అక్షాంశ రేఖాంశాలు: 26°N 70°W / 26°N 70°W / 26; -70 (Bermuda Triangle)

బెర్ముడా ట్రయాంగిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బర్ముడా ట్రయాంగిల్
నాసా వారి పశ్చిమ అట్లాంటిక్ చిత్రపటం. ఇందులో "బెర్ముడా త్రికోణం" అనబడే ప్రాంతం త్రికోణాకృతిలో గుర్తించబడింది..
వర్గీకరణ
వర్గీకరణ:సహజాతీత స్థలాలు
(Paranormal places)
వివరణ
ఇతర పేర్లు:డెవిల్స్ ట్రయాంగిల్
(Devil's Triangle)
దేశం:అంతర్జాతీయ జలాలు
స్థితి:పట్టణ కథ

బెర్ముడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రం లోని ఒక ప్రాంతం. దీనినే "డెవిల్స్ ట్రయాంగిల్" అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచీ ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. ఇక్కడ జరిగిన సంఘటనల గురించి అనేక కథలు, సిద్ధాంతాలు, ఊహలు ప్రచారంలో ఉన్నాయి.

సామాన్యమైన మానవ తప్పిదాలు లేదా ప్రకృతి సహజమైన భౌతిక విషయాలు ఇక్కడి ఘటనలకు సంతృప్తికరమైన కారణాలను చెప్పలేకపోతున్నాయని పలువురి భావన. కనుక గ్రహాంతర వాసులు, అసాధారణమైన ప్రాకృతిక నియమాలు ఇక్కడ పనిచేస్తున్నాయని విస్తృతమైన అభిప్రాయాలున్నాయి.[1] ఇక్కడి ఘటనలపై విస్తారంగా పరిశోధనలు జరిగినాయి. చాలా ఘటనల గురించి ప్రజలలో ఉన్న అభిప్రాయాలు అపోహలని, వాటిని రిపోర్టు చేయడంలో అసత్యాలు కలగలిసి పోయాయని తెలుస్తున్నది. అయినాగాని, ఇతర ప్రాంతాలలో జరిగే ఇటువంటి ప్రమాదాలు లేదా ఘటనలతో పోలిస్తే ఇక్కడ జరిగినవి కొంత భిన్నంగా ఉన్నాయని, వీటికి సరైన వివరణలు లభించడం లేదని వివిధ నివేదికలలో పేర్కొనబడింది.[2][3][4]

బెర్ముడా త్రికోణం పరిధి, హద్దులు

[మార్చు]
బెర్ముడా త్రికోణం

"బెర్ముడా త్రికోణం" అని ప్రసిద్ధమైనా గాని ఇది కచ్చితంగా ఒక త్రికోణం కాదు. సువిశాల సముద్రంలో కొంత పెద్ద భాగం. ఒక్కొక్క రచయితా ఈ త్రికోణాన్ని వివిధ హద్దులతో చూపారు. కొందరి ప్రకారం ఇది ఫ్లోరిడా జలసంధి, బహామా దీవులు, మొత్తం కరిబియన్ దీవి, అజోరెస్‌కు తూర్ప భాగాన ఉన్న అట్లాంటిక్ సముద్రం - వీటి మధ్య ట్రెపిజాయిడ్ ఆకారంలో విస్తరించిన ప్రదేశమే బర్ముడా త్రికోణం. మరికొందరు పరిశీలకులు, రచయితలు పైన చెప్పిన భాగాలకు మెక్సికో సింధు శాఖను కూడా ఈ త్రికోణంలో కలిపి చెబుతారు. ఎక్కువ రచనలలో ఉన్న త్రికోణం శీర్షాలు సుమారుగా - ఫ్లోరిడా అట్లాంటిక్ తీరము, సాన్ యువాన్, పోర్టోరికో, అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉన్న బెర్ముడా దీవి. ఎక్కువ ప్రమాద ఘటనలు బహామా దీవులు, ఫ్లోరిడా తీర ప్రాంతంలో జరిగినట్లు చెప్పబడ్డాయి.

ఈ ప్రాంతం ఓడలు, విమానాలు బాగా రద్దీగా తిరిగే ప్రాంతం. అమెరికా, యూరప్‌, కరిబియన్ దీవులకు చెందిన ఓడలు, విమానాలు ఇక్కడ తరచు కనిపిస్తుంటాయి. ఈ త్రికోణం ప్రాంతలోనే గల్ఫ్ స్ట్రీమ్ సాగర అంతర్వాహిని (ocean current) ప్రవహిస్తుంటుంది. దీని 5 లేదా 6 నాట్‌ల (knots) ప్రవాహ వేగం కొన్ని ఓడలు అదృశ్యం కావడానికి కొంత దోహదం చేసి ఉండవచ్చును. అంతే కాకుండా ఇక్కడ హఠాత్తుగా తుఫానులు చెలరేగి, మళ్ళీ సమసిపోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సహజ సిద్ధమైన కారణాల వలన ఇక్కడ రద్దీగా తిరిగే ఓడలలో కొన్ని అంతుచిక్కకుండా మాయమై ఉండవచ్చును. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరికరాలు అంత బాగా అభివృద్ధి చెందకముందు.[5]

బెర్ముడా త్రికోణం కథ మొదలు

[మార్చు]

ఈ ప్రాంతంలో అసాధారణమైన, చిత్రమైన స్థితి ఏదో ఉందని మొట్టమొదట క్రిస్టోఫర్ కొలంబస్ వ్రాశాడట. క్షితిజ రేఖలో ఏవో చిత్రమైన వెలుగులు కనిపిస్తున్నాయని, దిక్సూచి కొలతలు అనూహ్యంగా, అసంబద్ధంగా ఉన్నాయని, ఆకాశంలో మంటల్లాంటివి కనిపిస్తున్నాయని తన అక్టోబరు 11, 1492 లాగ్ బుక్‌లో వ్రాసాడు.[6] అయితే ఈ దృశ్యాన్నింటికీ సహేతుకమైన సమాధానాలు ఆధునిక పరిశోధకులు ఇస్తున్నారు. ఉదాహరణకు అతను చూచిన వెలుగులు అక్కడి తీరవాసులు వంటలు చేసుకొనే సమయంలో వచ్చిన మంటల కారణంగా వచ్చాయని చెబుతున్నారు.

