి పౌరోహితునిభార్య.
మూలాలు
[మార్చు]- బొబ్బిలియుద్ధ నాటకము, రెండవ కూర్పు, వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మదరాసు, 1934.
- బొబ్బిలియుద్ధ నాటకము, శ్రీ వేదము వేంకటరాయశాస్త్రి కృతము, ఐదవ కూర్పు, వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మదరాసు, 1983.
బయటి లింకులు
[మార్చు]- బొబ్బిలి యుద్ధము నాటకము, రెండవ కూర్పు మొత్తం పుస్తకం. Archived 2009-03-03 at the Wayback Machine