జవాహర్‌లాల్ నెహ్రూ రాజకీయ జీవితం, 1945-1947
1945 నుంచి 1947 వరకూ సాగిన జవాహర్‌లాల్ నెహ్రూ రాజకీయ జీవితాన్ని నమోదుచేస్తుంది ఈ వ్యాసం. 1945 జూన్ 15న రెండేళ్ళ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలపు జైలు జీవితాన్ని ముగించుకుని భారతదేశంలో రాజ్యాంగ సభ, డొమినియన్ల ఏర్పాటుకు బ్రిటీష్ వారు ప్రారంభించిన సంప్రదింపుల్లో పాల్గొనడం ప్రారంభించిన నెహ్రూ మరో రెండేళ్ళ పాటు రకరకాల రాజకీయ వ్యవహారాల్లో తలమునకలయ్యాడు. 1945లో వేవెల్ ప్రారంభించిన సంప్రదింపులకు ఆహ్వానం లేక వెళ్ళకపోయినా, తర్వాత కేంద్ర, రాష్ట్రాల శాసన సభల్లో కాంగ్రెస్ తరఫున పనిచేసి జనరల్ నియోజకవర్గాల్లో గెలవడంలో తన పాత్ర పోషించాడు. ముస్లిం నియోజకవర్గాల్లోనూ, ముస్లిం జనాధిక్యత ఉన్న కొన్ని ప్రావిన్సుల్లోనూ లీగ్ స్పష్టమైన విజయంతో భారతీయ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాబట్టుకోగలిగినంత రాబట్టుకునేందుకు అటు రాజకీయాలను, ఇటు మత హింసను వాడుకోసాగాడు. నెహ్రూ కాంగ్రెస్ ప్రతినిధుల్లో ముఖ్యునిగా చర్చల్లో నిర్ణాయకమైన స్థానాన్ని ఆక్రమించాడు. మరో ముఖ్యనేత వల్లభ్‌భాయ్ పటేల్‌తో పాటుగా కాంగ్రెస్ విధానాలను తరచు మారే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించడంలో తన పాత్ర పోషించాడు.
1946లోనే జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గాంధీ మద్దతు ఆధారంగా గెలుపొందిన నెహ్రూ, కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో ప్రభుత్వ ఆహ్వానం మేరకు వైస్రాయ్ కౌన్సిల్ ఉపాధ్యక్షునిగా, మధ్యంతర ప్రభుత్వాధినేతగా ప్రభుత్వాలు ఏర్పాటుచేసి మంత్రివర్గంలోనే ఉంటూ పనిచేయనివ్వని ముస్లింలీగ్ సభ్యుల ధోరణితో విసిగిపోయి తోటి కాంగ్రెస్ మంత్రులతో సహా రాజీనామా చేశాడు. 1947లో అధికార బదిలీ ప్రక్రియ విషయంలో పలు చర్చల అనంతరం జూలై నెలలో తోటి కాంగ్రెస్ నాయకులతో సహా భారత విభజనకు ఆమోదం తెలిపాడు. ఈ క్రమంలో ముస్లిం మతస్తుల సంఖ్యాధిక్యత ప్రాతిపదికన బెంగాల్, పంజాబ్ విభజన, వాయువ్య సరిహద్దు ప్రావిన్సులో జనాభిప్రాయ సేకరణ వంటి అంశాలను నిర్దిష్టంగా నిర్ణయించడంలో తనవంతు పాత్ర పోషించాడు.
మరోవైపు సంస్థానాల్లో ప్రజాపోరాటాలతో మమేకమైన చరిత్ర కలిగినవాడిగా కాశ్మీరు సంస్థానంలో జరిగిన ప్రజా ఉద్యమానికి మద్దతుగా 1946లో ఆందోళనలు చేసిన నెహ్రూ సంస్థానాధీశులు, సంస్థానాల అధికార వర్గాలకు అప్రియమైన, భయాందోళనలు రేకెత్తే మనిషిగా పేరుతెచ్చుకోవడంతో 1947లో సంస్థానాల విలీనం విషయంలో అతన్ని పక్కకు తప్పించి వల్లభ్‌భాయ్ పటేల్, వీపీ మీనన్, మౌంట్ బాటన్‌లు సంస్థానాల విలీనం పూర్తిచేశారు. అయితే 1947 ఆగస్టు 15 నాటికి విలీనం పూర్తికాని సంస్థానాలైన హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ వ్యవహారాల్లో ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రమేయం కల్పించుకున్నాడు. ప్రత్యేకించి కాశ్మీర్ ప్రతిష్టంభన పాకిస్తాన్ భూభాగం నుంచి జరిగిన ఆక్రమణ వల్ల సమస్యాత్మకం కావడం, అక్కడి ప్రజానాయకుడు షేక్ అబ్దుల్లాతో తనకు స్నేహం ఉండడం వంటి కారణాలతో మరింతగా దానిపై పనిచేశాడు. సంస్థానం అధికారికంగా విలీనం అయినా ఆక్రమణదారులను సంస్థానంలో సగ భాగం వరకే తరిమికొట్టగలగడంతో ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు పాకిస్తాన్ నియంత్రణలో ఉండిపోయాయి. మత ప్రాతిపదికన కాక పాకిస్తాన్ వైపు మొగ్గు అన్న అంశంపై కాశ్మీరులో ఉత్తరం, పశ్చిమాన ఉన్న భాగాలు పాకిస్తాన్‌కు, మిగతా ప్రాంతం భారతదేశానికి దక్కేట్టు విభజించవచ్చన్న ఆలోచనతో 1947లో నెహ్రూ ఉన్నా దాన్ని పాకిస్తాన్ సాధ్యపడనివ్వలేదు. ఇక 1947 డిసెంబరు నాటికల్లా కాశ్మీరు సమస్యను ఐక్యరాజ్య సమితికి నివేదించాలన్న నిర్ణయాన్ని మౌంట్ బాటన్ ప్రభావం, ఒత్తిడి మేరకు నెహ్రూ తీసుకున్నాడు. తర్వాతికాలంలో తానే పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ఈ నిర్ణయం మేరకు 1948 జనవర 1 నాటికి కాశ్మీరు సమస్య ఐక్యరాజ్య సమితి పరిశీలనకు వెళ్ళింది.
శాసన సభల ఎన్నికలు, క్యాబినెట్ మిషన్
[మార్చు]శాసన సభలకు ఎన్నికలు
[మార్చు]గాంధీ, కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం బ్రిటీష్ జైళ్ళలో మగ్గుతున్న కాలంలో వారు అందించిన క్విట్ ఇండియా నినాదం అప్పటికే యుద్ధకాలంలో ప్రభుత్వం అనుసరిస్తున్న దారుణమైన విధానాలకు విసిగి వేసారిపోయిన ప్రజలు అందుకుని దిశానిర్దేశం చేసే నాయకులు లేకున్నా ఉజ్జ్వలమైన పోరాటం చేశారు. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం అత్యంత దారుణంగా అణచివేసిన ఈ ఉద్యమం ఇరువైపులా హింసాత్మకమైన ఘటనలతో, ప్రభుత్వ ఆస్తి నష్టం, ఆందోళనకారుల ప్రాణనష్టాలతో సాగింది. కాంగ్రెస్, గాంధీ భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించే నాయకులుగా తిరిగి నిలబడ్డారు. మరోవైపు ముస్లింలీగ్ యుద్ధ ప్రయత్నాలకు సహాయం చేసి, భారత ప్రభుత్వానికి చేరువై, కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యక్షంగా ప్రభావితం చేయలేని ఈ దశలో ముస్లింలపై తన పట్టును అపరిమితంగా పెంచుకుంది. ఈ పరిణామాలన్నిటినీ 1946లో కేంద్ర, రాష్ట్ర శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయి.
ఎన్నికలకు ముందు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు 1945లో వైశ్రాయ్ వేవెల్ జరిపిన చర్చలకు ఆహ్వానితుల్లో లేకపోయినా సిమ్లాలోనే ఉన్న జవాహర్లాల్ ప్రభుత్వ ఉద్దేశాలపై వేసిన అంచనాలకు తగ్గట్టే అవి జరిగాయి. కాంగ్రెస్ నుంచి ప్రభుత్వంలోకి ముస్లిం సభ్యులు ఉండరాదన్న ముస్లింలీగ్ కోర్కెను వేవెల్ మన్నించినా, అందరు ముస్లిం ప్రతినిధులే లీగ్ సభ్యులే కావాలన్నది మాత్రం ఒప్పుకోలేకపోయాడు. జిన్నా ప్రతిపాదనలు ఉపసంహరించుకోగానే మొత్తం సంప్రదింపులు రద్దయ్యి, కాంగ్రెస్ సూచనలకు కనీస విలువ కూడా దక్కలేదు. 1945 చివర్లో జరిగిన ఎన్నికల్లో ముస్లింలీగ్ ముస్లింలలో తాను సాధించిన పట్టు నుంచీ, ప్రభుత్వ వర్గాల్లో సంపాదించిన మొగ్గు నుంచీ లాభం సంపాదించుకుంది. జనరల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధికశాతం గెలిచినా, కేంద్ర శాసన సభకు కేటాయించిన ముస్లిం నియోజకవర్గాల్లో చాలావరకూ సంపాదించింది. ముస్లిం మెజారిటీ ఉన్న పంజాబ్, సింధ్, బెంగాల్ ప్రావిన్సుల్లో లీగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగింది. అయితే ఈ ధోరణికి భిన్నంగా ముస్లింలు అత్యధిక దామాషాలో ఉన్న వాయువ్య సరిహద్దు రాష్ట్రాల్లో మాత్రం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటు చేసింది.[1]
ఫలితాల్లో ముస్లింలపై లీగ్ పట్టు స్పష్టంగా కనిపిస్తున్నా దీన్ని నెహ్రూ, కాంగ్రెస్ వేరేగా విశ్లేషించారు. భారతదేశం నుంచి విడిపోయే హక్కు ఇస్తే అది వారి భయాలు వదిలించుకోవడానికి పనికివస్తుందే తప్ప విడిపోయేందుకు దాన్ని వినియోగించుకోరని నెహ్రూ భావించాడు.[నోట్స్ 1] ఈ మేరకు కాంగ్రెస్ భారతదేశం నుంచి బ్రిటీష్ ప్రభుత్వం ఉపసంహారం జరగాలని, రాజ్యాంగ పరిషత్తు ఏర్పడాలని కోరుతూనే కాస్త తటపటాయిస్తూ ఏదైనా ప్రాంతం విడిపోవడానికి కోరుకుంటే అందుకు వారికి హక్కు ఉండాలని పేర్కొంది.[2]
క్యాబినెట్ మిషన్
[మార్చు]1946 ఫిబ్రవరిలో బ్రిటీష్ ప్రభుత్వం ముగ్గురు బ్రిటీష్ మంత్రి మండలి సభ్యులతో ఏర్పాటుచేసిన బృందం భారత స్వాతంత్ర్యాన్ని ప్రాతిపదికగా రాయబారానికి వచ్చింది. దీన్నే క్యాబినెట్ మిషన్ గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాల దామాషా ప్రాతినిధ్యంతో భారత రాజ్యాంగ పరిషత్తు ఏర్పడుతుందని, దానిలో చేరేందుకు ఇష్టం లేని రాష్ట్రాలను ప్రస్తుతానికి విడిచిపెట్టేయవచ్చు. వెనువెంటనే తాత్కాలిక కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలి. ఇదీ ప్రస్తుతానికి చేయదలచింది.[3] భవిష్యత్తు ఏర్పాటు విషయంలో ఒక ప్రతిపాదన బయటపెట్టారు. కేంద్రం, హిందూ ప్రాబల్యం కలిగిన రాష్ట్రాల గ్రూపు, ముస్లిం ప్రాబల్యం కలిగిన రాష్ట్రాల గ్రూపులుగా ఏర్పాటుచేస్తారు. అధికారాలు కేంద్రం, గ్రూపులు, రాష్ట్రాలకు నడుమ విభజితమై ఉంటాయి. కేంద్రం చేతిలో చాలా పరిమితమైన, బలహీనమైన అధికారాలు ఉంటాయి. సిమ్లాలో ఈ అంశంపై జరిగిన చర్చల్లో జిన్నా కేంద్రానికి ఒప్పుకుంటే, నెహ్రూ గ్రూపులకు ఆమోదం చెప్పాడు. సమాఖ్యలో యూనిట్లు శాశ్వతంగా ఉండిపోయేలా తాము నిర్బంధించమని నెహ్రూ అంగీకరించాడు.[4] అయితే యూనియన్ స్థాయిలో శాసన సభ ఉండరాదన్న జిన్నా ప్రతిపాదనకు నెహ్రూ, గ్రూపింగుల విషయంలో రాష్ట్రాలు వాటికవే నిర్ధారించుకోవాలన్న నెహ్రూ ప్రతిపాదన మీద జిన్నా ఒకరినొకరు వ్యతిరేకించుకున్నారు. అయితే స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులుగా తానూ, నెహ్రూ సమస్కంధులమని విడిగా సామరస్యపూర్వకంగా చర్చించుకుంటామని జిన్నా క్యాబినెట్ మిషన్ తో అన్నాడు. ఇలాంటి సమయంలో మే 8న క్యాబినెట్ మిషన్ ముస్లిం, హిందూ మెజారిటీ రాష్ట్రాల నుంచి దామాషా ఉండేలా రాజ్యాంగ సభ కొలువుతీరుతుందని, రాష్ట్రాలు "గ్రూపింగులుగా ఏర్పడితే ఏర్పడవచ్చు" అని అంతకుముందులా కాక గ్రూపింగు ప్రతిపాదనను బలహీనం చేస్తూ చేసిన ప్రతిపాదన కాంగ్రెస్ ను సంతోషపరిచి, లీగును భగ్గుమనేలా చేసింది.[5] గ్రూపింగులన్నీ ఐచ్ఛికమైనవే కావాలనీ, ఈ అంశం రాజ్యాంగ సభే నిర్ణయించాలనీ, లీగ్ అనుకూలించకపోతే కాంగ్రెసుతో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడాలని కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేసింది. వివాదాస్పదమైన అంశాలను భారతీయులో, ఆంగ్లేయులో కాని మధ్యవర్తులకు నివేదించాలంటూ జవాహర్లాల్ సూచించాడు. ముందు ఆలోచించుకుంటానన్న జిన్నా, తర్వాత కాంగ్రెస్ వారు మధ్యవర్తులుగా ఉండదగ్గవారి పేర్లను సూచించగానే అసలు మధ్యవర్తిత్వాన్నే అంగీకరించేది లేదన్నాడు. దాంతో ఇరుపక్షాలూ తమ బిర్రబిగిసిన వైఖరులకు తిరిగిపోయాయి.[6]
క్యాబినెట్ మిషన్ మధ్యేమార్గంగా ఒక రాజీ ప్రతిపాదన చేసింది. ఇందులో కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండేలా కొన్ని అంశాలు, లీగ్ కి నచ్చే విధమైన మరికొన్ని అంశాలు చేర్చారు. ఈ క్రమంలో గ్రూపింగులు ఐచ్ఛికమైనవని ఒక క్లాజు చెప్తున్నప్పటికీ, మరో క్లాజు దాన్ని నిర్బంధం చేస్తున్న సంగతి ముందుగా కాంగ్రెస్ కు తెలియదు, అయితే మంత్రిమండలి సభ్యులు దీన్ని ముస్లింలీగ్ కు వివరించారు. నిర్బంధ గ్రూపింగ్ విధానం ఉన్నందున మిషన్ పథకాన్ని అంగీకరిస్తున్నామని 1946 జూన్ 6 తేదీన ముస్లింలీగ్ అంగీకరిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఆజాద్ కు గ్రూపింగ్ నిర్బంధం కాదనీ, అసలు గ్రూపింగ్ ఏర్పాటుకావాలా వద్దా, అయితే ఎందులో చేరాలన్నది సెక్షన్లుగా ఏర్పడే రాజ్యాంగసభలో సమావేశమయ్యే రాష్ట్రాల ప్రతినిధులే నిర్ణయిస్తారని చెప్పి వేవెల్ ఒప్పించాడు. కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వంలో చేరడాన్ని నిరాకరిస్తూ, తనకు తెలిసిన వ్యాఖ్యానాన్ని బట్టి దీర్ఘకాలిక ప్రతిపాదనలకు అంగీకారం ఉందని, రాజ్యాంగ సభలో మాత్రం చేరింది.[7] క్యాబినెట్ మిషన్ పథకాన్ని రెండు పక్షాలూ ఆమోదించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, మిగిలిన సంప్రదింపుల పనిని వైశ్రాయికి వదిలివేసి జూన్ 29న ఇంగ్లండు వెళ్ళిపోయారు.
అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి వైశ్రాయ్ ప్రభుత్వం ఏర్పాటుచేయమని ఆహ్వానిస్తాడు. కాబట్టి 1946లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు కీలకమైనవి. అవి జరిగినప్పుడు మొత్తం 15 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల్లో 12 కమిటీల వల్లభ్ భాయ్ పటేల్ ని అభ్యర్థిగా ప్రతిపాదించాయి. అయితే గాంధీ మాత్రం నెహ్రూ అధ్యక్షత వహించడానికి అనుకూలంగా నిర్ణయించాడు. దాంతో కొందరు వర్కింగ్ కమిటీ సభ్యులు నెహ్రూ పేరును ప్రతిపాదించారు. అలానే నెహ్రూకు అనుకూలంగా తప్పుకొమ్మని పటేల్ ని ఒప్పించారు. నెహ్రూ తప్పుకునేందుకు ఒక వీలిచ్చే ఉద్దేశంతో పటేల్ తప్పుకుంటున్నట్టు సంతకం పెట్టే ముందు గాంధీ "పటేల్ పేరును 12 కమిటీలు ప్రతిపాదించాయి. మీ పేరును ఒక్కటీ ప్రతిపాదించలేద"ని నెహ్రూను ఉద్దేశించి అన్నాడు. సమాధానమివ్వకుండా నెహ్రూ మౌనం వహించాడు. నిర్ణయం తీసుకున్న గాంధీ ఇక పటేల్ చేత సంతకం పెట్టించాడు. అలా నెహ్రూ మూడోమారు కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.
1946 జూలై 7న నెహ్రూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలోనూ, ఆ తర్వాత విలేఖరులతో ఇష్టాగోష్ఠిలోనూ "రాజ్యాంగ పరిషత్తులో చేరడానికి మేం నిర్ణయించాం. అంతకుమించి క్యాబినెట్ మిషన్ వారి ప్రతిపాదనల్లో మరేవీ అంగీకరించలేద"ని ప్రకటించడం సంచలనం అయింది. ఒక బహిరంగ సమావేశంలో తిరిగి జూలై 10న దీన్నే పునరుద్ఘాటించాడు. దీని ప్రకారం రాజ్యాంగ సభ సర్వోన్నతమైన అధికారం కలిగివుంటుంది. [నోట్స్ 2] ఈ ప్రకటన తర్వాత జిన్నా క్యాబినెట్ మిషన్ కు ఇచ్చిన ఆమోదాన్ని వారాల వ్యవధిలో ఉపసంహరించుకున్నాడు.[నోట్స్ 3]
తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు, వేవెల్ నిష్క్రమణ
[మార్చు]జిన్నా జూలై చివర్లో కేబినెట్ మిషన్ పథకాన్ని తిరస్కరించాకా, బ్రిటీష్ ప్రభుత్వ వైఖరిని అనుసరిస్తూ వేవెల్ కాంగ్రెస్ అధ్యక్షుడైన జవాహర్లాల్ ను ప్రభుత్వం ఏర్పాటుచేయమని కోరాడు.[8] లండన్ నుంచి తమకు లభిస్తున్న మద్దతును వినియోగించుకుని జవాహర్లాల్ వైస్రాయ్ వేవెల్ తో గట్టిగా వ్యవహరించసాగాడు. అయిదుగురు సవర్ణ హిందువులు, అయిదుగురు ముస్లిములు, షెడ్యూల్డ్ కులస్తులు ఒకరు, మరో నలుగురు మిగతా అల్పసంఖ్యాకవర్గం వారూ అన్న దామాషా మీద ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. ఈ ఐదుగురు ముస్లింలలో నాలుగు స్థానాలు లీగుకు వదిలి, ఒకటి జాతీయవాద ముస్లిం ఒకరికి ఇస్తున్నారు.[9] సంప్రదింపుల ప్రక్రియలో తాను అనుభవిస్తున్న వీటో అధికారాన్ని, బ్రిటీష్ వారి పాక్షికతను కోల్పోయిన సంగతి, దాన్ని అర్థం చేసుకుని స్వతంత్రించి ముందుకు వెళ్తున్న నెహ్రూ చర్యల పూర్వాపరాలను అర్థం చేసుకున్న జిన్నా ప్రక్రియ మీద హింస ద్వారా ఒత్తిడి తీసుకువచ్చే వ్యూహంలోకి దిగాడు. ఆగస్టు 16 తేదీన ప్రత్యక్ష కార్యాచరణ దినం కోసం పిలుపునిచ్చిన జిన్నా వేలాదిమంది హిందూ-ముస్లింల ప్రాణాలు బలిగొని ఉపఖండంలో హింసను రాజేశాడు.
ఈలోగా నెహ్రూ వైస్రాయ్ కార్యనిర్వాహకవర్గానికి ఉపాధ్యక్షునిగా తన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. భారతదేశానికి, ఆఫ్ఘనిస్తాన్ కీ సరిహద్దుల్లో 97 శాతం మంది ముస్లింలు, అత్యధికంగా పఖ్తూన్ జాతీయులైన గిరిజన ముస్లింలే ఉన్న వాయువ్య సరిహద్దు ప్రావిన్సు మొత్తం ఉపఖండంలోని ముస్లింలందరికీ ఏకైక ప్రతినిధిగా నిలవడంలో జిన్నాకు, అలాంటి హోదా అతనికి ఇవ్వడంలో వేవెల్, అతని ప్రభుత్వానికి అడ్డంకిగా నిలిచింది. 1946లో జరిగిన ఎన్నికల్లో దాదాపు అరవై శాతం ఓట్లు సంపాదించి కాంగ్రెస్ వారైన ఖాన్ సోదరులు గెలిచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్ కు ఈ రాష్ట్రంపై పట్టు పెరగనివ్వకూడదని, వీలైతే దెబ్బతీయాలని ప్రయత్నంలో ఉన్న రాష్ట్ర గవర్నరు గిరిజన శాఖను చూస్తున్న నెహ్రూ స్వయంగా వెళ్ళి ప్రభుత్వంలో లీగ్ చేరేవరకూ వాయువ్య సరిహద్దు ప్రావిన్సును సందర్శించబోగా వద్దని ఢిల్లీకి వచ్చి మరీ నచ్చచెప్పాడు.[10] ఆ మాటలు పక్కనపెట్టి జవాహర్లాల్ తన పర్యటన సాగించగా ముస్లిం లీగ్ వ్యతిరేక ప్రదర్శనలు చేసి, రాళ్ళు విసిరారు. బ్రతికి బయటపడడం గొప్ప విషయంగానే ఎంచాలి. అయినా ధైర్యంగా తన సందర్శన పూర్తిచేసుకున్నాడు. మొత్తానికి ఈ కార్యక్రమాన్ని అవకాశంగా తీసుకుని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అధికారులు విజయవంతంగా బలహీనపరిచారు.[11]
వేవెల్ లండన్లో మంత్రివర్గం మద్దతు సంపాదించి ప్రభుత్వంలోకి ముస్లిం లీగ్ ను తీసుకురావడానికి జిన్నాతో సంప్రదింపులు మొదలుపెట్టి, అంతవరకూ రాజ్యాంగ పరిషత్తును సమావేశపరచకుండా నిలిపివేశాడు. ప్రతిష్టంభన, అల్లర్లు నిలిపివేయడానికి లీగ్ ప్రభుత్వంలో చేరడం వీలిస్తుందన్న ఆలోచనతో నెహ్రూ స్వయంగా జిన్నాను కలిసి అతనికీ ఆమోదయోగ్యమైన కొన్ని సూచనలు చేశాడు.[12] అయితే జాతీయవాది అయిన ముస్లింను కాంగ్రెస్ మంత్రివర్గంలో నామినేట్ చేయకపోతే చేరతానన్న అంశం మీదే జిన్నా పట్టుబట్టాడు. కానీ నెహ్రూ వ్యక్తిగతంగానూ, సంస్థాగతంగానూ అత్యంత కీలకమైన ఈ అంశంపై వెనక్కి తగ్గలేదు. తుదకు వేవెల్ షెడ్యూల్డ్ కులాలతో సహా ఐదుగురు వ్యక్తులను వైస్రాయ్ కౌన్సిల్ కి నామినేట్ చేసే అధికారాన్ని ఇస్తూ జిన్నాను ప్రభుత్వంలో చేరడానికి వేవెల్ ఒప్పించాడు. ఇందుకు ప్రతిగా వేవెల్ కేబినెట్ మిషన్ పథకానికి ఆమోదం కానీ, మత హింసను రాజకీయ సాధనంగా మలిచిన ప్రత్యక్ష చర్య విధానాన్ని విడనాడతానన్న హామీ కానీ, కనీసం తాము చేరబోయే ప్రభుత్వానికి సహకారం ఇస్తానన్న పూచీ కానీ జిన్నాను అడిగి తీసుకోలేదు. దీనిపై జవాహర్లాల్ ఎన్నోమార్లు నిరసన తెలిపినా, మరెంతగా వ్యతిరేకించినా వేవెల్ లక్ష్యపెట్టలేదు.[13]
దీనికి ఫలితం వెంటనే కనిపించింది. తాత్కాలిక ప్రభుత్వానికి లీగ్ నామినేట్ చేసిన సభ్యుల్లో ఒక్క లియాఖత్ అలీ ఖాన్ మినహా మిగతా వారెవరూ ఆ స్థాయికి చెందినవారు కారు.[14] పైగా తాత్కాలిక ప్రభుత్వంలోని ఇరుపక్షాల సభ్యులు సహచరుల్లా కాక ప్రతీ అంశంలోనూ ఒకరికొకరు ప్రత్యర్థుల్లా చర్చంచుకునేలా, తాను మధ్యవర్తిగా వ్యవహరించేలా వేవెల్ పనితీరు సాగింది. బెంగాల్లో హిందువుల మీద జరుగుతున్న హత్యాకాండకు ప్రతిగా బీహార్లో హిందూ రైతులు ముస్లింలపై దాడులు, హత్యాకాండ సాగించడం ప్రారంభమైంది.[15] వైస్రాయ్, జవాహర్లాల్, జిన్నాలు ముగ్గురూ దీన్ని ఆపాల్సిందేనని భావించినా ప్రభుత్వానికి చర్య తీసుకోగల సమర్థత, తీసుకున్న దాఖలా ఏమీ లేదు. జవాహర్లాల్, మరొక ముస్లింలీగ్ మంత్రిని వెంటపెట్టుకుని పర్యటించి, ఈ అంశంపై వ్యక్తిగత స్థాయిలో శ్రద్ధ తీసుకుని శాంతి భద్రతలు అదుపులోకి తీసుకురాగలిగాడు. రాజ్యాంగ పరిషత్తు విషయమై దీర్ఘకాలిక ప్రణాళికను లీగ్ ఇంకా ఆమోదించలేదు కనుక సమావేశపరచనని వేవెల్ తేల్చాడు.[16] ఆట్లీ ప్రభుత్వం నేరుగా జోక్యం కలిగించుకుని లండన్లో ఏర్పాటుచేసిన చర్చల్లో లీగ్, అక్కడి ప్రభుత్వం కలిసి కాంగ్రెస్ తతన వ్యాఖ్యానాన్ని విడిచిపెట్టి, లీగ్ వ్యాఖ్యానాన్నే స్వీకరించాలని ఒత్తిడి చేశారు. చివరకు అలా రాజ్యాంగ సభ డిసెంబరు 9 నాటికి కొలువు తీరింది. జిన్నాకు రాజ్యాంగ సభలో చేరకుండేందుకు కారణం ఉండకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ తన వ్యాఖ్యాన్ని విడిచిపెట్టింది. అయినా రాజ్యాంగ సభను కానీ, ప్రభుత్వాన్ని కానీ ఏ విధంగానూ జిన్నా పనిచేయనివ్వలేదు.[17] లియాఖత్ అలీఖాన్, అతని తోటి ముస్లింలీగ్ ప్రతినిధులు తమ ప్రభుత్వాధినేతగా నెహ్రూను గుర్తించ నిరాకరించారు. ఆర్థిక మంత్రిత్వశాఖ నడిపిస్తున్న లియాఖత్ అలీఖాన్ కాంగ్రెస్ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని పన్నులు వేశాడు. మతకలహాలు ఉత్తర భారతదేశం అంతటా వ్యాపించడం, జిన్నా చూపించిన బాటలోనే సంస్థానాధీశులు కూడా పయనిస్తూండడం, తాత్కాలిక ప్రభుత్వం ఏ ప్రభావం చూలేకపోవడం వంటి నిరాశామయమైన స్థితిగతుల మధ్య ముస్లిం లీగ్ కు చెందిన ఐదుగురు సభ్యులు తప్ప మిగిలిన వైస్రాయ్ కార్యనిర్వాహకవర్గం అంతా 1947 ఫిబ్రవరి 5న రాజీనామా చేశారు.[18] భారతదేశంలో పునరుద్ధరణకు సాధ్యంకాని రీతిలో పరిపాలన దెబ్బతిందని వేవెల్ ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకుని ఆట్లీ అతన్నే తొలగించి, వైస్రాయ్ గా మౌంట్ బాటన్ ను నియమించాడు. ఫిబ్రవరి 20వ తేదీన బ్రిటీష్ పార్లమెంటులో భారతదేశంలో అధికార బదిలీ పూర్తికావడానికి గడువుగా 1948 జూన్ 30 తేదీని నిర్ణయించినట్టు ప్రకటించాడు.[19]
భారత స్వాతంత్ర్యం, దేశ విభజన
[మార్చు]అట్లీ ప్రకటన
[మార్చు]ఆట్లీ ప్రకటన అనంతరం "[భారతదేశ రాజకీయ] చిత్రం నుంచి బ్రిటీష్ వారు క్రమేపీ కనుమరుగవుతున్నారు, నిర్ణయం తీసుకోవాల్సిన భారం మన మీదే ఉంది. కాబట్టి మనం సమస్యను సూటిగా ఎదుర్కోవాలని, ఒకరితో ఒకరు దూరాన్నుంచి మాట్లాడుకునే పద్ధతి మానుకుందామని" లియాఖత్ అలీ ఖాన్‌కు నెహ్రూ విజ్ఞప్తి చేశాడు. అధికార బదిలీ తేదీని ప్రకటన వెలువడ్డాకా పాకిస్తాన్ వాస్తవరూపం దాల్చుతుందని మరెన్నడూ లేనంత నమ్మకం ఏర్పడ్డ జిన్నా సాధ్యమైనంత అధికారాన్ని సాధించడానికి నిశ్చయించుకున్నాడు. ఆ క్రమంలో హింసాత్మకమవుతున్న పంజాబ్ ప్రావిన్సులో సహాయ నిరాకరణను ప్రారంభించి, కాంగ్రెస్-అకాలీదళ్ ప్రభుత్వం పతనం చేశాడు.[19]
విభజనకు అంగీకారం
[మార్చు]ముస్లింలీగ్ అంతగా అభిలషిస్తే పాకిస్థాన్‌ను తీసుకోవచ్చు. కానీ ఒక షరతు, పాకిస్థాన్‌లో చేరడానికి ఇష్టపడని ప్రాంతాలను మాత్రం అది తీసుకెళ్ళలేదు.
జవాహర్‌లాల్ నెహ్రూ, 1947 ఏప్రిల్ 20
ఈ దశలో దేశాన్ని విభజించకుండా బ్రిటీష్ ప్రయోజనాలకు భంగం కాని రీతిలో అధికార బదిలీ చేసేందుకు వచ్చిన మౌంట్ బాటన్ అప్పటికే దెబ్బతినిపోయిన క్యాబినెట్ పథకానికి జీవం పోసే ప్రయత్నాలు సాగించాడు. ఒక పౌరయుద్ధం స్థాయిలో సాగుతున్న మతకల్లోలాలు, దాని ఆధారంగా తన సిద్ధాంతాన్ని, స్థానాన్ని బలపరుచుకుంటూ తాత్సారం సాగిస్తున్న జిన్నా వైఖరి, వీటి మధ్య దెబ్బతింటూన్న బ్రిటీష్ ఆసక్తులు కలిసి మౌంట్ బాటన్‌కు పాకిస్తాన్ ఏర్పాటును అనివార్యమని భావించేలా చేశాయి. బ్రిటన్ ఆసక్తులకు భంగం కాని ఒక దేశానికి అధికార బదిలీ బదులు, బ్రిటన్‌తో సఖ్యంగా ఉంటూ కామన్వెల్త్‌లో కొనసాగే రెండు దేశాలను సృజించినా ఫర్వాలేదన్న అవగాహనకు వచ్చాడు. ఆ క్రమంలో పలు రకాలైన ప్రతిపాదనలు చేయసాగాడు.[20] మరోవైపు క్రమేపీ కాంగ్రెస్ నాయకులు కూడా దేశ విభజన తప్పదన్న ఆలోచనకు రాసాగారు. అయితే వీరి కారణం వేరు. బెంగాల్‌లో ప్రారంభమైన మత హింస మొత్తం ఉత్తర భారతదేశమంతటా విస్తరించడం, ఈ హింసను కూడా జిన్నా ఒక రాజకీయ విధానంగా మలుచుకోవడం కారణం. 1947 ఫిబ్రవరిలో పంజాబ్ ప్రావిన్సులో ముస్లింలు, ముస్లిమేతరుల నడుమ హింసాత్మకమైన రాజకీయ ఘర్షణ మతాల మధ్య ఘర్షణగా మారి హింసకు దారితీసింది. మత హింసను రాజకీయ ఆయుధంగా మార్చుకుంటున్న జిన్నా విధానాలను అడ్డుకట్ట వేయడానికి విభజనకు అంగీకరిస్తూనే, ముస్లిం సంఖ్యాధిక్యత ఉన్న ప్రాంతాలకు దాన్ని పరిమితం చేయాలన్న వ్యూహానికి కాంగ్రెస్ నాయకులు ఒక్కరొక్కరే రాసాగారు.[21] ముందుగా వల్లభ్ భాయ్ పటేల్ దేశ విభజన తప్పదన్న ఆలోచనకు వచ్చాడు. దేశ విభజన జరగకపోతే అంతర్యుద్ధం తప్పదన్న అంచనాకు అతను 1947 సంవత్సరారంభంలోకే వచ్చేశాడు. అదే ఆలోచనకు క్రమేపీ కృపలానీ, ఆజాద్, రాజాజీ, ప్రసాద్‌లతో పాటుగా నెహ్రూ కూడా వచ్చాడు. దేశ విభజన జరగాలంటే పంజాబ్‌ను విభజించాలంటూ కాంగ్రెస్ తీర్మానించింది, అదే తీర్మానంలో బెంగాల్ విభజన అంశం కూడా ఇమిడివుంది.[22] జిన్నా కోరుకుంటున్న విభజనకు పంజాబ్, బెంగాల్ విభజనలే సరైన ప్రత్యుత్తరమని, తక్షణ విభజనకు కాంగ్రెస్ పట్టుబట్టవలసిందేనని మిగతా వర్కింగ్ కమిటీతో సహా నమ్మి ఈ పనిచేశాడు. ఉపఖండంలో వ్యాపిస్తున్న హింసను అడ్డుకోవడానికి బెంగాల్ నుంచి బీహార్ వెళ్ళిన గాంధీని ఈ నిర్ణయంపై ముందస్తుగా నెహ్రూ సహా వర్కింగ్ కమిటీ సభ్యులు ఎవరూ సంప్రదించకుండా పక్కన పెట్టేశారు.[23]
గాంధీ ఐదు సూత్రాల పథకం
[మార్చు]గాంధీ మరోవైపు జరుగుతున్న సమస్యలన్నిటినీ తీర్చి, దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఆఖరి ప్రయత్నంగా - అధికారం అంతా జిన్నా చేతికే బదిలీ చేసే పథకాన్ని ఏప్రిల్ 1న మౌంట్ బాటన్‌కు ప్రతిపాదించాడు, మళ్ళీ ఏప్రిల్ 2న గట్టిగా చెప్పాడు.[24][నోట్స్ 4] తర్వాతి రోజుల్లో గాంధీ నెహ్రూతో సమావేశమై ఈ పథకం గురించి గంట సేపు చర్చించాడు. వర్కింగ్ కమిటీతో కూడా చర్చలు చేశాడు. అయితే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఆజాద్ మినహా నెహ్రూ, సహా మిగతా వర్కింగ్ కమిటీ సభ్యులు దీన్ని తిరస్కరించారు. ఏప్రిల్ 11న ఈ పథకాన్ని ఉపసంహరించుకుంటూ మౌంట్ బాటన్‌కి గాంధీ రాశాడు.[25] ఏప్రిల్ 20వ తేదీన నెహ్రూ పాకిస్తాన్ ఏర్పాటును అంగీకరిస్తూ బహిరంగంగా ప్రకటించాడు. అయితే ఆ ప్రకటనలోనే నిర్బంధంగా కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్‌లో చేర్చడాన్ని తిరస్కరించాడు.[26]
విభజన ప్రాతిపదికలు
[మార్చు]మే 10వ తేదీ రాత్రి హఠాత్తుగా మౌంట్ బాటన్ నెహ్రూకు బాల్కనైజేషన్ ప్లాన్ అందజేశాడు.[నోట్స్ 5] దీని ప్రకారం నేరుగా రాష్ట్రాలకే అధికార బదిలీ చేస్తారు. తర్వాత అవి గ్రూపింగ్ సహా అన్ని విషయాలను రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయి. ఈ ప్రతిపాదన నెహ్రూను తీవ్రమైన ఉద్విగ్న స్థితికి తీసుకుపోయింది. ఉద్రేకంతో రాసిన ఒక లేఖలో భారత యూనియన్‌ను ముక్కచెక్కలు చేస్తూ అధికారాన్ని నేరుగా రాష్ట్రాలకు అందించే సంభావ్యతకు కాంగ్రెస్ ఒప్పుకోదని తేల్చాడు. ఏ పథకమైనా యూనియన్‌తో మొదలై, అవసరమైతే కొన్ని రాష్ట్రాలు ఐచ్ఛికంగా బయటకు వెళ్ళేలా ఉండాలని, భారతదేశ భావనను తుంగలో తొక్కి, రాజ్యాంగ పరిషత్తును ప్రాముఖ్యతను సర్వనాశనం చేసేలా ఉందని ఈ ప్రతిపాదనను తీవ్రంగా తిరస్కరించాడు.[27]
ఈ పథకం ప్రతిపాదించడంతో జవాహర్‌లాల్‌కి మౌంట్ బాటన్ మీద ఉన్న విశ్వాసం దెబ్బతింది.[27] దీన్ని సవరించడానికి జవాహర్‌లాల్ లేవనెత్తిన ముఖ్యమైన అభ్యంతరాన్ని దృష్టిలో ఉంచుకుని పథకాన్ని తిరగరాయమని తన సహాయకులను ఆదేశించాడు. సిక్ఖులకు ప్రత్యేక రాష్ట్రాన్ని నిరాకరించడం, అస్సాంలో భాగమై ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న సిల్హెట్ జిల్లా భవితవ్యాన్ని ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నిర్ణయించడం, పంజాబ్, బెంగాల్ ప్రావిన్సులు మత ప్రాతిపదికన విభజించడం, సింధ్ ప్రావిన్సు ఎటు చేరాలన్నది దాని శాసన సభ నిర్ణయించుకోవడం, బెలూచిస్తాన్ నిర్ణయం విషయంలో ఒక సముచితమైన యంత్రాంగం రూపొందించడం వంటివి సవరించిన ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. ఈ పద్ధతులేవీ సంస్థానాలకు వర్తించవనీ చేర్చారు. కొంత కాలం పాటు అధినివేశ ప్రతిపత్తితో ఈ రెండు దేశాల్లో అధికార మార్పిడి జరగడం కూడా ఇందులో ఇమిడివుంది.[28] లాహోరు తగలబడిపోతూండగా, మరోవైపు కలకత్తా మరో సంహారకాండకు సిద్ధమవుతూండగా - ఈ మతహింసను ఆపే ఉద్దేశం కానీ, సత్తా కానీ బ్రిటీష్ అధికారులకు లేని స్థితిలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అధికారాన్ని తమ చేతిలోకి తీసుకుని, అదుపు చేయాలన్న ఉద్దేశంతో నెహ్రూ ఉన్నాడు. నెహ్రూ మన:స్థితిని అవకాశంగా మౌంట్ బాటన్ తీసుకుని అధినివేశ ప్రతిపత్తికి, వాయువ్య సరిహద్దు ప్రావిన్సులో జనాభిప్రాయ సేకరణకు ఒప్పించే ప్రయత్నం చేశాడు. భారతదేశాన్ని కామన్‌వెల్త్‌లో ఉంచడానికి ఇది చాలా కీలకమని పాకిస్తాన్ అవకాశాలు మెరుగుపరుచుకునే ఉద్దేశంతో జిన్నా అధినివేశ ప్రతిపత్తి చాలని అంగీకరించాడు కూడా.[29] అయితే నెహ్రూ బ్రిటీష్ వారు ఉపసంహరించుకోక మునుపే "పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగిన అధినివేశ ప్రతిపత్తి"ని తాత్కాలిక ప్రభుత్వానికి ఇచ్చితీరాలని, ఇందుకు ముస్లింలీగ్‌కు అంగీకారం లేకపోతే ప్రభుత్వం నుంచి వెళ్ళిపోవచ్చనీ కాంగ్రెస్ తరఫున తేల్చాడు. [నోట్స్ 6] అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల కోసం తనకు అతిక్రమణాధికారం అట్టిపెట్టుకుని ఈ స్వయంప్రతిపత్తి ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించిన మౌంట్ బాటన్ (బహుశా జిన్నా అభ్యంతరం మేరకు కావచ్చు) తర్వాత ఈ ప్రతిపాదన తిరస్కరించాడు. అనేక వాదోపవాదాల తర్వాత దేశ విభజన నిర్ణయం జరిగితే అధికార మార్పిడి త్వరితగతిని జరిగేందుకు ఒకరు కానీ, ఇద్దరు వేర్వేరు గవర్నర్ జనరళ్ళతో కానీ రెండు డొమినియన్ ప్రభుత్వాలు ఏర్పాటుచేసేందుకు, సైనిక దళాలను కూడా వారి రిక్రూట్‌మెంట్ భూభాగం ఎటువైపు చేరిందన్నదాని ఆధారంగా విభజిస్తారు.[27] ఈ పథకం అమలు జరిగి ఒక ప్రాంతంలో అధిక సంఖ్యాకులైన వారు ఏ దేశంలో కలవాలనుకుంటే దానిలో కలిసేలా చేయగలిగితే అంతా కుదుటపడుతుందని, "ఒక జ్వరం వంటి మతోన్మాదం" పోతుందని పొరబడ్డాడు.[30]
పంజాబ్, బెంగాల్ ప్రావిన్సులను విభజించే ప్రతిపాదనను తిరస్కరిస్తే, అసలు పాకిస్తాన్ ప్రాతిపదికే దెబ్బతింటుంది కనుక జిన్నా ఆమోదించక తప్పలేదు. అయితే జిన్నా పాకిస్తాన్ సరిహద్దులను ముస్లిం సంఖ్యాధిక్య ప్రాంతాలకు కుంచింపజేసే ఈ పథకాన్ని ఓ కుతంత్రం అని వ్యాఖ్యానించాడు. చివరకు ఈ పథకాన్ని బ్రిటీష్ మంత్రిమండలికి నివేదించి వారి ఆమోదాన్ని తీసుకున్న మౌంట్ బాటన్ కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల ముందు మరోసారి ఉంచి వారి లాంఛనయుతమైన ఆమోదాన్ని పొందాడు.[31] కాంగ్రెస్ ప్రతినిధిగా నెహ్రూ, ముస్లింలీగ్ తరఫున జిన్నా, సిక్ఖుల ప్రతినిధిగా బల్‌దేవ్ సింగ్‌లను దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించమని మౌంట్ బాటన్ కోరాడు. ఆనాటి ప్రసంగంలో "సంతోషకరం కాకున్నా భారతదేశం విడిపోయేందుకు సిఫార్సు చేశానంటే సంతోషంగా మాత్రం చేయలేదని, అయితే సంతోషకరం కాకున్నా సరియైన మార్గం మాత్రం ఇదేననడంలో సందేహం లేదనీ" వివరిస్తూ భవిష్యత్తు మీద ఒక ఆశ ప్రసరిస్తూ మాట్లాడాడు.[32]
వాయువ్య సరిహద్దు ప్రాంతం సమస్య - జనాభిప్రాయ సేకరణ
[మార్చు]వాయువ్య సరిహద్దు ప్రావిన్సులో అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఉండగా (ఇక్కడ 97 శాతం మంది గిరిజనులైన ముస్లింలు), దాన్ని రద్దుచేసి గవర్నరు పాలన ఏర్పరచకుండా, మరో ఎన్నికలకు వెళ్ళకుండా నేరుగా భారత, పాకిస్తాన్‌లలో దేన్ని ఎంచుకుంటారన్న అంశంపై తన నిర్వహణలో జనాభిప్రాయ సేకరణకు చేద్దామని, అందుకు ప్రావిన్సు ప్రధాని డాక్టర్ ఖాన్ సాహెబ్‌ను ఒప్పించమని మేలో మౌంట్ బాటన్ జవాహర్‌లాల్‌కు రాశాడు. ఈ అంశంపై వర్కింగ్ కమిటీ నిర్ణయం లేకుండా ఏమీ తేల్చలేనని, అంతిమ నిర్ణయాలు తీసుకునేముందు ప్రజల అభిప్రాయం తీసుకోవడానికి, అందుకు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి ఉండాలన్నదానికి మాత్రమే సూత్రప్రాయంగా ఆమోదించాడు.[33] మే నెల చివరిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో జరిగిన వాడివేడి చర్చల్లో సుదీర్ఘ ఉద్యమ సహచరుడు, పఖ్తూన్ల నాయకుడు అయిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని వాయువ్య సరిహద్దు ప్రావిన్సును భారతదేశంలో కలిపేందుకు వైస్రాయ్‌కి ప్రతిపాదన పంపమనీ, అలా చేయలేని పక్షంలో కనీసం పాకిస్తాన్, స్వతంత్ర పఖ్తూన్ దేశాల మధ్య జనాభిప్రాయ సేకరణ కోసమైనా అడగమని కోరాడు.[34][35][36] స్వతంత్రత ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఒక ప్రాతిపదికగా ఉండగలదా అన్న విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు కృపలానీ లేఖ రాసినా, గాంధీ తానే గఫార్ ఖాన్‌ను తీసుకువెళ్ళి కలిసినా మౌంట్ బాటన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాడు. ఇతర రాష్ట్రాలకు భారతదేశం, పాకిస్తాన్‌లతో సంబంధం లేకుండా స్వాతంత్ర్యాన్ని ఇచ్చే అంశాన్ని జవాహర్‌లాల్ గట్టిగా వ్యతిరేకించాడని, ఆ సూత్రాన్నే ఇక్కడ పాటిస్తున్నట్టు ఖండితంగా చెప్పాడు.[37] ప్రజాభిప్రాయ సేకరణ అంశాన్ని పక్కకు పెట్టినా, స్వతంత్రతను ఒక ప్రాతిపదికగా ముందుకు తెచ్చినా అవే ప్రాతిపదికలు మిగతా ప్రాంతాలకు వర్తింపజేయ చూసేందుకు జిన్నా, మౌంట్ బాటన్ సిద్ధంగా ఉండడంతో పటేల్, నెహ్రూలు ఈ అంశంపై వెనక్కి వెళ్ళలేరు. నెహ్రూపై గాంధీ, గఫార్ ఖాన్ ఎంత ఒత్తిడి తెచ్చినా అతను అప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ ప్రాతిపదికను అంగీకరించిన నెహ్రూ దాన్ని తిరగదోడలేని తన నిస్సహాయతే ప్రకటించగలిగాడు.[38] స్వతంత్రత గురించి ఆలోచన మాని భారతదేశం, పాకిస్తాన్‌లలో దేనిలో చేరాలన్నదానిపై సర్వశక్తులను ఒడ్డి పోరాడాలని ఖాన్ సోదరులను జవాహర్‌లాల్ కోరాడు. తుదకు జనాభిప్రాయ సేకరణే ఖాయమైంది. అయితే ఖాన్ సోదరులు, వారి వెంబడి స్థానిక కాంగ్రెస్ శాఖ జనాభిప్రాయాన్ని బహిష్కరించడంతో పాకిస్తాన్‌లో చేరడానికి అనుకూలంగా ఓటు పడి వాయువ్య సరిహద్దు ప్రావిన్సు తుదకు పాకిస్తాన్ పరమైంది.[37]
రాడ్‌క్లిఫ్ అవార్డు, మత హింస
[మార్చు]వైస్రాయ్ మౌంట్ బాటన్ భారతదేశ వ్యవహారాలతో ఏమాత్రం ప్రమేయం లేని, నిజానికి భారతదేశాన్ని ఇంతకుముందు ఎన్నడూ చూసివుండని వ్యక్తి అయితేనే అత్యంత తక్కువ కాలంలో ఎటువైపూ పక్షపాతం చూపకుండా విభజన చేయగలుగుతాడన్న ఉద్దేశంతో సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్‌కి ఆ పని అప్పగించాడు.[39][నోట్స్ 7] మరోవైపు పంజాబ్‌లో హిందువులు, సిక్ఖులకు, ముస్లింలకు మధ్య ప్రజ్వరిల్లుతున్న హింసను అదుపుచేసేందుకు మేజర్-జనరల్ రీస్ ఆధ్వర్యంలో పంజాబ్ సరిహద్దు బలగాన్ని ఏర్పాటుచేశారు.[40] తాత్కాలిక ప్రభుత్వం పనిచేయడంలో రెండు సంఘాలు ఏర్పాటుచేసి ఒకటి భారతదేశానికి, మరొకటి ఏర్పడనున్న పాకిస్తాన్ కు సంబంధించిన పనులు చేయాలని, అయితే ప్రతీ పనినీ రెండు సంఘాలు పరిశీలించాలని ఒక ఏర్పాటును నెహ్రూ ప్రతిపాదించాడు. జిన్నా ఇందుకు అంగీకరించలేదు. ఒకవైపు లక్షలాదిమంది మత హింసలో కూరుకునిపోయి ఉండగా ప్రభుత్వ యంత్రాంగం నిష్ఫలంగా మిగిలిపోయింది.[41] 23 వేలమందితో ఏర్పాటుచేసిన సరిహద్దు బలగం లక్షలాదిమంది మధ్య చెలరేగిన హింసను ఎదుర్కోవడానికి ఏ విధంగానూ సరిపోలేదు. అసలు ఆ పనిచేయడానికి అధికారులు మానసికంగా కూడా సిద్ధంగా లేరు.[42] ఇక నెహ్రూ మరోమారు తాత్కాలిక ప్రభుత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధపడగా, మౌంట్ బాటన్ భారత స్వాతంత్ర్య చట్టం ఆమోదం పొందగానే మంత్రిమండలిని రెండు దేశాలకూ విభజించి ఆ సంక్షోభాన్ని నివారించాడు.[41]
రాడ్‌క్లిఫ్ సరిహద్దు రేఖ నిర్ణయాన్ని అత్యంత త్వరితంగా పూర్తిచేసి ఆగస్టు 9 నాటికల్లా మౌంట్ బాటన్‌కు సమర్పించాడు. అయితే అప్పటివరకూ వీలైనంత త్వరగా విభజన అవార్డు ప్రకటించాలని అంటూ వచ్చిన వైస్రాయ్ హఠాత్తుగా ఆగస్టు 15కు ముందు దీన్ని ప్రకటిస్తే జరిగే పరిణామాలన్నిటికీ బ్రిటీష్ వారే బాధ్యులవుతారన్న విచిత్రమైన తర్కం ఆధారంగా సరిహద్దుల నిర్ణయాన్ని ప్రకటించకుండా ఆపివేశాడు. ఈ ఆలస్యం కారణంగా పుకార్లు మరింత ఆజ్యం పోస్తూండగా మతహింస దారుణంగా పెచ్చుపెరిగిపోయింది. సరిహద్దు ప్రకటనలో జరుగుతున్న జాప్యమే శాంతి విఘాతానికి, దుష్పరిణామాలకు కారణం అవుతోందని బ్రిటీష్ ఇండియా సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ సర్ క్లాడ్ ఔచిన్‌లెక్ భావించాడు. మొత్తానికి రాడ్‌క్లిఫ్ అవార్డును వైస్రాయ్ మౌంట్ బాటన్ స్వాతంత్ర్యానంతరం ఆగస్టు 16న ప్రకటించాడు.[43]
భారత స్వాతంత్ర్యం
[మార్చు]భారతదేశానికి విభజనతో పాటుగా ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించింది. ఆగస్టు 14వ తేదీ రాత్రి పదకొండు గంటల నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. రాజ్యాంగ సభ ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రార్థనలు పూర్తయ్యాకా, భారత ముస్లింలను ప్రతినిధిగా చౌధురీ ఖాలిజ్జమాన్, భారత తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌లు ప్రసంగించాకా స్వతంత్ర భారతదేశానికి ప్రధాని హోదాలో జవాహర్‌లాల్ నెహ్రూ ప్రసంగించాడు. చారిత్రాత్మకమైనది, అలంకార శోభితమైనది, ఆవేశపూరితమైనది, భవిష్యత్తులో పలుమార్లు ఉటంకింపులకు నోచుకున్నదీ అయిన ప్రసంగాన్ని చేశాడు నెహ్రూ.[44]
“ | ఎంతోకాలం క్రితం మనం భవిష్యత్తుతో సమాగమాన్ని నిర్ణయించుకుని, సంకేత సమయాన్ని కూడా ఏర్పరుచుకున్నాం. ఇప్పుడు మన ప్రతిజ్ఞ నెరవేర్చే సమయం వచ్చింది. మొత్తంగా నెరవేర్చడం లేకపోయినా గణనీయమైన స్థాయిలో నెరవేరుస్తున్నాం. అర్థరాత్రి గంట మోగినప్పుడు, ప్రపంచం నిద్రలో మునిగిపోయినప్పుడు, భారతదేశం నవజీవితంలోకి, స్వాతంత్ర్యంలోకి మేల్కొంటుంది. | ” |
—జవాహర్‌లాల్ నెహ్రూ, 1947 ఆగస్టు 15 రాజ్యాంగ సభలో |
ప్రధానమంత్రిత్వం, పరిపాలన
[మార్చు]పంజాబ్ మత హింస
[మార్చు]భారతదేశ తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నెహ్రూ, అతని ప్రభుత్వం 1947లో వ్యవహరించడానికి ఎన్నో సమస్యలు ఎదురుచూస్తూ ఉన్నాయి. అన్నిటికన్నా కొత్తగా భారతదేశానికి, పాకిస్తాన్‌కి నడుమ పంజాబ్ ప్రావిన్సును విభజిస్తూ ఏర్పడ్డ విభజన రేఖకు అటూ ఇటూ చెలరేగుతున్న హింసను, కల్లోలాన్ని అదుపులోకి తీసుకురావడం అత్యంత ప్రధానమైనది. ఈ మారణకాండ వెనుక చారిత్రక కారణాలతో పాటు ఎన్నో పరిపాలనా పరమైన తప్పుడు నిర్ణయాలు కూడా ఉన్నాయి. [నోట్స్ 8] ఆగస్టు 15కు ముందు పరిపాలన బ్రిటీష్ వారి చేతులోనే ఉంది, ప్రభుత్వాన్ని సచేతనం చేసేందుకుగాను మధ్యంతర ప్రభుత్వానికి స్వాతంత్ర్య దినానికి ముందే పూర్తి స్వయం నిర్ణయాధికారం కల్పించాలని నెహ్రూ కోరగా జిన్నా అందుకు అడ్డుకున్నాడు. ఆగస్టు 14న ప్రాచీన సాంస్కృతిక కేంద్రాలు, పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాహోర్, అమృత్‌సర్ నగరాల్లో ఒకేసారి పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ అల్లర్లు తూర్పు పంజాబ్, పశ్చిమ పంజాబ్‌లలోని పలు ప్రదేశాల్లోనూ వ్యాప్తి చెందడమే కాక ఈసారి ఢిల్లీకి కూడా వ్యాపించాయి. తూర్పు ప్రాంతంలో హిందువులు, సిక్ఖులు ముస్లింలను, పశ్చిమ ప్రాంతంలో ముస్లింలు సిక్ఖులను, హిందువులను లక్ష్యం చేసుకుని హత్యాకాండకు, పలు అకృత్యాలకు పాల్పడ్డారు. ఈ హత్యాకాండ సంఖ్యాపరంగానూ, అమానుషత్వం, క్రౌర్యాల విషయంలోనూ దిమ్మెరపోయేలా చేసింది.[నోట్స్ 9] ఉద్దేశపూర్వకమైన ఆలస్యం తర్వాత ఆగస్టు 16న వైస్రాయ్ మౌంట్ బాటన్ సరిహద్దు అవార్డు ప్రకటించాడు. సిక్ఖు మతానికి తొలి గురువైన గురు నానక్ జన్మ స్థానమైన నాన్కానా సాహిబ్ పాకిస్తాన్‌లో ఉండిపోయిన సంగతి సిక్ఖులకు మింగుడుపడలేదు, గుర్‌దాస్ పూర్ జిల్లా మొత్తం పాకిస్తాన్‌కు చెందుతుందని భావించిన ముస్లింలు అది భారతదేశంలో ఉందని తెలిసి కోపోద్రిక్తులయ్యారు. తాము వలసపోనక్కరలేదనీ తమ ప్రాంతం కచ్చితంగా సరైన వైపు (హిందువులు, సిక్ఖుల విషయంలో భారతదేశం, ముస్లింల విషయంలో పాకిస్తాన్) ఉంటుందనీ భావించిన లక్షలాది మంది ముస్లింలు, సిక్ఖులు, హిందువులు తాము తప్పుడు దేశంలో ఉండిపోయామని తెలిసి భయాందోళనలతో వలసలు మొదలుపెట్టారు. ఇరువైపుల నుంచి 60 లక్షల మంది చొప్పున, మొత్తానికి కనీసం కోటికి పైగా ప్రజలు వలసవెళ్ళారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రవాసంగా ఈ విపరిణామం ప్రఖ్యాతి చెందింది. వలసలు వెళ్తున్న జనసమూహాల మీద సంఖ్యాధిక్య పక్షం వారు విరుచుకుపడి మారణహోమాలు సృష్టించారు. ఈ దారుణకాండలో మూడు మతాల మహిళలు అందరికన్నా ఎక్కువగా బాధలు పడ్డారు. అత్యాచారాలు, కిడ్నాప్‌లు సర్వసాధారణమైపోయాయి.