1950 సెప్టెంబరు 16న ఇ.వి.డబ్ల్యు జోన్స్ వ్రాసిన పత్రికా వ్యాసం బెర్ముడా త్రికోణం గురించి అలౌకికమైన, అసాధారణమయన ఊహాగానాలకు, లెక్క లేననన్ని పరిశోధనలకు ఆద్యం.[7] తరువాత రెండేళ్ళకు ఫేట్ అనే పత్రికలో " సీ మిస్టరీ ఎట్ అవర్ బేక్ డోర్",[8] అనే వ్యాసాన్ని జార్జ్ సాండ్ అనే రచయిత వ్రాసాడు. ఇందులో అమెరికా నౌకాదళానికి చెందిన ఐదు అవెంజర్ బాంబర్ విమానాలు - అన్నింటినీ కలిపి ఫ్లైట్19 అంటారు - అదృశ్యమవ్వడాన్ని వర్ణించాడు. తరువాత ఫ్లైట్19 ఘటన ఒక్కటే వివరంగా అమెరికన్ లీజియన్అనే పత్రిక ఏప్రిల్ 1962 సంచికలో వచ్చింది. [9] ఇందులో వ్రాసిన ప్రకారం ఆ విమాన ప్రయాణ నాయకుడు అన్నమాటలు - "మేము తెల్లని నీటి ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ అంతా అయోమయంగా ఉంది. మేము ఎక్కడున్నామో తెలవడంలేదు". తరువాత ఇదే ఘటన గురించి విన్సెంట్ గడ్డిస్అనే రచయిత ఫిబ్రవరి 1964లో అర్గొసీ పత్రికలో వ్రాసిన వ్యాసం ఈ ఘటనకు మిస్టరీ రూపాన్ని ప్రసిద్ధం చేసింది. ఈ రచనలోనే "ది డెడ్లీ బెర్మూడా ట్రయాంగిల్"[10] అనే ఆకర్షణీయమైన పేరు వాడాడు. ఇదే రచయిత మరుసటి యేడాది ఇన్విజిబల్ హొరైజన్స్ అనే పుస్తకంలో ఇక్కడి ఘటనల గురించి మరింత వివరంగా వ్రాశాడు.[11] తరువాత ఈ మిస్టరీ గురించి అనేక రచనలు వెలువడ్డాయి. జాన్ వాలేస్ స్పెన్సర్ లింబోఆఫ్ ది లాస్ట్, 1969);[12] ఛార్లెస్ బెర్లిట్జ్ (ది బెర్మూడా ట్రయాంగిల్, 1974);[13] రిచర్డ్ వైనర్ (ది డెవిల్స్ ట్రయాంగిల్, 1974) [14] లాంటివి. ఈ రచనలన్నింటిలోనూ ఎకర్ట్ ప్రతిపాదించి అసహజ, అలౌకికమైన మిస్టరీ బాణీని కొనసాగించారు;[15] కుశ్చే వివరణ

అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ డేవిడ్ కుశ్చే అనే పరిశోధకుడు అప్పటివరకూ ఉన్న వివిధ రచనలను పరిశీలించి, 1975లో ది బెర్మూడా ట్రయాంగిల్ మిస్టరీ: సాల్వడ్ అనే పుస్తకం ప్రచురించాడు.[16] ఇందులో అప్పటివరకూ ఉన్న మిస్టరీ సిద్ధాంతాలను రచయిత సవాలు చేశాడు. అతని పరిశీలనల ప్రకారం

  • ఈ బెర్ముడా త్రికోణం ప్రాంతంలో జరిగినవని చెబుతున్న అదృశ్యఘటనలు చాలా వరకు అతిశయోక్తులతోను లేదా అసంపూర్ణ పరిశోధనతోను లేదా అస్పష్ట సమాచారంతోను తెలుపబడ్డాయి.
  • కొన్ని ఇతర ప్రాంతాలలో జరిగిన ఘటనలు కూడా ఇక్కడ జరిగినట్లు చెప్పబడ్డాయి.
  • తుఫానులు తరచు వచ్చే ఇలాంటి ఇతర రద్దీ రవాణా సముద్ర ప్రాంతాలలో జరిగే ఘటనలతో పోలిస్తే ఇక్కడ జరిగినవి ఎక్కువేమీ కాదు.

మొత్తానికి కుశ్చే ఇలా తేల్చాడు - బెర్ముడా త్రికోణానికి సంబంధించిన మిస్టరీ కేవలం కల్పన. అపోహలు, నిర్హేతుక భావాలు, సంచలనాత్మక ధోరణి కారణంగా కొందరు రచయితలు అవాఛితంగా గాని లేదా ఉద్దేశ్య పూర్వకంగా గాని ఇది ఒక పెద్ద మిస్టరీ అనే అభిప్రాయాన్ని పెంచి పోషించారు.[16] §చివరిమాట, పే. 277

మరి కొన్ని అభిప్రాయాలు

నౌకా యానంతోనూ, సముద్ర ప్రయాణాలతోనూ గట్టి సంబంధం ఉన్న లండన్ లాయడ్స్ ఇన్సూరెన్స్ కంపెనీ, అ.సం.రా. తీర భద్రతా సంస్థ వంటి సంస్థల రికార్డుల ప్రకారం ఇది ప్రత్యేకంగా ప్రమాదకరమైన ప్రదేశం ఏమీకాదు. ఇతర సముద్ర ప్రాంతాలలో జరిగే ప్రమాదాలవంటివే ఇక్కడా జరుగుతున్నాయి. బెర్ముడా త్రికోణం గురించిన సంచలనాత్మకమైన కథనాలు చాలా వరకు నిరాధారమైనవి అని వీరి రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుంది.[17] [18] ఉదాహరణకు 1969లో జరిగిన ఒక ప్రమాదంలో కెప్టెన్ తప్ప మిగిలిన అందరి శరీరాలు అదృశ్యమయ్యాయని, కెప్టెన్ ఒక్కడి మృతదేహం మాత్రం కాఫీ కప్పును పట్టుకొన్న భంగిమలో ఓడలో మిగిలి ఉందని ఒక "త్రికోణం రచయిత" వ్రాసాడు. కాని నిజానికి దాదాపు అందరు మరణించినవారి శరీరాలను తీరభద్రతా సంస్థ వెలికి తీసింది.[12]

