టి.రుక్మిణి
తిరువేంగడం రుక్మిణి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | శివమొగ్గ, కర్ణాటక, భారతదేశం | 1936 నవంబరు 27
మరణం | 2020 మే 31 | (వయసు 83)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | వాయులీన విద్వాంసురాలు |
వాయిద్యాలు | వయోలిన్, గాత్రం |
టి.రుక్మిణి (1936-2020) కర్ణాటక వాయులీన విద్వాంసురాలు.[1]
విశేషాలు
[మార్చు]తిరువేంగడం రుక్మిణి కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ పట్టణంలో 1936 నవంబర్ 27వ తేదీన జన్మించింది.[2] ఈమె ఆర్.ఆర్.కేశవమూర్తి, లాల్గుడి జయరామన్‌ల వద్ద వాయులీనా వాద్య సంగీతాన్ని అభ్యసించింది. సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద గాత్ర సంగీతాన్ని నేర్చుకుంది. ఈమె తన 16వ యేట టి.ఆర్.మహాలింగం కచేరీకి వాయులీన సహకారం అందించడంతో తన ప్రదర్శనను ప్రారంభించి 65 సంవత్సరాలకు పైగా అనేక కచేరీలు నిర్వహించింది. ఈమె ఐదు తరాల సంగీత విద్వాంసులకు వాద్య సహకారం అందించడమే కాక సోలో ప్రదర్శనలు కూడా అనేకం చేసింది.[3] ఈమె సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, టి.కె.రంగాచారి, వోలేటి వెంకటేశ్వర్లు, రామనాథ కృష్ణన్, డి.కె.పట్టమ్మాళ్, డి.కె.జయరామన్, చెంబై వైద్యనాథ భాగవతార్, సుందరం బాలచందర్, ఎం.డి.రామనాథన్, ఎం.ఎల్.వసంతకుమారి, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, టి.ఆర్.సుబ్రహ్మణ్యం, సిక్కిల్ సిస్టర్స్ వంటి అగ్రశ్రేణి సంగీత కళాకారుల కచేరీలలో పాల్గొన్నది. ఈమె వాయులీన ప్రదర్శనలే కాక గాత్ర సంగీత ప్రదర్శనలు కూడా చేసింది. పద్మలోచన నాగరాజన్, వైజయంతిమాల బాలి వంటి భరతనాట్య కళాకారిణుల నాట్యప్రదర్శనలలో గాత్రాన్ని అందించింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణతో కలిసి గాత్ర సంగీత కచేరీలు నిర్వహించింది. ఈమె భారతదేశంలోనే కాక ప్రపంచంలోని అనేక దేశాలలో తన ప్రదర్శనలు ఇచ్చింది.
మైలాపూరులోని "శ్రీత్యాగరాజ సంగీత విద్వత్సమాజం"కు ఉపాధ్యక్షురాలిగా ఆరు సంవత్సరాలు సేవలను అందించింది. ఈమె ఆకాశవాణిలో వయోలిన్, గాత్ర సంగీత విభాగాలు రెండింటిలోను ఏ గ్రేడు కళాకారిణిగా అనేక కార్యక్రమాలను చేసింది. ఈమె వర్ణాలను, తిల్లానాలను స్వరపరచడమే కాక సుబ్రహ్మణ్యభారతి గీతాలకు, పురందరదాసు పదాలకు, తిరుప్పావై, ఇతర పాశురాలకు రాగాలను సమకూర్చింది.
ఈమెకు "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" కళైమామణి పురస్కారాన్ని ప్రదానం చేసింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1997లో అవార్డును ప్రకటించింది. మద్రాసు సంగీత అకాడమీ "సంగీత కళాచార్య" బిరుదును, శ్రీకృష్ణ గానసభ, చెన్నై "సంగీత చూడామణి" బిరుదును ప్రదానం చేశాయి.
ఈమె తన 84వ యేట 2020, మే 31వ తేదీన మరణించింది.
మూలాలు
[మార్చు]- ↑ web master. "T. Rukmini". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 2 April 2021.[permanent dead link]
- ↑ web master. "Vidushi T Rukmini passes away". Sruti Magazine. Sruti Magazine. Retrieved 2 April 2021.
- ↑ Poorna Vaidhyanathan (4 June 2020). "Her voice was as sweet as her bow". The Hindu. Retrieved 2 April 2021.
- All articles with dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1936 జననాలు
- వాయులీన విద్వాంసులు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు
- కర్ణాటక సంగీత విద్వాంసులు
- ఆకాశవాణి కళాకారులు
- కళైమామణి పురస్కార గ్రహీతలు
- 2020 మరణాలు