Jump to content

ప్రకృథ కాత్యాయనుడు

వికీపీడియా నుండి

క్రీ.పూ.6 వ శతాబ్దంలో అంటే గౌతమ బుద్దుని కాలంలోనే సాంస్కృతిక తిరుగుబాటుకు ప్రేరణ కలిగిస్తూ ప్రజలలో భౌతికవాదాన్ని ప్రచారం చేసిన భౌతిక వాద దార్శనికులలో ప్రకృథ కాత్యాయనుడు ఒకడు. బౌద్ధ గ్రంథాలలో పేర్కొనబడ్డ ఆరుగురు ప్రసిద్ధ తీర్ధంకరులలో నాల్గవ వాడు. ఇతను గౌతమ బుద్ధుని సమకాలికుడు. వైదిక మత విశ్వాసాలకు వ్యతిరేకంగా భౌతిక వాదాన్ని ప్రచారం చేసిన తాత్వికుడు.

ఆధార గ్రంధాలు

[మార్చు]

ప్రాచీన భారతీయ భౌతికవాదులలో ఒకడైన ప్రకృథ కాత్యాయనుని గురించిన ప్రస్తావనలు అతని తాత్విక ధోరణి గురించి ఉటంకించిన వివరాలు, వ్యాఖ్యలు బుద్దఘోషుని “సుమంగళ విలాసిని” బౌద్ధమత గ్రంథమైన “ మధ్యమ నికాయ ” దిఘ నికాయ లోని 'శమన్నఫాల సుత్త' తదితర బౌద్ధ, జైన మత గ్రంథాలలో లభిస్తాయి. ప్రక్రుధ కాత్యాయనుని గురించి తెలిపే మూల ఆధారగ్రంధాలు ధ్వంసమై పోయాయి. ఒకవేళ అవి వుండి వున్నప్పటికీ వాటిని తీవ్రంగా నిరసించిన జైనులు, బౌద్ధులు వాటిని నాశనం చేసి వుండవచ్చు. అసలు మనకు ప్రకృథ కాత్యాయనుని గురించి తెలిసినది, అతనిని విమర్శిస్తూ జైనులు, బౌద్ధులు తమ తమ గ్రంథాలలో ఉటంకించిన వ్యాఖ్యలు, కథనాల నుండి మాత్రమే. ఈ ఉటంకలు కూడా పూర్ణ కాశ్యపుని భౌతికవాద బోధనల గురించి యదార్ధంగా చెప్పినవి కావు. అతనిని అప్రతిష్టపాలు చేయడానికి అతనిపై ద్వేషం, అసహ్యం కలిగించే ప్రయత్నంలో అతని భౌతికవాద బోధనలను వక్రీకరిస్తూ నిందిస్తూ జైన, బౌద్ధ మతాల రచయితలు తమ గ్రంథాలలో రాసుకొన్న ఉటంకనలు మాత్రమే. ప్రక్రుధ కాత్యాయనుని బోధనల గురించి వివరాలు తెలుసుకోవడానికి సైతం, ఆ మతాన్ని ద్వేషిస్తూ, వక్రీకరిస్తూ, అవహేళన చేస్తూ వచ్చిన ఇతర మతగ్రంధాల ఉల్లేఖనలే దిక్కయ్యేంతగా పూర్ణ కాశ్యపునికి తత్వబొదనలకు సంబంధించిన మూల ఆధార గ్రంథాలు ధ్వంసం చేయబడ్డాయి.

జీవన చరిత

[మార్చు]

ప్రకృథ కాత్యాయనుని ప్రక్రుద్ద కాత్యాయనుడని, పకుధ కచ్చాయనుడని, కకుద కచ్చాయనుడని వేర్వేరు పేర్లతో వ్యవాహరిచడం జరిగింది. ఇతని వ్యక్తిగత విషయాలు, జీవన విధానం గురించి స్పష్టంగా తెలియదు.బౌద్ధ తత్వవేత్త బుద్ధఘోషుని “సుమంగళ విలాసిని”, ఇతర బౌద్ధ గ్రంథాలైన 'మద్యమ నికాయ' ల ద్వారా కొన్ని వివరాలు తెలియ వస్తాయి. ఇతను మెడపై ఒక కణితి వుండేదని, గూని వాడని, చన్నీటిని ఎన్నడూ తాకలేదని, ఏ నదిని దాటలేదని చులకనగా చేస్తూ బౌద్ధ గ్రంథాలు పేర్కొన్నాయి.

బోదనలు – ప్రచారం

[మార్చు]

ప్రకృథ కాత్యాయనుడు అణువాది. ఇతని వాదాన్ని అకృతతావాదం అంటారు. బౌద్ధ గంధం 'మద్యమ నికాయ' పేర్కొన్న ప్రకారం గౌతమ బుద్ధుడు జీవించిన కాలంలోనే గంగ మైదాన ప్రాంతాలలో ముసలి వయసులో కూడా పర్యటిస్తూ వైదిక మత విశ్వాసాలకు వ్యతిరేకంగా భౌతికవాద తత్వాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసాడని తెలుస్తుంది.