పత్రికలు, పుస్తకాలు అధికంగా "సంచలనం కలిగించే" విషయాలపై మొగ్గు చూపుతారని, అందువల్లనే ఈ త్రికోణం రచయితలు చేసిన అసాధారణ కల్పనలకు ఇంత ప్రాచుర్యం లభించిందని పలు విమర్శకుల అభిప్రాయం. (NOVA / Horizon - కార్యక్రమం ది కేస్ ఆఫ్ ది బెర్మూడా ట్రాయంగిల్ 1976-06-27) - ఇతర సముద్ర ప్రాంతాలలోనూ, తుఫానులలోనూ ఓడలు, విమానాలు ఎలా పనిచేస్తాయో, ఎలా విఫలమౌతాయో ఇక్కడ కూడా అలానే జరుగుతున్నది.[19] ఎర్నస్ట్ ట్రావెస్[20] బ్యారీ సింగర్ వంటి హేతువాద పరిశోధకులు కూడా ఈ అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. ఈ త్రికోణం చుట్టుప్రక్కల ఉన్న పెద్ద నగరాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు కలిపి ఏటా లక్షలలో వాహనాల రాకపోకలకు కేంద్రంగా ఉన్నాయి.

ప్రకృతి సహజ వివరణలు

[మార్చు]
ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ హైడ్రేటు నిలవలు ఉన్నవని భావిస్తున్న సముద్ర తీర ప్రాంతాలు- 1996 నాటి మ్యాపు. - వారి చిత్రం
పశ్చిమ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉత్తరదిశగా ప్రవహిస్తున్న గల్ఫ్ స్ట్రీమ్ అంతర్వాహిని (కృతకంగా రంగులు అద్దబడిన చిత్రం). ()
మిథేన్ హైడ్రేటులు (Methane clathrate)

భూభాగాల అంచున ఉండే మహా సముద్రాల మెరక ప్రాంతాల (భూఖండాల అరల)లో కొన్ని చోట్ల పెద్దపెట్టున మిథేన్ హైడ్రేటుల నిల్వలు ఉన్నాయి. వీటినుండి వచ్చే గాలి బుడగలు అక్కడి నీటి సాంద్రతను తగ్గించేస్తాయి. కనుక అక్కడ ఓడలు తేలియాడే గుణం (ప్లవన శక్తి) తగ్గుతుంది. ప్రయోగశాలలలో నమూనా ఓడలపై జరిగిన ప్రయోగాలలో ఇలాంటి ఓడలు అతి తక్కువ సమయంలోనే మునిగిపోవచ్చునని తెలుస్తున్నది.[21] 1981లో అ.సం.రా. జియొలాజికల్ సర్వే వారు అమెరికా తీరప్రాంతాలలో ఉన్న మిథేన్ నిల్వల గురించి ఒక శ్వేతపత్రం విడుదల చేశారు.[22] అయితే వారి వెబ్ సైటులో ఉన్న సమాచారం ప్రకారం "బెర్ముడా త్రికోణం" అనబడుతన్న ప్రాంతంలో పెద్దయెత్తున మిథేన్ వాయువు విడుదలైన దాఖలాలు ఏమీ లేవు.[23]

దిక్సూచి చలనాలు

బెర్ముడా త్రికోణంలో జరిగిన అనేక ఘటనలలో దిక్సూచి పని చేయకపోవడం లేదా అనూహ్యంగా ప్రవర్తించడం గురించి ప్రస్తావనలున్నాయి. ఇక్కడేదో ప్రత్యేకమైన లేదా బలమైన అయస్కాంత శక్తి ఉండవచ్చునని ఊహలున్నాయి కాని అటువంటి ఆధారాలు ఇంతవరకూ ఏవీ బయటపడలేదు. అంతే కాకుండా భూమిమీద వివిధ ప్రాంతాలలో భౌగోళిక ఉత్తర ధృవం, అయస్కాంత ఉత్తర ధృవం ఒకటి కాదు. కనుక ఇలాంటి పెద్ద ప్రాంతంలో ఓడలు ప్రయాణించేటపుడు దిక్సూచి సూచకాలలో తేడాలు రావడం అసహజం కాదు.

తుఫానులు

అట్లాంటిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ ప్రాంతంలో బలమైన తుఫానులు తరచు సంభవిస్తుంటాయి. వీటికారణంగా ఎంతో జననష్టం, ఆస్తి నష్టం సంభవించింది. 1502లో ఫ్రాన్సిస్కో డె బోర్బడిల్లా నాయకత్వంలోని స్పానిష్ ఫ్లీటు మునిగిపోవడం చరిత్రలో తుఫాను కారణంగా నమోదయిన మొదటి నౌకాభంగం. బెర్ముడా త్రికోణం ప్రాంతంలో జరిగిన కొన్ని ఘటనలు ప్రధాన కారణం తుఫానులు కావచ్చును.

గల్ఫ్ అంతర్వాహిని

గల్ఫ్ స్ట్రీమ్ ఆనేది మెక్సికో సింధుశాఖ నుండి ఫ్లోరిడా జలసంధి మీదుగా ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోకి ప్రవహించే ఒజ సముద్ర అంతర్వాహిని. అనగా ఇది సముద్రంలో ఒక నది లాంటిది. ఇది తన ప్రవాహంలో తేలే వస్తువులను లాగుకువెళ్ళిపోవడం సహజం. కనుక ఇక్కడ పడిపోయిన ఓడలు లేదా విమానాలు అక్కడ ఉండకుండా మరెక్కడో సుదూర ప్రాంతాలలో బయట పడడం అసహజం కాదు. 1967 డిసెంబరు 22న జరిగిన ప్రమాదంలో విచక్రాప్ట్ అనే పడవ ఒకచోటునిండి సమాచారం పంపింది కాని రక్షణాబలగం వారి పడం అక్కడికి వెళ్ళేసరికి ఆ పడవ అక్కడలేదు.