భారతదేశ ప్రధానమంత్రిగా నెహ్రూ ఈ పరిణామాల కేంద్ర స్థానంలో ఉన్నాడు. పంజాబ్ హింసాకాండ, దాని దుష్ప్రభావాల పట్ల జవాహర్‌లాల్ నెహ్రూ ఎంతో కలతచెంది ఉన్నాడు. ఆగస్టు 15 తర్వాత ఆ నెలాఖరులోపే పంజాబ్ ప్రాంతాన్ని మూడు సార్లు పర్యటించాడు. సరిహద్దుకు రెండువైపులా ఉన్న ప్రాంతంలోని జనాన్ని కలిసి మాట్లాడాడు.[43] విమానాలపై పర్యటించి పరిస్థితిని అంచనా వేశాడు. ఈ క్రమంలో మైళ్ళ పొడవున సాగుతూ చరిత్రలోకెల్లా అతిపెద్ద కాందిశీకుల గుంపులను చూసి వేదన చెందాడు. పెద్దగా ప్రభావం చూపని సరిహద్దు బలగాన్ని సెప్టెంబరు 2న రద్దుచేశారు. శాంతి భద్రతల సమస్య భారత, పాకిస్తాన్ ప్రభుత్వాల మీద పడింది. మరోవైపు భారతదేశానికి బద్ధశత్రువుగా, పాకిస్తాన్ వాదానికి సమర్థకుడిగా పేరొందిన ఐసిఎస్ అధికారి సర్ ఫ్రాన్సిస్ మడీని జిన్నా పశ్చిమ పంజాబ్ ప్రావిన్సు గవర్నరుగా నియమించాడు. 1946-47 సంప్రదింపుల సమయంలో ఇతని వ్యవహార శైలి వల్ల నెహ్రూ ఇతన్ని గురించి "పక్షపాతియైన బ్రిటీష్ ముల్లా" అని వ్యాఖ్యానించాడు.[45] మడీ తన మంత్రిమండలిని రద్దుచేసి గవర్నర్ పాలన విధించుకుని పరిపాలించడం ప్రారంభించాడు. తూర్పు, పశ్చిమ పంజాబ్‌ల మధ్య ఉన్న అగాథాన్ని పూడ్చేందుకు మంత్రిమండలి ద్వారా జరుగుతున్న ప్రయత్నాలు అలా వమ్మయ్యాయి.[46] అయితే అతనికీ, జిన్నాకీ శ్రద్ధ ప్రధానంగా భారతదేశం నుంచి తరలివస్తున్న ముస్లిం కాందిశీకుల మీద, వారి భద్రత మీద, వారికి ఆహార సరఫరాల మీద ఉండేది. పంజాబ్ గవర్నర్‌కి తన పాలనా విభాగంలో జరుగుతున్న దాడులు, లూటీలకు సంబంధించిన ఒకే ఒక్క చింత - "రాబోయే రోజుల్లో ఈ అలవాటు ఉండిపోతే [పాకిస్తాన్‌కి] ప్రమాదకరమైన అలవాటుగా మారుతుంది" అన్న కోణంలోనే ఉండేది.[45] ఈ సమస్యను ఎదుర్కోవడానికి తనవైపు నుంచి చేయగలిగిన ప్రతీదీ నెహ్రూ ప్రయత్నించాడు. కలకత్తాలోనూ, నౌఖాలీలోనూ మతకల్లోలాలను అడ్డుకున్న గాంధీని వీలైంత త్వరగా పంజాబ్ వెళ్ళమని నెహ్రూ తంతి ద్వారా సూచించాడు.[47] [నోట్స్ 10] పాకిస్తాన్ కొత్త గవర్నర్-జనరల్ మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ అప్పటి రాజధాని కరాచీలో ఉండిపోయి, మొత్తం పంజాబ్‌లో ఒక్క లాహోరును మాత్రమే పర్దాల మాటున, గట్టి బందోబస్తులో సందర్శించి పరిస్థితులను ఎదుర్కోవడంలో అనిశ్చితత్వాన్ని చాటుకున్నాడు. అందుకు భిన్నంగా మతావేశంలో కలహిస్తున్నవారిని ప్రత్యక్షంగా కలుసుకుంటూ, గట్టి నిశ్చయంతో పరిష్కారం కోసం నిష్పాక్షికంగా నెహ్రూ, గాంధీ చేస్తున్న కృషి వారి సైద్ధాంతిక నిబద్ధతకు గీటురాయిగా నిలిచింది.[46] నెహ్రూ పటేల్‌తో చర్చించి పలు ప్రదేశాల్లో, మరీ ముఖ్యంగా ఢిల్లీలోనూ, అమృత్‌సర్‌లోనూ ముస్లింలకు వ్యతిరేకంగా శాంతికి విఘాతం కలిగించడంలో బాధ్యత ఉన్న సంస్థగా భావిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై గట్టి చర్యలకు ఉపక్రమించాడు. ముస్లింలు స్వతంత్రంగా బ్రతికి, పనిచేయగల ప్రదేశంగా భారతదేశంగా నిలవాలని కాంక్షించాడు. బలవంతం మీద ద్విజాతి సిద్ధాంతం ప్రాతిపదికన దేశాన్ని విభజించినప్పటికీ, కాంగ్రెస్ ఎన్నటికీ ఈ సిద్ధాంతాన్ని అంగీకరించబోధని అల్పసంఖ్యాక వర్గాల హక్కులపై గాంధీ, నెహ్రూలు రూపొందించిన విధానం ప్రకారం తీర్మానం చేసింది.[48] వారి కార్యకలాపాల వల్ల ఈ దశలో మునుపు ఎన్నడూ లేనంత అత్యున్నత స్థాయికి గాంధీ, నెహ్రూల ప్రతిష్ఠ పశ్చిమ పంజాబ్‌లో ఇనుమడించింది. వారిని ఉద్దేశించి ప్రశంసల జల్లు కురిపిస్తూ పశ్చిమ పంజాబ్ శాసన సభలో పలువురు ముస్లింలీగ్ సభ్యులు మాట్లాడి, ఆ మేరకు ఒక తీర్మానం చేసి గాంధీకి పంపిన సందేశంలో జతపరిచారు.[49] కానీ అంతే స్థాయిలో వారిద్దరి ప్రతిష్ఠ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఢిల్లీ నగరానికి పారిపోయి వచ్చిన హిందూ, సిక్ఖు కాందిశీలకుల గుంపుల్లో దిగజారిపోయింది. దీనికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ ఉపన్యాసాల్లో నేరుగా గాంధీని, కొంతమేరకు నెహ్రూని కూడా విమర్శిస్తూ ఉండేవాడు.[50]
పటేల్‌తో సమస్యలు
[మార్చు]వల్లభ్‌భాయ్ పటేల్ భారత దేశ ఉప ప్రధానిగా, సంస్థానాల వ్యవహారాల మంత్రిగా, హోం మంత్రిగానే కాక అంతకుముందు దశాబ్దాల పాటు భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలోనూ జవాహర్‌లాల్ నెహ్రూకి సహచరుడు. అయితే నెహ్రూకీ, పటేల్‌కీ రాజకీయ, ఆర్థిక, మతపరమైన అంశాల్లో అవగాహన భేదం మాత్రమే కాక వ్యవహార శైలుల్లో కూడా భిన్నత్వం ఉండేది. గాంధీ, జాతీయ రాజకీయాల్లో అవసరాలు వారిద్దరినీ కలిసి పనిచేసేలా ప్రేరేపించిన శక్తులు.
1947 డిసెంబరు నెలలో మతకల్లోలాల్లో అట్టుడికిన అజ్మీర్ పట్టణంలో పరిస్థితులను అంచనా వేయడానికి హోంమంత్రిత్వ శాఖ అప్పటికే ఒక బృందాన్ని పంపి ఉన్న సందర్భంలో, నెహ్రూ ఆ ప్రాంతాన్ని పర్యటించేందుకు సంకల్పించి దాన్ని వ్యక్తిగత కారణాలతో విరమించుకుని తన వ్యక్తిగత కార్యదర్శిని పంపించడంతో సమస్య తారాస్థాయికి చేరుకుంది. విచారణ బృందం పర్యటించిన ప్రాంతాన్ని, నెహ్రూ కార్యదర్శి పర్యటించి వివరాలు సేకరించడం అంటే తన శాఖపై నమ్మకం లేని చర్య అవుతుందని పటేల్ భావించాడు.[51] అప్పటికి తనపై హిందూ అనుకూలవాది అని ముద్రవేసే ప్రయత్నాలు బయటనుంచి జరగడం వల్ల పటేల్‌కు ఈ ఘటనకు, ఆ మాటలను నిజం చేసేదిగా కనిపించివుండవచ్చు. అయితే తన కుటుంబంలో ఒక మరణం కారణంగా తాను వెళ్ళలేక కార్యదర్శిని పంపించానని వివరిస్తూనే తనకు ఎక్కడికైనా పర్యటించే హక్కు ప్రభుత్వాధినేతగా ఉందని నెహ్రూ ఉద్ఘాటించాడు. క్యాబినెట్ విధానంలో ప్రధానమంత్రి సమానుల్లో ప్రథముడు మాత్రమేనని, పై స్థానంలో నిలబడి పెత్తనం చేయడం చెల్లదని పటేల్ సమాధాన మిచ్చాడు. వారిద్దరి మధ్య ప్రారంభమైన ఈ వివాదం, చివరకు ప్రధానమంత్రి అధికార పరిధి ఏమిటన్న ప్రశ్నకు భిన్నమైన వ్యాఖ్యానాలు ప్రతిపాదించుకునేదాక వచ్చింది.[52]
ఈ వివాదం ముదిరి ఇద్దరూ రాజీనామాలకు సిద్ధమై, తమ తమ అభిప్రాయాలను మహాత్మా గాంధీ ముందు పెట్టి రెండు వ్యాఖ్యానాల్లో ఏది సరైనదో తేల్చాలని, రెండవ వారు రాజీనామా చేద్దామని అంగీకారానికి వచ్చారు. ఈలోగానే గాంధీ మతసమస్య, భారత-పాకిస్తాన్ వివాదాల విషయమై నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ఈ పరిణామం నెహ్రూ, పటేల్ ఇద్దరి మనస్సులనూ బాధించింది. ఉపవాస దీక్ష ముగించాకా, జనవరి 30 తేదీన ప్రార్థనా సమావేశం ముందు గాంధీ పటేల్‌ను కలిసి నెహ్రూ, పటేల్ ఇద్దరూ అభిప్రాయ భేదాలు సరిజేసుకుని కలిసి సాగాలని, వారిద్దరినీ మర్నాడు కలుస్తానని చెప్పి వెళ్ళాడు.[52] ఆ కలవడం ఇక సాధ్యపడలేదు. ఆ రోజునే ప్రార్థనా సమావేశానికి వెళ్తున్న గాంధీని గాడ్సే హత్యచేశాడు.
గాంధీ హత్య జరిగిన మూడు రోజులకు కుదుటపడి నెహ్రూ పటేల్‌కు - గాంధీ మరణం వల్ల ఓ భిన్నమైన, మరింత కష్టమైన ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సిన స్థితిలో పాత వివాదాలకు ప్రాధాన్యత లేదనీ, వీలైనంత సహకారంతో పనిచేయడమే తమ కర్తవ్యమని తోస్తోందంటూ ఓ ఉత్తరం రాశాడు. పటేల్ ప్రతిస్పందిస్తూ - గాంధీ మృత్యువు అంతా మార్చేసిందనీ, విచారగ్రస్తమైన దేశ ఆసక్తుల కోసం మనం ఏ ఉమ్మడి ప్రయత్నాలు చేపట్టాలన్నది తెలుసుకుందామని స్పందించాడు.[52] అభిప్రాయ భేదాలతో, భిన్న పంథాలతో కొండొకచో రాజకీయపుటెత్తుగడలతో భేదిస్తూనే పటేల్, నెహ్రూలు 1950లో పటేల్ మరణించేవరకూ కలిసి పనిచేశారు.
సంస్థాన వ్యవహారాలు
[మార్చు]అఖిల భారత సంస్థానాల ప్రజల మహాసభ అధ్యక్షత
[మార్చు]భారతదేశంలోని మూడవ వంతు భూభాగంలో బ్రిటీష్ సార్వభౌమత్వం కింద నామమాత్ర అధికారం నుంచి కరెన్సీ ముద్రణ, రైల్వేల నిర్వహణపై అదుపు వరకూ వివిధ స్థాయిల్లో అధికారం కలిగిన ఐదు వందల పైచిలుకు సంస్థానాలు ఉండేవి. ఉదారమైన విలువలు వ్యక్తిగతంగా కలిగిన పరిపాలకులు ఉన్న కొన్ని సంస్థానాలు మినహాయిస్తే చాలా సంస్థానాల్లో సంస్థానాల ప్రజలకు కనీస పౌరహక్కులు కూడా లేకుండా అణచివేత జరిగేది.[53][54] ఈ సంస్థానాల్లోని ప్రజా ఉద్యమాలతో ప్రమేయం పెట్టుకోవడం, దానిని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమాలతో ముడివేయడం అన్నది మొదటి నుంచీ నెహ్రూకి చాలా ఆసక్తిదాయకమైన కార్యరంగం. పైగా 1945-46లో అఖిల భారత దేశీయ సంస్థానాల ప్రజల మహాసభకు జవాహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నాడు. అంతవరకూ విస్తృతంగా సంస్థానాల్లో ప్రజలపై చేస్తున్న అణచివేత బ్రిటీష్ సామ్రాజ్యవాద విధానాల్లో ఒక భాగంగా ఎంచిన నెహ్రూ అసలు బ్రిటీష్ సామ్రాజ్యమే భారతదేశంలో అధికారాన్ని బదలీ చేయడానికి సిద్ధపడుతున్న తరుణంలో సంస్థానాల్లోనూ ప్రశాంతంగానే ప్రజల ఆకాంక్షలకు తగ్గ రాజకీయ మార్పులు సాధ్యమని విశ్వసించాడు. సంస్థానాల సమస్య పట్ల నెహ్రూ ఆలోచనలు 1945 డిసెంబరు నాటికి ఇలా ఉండేవి: మరీ చిన్నవిగా ఉన్న సంస్థానాలు అవి సరిహద్దులు పంచుకుంటున్న ప్రావిన్సుల్లో వాటికి తగ్గవాటిలో కలిపేయాలి. ఇక మిగిలే 20 పెద్ద సంస్థానాలను అప్పటికి సంప్రదింపుల్లో ప్రస్తావనకు వస్తున్న భారతదేశ సమాఖ్యలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పరిపాలనా విభాగాలుగా ఉంటాయి. ఆ పరిపాలనా విభాగాలపై బ్రిటీష్ చక్రవర్తి తరహాలో లాంఛనమైన స్థానం కలిగిన మహారాజులు, ప్రజాస్వామికంగా ఎన్నికయ్యే ప్రభుత్వాలు ఉంటాయి. ఈ పరిణామం స్నేహపూర్వకమైన వాతావరణంలో జరిగిపోవచ్చని అతను ఆశించాడు.[55] మరోవైపు సంస్థానాధీశులు మాత్రం తమ అధికారాన్ని అంత తేలికగా వదులుకునేందుకు సిద్ధపడలేదు. ఈ విజ్ఞప్తులు, ప్రజాందోళనలు వారికి రుచించలేదు. పలు సంస్థానాల్లో ప్రజా ఆందోళనలకు కాల్పులు, అరెస్టులు, రాజకీయ ఖైదీలపై దమనకాండ, ప్రజా సంస్థల నిషేధం వంటి చర్యలతో సమాధానమిచ్చారు. ఫరీద్‌కోట్ సంస్థానంలో నెహ్రూ ప్రవేశంపై విధించిన నిషేధాన్ని ధిక్కరించేసరికి అధికారులు పరిష్కారానికి ముందుకువచ్చారు.[56]
కాశ్మీరు మహారాజాపై ఆందోళన
[మార్చు]కాశ్మీరు సంస్థానంలో ప్రజాందోళనలకు ప్రాతినిధ్యం వహిస్తూ, మత నిరపేక్షమైన, జాతీయ భావాలతో కూడిన నేషనల్ కాన్ఫరెన్స్ అన్న బలమైన రాజకీయ సంస్థకు షేక్ అబ్దుల్లా, మరికొందరు నాయకులు నేతృత్వం వహించేవారు. జాతీయ దృక్పథం కలిగిన ఈ సంస్థను, ముస్లిం మత పాక్షిక సంస్థ అయిన ముస్లిం కాన్ఫరెన్స్ అన్న సంస్థలో కలిపివేసే ప్రాతిపదికన జరిగిన రహస్య చర్చలు 1946 మార్చి నాటికి విఫలం కావడంతో షేక్ అబ్దుల్లాను, ఇతర నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులను సంస్థాన ప్రభుత్వం అరెస్టు చేసింది. నెహ్రూకు సన్నిహితుడు, కాశ్మీర్ సింహంగా పేరు పొంది, ఆ ప్రాంతపు ప్రజలకు తిరుగులేని నాయకుడు అయిన షేక్ అబ్దుల్లా అరెస్టుతో నెహ్రూ ఆగ్రహించాడు. వెంటనే సిమ్లా నుంచి కాశ్మీర్ వెళ్ళి వారికి మద్దతునివ్వాలనుకున్నా వైస్రాయ్ ఈ పరిణామాల్లో జోక్యం చేసుకుంటాడన్న ఆశతో అప్పటికి వాయిదా వేసుకున్నాడు. రెండు నెలల పాటు వేచిచూసిన నెహ్రూ ఇక జూన్ నెల మధ్యలో అబ్దుల్లా పక్షాన వాదించేందుకు న్యాయవాదులతో సహా కాశ్మీరును సందర్శించాలని నిర్ణయించుకున్నాడు.[56]
మరో పదిరోజుల పాటు జరుగుతున్న సంప్రదింపుల ప్రక్రియలో తానున్న పరిస్థితుల్లో, నెహ్రూపై కాశ్మీర్ ప్రభుత్వం ఏ అవాంఛనీయ చర్య చేపట్టినా తనకు తలనొప్పులు తెచ్చిపెడుతుందని భావించిన వైస్రాయ్ వేవెల్ పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ముందు నెహ్రూని పర్యటన వాయిదా వేసుకొమ్మని కోరి విఫలమయ్యాడు. తర్వాత కాశ్మీర్ ప్రభుత్వాన్ని షేక్ అబ్దుల్లా విచారణ వాయిదా వేసుకొమ్మని, తద్వారా నెహ్రూ పర్యటన వాయిదా పడుతుందని సూచించాడు. కాశ్మీర్ అధికారవర్గం ఈ సూచన తిరస్కరించి, నెహ్రూ కాశ్మీరులో ప్రవేశించదలిస్తే సరిహద్దు దగ్గరే అరెస్టు చేయాలని నిర్ణయించింది. నెహ్రూ మీద చర్య తీసుకోవద్దని ఇండియా ప్రభుత్వం నిర్బంధిస్తే మహారాజు పదవీ త్యాగం, ప్రధానమంత్రి రాజీనామాలు చేయాల్సివస్తుందని తేల్చి చెప్పారు. తుదకు ఒత్తిడితెచ్చే ఉద్దేశం లేదని వైస్రాయ్, పొలిటికల్ డిపార్ట్‌మెంట్ తప్పుకున్నాయి. అరెస్టు ఖాయమని నిశ్చయమైపోయినా నెహ్రూ తన కార్యక్రమానికి కట్టుబడి జూన్ 19 నాటికి సంస్థానం సరిహద్దుకు చేరుకున్నాడు. అక్కడే కాశ్మీర్ అధికారులు అతన్ని అడ్డుకుని బహిష్కరణ ఉత్తర్వు అందజేశారు. తనను కాశ్మీర్‌లో ప్రవేశించకుండా అడ్డుకునే ప్రయత్నాలు నెహ్రూను ఆగ్రహావేశ వివశుడిని చేశాయి. కాంగ్రెస్ పట్ల, తన పట్ల చూపుతున్న అమర్యాదను అత్యంత పరుషమైన మాటల్లో, తీవ్ర పదజాలంతో ఖండించాడు. ఈ ఉత్తర్వును ఉపసంహరించుకునేందుకు ఓ ఐదు గంటల సమయాన్ని ఇచ్చి, ఆ తర్వాత అక్కడే కొలువైన మేజిస్ట్రేట్‌తో చెప్పి మరీ సంస్థానంలోకి ప్రవేశించాడు. కాశ్మీర్ అధికారులు అతన్ని అరెస్టు చేశారు.[57] ఈ వివాదంలో షేక్ అబ్దుల్లా విచారణ వాయిదా పడింది. సంప్రదింపులు జరుగుతున్నందున తిరిగి రమ్మని మరోవైపు కాంగ్రెస్ కార్యనిర్వాహకవర్గం ఒత్తిడి చేసింది. దాంతో మళ్ళీ కాశ్మీరు తిరిగి వస్తానని స్పష్టం చేసి, ఢిల్లీ తిరిగి వెళ్ళాడు.[7] 1946లో మరోసారి కాశ్మీరును నెహ్రూ సందర్శించినా షేక్ అబ్దుల్లా నిర్బంధం తొలగించలేకపోయాడు.[58]
సంస్థానాలు భారతదేశంలో విలీనం
[మార్చు]1947లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై, అధికార బదిలీ ప్రాతిపదికలు, సూత్రాలపై సంప్రదింపులు, చర్చలు జరుగుతూండగానే సంస్థానాధీశులు స్వతంత్రత గురించిన ఆలోచనలు ప్రారంభించారు. రాజకీయ శాఖ సంస్థానాలు స్వతంత్రమయ్యే ప్రయత్నాలకు వత్తాసునిస్తూ భారతదేశ స్వాతంత్ర్యాన్ని దొడ్డిదోవన దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలు పలుమార్లు వేవెల్ వద్ద జవాహర్‌లాల్ చేసినా వేవెల్ నిర్లక్ష్య వైఖరిని అవలంబించాడు. ఫ్యూడల్ వ్యవస్థకు చెందిన నిరంకుశులైన సంస్థానాధీశులన్నా, ప్రజాభిప్రాయాన్ని మచ్చుకైనా సహించని వారి రీతి అన్నా జవాహర్‌లాల్‌కు అసహ్యం. రాజకీయ శాఖ వారి విధానాల వల్ల కీలుబొమ్మలైన మహారాజులు, నవాబులు ఇప్పుడు స్వతంత్రులు కావాలని చూస్తున్నారన్న ఆలోచన అతనికి ఆగ్రహావేశాలు తెప్పించేది.[59] అవసరమైతే బలప్రయోగంతో అయినా సంస్థానాలు ప్రజామోదం లేకుండా స్వతంత్రులయ్యే ప్రయత్నాలను భగ్నం చేస్తానని మౌంట్ బాటన్‌కు సూచన ప్రాయంగా తెలియజేశాడు. మరోవైపు సంస్థానాధీశులు, వారి మంత్రులు, సలహాదారులు జవాహర్‌లాల్ పట్ల, సంస్థానాల వ్యవహారాల్లో అతని విధానాల పట్ల అంతే ఆగ్రహంతో ఉండేవారు.[58] వారు అతనంటే భయపడేవారు కూడా.[60]
కాంగ్రెస్ ప్రభుత్వం సంస్థానాల సమస్యలను చక్కటి వ్యవహారజ్ఞానం కలవాడైన వల్లభ్‌భాయ్ పటేల్‌కు అప్పగించింది. అతను తన పనిని 1946 డిసెంబరు నుంచి ప్రారంభించి, 1947 మార్చి నాటికి గట్టి ప్రయత్నాలుతో ముందుకు తీసుకుపోసాగాడు[60] నెహ్రూ, పటేల్, గాంధీలు కలిసి వైస్రాయ్ మౌంట్ బాటన్‌ను సంస్థానాల సమస్యను పరిష్కరించడంలో నిశ్చయమైన, నిర్ణయాత్మకమైన సహాయాన్ని చేసేలా ఒప్పించారు.[61] పటేల్, మౌంట్ బాటన్ ప్రయత్నాలకు తోడు అనుభవజ్ఞుడు, సమర్థుడు అయిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి వి.పి.మీనన్ కార్యదర్శిగా సమర్థంగా పనిచేశాడు.[62]
సంస్థానాలు స్వతంత్ర దేశాలయ్యే సంభావ్యతను నివారించి, భారతదేశ రాజకీయ ఐక్యతను కాపాడే ప్రయత్నాన్ని భుజానికి ఎత్తుకున్న పటేల్, మౌంట్ బాటన్, వి.పి.మీనన్‌లు అందుకు నెహ్రూ వైఖరికి చెందిన సంస్థానాల ప్రజాప్రాతినిధ్యమనే సంగతిని అంతగా పట్టించుకోలేదు,[58] అందుకు బదులుగా రాజకీయ ఒప్పందాల ఆటకు సిద్ధపడ్డారు. భారతదేశం నుంచి బ్రిటీష్ వారు నిష్క్రమించాకా ఎట్టి పరిస్థితుల్లోనూ సంస్థానాల వ్యవహారాల్లో బ్రిటీష్ వారు మద్దతు ఇవ్వరనీ, తమకు సరిహద్దులో ఉన్న బలమైన డొమినియన్ అయిన భారతదేశంతో వ్యవహరించక తప్పదనీ, అందుకు గాను సంస్థానాలకు అత్యంత ఇబ్బందికరమైన, బరువైన రక్షణ, విదేశాంగ, సమాచార వ్యవస్థలను భారతదేశం చేతిలో పెడుతూ ఒప్పందం చేసుకొమ్మని ప్రోత్సహిస్తూ సంస్థానాధీశుల సమావేశంలో మాట్లాడాడు.[61][63] రక్షణ, విదేశాంగ, సమాచార వ్యవస్థలు భారతదేశం చేతిలో పెడితే అంతర్గత స్వాతంత్ర్యాన్ని బుద్ధిపూర్వకంగా గౌరవిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానం నుంచి వెంటనే వెనక్కి తగ్గి పూర్తి విలీనం దిశగా సంస్థానాలపై ఒత్తిడి చేసింది. సంస్థానాల్లో ప్రజామండళ్ళు ఆందోళనలతో అంతర్గతంగా ఒత్తిడిపెంచాయి.[63] కొన్ని సంస్థానాలు ఇష్టపూర్వకంగా భారతదేశంతో ఒప్పందంలోకి రాగా మరికొన్ని రాజకీయ సంప్రదింపుల క్రీడలో పటేల్ ఆటకు తలొగ్గి ఒప్పందాలపై సంతకాలు చేశాయి.[64] ఈ క్రమంలో వారి నుంచి తీసుకున్న భూమికి బదులుగా దామాషాకు తగ్గట్టు రాజభరణాలు ఇప్పించడానికి పటేల్ అంగీకరించాడు. అవసరం మేరకు వారి బిరుదాలు, రాజప్రాసాదాలు వారినే ఉంచుకోనిచ్చారు, కొన్ని సందర్భాల్లో గవర్నర్లుగానూ నియమించారు. అయితే సంస్థానాల వ్యవహారాల శాఖ ఏవేవి వారికి ఇస్తున్నా వారి నుంచి భూమిని మాత్రం మినహాయింపు లేకుండా తీసుకోవడంపైనే దృష్టిపెట్టింది.[64]
సంస్థానాధీశులు కానీ, ఈ విధానాలు కానీ పెద్దగా నచ్చని నెహ్రూను ఉపేక్షించడం ద్వారా సంస్థానాధీశులు తాము సులువుగా భారతదేశంతో ఒప్పందంలోకి వచ్చేలా మౌంట్ బాటన్ వీలుకల్పించాడు. అయితే ఈ మొత్తం వ్యవహారం ముగిసేనాటికి మూడు రాజ్యాలు మాత్రం భారతదేశంతో యధాతథ స్థితి తప్ప మరే ఒప్పందం చేసుకోకుండా నిలిచిపోయాయి. తిరువాన్కూరు, భోపాల్, జోధ్‌పూర్ సంస్థానాలు కొంత సమస్యాత్మకమైన సందర్భాలు సృష్టించినా సామ దాన భేదోపాయాలతో వాటిని భారతదేశంలో ఆగస్టు 15కు ముందే విలీనం చేయగలిగారు. ఒకటి - హైదరాబాద్, రెండోది - జునాగఢ్, మూడోది - కాశ్మీర్. గుజరాత్ ద్వీపకల్పంలోని జునాగఢ్ సంస్థానం, కీలకమైన వ్యూహాత్మక ప్రదేశంలోని కాశ్మీర్ సంస్థానం, తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాల్లో వ్యాపించి దక్కన్ పీఠభూమి హృదయస్థానంలో విస్తారమైనది హైదరాబాద్ సంస్థానం. వీటిలో జునాగఢ్ నెలకొని ఉన్న ప్రాంతం పటేల్‌కు, గాంధీకి మాతృభూమి కాగా, కాశ్మీర్ నెహ్రూ పూర్వీకుల స్థానం.
జునాగఢ్ సమస్య, విలీనం
[మార్చు]జునాగఢ్ నవాబు ముస్లిం, రాజ్యంలోని 80 శాతానికి పైగా ఉన్న ప్రజలు హిందువులు. నవాబు 1947లో సింధ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, జిన్నా సన్నిహితుడు అయిన సర్ షా నవాజ్ భుట్టోని తన కొత్త దివానుగా నియమించుకున్నాడు. కొత్త దివాను తన నవాబుపై జునాగఢ్ సంస్థానాన్ని భారతదేశంలో చేర్చవద్దనీ, పాకిస్తాన్‌లో చేరుద్దామని ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆగస్టు 14న జునాగఢ్ సంస్థానం పాకిస్తాన్‌లో చేరుతుందని ప్రకటించింది, నెలరోజుల పాటు ఈ అవకాశాన్ని గురించి ఆలోచించిన పాకిస్తాన్ సెప్టెంబరు 13న జునాగఢ్ పాకిస్తాన్‌లో విలీనం కావడాన్ని అంగీకరించింది.
నెహ్రూ-పటేల్ ఈ పరిణామం మీద ఆగ్రహోదగ్రులయ్యారు. పటేల్ సంస్థాన ప్రజానీకం తప్ప సంస్థానాధీశుడు నిర్ణయించరాదని ప్రకటించగా, నెహ్రూ భారత విధానాన్ని మలుస్తూ జునాగఢ్ పాకిస్తాన్‌లో విలీనం కావడాన్ని భారతదేశం అంగీకరించట్లేదనే వైఖరి తీసుకున్నాడు. ఆగస్టు 15 తర్వాత కేవలం భారతదేశానికి మాత్రమే గవర్నర్-జనరల్ హోదాలో ఉన్న మౌంట్ బాటన్ తన ప్రభుత్వ ఆసక్తులను ఆటంకపరుస్తూ జునాగఢ్ పాకిస్తాన్‌లో విలీనం అయిన తీరు చట్టపరంగా సవ్యంగా ఉందని, భౌగోళికంగా వేరుపడి ఉన్నదన్న వాదన న్యాయశాస్త్రపరంగా నిలవదంటూ భాష్యం చెప్పాడు. తన వ్యక్తిగత ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని జునాగఢ్ సంస్థానం మీద సైనిక చర్య చేపట్టవద్దనీ, ప్రజాభిప్రాయ సేకరణకు ఒప్పుకొమ్మని మౌంట్ బాటన్ నెహ్రూను బలవంతం చేశాడు.[65] మరోవైపు పాకిస్తాన్ రాబోయే కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాల వ్యవహారాల్లో తన వాదనకు అనుకూలంగా చేసుకోవడానికి జునాగఢ్ ఒక బేరసారాల బల్లగా వాడుకోదలిచింది.
పాకిస్తాన్ జునాగఢ్ విలీనాన్ని ఆమోదిస్తూ చేసిన ప్రకటనకు పటేల్ తొలి స్పందన ఆ సంస్థానపు సామంత సంస్థానాలైన మంగ్రోల్, బబరియావాడాలను ఆ సామంత సంస్థానాల హిందూ పాలకుల అనుమతితో భారతదేశంలో చేర్చుకోవడం. తన సామంతులు తనతో సంప్రదించకుండా విలీనం చేయడం తగదన్న నవాబు వాదనను తిరస్కరించి, భారత ప్రభుత్వం కొద్దిపాటి సైన్యాలను ఆయా సామంత సంస్థానాల రక్షణ కోసం చిన్నపాటి సైనిక బలగాన్ని పంపించింది. నవాబు తనను కలవడానికి వచ్చిన వి.పి.మీనన్‌ని జబ్బు సాకుపెట్టి కలవలేదు, మీనన్ దివానుని కలిసి సాంస్కృతిక, భౌగోళిక కారణాలతో భారతదేశంలో కలవమని కోరాడు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పరిష్కరించుకోవడానికి తనకు అభ్యంతరం లేదంటూ, పలు ఫిర్యాదులు చేశాడు. మరోవైపు మహాత్మా గాంధీ సోదరుని కుమారుడు, జునాగఢ్ పౌరుడు అయిన సామల్‌దాస్ గాంధీ ఆధ్వర్యంలో బొంబాయిలో "జునాగఢ్ తాత్కాలిక ప్రభుత్వం" ఏర్పడి సంస్థానంలో ఉద్యమానికి ఊతమిచ్చింది. ఈ పరిణామాలకు బెదిరిపోయిన నవాబు కరాచీ పారిపోగా దివాను మాత్రం సంస్థానంలోనే ఉండిపోయాడు. అక్టోబరు 27న సంస్థానం విషయంలో పాకిస్తాన్ ధోరణి పట్ల కాస్త విరసంగా జిన్నాకు ఉత్తరం రాసిన దివాన్ షా నవాజ్ మరో పదిరోజులకు భారత ప్రభుత్వానికి పరిపాలన అప్పగించడానికి సిద్ధపడ్డాడు. నవంబరు 9న లాంఛనంగా అధికార బదిలీ జరిగింది.[66] పటేల్, నెహ్రూలు జునాగఢ్ విలీనం విషయంలో తనను సంప్రదించకుండానే సాధించినందుకు మౌంట్ బాటన్ అలిగాడు. కొంతవరకూ మౌంట్ బాటన్ కోసం, కొంతమేరకు తమ విధానం ప్రకారం తర్వాతి ఏడాది ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. 91 శాతం మంది ప్రజల మద్దతుతో భారతదేశంలో చట్టబద్ధంగా సంస్థానం విలీనం అయింది.[67]
హైదరాబాద్ సమస్య
[మార్చు]మరాఠ్వాడా, ఉత్తర కన్నడ ప్రాంతాలు, తెలంగాణ అనే మూడు వేర్వేరు భాషా ప్రదేశాల్లో, అప్పటికి కోటిన్నరకు పైగా జనాభాతో, ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని వేరుచేసే దక్కను భూభాగంలో విస్తరించిన ప్రదేశం హైదరాబాద్ సంస్థానం. అత్యధిక శాతం తెలుగు, కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడే హిందువులు ఉన్న ఈ ప్రాంతానికి 18వ శతాబ్దంలో ఔరంగజేబుకు దక్కను సుబేదారుగా ప్రారంభించి క్రమేపీ స్వాతంత్ర్యం ప్రకటించుకున్న ముస్లిం వంశీకులు పరిపాలకులు. 1947 నాటికి పరిపాలనలో ఉన్న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వతంత్రం ప్రకటించుకున్నాడు. రాజ్యంలోని నిరంకుశ పరిపాలనా విధానాలను వ్యతిరేకిస్తూ, తీవ్రమైన అణచివేతలో పోరాడుతున్న కమ్యూనిస్టులు, ఆర్య సమాజ్, హైదరాబాద్ కాంగ్రెస్ సంస్థలు ఈ పరిణామాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. మరోవైపు రాజ్యంలో ప్రభుత్వ మద్దతుతో ప్రైవేటు సైన్యాన్ని నడిపిస్తున్న ఖాసిం రజ్వీ, అతని అనుయాయులైన రజాకార్లు హైదరాబాదీలకే స్వతంత్ర హైదరాబాద్ అన్న నినాదంపై ఇస్లాం రాజ్యాన్ని కాపాడుకునేందుకు అంటూ సంస్థాన ప్రజల్లో హిందువులను లక్ష్యం చేసుకుని ఘోర కృత్యాలు సాగించారు. ఈ పరిణామాలన్నిటికీ పాకిస్తాన్ ప్రత్యక్షంగా మద్దతునిస్తూండగా, గాంధీ, కాంగ్రెస్‌ల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న బ్రిటీష్ కన్జర్వేటివ్ పక్ష నాయకుడు విన్‌స్టన్ చర్చిల్, మరికొందరు టోరీలు హైదరాబాద్ పక్షాన్ని సమర్థిస్తూ మాట్లాడసాగారు.
1947 చివరి నాటికి ఈ అంశంపై ఏ పర్యవసానం తేలలేదు. నెహ్రూ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి పరిపాలన అప్పగించమని నిజాంను కోరాడు. అయితే అతను ఎవరి మాటా వినిపించుకునే స్థితిలో లేడు. హైదరాబాద్ సంస్థానం మీద చర్య తీసుకుంటే ఉపఖండంలోని ముస్లింలు అందరూ ఒక్క మనిషిగా వ్యతిరేకిస్తారంటూ జిన్నా స్వరం పెంచాడు. సంస్థానం మీద సైనిక చర్య విస్తృత స్థాయిలో భారత పాకిస్తాన్ దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధంగా పరిణమించడమో, మరోమారు ఉపఖండంలోని మతహింసకు దారితీయడమో జరుగుతందన్న అంచనా మేరకు ఏ చర్య తీసుకునేందుకు నెహ్రూ, పటేల్ వెనకాడారు. భారత ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించిన బ్రిటీష్ వారితో ఉన్న ఏర్పాటునే కొనసాగించేలా "యధాతథ ఒప్పందాన్ని" మాత్రమే హైదరాబాద్ చేసుకుంది. ఆ ప్రకారం హైదరాబాద్‌లో భారతదేశపు రాజకీయ ఏజెంటుగా పటేల్ సన్నిహితుడైన కె.ఎం.మున్షీని, ఢిల్లీలో హైదరాబాద్ ఏజెంటును నియమించారు. 1948 సెప్టెంబరు వరకు ఈ ప్రతిష్టంభన కొనసాగడమే కాక విషమించడం కూడా జరిగింది.
కాశ్మీరు ప్రతిష్టంభన
[మార్చు]1947 నాటికి కాశ్మీర్ సంస్థాన పరిపాలకుడు సిక్ఖు సామ్రాజ్యపు సామంతులుగా కాశ్మీరును జయించి, ఆంగ్లో-సిక్ఖు యుద్ధాల్లో ఆంగ్లేయులకు సహకరించి జమ్ము, కాశ్మీర్, లడాఖ్ ప్రాంతాలకు సంస్థానాధీశులుగా బ్రిటీష్ యుగంలో పరిపాలించిన డోగ్రా పాలక వంశస్థుడు, హిందూ మతస్థుడు - హరిసింగ్. ఈ సంస్థానం భారత ఉపఖండానికి అత్యంత ఉత్తరాన టిబెట్, ఆఫ్ఘనిస్తాన్‌లతో కూడా సరిహద్దులు పంచుకుంటూ అంతర్జాతీయంగా వ్యూహాత్మక ప్రాంతంలో నెలకొని ఉంది. తన పూర్వీకుల ప్రాంతం కావడం, సంస్థానంలో ప్రజాప్రాతినిధ్యం కోసం జరుగుతున్న నేషనల్ కాన్ఫరెన్సు ఉద్యమంతోనూ, దాని నాయకుడు షేక్ అబ్దుల్లాతోనూ సన్నిహితమైన సంబంధం ఉండడంతో జవాహర్‌లాల్ నెహ్రూకి కాశ్మీర్ సమస్యతో గాఢమైన అభినివేశం ఉంది.
సంస్థానాల వ్యవహారాలు చూస్తున్న వల్లభ్‌భాయ్ పటేల్ మాత్రం 1947 ఆగస్టు 15లోపు రెండు దేశాల్లో దేంట్లో చేరతాడో తేల్చుకొమ్మని మహారాజా హరిసింగ్‌కు మౌంట్ బాటన్ ద్వారా చెప్పాడు. కాశ్మీర్ విషయంలో పటేల్ వైఖరి సెప్టెంబరు వరకూ తటస్థంగా ఉండేది. పంజాబ్, బెంగాల్ విభజనలో ఏ సూత్రాన్నైతే అనుసరించి విభజించారో, అదే సూత్రాన్ని వర్తింపజేసి ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి కాశ్మీర్‌ను కావాలంటే మహారాజు పాకిస్తాన్‌లో కలపవచ్చన్న వైఖరితో ఉండేవాడు. భౌగోళికంగా పాకిస్తాన్ ప్రాంతాలకు అంటిపెట్టుకుని ఉండడం కూడా అతను ఈ వైఖరికి రావడానికి కారణమైంది. అయితే అదే సూత్రం మేరకు హిందువులు అధిక సంఖ్యలో ఉండి, భౌగోళికంగా భారతదేశం చుట్టూ ఉన్న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసేందుకు తమ ప్రయత్నాలకు పాకిస్తాన్ అడ్డుతగలకూడదని ఆశించాడు. పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ ఇందుకు సానుకూలంగా ప్రతిస్పందించలేదు. పైగా 1947 సెప్టెంబరు 13న హిందువులు అధిక సంఖ్యలో ఉన్న జునాగఢ్ రాజ్యాన్ని పాకిస్తాన్‌లో చేర్చుకోవడానికి ఆ దేశం అంగీకారం తెలిపింది. అంతటితో కాశ్మీర్ పట్ల పటేల్ తటస్థ వైఖరి మారిపోయింది. కాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు.[68][69]
మొదటి నుంచీ నెహ్రూ కాశ్మీర్ భారతదేశంలోనే ఉండాలన్న వైఖరితో ఉండేవాడు. ఇందుకు అతనికి సంస్థానంతో, అక్కడి నాయకులతో ఉన్న వ్యక్తిగత సంబంధం మాత్రమే కారణం కాదు. భారతదేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటుచేసిన ద్విజాతి సిద్ధాంతాన్ని తిరస్కరిస్తున్న కాంగ్రెస్ వైఖరిని, కాశ్మీర్ సంస్థాన ప్రజల్లో మంచి పలుకుబడి కలిగిన షేక్ అబ్దుల్లా, అతను భాగమైన నేషనల్ కాన్ఫరెన్స్ పంచుకుంటూ ఉండడం ముఖ్య కారణం. తామెంతగా ముస్లింలో అంతగానూ కాశ్మీరీలమేనన్న నేషనల్ కాన్ఫరెన్స్ దృక్పథం రాజ్య పాలకుడైన హరిసింగ్ అణచివేతను సమర్థంగా ప్రతిఘటిస్తూ ప్రజల ప్రాతినిధ్యాన్ని సాధించుకున్నది. ముస్లింలంతా పాకిస్తాన్‌లో కలిసి తీరాలన్న వైఖరిని ఖండించే ఈ దృక్పథానికి సహజంగానే నెహ్రూ ఎంతగానో అకర్షితుడై ఉన్నాడు.
మరోవైపు సంస్థాన పరిపాలకుడైన హరి సింగ్ భారతదేశంలో అధికార బదిలీ అంశంపై చర్చలు ప్రారంభమైన నాటి నుంచి యూనియన్లో చేరడం పట్ల గట్టి వ్యతిరేకతతో ఉన్నాడు. అతనికి కాంగ్రెస్ అంటే తీవ్ర వైముఖ్యత ఉండేది. మరోవైపు పాకిస్తాన్ ఏర్పాటు వాస్తవరూపం దాల్చేకొద్దీ స్వయానా హిందూ మతస్తుడై ఉండి ఇస్లామిక్ రాజ్యంలో తన సంస్థానాన్ని కలపడం అతనికి సరిపడే సంగతిగానూ తోచలేదు. అసలు ఇవన్నీ అటుంచినా బ్రిటిష్ వారు ఉపఖండంపై తమ సామ్రాజ్యాన్ని ఉపసంహరించుకోవడమే జరిగితే తాను స్వతంత్రుడను కావచ్చన్న ఆలోచనే అతన్ని మరింత ఆకర్షించింది. దీనికి అతని దివాన్ రామచంద్ర కాక్ స్వతంత్రుడవు కమ్మంటూ మహారాజుకు ఇస్తున్న సలహాలు తోడైనాయి. అప్పటికే ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం ఉద్యమించిన షేక్ అబ్దుల్లాను జైల్లో పెట్టారు. 1947 జూన్ చివరి వారంలో విభజన నిర్ణయం అనంతరం మౌంట్ బాటన్ భారత, పాకిస్తాన్ లలో ఏదో ఒక దేశాన్ని ఎంచుకుని చేరిపొమ్మని కాశ్మీర్ పాలకుడికి సూచించేందుకు పర్యటించాడు. మౌంట్ బాటన్ పర్యటనలో తనను కలవనివ్వకుండా కడుపునొప్పి మిషతో మహారాజు తప్పించుకుంటే, అతన్ని కలిసిన ప్రధానమంత్రి కాక్ కూడా ఏదో ఒక దేశంలో చేరమన్న సూచన మహారాజుకు చేయమంటే తిరస్కరించాడు.[70] జూలైలో జవాహర్‌లాల్ నెహ్రూ పర్యటన కూడా పరిష్కారం సాధించడంలో విఫలమైంది.[69]
ఆగస్టు నాటికి సంస్థానంతో పాకిస్తాన్ యధాతథ ఒప్పందం చేసుకోగా భారతదేశం వేచిచూసే వైఖరి అవలంబించింది. తాను చేసుకున్న యధాతథ ఒప్పందాన్ని తానే ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ సంస్థానంతో రవాణా సేవలు, వస్తు సరఫరాలు నిలిపివేసి ఉద్రిక్తత పెంచసాగింది. ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న ఈ సంస్థానాన్ని పాకిస్తాన్‌లో చేర్చుకోవాలన్నది వారి వైఖరి. కాశ్మీర్ సంస్థానాధీశుడు పాకిస్తాన్‌తో సంబంధాలు చెడిపోగానే ప్రధానులను వరుసగా మార్చి పటేల్, నెహ్రూలతో సత్సంబంధాలు ఉన్న మెహర్ చంద్‌జైన్ అన్న మాజీ న్యాయమూర్తిని ప్రధానిని చేశాడు.[69] కాశ్మీర్ ప్రజల అభిప్రాయాలను 1947 సెప్టెంబరులో పరిశీలించిన సంస్థాన బలగాల బ్రిటీష్ సేనాని - ప్రజలు ఏ పక్షంలో చేరడానికీ గట్టి మొగ్గుతో లేరనీ, నేషనల్ కాన్ఫరెన్సు మాత్రం కాంగ్రెస్ పక్షపాతి అనీ, పాకిస్తాన్ వ్యతిరేకి అనీ, ఇక పాకిస్తాన్‌లో చేరాలని సంస్థాన ప్రజల అభిప్రాయాన్ని మలిచేందుకు ప్రయత్నిస్తున్న రాజకీయ పక్షాలు ఏమీ ఉనికిలో లేవనీ గమనించాడు.[71] ఐతే శ్రీనగర్‌కు పశ్చిమాన పాకిస్తాన్‌తో సరిహద్దు పంచుకుంటున్న పూంఛ్ జిల్లా మాత్రం ఇందుకు మినహాయింపు. పలు ఆర్థిక, రాజకీయ కారణాల వల్ల అక్కడి గిరిజన ముస్లింలు మహారాజు పట్ల వ్యతిరేకతతో ఉన్నారు.[72] 1947 ఆగస్టు 14న చాలా దుకాణాలు, కార్యాలయాలపై పాకిస్తానీ జెండాను ఎగురవేశాయి. సెప్టెంబరు మొదటి వారాలకల్లా పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్, సీనియర్ పంజాబ్ ముస్లింలీగ్ నాయకుడు మియా ఇఫ్తికారుద్దీన్‌ల అనుమతితోనే సైన్యం పాకిస్తాన్‌లోని ముర్రీ అనే పట్టణంలో స్థావరాన్ని ఏర్పాటుచేసి ఆయుధాలు రహస్యంగా సరిహద్దులు దాటించి కొన్ని డజన్ల మంది పాకిస్తాన్ అనుకూలురైన తిరుగుబాటుదారులకు అందించింది.[73] సెప్టెంబరు 27న సంస్థానంలో క్షీణిస్తున్న పరిస్థితులు, పాకిస్తాన్ చొరబాటు చేయబోతున్న సూచనలు వివరిస్తూ పటేల్‌కు నెహ్రూ రాసిన లేఖలో పాకిస్తాన్ చొరబాటును అడ్డుకోవాలంటే, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలచగల అబ్దుల్లాను మహారాజు విడుదల చేసి అతని సహకారంతో భారతదేశంలో కాశ్మీరును చేర్చడం మహారాజుకున్న ప్రత్నామ్నాయం అని విశ్లేషించాడు.[69] దీనికి జవాబుగా అప్పటికే జునాగఢ్ వ్యవహారం వల్ల భారతదేశంలో కాశ్మీర్ విలీనం పట్ల అనుకూల వైఖరి అవలంబించిన పటేల్ - కాశ్మీరుకు సంబంధించిన విధానపరమైన అంశాల్లో మనిద్దరికీ అభిప్రాయభేదాలు లేవని నెహ్రూ వైఖరికి ఆమోదం తెలిపాడు. సెప్టెంబరు 29న జైలు నుంచి విడుదలైన షేక్ అబ్దుల్లా, వారంరోజుల తర్వాత శ్రీనగర్‌లోని ప్రసిద్ధ హజరత్ బాల్ మసీదు నుంచి ప్రసంగిస్తూ అధికారం మొత్తం కాశ్మీరు ప్రజలకు బదిలీ కావాలని, అప్పుడు ప్రజాప్రతినిధులు భారతదేశంలో చేరాలో, పాకిస్తాన్‌లో చేరాలో నిర్ణయించుకుంటారని, కాశ్మీరులో ప్రజాప్రభుత్వం హిందువులు, సిక్ఖులు, ముస్లింల ఉమ్మడి ప్రభుత్వం అవుతుంది తప్ప ఏ వర్గానికో చెందదనీ తన వైఖరి వివరించాడు. పరిస్థితులు వేగంగా మారిపోతున్నా కాశ్మీర్ మాత్రం అక్టోబరు 12 నాటికి కూడా స్వతంత్ర కాశ్మీరుపై అధికారం తనదేనని, కాశ్మీరు తన పాలనలో తూర్పు స్విట్జర్లాండ్‌లా వెలుగుతుందని భావించసాగాడు.[71]
కాశ్మీర్‌లోకి పాకిస్తాన్ చొరబాటు
[మార్చు]ఉత్తరాన పాకిస్తాన్‌లోని వాయువ్య సరిహద్దు ప్రావిన్సు నుంచి కాశ్మీర్ సరిహద్దు దాటి అక్టోబరు 22న సాయుధులైన ఆక్రమణదారులు దాడికి పాల్పడుతూ చొచ్చుకువచ్చారు.[73] [నోట్స్ 11] అక్టోబరు 22 నాటికి వీరు దక్షిణ దిశలో వేగం పుంజుకుంటూ, ఆశ్చర్యం గొలిపే వ్యూహాలతో శ్రీనగర్ వైపు తమ చొరబాటు సాగించారు. రైఫిళ్ళు, గ్రెనేడ్లతో దాడిచేస్తూ, లారీల మీద ప్రయాణించారు. యూరీ పట్టణం పతనం కాకుండా కాశ్మీర్ సంస్థాన సైన్యాధికారి బ్రిగేడియర్ రాజేంద్రసింగ్ ముందుగా చేరుకుని అక్కడ పట్టణానికి ఉత్తర ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ నదిపై ఉన్న వంతెనను పేల్చి పోరాడి 48 గంటల పాటు ఆక్రమణదారులను అడ్డుకోగలిగారు. రాజేంద్ర సింగ్ సైన్యం నేలకొరగడంతో యూరీ నుంచి మహూతాలో శ్రీనగర్‌కు విద్యుత్తు సరఫరా చేసే కేంద్రం నుంచి సరