దక్షిణామూర్తి
దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.
బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.
ఇక ఈ నలుగురూ గురువు కోసం వెదుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నాడు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ, పరమశివుడినీ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ, పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.
పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి, అతని తేజస్సుకు ఆకర్షితులై, ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా బోధించారు.