అసాధారణమైన అలలు

ప్రశాంతమైన సముద్రంలో కూడా ఒకోమారు అసాధారణంగా పెద్దవైన అలలు (అసహజ అలలు) హఠాత్తుగా సంభవిస్తుంటాయి. 1982లో అలాంటి ఒక మహాతరంగం కారణంగా న్యూ ఫౌండ్ లాండ్ సమీపంలోని సముద్రంలో ఓషన్ రేంజర్ అనబడే అప్పటి అతిపెద్ద ఆయిల్ ప్లాట్‌ఫారమ్ వూరికే తిరగబడిపోయింది. అయితే బెర్ముడా త్రికోణం ప్రాంతంలో ఇలాంటి మహాతరంగాలు రావడం గురించిన ఆధారాలు లేవు. అందునా వాటి కారణంగా అయితే విమాన ప్రమాదాలకు వివరణ ఇవ్వడం సాధ్యం కాదు.

మానవ చర్యలు

[మార్చు]
వ్యక్తుల పొరపాట్లు

తమ విధుల నిర్వహణలో వ్యక్తులు తెలిసి గాని, తెలియక గాని తప్పిదాలు చేయడం సహజం. అందునా విపత్కర పరిస్థితులలో ఇలాంటి చర్యలు జరిగే అవకాశం మరింత ఎక్కువ. ఇలాంటి తప్పిదాలే బెర్ముడా ట్రయాంగిల్‌లో జరిగిన అనేక ఘటనలకు కారణాలు కావచ్చునని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తున్నది. ఉదాహరణకు 1972లో వి.ఎ.ఫాగ్ అనే ట్యాంకర్ విధ్వంసానికి కారణం - తేలికగా నిప్పు అంటుకొనే బెంజీన్ మరకలను తుడవడానికి తీసుకోవాలసిన జాగ్రత్త గురించి ఆ పని చేసే వ్యక్తికి తగినంత శిక్షణ ఉండకపోవడమే. అలాగే 1958 జనవరి 1న హార్వే కొనొవర్ అనే వ్యాపారవేత్త మొండిగా వ్యవహరించి ఫ్లారిడా వద్ద తన పడవను తుఫాను మధ్యలోకి తీసుకువెళ్ళినందువల్ల దానిని కోల్పోయాడు. చాలా కేసులలో ధ్వంసమైన నౌకల లేదా విమానాల శకలాలు లభించనందువలన నిర్దిష్టమైన ఆధారాలు లభించడంలేదని పలు అధికారిక నివేదికలలో చెప్పబడింది.

దురుద్దేశ పూర్వకమైన చర్యలు

యుద్ధం, పైరసీ (సముద్రపు దోపిడి), దోపిడి వంటి కారణాల వల్ల కూడా కొన్ని అదృశ్య ఘటనలు జరిగి ఉండవచ్చును. ప్రపంచ యుద్ధాలలో జలాంతర్గాముల దాడి ద్వారా, లేదా సముద్రంపై ఓడల దాడి ద్వారా అనేక నావలు నాశనం చేయబడ్డాయి. వీటిలో కొన్ని రికార్డులలో కూడా నమోదు కాలేదు కనుక ఇదమిత్థంగా నిర్ధారంచడం సాధ్యం కాలేదు. ఉదాహరణకు 1918లో USS సైక్లోప్స్ అనే యుద్ధ నౌక, తరువాత రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రొటీయస్, నెరియస్ అనే నౌకలు జలాంతర్గాముల దాడులవల్ల అదృశ్యమయ్యాయని అభిప్రాయం ఉంది కాని జర్మనీ రికార్డులలో ఈ విషయం నిర్ధారం కావడంలేదు.

15వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు సముద్రాలలో పైరసీ చర్యలు తరచు జరుగుతూ ఉండేవి. వీటికి తోడు మాదక ద్రవ్యాల రవాణా చేసే ముఠాలు కూడా కొన్ని పడవల అదృశ్యానికి కారణం కావచ్చును. కరిబియన్ సముద్ర ప్రాంతంలో 1560 నుండి 1760 కాలంలో పైరసీ అధికంగా ఉండేది. (ఎడ్వర్డ్ టీచ్ బ్లేక్ బియార్డ్), (జీన్ లాఫిట్) వంటి పైరేటులు ఈ ప్రాంతంలో ప్రసిద్ధులు. లాఫిట్ కూడా ఈ బెర్ముడా త్రికోణం ఘటనలోనే మరణించాడని ఒక అభిప్రాయం ఉంది.

సముద్రం మీద దోపిడి చేసే పైరేటులే కాకుండా తీర ప్రాంతంలో మాటు వేసి, ఓడలను తప్పు దారి మళ్ళించి, వాటిని దోపిడి చేసే ముఠాలు ఉన్నాయి. వీరు సంపదలను దోచుకొని ఓడలో జనాలను చంపివేసేవారు. వీరిని (బాంకర్స్ లేదా రెక్కర్స్) అంటారు. తీరంనుండి లైటుల ద్వారా ఓడలను తప్పుదారి పట్టించడం వీరవలంబించే పద్ధతులలో ఒకటి. నాగ్స్ హెడ్, ఉత్తర కరోలినా తీరంలో ఒక గుర్రానికి లాంతరు కట్టి, దాని నడక ద్వారా ఓడలను భ్రమింపజేసే విధానం ప్రసిద్ధం.

ప్రజాబాహుళ్యంలో ఉన్న నమ్మకాలు

[మార్చు]

బెర్ముడా త్రికోణం గురించి చాలా సాహిత్యం (కాల్పనికము, పరిశోధనాత్మకమూ కూడాను) వెలువడింది. జనప్రియమైన రచనలలో అలౌకిక, అసాధారణ శక్తుల ప్రభావంవల్ల ఇక్కడి ఘటనలు జరుగుతున్నాయనేది బాగా ప్రచారం పొందిన భావం. ఒకప్పుడు గొప్పగా ప్రభవించి, తరువాత అంతరించిన (అట్లాంటిస్) అనే భూఖండపు నాగరికత సాంకేతిక పరిజ్ఞానపు అవశేషాలు బెర్ముడా త్రికోణంలో ఇంకా పనిచేస్తున్నాయని, వాటి ప్రభావం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఒక ప్రచారం. అట్లాంటిస్ నాగరికత సిద్ధాంతానికి అనుబంధమైన మరొక ప్రచారం గాథ ఏమంటే - బహామా దీవుల సమీపంలో, బెర్ముడా త్రికోణ పరిధిలో బిమిని అనే దీవి ఉంది. ఈ దీవి సమీపంలో వృత్తాకారంలో ఉన్న శిలల అమరికకు బిమిని రోడ్ అని పేరు. ఈ "రోడ్డు" ఒకప్పటి అట్లాంటిస్ నాగరికతకు చెందిన ఒక రోడ్డు లేదా గోడ లేదా మరొక కట్టడం అని అభిప్రాయం. కాని ఇది సహజమైన రాతి అమరికయేనని భూగర్భ శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.[24]

ప్రచారంలో ఉన్న మరొక భావం - గ్రహాంతర వాసులు తమ తమ రోదసి వాహనాలలో ఇక్కడికి వస్తున్నారని. వారి వాహనాలు యు.ఎఫ్.ఓ.లు (UFO)గా వివిధ రచనలలోను, సినిమాలలోను ప్రసిద్ధమయ్యాయి. గ్రహాంతర వాసుల ఇక్కడి మనుషులను, జంతువులను, పూర్తి ఓడలను కూడా ఎత్తుకుపోతున్నారనేది ఇలాంటి కథనాలలో ముఖ్యాంశం. ఈ రకమైన కథనే ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ ([స్టీవెన్ స్పీల్బర్గ్) తన సినిమా క్లోస్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ది ధర్డ్ కైండ్లో ఉపయోగించాడు.

అసహజ, అసాధారణ శక్తుల గురించి అనేక పుస్తకాలు వ్రాసిన ఛార్లెస్ బెర్లిజ్ అనే రచయిత తన బాణీలో ఇక్కడ ఏవేవో అనిర్వచనీయ, అసాధారణ శక్తులున్నాయని వ్రాసాడు.[13]

ప్రసిద్ధ ఘటనలు

[మార్చు]

బెర్ముడా త్రికోణం ప్రాంతంలో అనేక సంఘటనలు జరిగినట్లుగా భావింపబడుతుంది, వాటిలో కొన్ని సంఘటనలు బాగా ప్రసిద్ధమయ్యాయి.బెర్ముడా త్రికోణం సంఘటనలుజబితా

అమెరికా నౌకారక్షణ దళానికి చెందిన TBF గ్రమ్మన్ ఎవంజర్ విమానాల శ్రేణి. ఈ అమరికకు ఫ్లైట్ 19కు దగ్గరి పోలికలు ఉన్నాయి. పెక్కుమంది "త్రికోణం రచయితలు" ఫ్లైట్ 19ను వివరిస్తానికి ఈ చిత్రాన్ని వాడారు. (ఇది అమెరికా నేవీ వారి చిత్రం)
ఫ్లైట్ 19

"ఫ్లైట్ 19" (ఫ్లైట్19) అనేది అమెరికా నౌకా దళానికి చెందిన "టి.బి.ఎమ్. అవెంజర్ బాంబురు విమానాల" (TBM ఎవెంజర్) శిక్షణా ప్రయాణం. ఇది డిసెంబరు 5, 1945న అట్లాంటిక్ అసముద్రంలో అదృశ్యమయ్యింది. అప్పుడు దిక్సూచి (కంపాస్) సరిగా పనిచేయలేదని, వాతావరణం ప్రశాంతంగా ఉందని, ప్రమాదానికి కారణాలు తెలియడంలేదని, శిక్షణా పైలట్ లెఫ్టినెంట్ ఛార్లెస్ కారొల్ టాయ్‌లర్ (ఛార్లెస్ కరోల్ టేలర్) అనుభవజ్ఞుడైన నాయకుడని నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ విషయాలపై వివిధ సందేహాలున్నాయి.[25] కొన్ని ముఖ్యమైన వివరాలు లభించలేదు. ఉదాహరణకు ఆ పైలట్ ఇంతకుముందు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రెండు మార్లు దారి తప్పిన సందర్భాలు ఉన్నాయి. అతనికి ఈ ప్రాంతం సుపరిచితం కాదు. సంభాషణల రిపోర్టులో దిక్సూచి సమస్యల గురించిన ప్రస్తావన లేదు.[25]

మేరీ సెలెస్టి

1872లో " మేరీ సెలెస్టి" (మేరీ సెలెస్టీ) అనే పేరుగల ఓడ పోర్చుగల్ తీరప్రాంతంలో వదలివేయబడింది. అంటే దీనికీ, బెర్ముడా త్రికోణానికీ ఏమీ సంబంధం లేదు. ఈ ఘటన ఆధారంగంగా ప్రఖ్యాత డిటెక్టివ్ నవలారచయిత (అర్థర్ కోనాన్ డోయల్) మేరీ సెలెస్టీ అనే చిన్నకథ వ్రాశాడు. ఇక పోతే మేరీ సెలెస్టీ అనే ఇలాంటి పేరే ఉన్న ఒక ఓడ సెప్టరంబరు 13, 1864న[26] బెర్ముడా తీర ప్రాంతంలో మునిగిపోయింది. ఈ చివరి ఘటన మాత్రం బెర్ముడా త్రికోణం ప్రాంతంలో జరిగింది కాని, మొదటి ఘటన (1872)ను, దానిపైన ఆధారపడి వ్రాసిన కల్పిత కథలోని విషయాలను ఈ 1864లో జరిగిన ఓడ ప్రమాదంతో కలగలిపి వర్ణించడం జరుగుతుంది.

