Jump to content

బన్సీలాల్‌పేట్ కోనేరు బావి

వికీపీడియా నుండి
బన్సీలాల్‌పేట మెట్లబావి ప్రారంభోత్సవ కార్యక్రమం

బన్సీలాల్‌పేట్ కోనేరు బావి అనేది సికింద్రాబాదు సమీపంలోని బన్సీలాల్‌పేటలోని పురాతన మెట్లబావి. బన్సీలాల్‌పేటలో పురాతన మెట్ల బావిని పదిహేడో శతాబ్దంలో తాగునీటి అవసరాల నిమిత్తం దీనిని నిజాం హయాంలో నిర్మించారు. ఈ కోనేరు బావి కాలగమనంలో చెత్తాచెదారంతో నిండి శిథిలావస్థకు చేరుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరణకు 2021 ఆగస్టు 15 చర్యలు చేపట్టింది.[1][2] పూర్తిగా పూడికతో నిండిపోయి రూపురేఖలు కోల్పోయిన బన్సీలాల్‌పేట మెట్లబావిని 10కోట్ల రూపాయలతో ప్రభుత్వం పునరుద్ధరించింది.

చరిత్ర

[మార్చు]

సికింద్రాబాదు ప్రాంత ప్రజల తాగునీటి కోసం అసఫ్‌-జాహీ వంశస్తులు ఆరు అంతస్తుల లోతు, మెట్లు, స్తంభాలతో అద్భుతంగా బన్సీలాల్‌పేటలోని మెట్లబావిని నిర్మాణం చేశారు. ఊటనీరుతో నిండి మోట ద్వారా నీటిని పైకి లాగడానికి ఏర్పాట్లు కూడా ఉండేవి. 22 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ బావిలోని నీళ్ళు ఎంత కిందికి వెళ్ళినా మెట్ల ద్వారా కిందకు దిగి కుండ లేదా బిందెతో మంచి నీళ్ళు తోడుకోవచ్చు. ఆంగ్లేయుల కాలంలో 1933లో సికింద్రాబాదు పాలనాధికారి, రెసిడెంట్‌ అధ్యక్షుడు టీహెచ్‌ కీస్‌ ఈ బావిని పునరుద్ధరించారు. అందుకు సేట్‌ బన్సీలాల్‌ అనే వ్యాపారి ఆర్థిక సహకారం అందించారని, అనంతరమే ఆ ప్రాంతానికి బన్సీలాల్‌పేట్‌ అని నిలిచిపోయింది.[3]

ప్రత్యేకతలు

[మార్చు]
  1. బన్సీలాల్‌పేట్‌ బావి అద్భుతమైన శిల్పకళా సంపదను కలిగి ఉంది. బావి ప్రవేశ ద్వారం ఆర్చ్‌లాగా, చుట్టూ ఏర్పాటు చేసిన రాతి కట్టడం, సింహాలు, పాములు, గుర్రాల బొమ్మలు అలనాటి కళాత్మకతను సమున్నతంగా ఆవిష్కరిస్తాయి.
  2. బన్సీలాల్‌పేట కోనేరు బావి 53 అడుగుల లోతు, 30.5 మీటర్ల పొడవు, 19.2 ఫీట్ల వెడల్పుతో విస్తరించి ఉంది.[4]

పునరుద్ధరణ

[మార్చు]

హైదరాబాద్ నగరంలోని పురాతన కట్టడాలను పరిరక్షించి వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దటానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా 40 ఏళ్ల క్రితం పూర్తిగా మూసివేసిన ఈ బావి పునరుద్ధరణ పనులను ‘ది రెయిన్‌ వాటర్‌ ప్రాజెక్టు’ సంస్థ జీహెచ్‌ఎంసీ సహకారంతో 2012లో చేపట్టింది. ఈ బావికి దాదాపు 52 ఫీట్ల వరకు పూడికతతీత చేపట్టి దాదాపు 400 లారీల వ్యర్థాలను తొలగించారు. మొత్తంగా 863 ట్రిప్పుల లారీలతో 3,900 టన్నుల చెత్తను వెలికితీశారు. ఏడంతస్తుల లోతు కలిగిన కొలను మట్టి, చెత్తా చెదారంతో పూర్తిగా కూరుకుపోయిన బావిని భావితరాలు గుర్తుంచుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.[5][6]

ప్రధాని ప్రసంశలు

[మార్చు]

సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేట్‌లోని పురాతన బావి పునరుద్ధరణపై 2022 మార్చి 27న మన్‌కీ బాత్‌లో కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ఈ బావి గురించి ప్రస్తావిస్తూ నీటిసంరక్షణ, భూగర్భ జలాలను కాపాడుకొనేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని అభినందించాడు.[7]

ప్రారంభం

[మార్చు]

పునరుద్ధరించిన మెట్లబావిని 2022 డిసెంబరు 5న తెలంగాణ రాష్ట్ర మంత్రులు కెటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, హైదరాబాదు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రధాన ద్వారం, బాహ్య కట్టడాల పరిరక్షణ చర్యలు, చక్కటి పచ్చదనంతో నిండిన ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌, ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు వీలుగా ఏర్పాటుచేసిన ఓపెన్‌ యాంఫీ థియేటర్‌, బావిలో నుంచి వెలికితీసిన పురాతన పరికరాలు , బావి చరిత్రను వివరించే ఫొటోలతో ఏర్పాటుచేసిన ప్రత్యేక గ్యాలరీలను సందర్శించారు. బావిని అందంగా ముస్తాబు చేయడంలో 13 నెలలపాటు శ్రమించిన పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందిని జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎంఎస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు సాయన్న, ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేశ్‌, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[8]

మూలాలు

[మార్చు]
  1. News18 Telugu (29 January 2022). "హైదరాబాద్‌లో 17వ శతాబ్దం నాటి అరుదైన మెట్ల బావి.. ఆగస్టు 15నాటికి." Retrieved 29 March 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (28 January 2022). "పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు". Archived from the original on 29 March 2022. Retrieved 29 March 2022.
  3. telugu, NT News (2022-12-05). "భావితరాలకు చరిత్ర తెలిసేలా.. అలనాటి వైభవం పునరావిర్భావం". www.ntnews.com. Archived from the original on 2022-12-06. Retrieved 2022-12-09.
  4. Namasthe Telangana (27 January 2022). "చారిత్రాత్మక కట్టడాలకు పూర్వ వైభవం". Archived from the original on 29 March 2022. Retrieved 29 March 2022.
  5. Sakshi (28 January 2022). "హైదరాబాద్‌ నగరంలో 17 శతాబ్దం నాటి అరుదైన బావి". Archived from the original on 2022-02-05. Retrieved 29 March 2022.
  6. Namasthe Telangana (23 January 2022). "నాటి చరిత్ర.. బావి వైభవం". Archived from the original on 29 March 2022. Retrieved 29 March 2022.
  7. Sakshi (28 March 2022). "బన్సీలాల్‌పేట్‌ కోనేరు బావిపై మోదీ ప్రశంసలు". Archived from the original on 29 March 2022. Retrieved 29 March 2022.
  8. telugu, NT News (2022-12-06). "చరిత్రకు సాక్ష్యం బన్సీలాల్‌పేట మెట్లబావి". www.ntnews.com. Archived from the original on 2022-12-06. Retrieved 2022-12-09.