ఇతని తత్వం షష్ఠయవాదం అని బౌద్ధ వాజ్మయమైన 'శమన్నఫాల సుత్త ' పిలవగా, ఆత్మసష్ట వాదం అని జైన గ్రంథాలు తెలిపాయి. ఇతని తెలిపిన మౌలిక కాయాలైన సుఖం, దుఃఖం లను తీసివేసి వాటికి బదులు ఆకాశాన్ని చేరిస్తే ఆరు కాయాలవుతాయి.

  • ఇతని తత్వంలో ప్రపంచంలో ప్రతీది సప్త భూతాల (Elements) తో నిర్మితమైనది. ఆ సప్త భూతాలు శాశ్వతమైనవి. నిరంతరం స్థిరంగా వుంటాయి. అవి భూమి, జలం, వాయువు, అగ్ని, సుఖం, దుఃఖం, జీవం. ఈ ఏడూ కాయాలు చలించవు. మారవు. అవి మౌలికమైనవి. వాటిని ఎవరూ సృష్టించ లేరు. అలాగే వాటిని ఎవరూ నాశనం చేయనూ లేరు.
  • సప్త భూతాలలో మొదటి నాలుగు (భూమి, జలం, వాయువు, అగ్ని) అనేవి పదార్దములు. ఈ నాలుగు చార్వాకులు అంగీకరించినవే. చివరి మూడు (సుఖం, దుఃఖం, జీవం) పదార్దేతరాలు. కనిపించనివి. ఏడవ దానిగా జీవనాన్ని పేర్కొనడంతో ఆధ్యాత్మిక వాదానికి కొంత లోనైనట్లు తెలియ వస్తుంది.
  • విశ్వం మంతా మౌలికమైన ఈ సప్త భూతాలతో నిర్మితమైనది. ఎంత పదునైన కత్తితో నరికినా ఆ వేటు ఆ మౌలిక భూతాలకు తగలదు. కత్తివేటు ఆ ఏడు భూతాలకు అవతల గల వివరం (ఖాళీప్రదేశం) లోకే వెళుతుంది. అంతే తప్ప మౌలిక తత్వానికి తగలదు. ఇది అణువాదానికి చెందిన ప్రాథమిక ఆలోచనగా కాబట్టే ప్రక్రుధ కాత్యాయనుని అణువాదిగా భావించారు..
  • శరీరం కూడా ఈ సప్త మౌలిక భూతాలతో నిర్మితమైంది. మరణానంతరం శరీరం ఆ సప్త భూతాల్లోనే కలసిపోతుంది. సుఖ దుఖాలకు భూతాలతో ప్రమేయం లేదని ఇతని సిద్దాంతం.
  • ప్రక్రుధ కాత్యాయనుడు బ్రాహ్మణ పురోహితుల ‘కర్మవాదా’న్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలా ఉదహరిస్తాడు. ఎవరైనా ఒకడు మరొకడిని కత్తితో నరికితే  ఆతను హాత్య చేసినట్టు కాదు. ఎందుకంటే ఆ కత్తి శరీరానికి మూలాధారమైన సప్త భూతాలను తాకకుండా దూసుకు పోతుంది కనుక అతను హంతకుడూ కాడు. ఇతను హతుడూ కాడు. అదే విధంగా చంపేవాడు, చచ్చేవాడు, చెప్పేవాడు, వినేవాడు, బోధించేవాడు, గ్రహించేవాడు అనే వాళ్ళెవరూ లేరు.

మౌలికమైన సప్త భూతాల చలనాన్ని తిరస్కరించిన ప్రకృథ కాత్యాయనుడిని, గ్ర్రీకు తత్వవేత్త ఎంపిడో క్లెస్ తో పోలుస్తారు. మౌలికంగా ప్రకృథ కాత్యాయనుని యాంత్రిక భౌతికవాదిగా, జడ భౌతికవాదిగా గుర్తిస్తారు.

మూలాలు

[మార్చు]
  • History and Doctrines of the Ajivikas, a Vanished Indian Religion - A.L. Basham
  • The Culture & Civilization of Ancient India- D.D. Kosambi
  • ప్రాచీన భారత దేశ చరిత్ర – రామ్ శరణ శర్మ
  • విశ్వ దర్శనం, భారతీయ చింతన – నండూరి రామమోహన రావు
  • భారతీయ భౌతికవాదం – చార్వాక దర్శనం –కత్తి పద్మా రావు
  • ప్రాచీన భారతంలో చార్వాకం –సి.వి.