ఎల్లెన్ ఆస్టిన్

వివిధ కథనాల ప్రకారం ఎల్లెన్ ఆస్టిన్ అనే నౌకకు 1881లో ఒక వదలివేయబడిన నౌక తారసపడింది. ఆ నౌకలో కొంతమంది సిబ్బందిని ఉంచి న్యూయార్క్‌‍‌కు తోడ్కొనిపోవాలని ప్రయత్నించారు. ఆ అజ్ఞాత నౌక మధ్యలో అదృశ్యమయ్యింది. మళ్ళీ కనిపించేసరికి అందులో సిబ్బంది ఎవరూ లేరు. మళ్ళీ ఒకమారు అదృశ్యమై తరువాత ఇంకొక సిబ్బందితో కనిపించిందట. లాయడ్స్ వారి రికార్డులు పరిశీలిస్తే మెటా అనే నౌకను 1854లో నిర్మించారు. 1880లో ఆమెటా పేరు ఎల్లెన్ ఆస్టిన్గా మార్చారు. ఆ నౌకకు సంబంధించిన ఏ విధమైన మరణాలు (లేదా అదృశ్యమైన సిబ్బంది) నమోదు కాలేదు. అజ్ఞాత నౌకలో ఉంచిన సిబ్బంది అదృశ్యమైతే అవి "ఎల్లెన్ ఆస్టిన్" నౌకా సిబ్బంది మరణాలుగా నమోదు కావాల్సి ఉంది.[27]

యు.ఎస్.ఎస్. "సైక్లోప్స్"

అమెరికా నౌకాదళం చరిత్రలో యుద్ధం లేకుండా ఎక్కువ మంది సైనికులు మరణించిన ఘటన (యు.ఎస్.ఎస్. "సైక్లోప్స్") అదృశ్యమవ్వడం. మార్చి4, 1918న బార్బడోస్‌లో బయలుదేరిన ఈ యుద్ధనౌక, 309 మంది సిబ్బందితో సహా అంతులేకుండా అదృశ్యమైంది. స్పష్టమైన కారణం ఏమీ కనిపించడంలేదు. తుఫానులు, శత్రువుల దాడి, మునిగిపోవడం వంటి అనేక కారణాలను పరిశోధకులు ఊహిస్తున్నారు.[28][29]

థియొడోసియా బర్ ఆల్‌స్టన్

(థియొడోసియా బర్ ఆల్‌స్టన్, మాజీ అమెరికా ఉపరాష్ట్రపతి అలాన్ బర్ కుమార్తె. ఆమె అదృశ్యం కావడానికి బెర్ముడా త్రికోణపు ఘటనలతో సంబంధం కలిపి చెబుతుంటారు.[30] ఆమె పేట్రియట్ అనే నౌకలో ప్రయాణికురాలు. ఛార్లెస్టన్ నుండి న్యూయార్క్ నగరానికి డిసెంబరు 30, 1812న బయలుదేరింది. తరువాత ఆమె జాడ తెలియరాలేదు. యుద్ధం, పైరేటులు వంటి ఎన్నో విషయాలుఆమె అదృశ్యమవ్వడానికి కారణాలుగా చెబుతుంటారు.

స్ప్రే

1909లో జోషువా స్లోకమ్ అనే అనుభవజ్ఞుడైన కెప్టెన్ స్ప్రే అనే గట్టి తెరచాప పడవలో కరిబియన్ నుండి వెనిజ్వెలాకు ప్రయాణమయ్యాడు. ఆ నౌక అదృశ్యమైంది. ఏ విధమైన ఆధారాలు లభించలేదు. అదృశ్యమయ్యే సమయంలో ఆ నౌక బెర్ముడా త్రికోణం ప్రాంతలో ఉందనుకోవడానికి కూడా ఆధారాలు లేవు. ఏదైనా తిమింగలాన్ని ఢీకొనడం వల్ల గాని, లేక స్టీమర్ తాకిడి వల్ల గాని ఆ పడవ ధ్వంసం అయి ఉండవచ్చునని భావించారు. అసహజమైన కారణాలకు సంబంధించిన ఆధారాలు ఏవీ దొరకలేదు.

కారొల్ ఎ.డీరింగ్
షూనర్ కరోల్ ఎ డీరింగ్, as seen from the కేప్ లుకౌట్ లైట్షిప్ జనవరి 29, 1921 న దానిని వదిలిపోయిన రెండురోజల తర్వాతtwo days before she was found deserted in ఉత్తర కరోలినా. (యుఎస్ కోస్ట్ గార్డ్)

కారొల్ ఎ.డీరింగ్ అనేది 1919లో నిర్మింపబడిన ఐదు తెరచాప స్తంభాల బలమైన నావ.ఇది జనవరి 31, 1921న (డయమండ్ షోల్స్, కేప్ హట్టేరాస్, ఉత్తర కరోలీనా) వద్ద వదిలివేయబడ్డ నావగా దర్శనమిచ్చింది. అప్పటి పైరసీ లేదా స్మగులింగ్ చర్యలకు సంబంధించిన విషయాలు ఈ నావను వదలి వేయడానికి కారణాలు కావచ్చును. S.S. Hewitt అనే మరొక నావ కూడా షుమారు ఇదే సమయంలో అదృశ్యమైంది. డీరింగ్ అదృశ్యమైన సమయంలో డీరింగ్ ప్రయాణించిన మార్గంలోనే మరొక నావ వెళ్ళినట్లు, ఆ రెండవ నావ lightship సంకేతాలను అసలు పట్టించుకోకుండా ఉన్నట్లు రిపోర్టులు ఉన్నాయి. ఆ రెండవ నావయే హ్యూయిట్ కావచ్చును. డీరింగ్ అదృశ్యానికి, దీనికి కొంత సంబంధం ఉండి ఉండవచ్చును.[31]

డోగ్లాస్ డి.సి.3

డిసెంబరు 28, 1948న , NC16002 అనే నెంబరు గల ఒక డోగ్లాస్ డిసి-3 విమానం సాన్ యోన్ నుండి మియామీకి ప్రయాణిస్తుండగా అదృశ్యమయ్యింది. విమానం శకలాలు గాని, అందులో ప్రయాణిస్తున్న 32 మంది మృత దేహాలు గాని ఏమీ లభించలేదు. విమానం అదృశ్యమవ్వడానికి కారణాలు తెలియరాలేదు. పౌర విమానయాన బోర్డు పరిశోధనలో తెలిసిన ఒక చిన్న విషయం - ప్రయాణానికి ముందు విమానం బ్యాటరీల చార్జింగ్ తక్కువలో ఉంది. కాని పైలట్ నిర్ణయానుసారం వాటిని రీచార్జి చేయకుండానే విమానంలో పెట్టారు. అయితే ఇందు కారణంగా విమానం కూలిపోయే అవకాశాలు కనిపించడంలేదు. ఏమయినా ఈ బ్యాటరీలకు సంబంధించిన సమాచారం త్రికోణం రచయితల పుస్తకాలలో పెద్దగా ప్రస్తావించబడలేదు.[32]

స్టార్ టైగర్, స్టార్ ఎరియెల్

స్టార్ టైగర్, స్టార్ ఎరియెల్ అనేవి ఆవ్రో టుడర్ IV మోడల్‌కు చెందిన విమానాలు. వీటిలో స్టార్ టైగర్ 1948 జనవరి 30న అజోరెస్ నుండి బెర్ముడాకు వెళుతుండగా అదృశ్యమయ్యింది. స్టార్ ఎరియెల్ 1949 జనవరి 17న బెర్ముడా నుండి జమైకాకు వెళుతుండగా అదృశ్యమయ్యింది. విమానం సిబ్బంది నుండి ఎటువంటి ప్రమాద హెచ్చరికలు రాలేదు. అదృశ్యమవడానికి కొద్దిసేపు ముందు పైలట్లనుండి వచ్చిన సందేశాల ప్రకారం అంతా నార్మల్‌గానే ఉంది. రెండు ఘటనలకూ కారణాల గురించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. పైలట్లు చివరి క్షణంలో పరికరాలను గమనించడంలో అశ్రద్ధ చూపి ఉండవచ్చుననే ఊహ మరి కొన్ని ఇతర ప్రమాదాల విశ్లేషణ ద్వారా కలుగుతుంది కాని అందుకు ఆధారం లేదు. స్టార్ టైగర్ కేవలం 2000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నందున పడిపోవడానికి ముందు ప్రమాద హెచ్చరిక పంపేందుకు చాలినంత సమయం ఉండి ఉండకపోవచ్చును కూడాను.[33]

కె.సి.135 స్ట్రాటోంకర్

ఆగష్టు 28, 1963న అమెరికా వైమానిక దళానికి చెందిన రెండు KC-135 స్ట్రాటో టాంకర్ విమానాలు ఢీకొని అట్లాంటిక్‌లో కూలిపోయాయి. త్రికోణం రచయితల కథనాల ప్రకారం ఈ రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొనలేదు. 160 మైళ్ళ దూరంలో ఉన్న రెండు వేరు వేరు స్థలాలలో ఈ రెండు విమానాలు (మరొక రెండు గుర్తు తెలియని వస్తువులతో?) ఢీకొన్నాయి.[10][13][14]) కాని కుశ్చే పరిశోధన ప్రాకరం "రెండవ ప్రమాద స్థలం" అని చెప్పబడే చోటు కేవలం ఒక పాత తెప్ప చుట్టూ పోగుపడిన సముద్రపు మొక్కలు, తుక్కు మాత్రమే ( సీవీడ్, డ్రిప్ట్ వుడ్తేలేవస్తువు)తో కలగలిసిపోయినవి.[16]

ఎస్.ఎస్. మెరైన్ సల్ఫర్ క్వీన్

"ఎస్.ఎస్. మెరైన్ సల్ఫర్ క్వీన్" అనే T2 ట్యాంకరు చమురు రవాణాకు వాడబడేది. దానిని సల్ఫర్ రవఅణాకు అనుగుణంగా మర్చారు. 1963 ఫిబ్రవరి 4 తరువాత దీని జాడ తెలియరాలేదు. ఫ్లోరిడా కీస్ వద్ద ఇది అదృశ్యమైనపుడు అందులో 39 మంది సిబ్బంది ఉన్నారు. 1964 "ఆర్గొసీ" పత్రికలో విన్సెంట్ గడ్డిస్ వ్రాసిన వ్యాసంలో ఈ ఘటన "అజ్ఞాతంలోకి పయనమైన నౌక" అని వ్రాయబడింది.[10] కాని తీర భద్రతా దళం రిపోర్టు ప్రకారం ఈ ట్యాంకరును సరుగా మెయింటెయిన్ చెయ్యలేదు. ఇది సముద్ర ప్రయాణాలకు అనుమతించబడ కూడనిది.[34][35]

రైఫుకు మారు

1921లో గాని లేదా కొద్ది సంవత్సరాల తరువాత గాని (రైకుకె మారు) అనే జపాన్ నౌక ప్రయాణికులతో సహా మునిగి పోయింది. మునిగిపోయే ముందు ఎదో "కత్తి లాంటి ప్రమాదం" తమమీద పడుతుందని సందేశం ఇచ్చినట్లు పలు త్రికోణ కథనాలలో వ్రాశారు. - ఈ (కత్తి) ఏమిటనే విషయం మీద చాలా ఊహలున్నాయి. ఉదాహరణకు అది ఒక నీటి బుగ్గ కావచ్చునని. నిజానికి ఆ నౌక "త్రికోణం" ప్రాంతంలో లేనేలేదు. దాని ప్రమాద సంకేతంలో "dagger" అన్న పదం కూడా లేదు. 1925 ఏప్రిల్ 21న బోస్టన్‌లో బయలుదేరిన ఈ నౌక జర్మనీ లోని హాంబర్గ్ వైపు ప్రయాణిస్తుంది. ఇది ఒక తుఫాన్‌లో చిక్కుకొని ఉత్తర అట్లాంటిక్‌లో మునిగిపోయింది. మునిగిపోయే ముందు ఆ నౌక ఇచ్చిన సందేశం "ఇప్పుడు అత్యంత ప్రమాదం. త్వరగా రండి." దగ్గరలో ఉన్న RMS Homeric అనే నౌక ఈ "రైఫుకు మారు"ను రక్షించడానికి ప్రయత్నించింది కాని విఫలమయ్యింది.[36]

కన్నమెరా

కన్నమెరా-4 అనే విహార నౌక 1955 సెప్టెంబరు 26న బర్ముడాకు దక్షిణాన అట్లాంటిక్‌లో తేలియాడుతూ కనిపించింది. అందులో మనుషులెవరూ లేరు. కథనాల ప్రకారం మూడు తుఫానులు వచ్చినా ఈ నావ నిలిచిందని, కాని అందులోని సిబ్బంది మాయమయ్యారని.[13][14]). నిజానికి అ సమయంలో ఆ స్థలంలో వచ్చిన ఒకే ఒక తుఫాను పేరు "ఎడిత్". తరువాత పరిశోధనలో నిశ్చయంగా తేలిందేమంటే "ఎడిత్" తుఫాను వచ్చినపుడు "కన్నమెరా" రేవులోనే కట్టివేసి ఉంది. తుఫాను కారణంగా దాని కట్లు తెగిపోయి అది సముద్రంలోకి నెట్టబడింది.

త్రికోణం రచయితలు

[మార్చు]

"బెర్ముడా త్రికోణం"లో జరిగినవని చెప్పబడే ఘటనలను వర్ణించిన ముఖ్యమైన పుస్తకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

  • Gian J. Quasar (2003). Into the Bermuda Triangle: Pursuing the Truth Behind the World's Greatest Mystery ((Reprinted in paperback (2005) ISBN 0-07-145217-6) ed.). International Marine / Ragged Mountain Press. ISBN 0-07-142640-X.
  • [13] Charles Berlitz (1974). The Bermuda Triangle (1st ed.). Doubleday. ISBN 0-385-04114-4.
  • [16] Lawrence David Kusche (1975). The Bermuda Triangle Mystery Solved. ISBN 0-87975-971-2.
  • [12] John Wallace Spencer (1969). Limbo Of The Lost. ISBN 0-686-10658-X.
  • David Group (1984). The Evidence for the Bermuda Triangle. ISBN 0-85030-413-X.
  • [26] Daniel Berg (2000). Bermuda Shipwrecks. ISBN 0-9616167-4-1.
  • [14] Richard Winer (1974). The Devil's Triangle. ISBN 0553106880.
  • Richard Winer (1975). The Devil's Triangle 2. ISBN 0553024647.
  • [30] Adi-Kent Thomas Jeffrey (1975). The Bermuda Triangle. ISBN 0446599611.

మరి కొన్ని సంబంధిత రచనల కోసం ఆంగ్ల వికీలో Bermuda Triangle source page చూడవచ్చును.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]
మూలాలు
  1. కాఖ్రాన్-స్మిత్, మెరిలిన్ (2003). "Bermuda Triangle: dichotomy, mythology, and amnesia". జర్నల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. 54.
  2. "పరిచయం". bermuda-triangle.org Bermuda Triangle .org].
  3. "విమాన దుర్ఘటనలు". bermuda-triangle.org Bermuda Triangle .org].
  4. "తప్పిపోయిన నౌకలు". bermuda-triangle.org Bermuda Triangle .org].
  5. "Bermuda Triangle". strangegr.
  6. "Excerpts from Christopher Columbus' Log".
  7. E.V.W. Jones (September 16, 1950). "unknown title, newspaper articles". Associated Press.
  8. George X. Sand (October 1952). "Sea Mystery At Our Back Door". Fate.
  9. Allen W. Eckert (April 1962). "The Lost Patrol". American Legion.
  10. 10.0 10.1 10.2 Vincent Gaddis (February 1964). "The Deadly Bermuda Triangle". Argosy: 28–29, 116–118.
  11. Vincent Gaddis (1965). Invisible Horizons.
  12. 12.0 12.1 12.2 John Wallace Spencer (1969). Limbo Of The Lost. ISBN 0-686-10658-X.
  13. 13.0 13.1 13.2 13.3 13.4 Charles Berlitz (1974). The Bermuda Triangle (1st ed.). Doubleday. ISBN 0-385-04114-4.
  14. 14.0 14.1 14.2 14.3 Richard Winer (1974). The Devil's Triangle. ISBN 0553106880.
  15. "Strange fish: the scientifiction of Charles F. Berlitz, 1913-2003". Skeptic. Altadena, CA. Archived from the original on 2007-09-30. Retrieved 2008-08-31.
  16. 16.0 16.1 16.2 16.3 Lawrence David Kusche (1975). The Bermuda Triangle Mystery Solved. ISBN 0-87975-971-2.
  17. "Office of Investigations and Analysis".
  18. "V A Fogg" (PDF). USCG.
  19. "The Case of the Bermuda Triangle". NOVA / Horizon. 1976-06-27. PBS. 
  20. Taves, Ernest. "Bermuda Triangle". The Skeptical Inquirer. 111 (1): 75–76.
  21. "Methane Bubble". Monash Univ.
  22. "Gas Hydrate at the USGS". Woods Hole. 1981. Archived from the original on 2012-02-18. Retrieved 2008-08-31.
  23. "Gas Hydrate at the USGS, Bermuda Triangle". Woods Hole. Archived from the original on 2012-10-23. Retrieved 2008-08-31.
  24. "A Geologist's Adventures with Bimini Beachrock and Atlantis True Believers". Skeptical Inquirer. January 2004. Archived from the original on 2007-04-06. Retrieved 2008-08-31.
  25. 25.0 25.1 "The Disappearance of Flight 19". bermuda-triangle.org Bermuda Triangle .org].
  26. 26.0 26.1 Daniel Berg (2000). Bermuda Shipwrecks. ISBN 0-9616167-4-1.
  27. "Ellen Austin". bermuda-triangle.org Bermuda Triangle .org].
  28. "Bermuda triangle". D Merrill. Archived from the original on 2002-11-24. Retrieved 2008-08-31.
  29. "Myths and Folklore of Bermuda". Bermuda Cruises. Archived from the original on 2009-06-10. Retrieved 2008-08-31.
  30. 30.0 30.1 Adi-Kent Thomas Jeffrey (1975). The Bermuda Triangle. ISBN 0446599611.
  31. "Carroll A Deering". Graveyard of the Atlantic. Archived from the original on 2005-08-28. Retrieved 2008-08-31.
  32. "Airborne Transport, Miami, December 1948" (PDF). Aviation Safety. Archived from the original (PDF) on 2007-01-03. Retrieved 2008-08-31.
  33. "The Tudors". bermuda-triangle.org Bermuda Triangle .org].
  34. "Marine Sulphur Queen" (PDF). USCG.
  35. "The Queen with the Weak Back". TIME. Archived from the original on 2012-09-12. Retrieved 2008-08-31.
  36. "The Case of the Bermuda Triangle". NOVA / Horizon. 1976-06-27. PBS. 


బయటి లింకులు

[మార్చు]