Jump to content

లక్ష్మి

వికీపీడియా నుండి
(లక్ష్మీదేవి నుండి దారిమార్పు చెందింది)
లక్ష్మిదేవి

లక్ష్మి హిందూ మత ప్రధాన దేవత. ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతి, సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు. ఈమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణించబడుతుంది. భారతదేశంలో దీపావళి పండుగ నాడు హిందువులు ఈమెను పూజిస్తారు. లక్ష్మిదేవి చీర కట్టుకొని, అభరణాలను ధరించి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. లక్ష్మిదేవి నాలుగు చేతులతో ఉంటుంది, రెండు చేతులతో పుష్పాలను పట్టుకొని, రెండు చేతులతో బంగారు నాణేలను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈమె తామర పువ్వు మీద కూర్చుని సాధారణంగా ఏనుగులతో ఉంటుంది. ఈమెకు అనేక అవతారాలు ఉన్నాయి (అంటే మానవుని రూపంలో లేదా మరే ఇతర రూపంలో నైనా భూమిపైకి వచ్చే దేవత). విష్ణు దేవేరి అయిన లక్ష్మీ, విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా, అతనితో పాటు ఈమె కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా, మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వరస్వామి భార్య పద్మావతిగా అవతరాలను ఎత్తి అతనిని వివాహం చేసుకుంటుంది. లక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసం రెండవ శుక్రవారం, వరలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మిదేవి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. దీపావళి సందర్భంగా, నవరాత్రి సందర్భంగా కూడా లక్ష్మి పూజలు జరుపుకుంటారు. శ్రీ అనే పదం సిరి పదానికి సమానం. అనగా సంపద, ఐశ్వర్యానికి దేవత. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం, అందుకే ఆ లక్ష్యాలు అష్టలక్ష్ములుగా అవతరించాయి. లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత, లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్ష్యం పొందినట్లేనని భావన.[1] [2]

అష్టలక్ష్ములు

[మార్చు]
  1. ఆదిలక్ష్మి: "మహాలక్ష్మి" అని కూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.
  2. ధాన్యలక్ష్మి: ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది.
  3. ధైర్యలక్ష్మి: "వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రాలు ధరించింది. చక్రం, శంఖం, ధనుర్బాణాలు, త్రిశూలం, రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉండును.
  4. గజలక్ష్మి: రాజ్య ప్రదాత. నాలుగు హస్తాలు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకం ఛేస్తుంటాయి. ఎర్రని వస్త్రాలు ధరించింది. రెండు చేతులలో రెండు పద్మాలు కలిగింది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.
  5. సంతానలక్ష్మి: ఆరు చేతులు కలిగింది. రెండు కలశాలు, ఖడ్గం, డాలు ధరించింది. వడిలో బిడ్డ కలిగి, ఒకచేత అభయముద్ర కలిగింది. మరొక చేయి బిడ్డను పట్టుకొని ఉంటుంది. బిడ్డ చేతిలో పద్మం ఉంది.
  6. విజయలక్ష్మి: ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రాలు ధరించింది. శంఖము, చక్రము, ఖడ్గం, డాలు, పాశం ధరించింది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.
  7. విద్యాలక్ష్మి: శారదా దేవి.చదువులతల్లి. చేతి యందు వీణ ఉంటుంది.
  8. ధనలక్ష్మి: ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించింది. శంఖ చక్రాలు, కలశం, ధనుర్బాణాలు, పద్మం ధరించిన మూర్తి. అభయ ముద్రలోనున్న చేతినుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.

అష్టలక్ష్మి స్తోత్రం

[మార్చు]

ఆదిలక్ష్మి:- సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే | పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే, జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 ||

ధాన్యలక్ష్మి:- అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే , క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే , జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 ||

ధైర్యలక్ష్మి:- జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే , సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే | భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే , జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||

గజలక్ష్మి:- జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే , రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే | హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే , జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||

సంతానలక్ష్మి:- అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే , గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే | సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే , జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||

విజయలక్ష్మి:- జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే , అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే | కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే , జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||

విద్యాలక్ష్మి:- ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే , మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే | , నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే , జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||

ధనలక్ష్మి:- ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే , ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే | వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే , జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ || 8 ||

మూలాలు

[మార్చు]
  1. "Diwali Lakshmi pooja muhurat, time, samagri list: How to do Diwali pooja at home". www.indiatoday.in. Retrieved 21 March 2020.
  2. M. A., English Literature. "Diwali: The Biggest and Brightest Hindu Festival". Learn Religions (in ఇంగ్లీష్). Retrieved 21 March 2020.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=లక్ష్మి&oldid=4338842" నుండి వెలికితీశారు