పిశుపాటి చిదంబర శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పిశుపాటి చిదంబర శాస్త్రి (1892 - 1951) సుప్రసిద్ధ కవి, పండితుడు, అవధాని.

వీరు ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో సీతారామయ్య, కనకమ్మ దంపతులకు జన్మించారు. వీరు పలువురు పండితుల దగ్గర చదివి, కావ్య, నాటక, అలంకార, న్యాయ, వాస్తు, జ్యోతిష, తర్క, వ్యాకరణ వేదాంత మంత్ర శాస్త్రాలలో అఖండ పాండిత్యాన్ని సంపాదించారు. వీరు సంస్కృతం, తెలుగులోనూ అష్టావధానాలు, శతావధానాలను విజయవంతంగా శతాధికంగా నిర్వహించారు.

వీరు మైసూరు మహారాజా గారి ఆస్థానంలో 1920 నుండి అస్థాన విద్వాంసుడిగా పదవిని అలంకరించారు. గద్వాల సంస్థానంలో కొంతకాలం ఆస్థాన కవిగా ఉన్నారు. 1942 లో వెంకటగిరి సంస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నారు.

వీరు 1926 నుండి 15 సంవత్సరాలు సూర్యారాయాంధ్ర నిఘంటువు రచనా కార్యంలో పాల్గొన్నారు.

తిరువాన్కూరు మహారాజా ఆస్థానంలో నరసింహ కంకణ సత్కారాన్ని, గజారణ్య క్షేత్రంలో ఆశుకవి కేసరి అని, దర్భాంగ మహారాజా సంస్థానంలో కావ్య కళానిధి అను గౌరవాలు పొందారు.

వీరు సంస్కృతంలో పది, తెలుగులో 26 గ్రంథాలు రచించారు.వాటిలో ప్రబంధాలు, నాటకాలు, శతకాలు, లక్షణ గ్రంథాలు ఉన్నాయి[1]. వీరి రచనలలో 54 వేల శ్లోకాలు కలిగిన పద్మపురాణానికి తెలుగు అనువాదం శ్రీమదాంధ్ర పద్మపురాణము,[2] హైమవతీ విలాసము[3] పేర్కొనదగినవి.

వీరు 1951 లో పరమపదించారు.

అవధానాలు

[మార్చు]

వీరు ప్రప్రథమంగా పద్దెనిమిది సంవత్సరాల పిన్నవయసులో కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో 16-02-1910న అష్టావధానం చేశారు. చివరి సారి వీరు 24-02-1944లో సికిందరాబాదులో రెండు అష్టావధానాలు, ఒక ఆశుకవితా సభ నిర్వహించారు. ఈ మధ్యకాలంలో అంటే 34 ఏళ్లపాటు ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాలలో శతాధిక అష్టావధానాలు, శతావధానాలు, ఆశుకవితా ప్రదర్శనలు చేసి అనేక ఘనసత్కార సన్మానాలను పొందారు. వీరు గద్వాల, పిఠాపురం, నవాబుపేట, దొంతి, బెళగల్లు, బదినేహాల్ సంస్థానాలలో సంస్కృతాంధ్రాలలో శతావధానాలు, బెంగళూరు, గణపురం, కాకినాడ, బెజవాడ, జగ్గయ్యపేట, సికిందరాబాదు, ఒంగోలు, అవిడి తదితర పట్టణాలు, గ్రామాలలో తెలుగులో శతావధానాలు చేశారు. మైసూరు, తలకాడు, కారుమంచి తదితర ప్రాంతాలలో సంస్కృత శతావధానాలు నిర్వహించారు. జయపురం, బొబ్బిలి, పిఠాపురం, వేంకటరిగి, దైవముదిన్నె, గద్వాల, బెజవాడ, గుడివాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, సికిందరాబాదు, భువనగిరి, యాదగిరి గుట్ట, కాశీ, మధుర, దర్భాంగ, మైసూరు, అనంతశయనం, కొచ్చిన్, శ్రీరంగపట్టణం, త్రిమకూటమ్‌, సత్యమంగళం, కాకినాడ, కొవ్వూరు, ఏలూరు, జగ్గయ్యపేట, పార్వతీపురం మొదలైనచోట్ల సంస్కృతాంధ్రాలలో అష్టావధానాలు, ఆశుకవితా సభలు నిర్వహించారు. వీరి అవధానాలలో దత్తాక్షరి, వ్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి, వివర్గాక్షరి, ఛందోభాషణం, పృష్టకల్పనము, సమస్య, ఏకసంథాగ్రహము అనే అంశాలు ఉండేవి. వీరి అవధానాలకు సంబంధించి పీఠికాపుర సంస్థాన శతావధానము, గద్వాల శతావధానము, నవాబుపేట సంస్థాన శతావధానము, బెజవాడ శతావధానము, ఒంగోలు శతావధానము, గద్వాల శతావధానము, ఆశుకవితావధాన సంగ్రహము, అష్టావధాన, ఆశుకవితా వినోదము - రాజసభావినోదం, రాజగోష్ఠి విధానం - అవధానాదర్శం అనే గ్రంథాలు వెలువడ్డాయి.[1]

వీరు అవధానాలలో పూరించిన పద్యాలు మచ్చుకు కొన్ని:

  • సమస్య: బంగరు లింగకాయగల భామిని వైష్ణవభామయే సుమా!

పూరణ:

సంగడికాఁడ! చూచితె యసాధుగుణుం డొకలింగధారి మేల్
వంగడమందు నున్న యొకవైష్ణవభామను లేవఁదీసి త
న్మంగళసూత్రదేశమునఁ దానొక లింగము గట్టెఁ జూడుమీ
బంగరు లింగకాయగల భామిని వైష్ణవభామయే సుమా!

  • సమస్య: కలువ వికసించె భాస్కరుగాంచినంత

పూరణ:

భాస్కరుండను తనప్రియవల్లభుండు
తిరిగి పరదేశముల నెల్ల మరల నొక్క
నాడు చనుదేర నాతని నాతి కంటి
కలువ వికసించె భాస్కరుగాంచినంత

  • వర్ణన: కోనసీమపై పద్యం

పనస మహీరుహంబులను భాసిలు కొబ్బరితోఁటలన్ సెబా
సనఁదగు కుల్యలన్ సుమఫలాదిసమృద్ధుల నెంతయేనియున్
గనులకు విందుచేయుచు సుఖంబుల కాస్పదమైన కోనసీ
మను వసియించు భాగ్యమది మాకు లభించెఁ గలార్థివృత్తిలోన్

  • నిషిద్ధాక్షరి: భ్రమరీ వర్ణన

పూరణ:

 భృంగి కడునింపు నింపెన్
బొంగుగ నీవేళ నేమి పోల్పోయిది చూ
పంగ నొకరేల? నీదగు
సంగతియే తెల్పుచుండె సర్వము నిచటన్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 181–187.
  2. పిశుపాటి, చిదంబరశాస్త్రి (1953). శ్రీమదాంధ్ర పద్మపురాణము (ప్రథమ ed.). నెల్లూరు: పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి. pp. 1–448. Retrieved 25 July 2016.
  3. పిశుపాటొ, చిదంబరశాస్త్రి (1930). హైమవతీ విలాసము (ద్వితీయ ed.). pp. 1–92. Retrieved 25 July 2016.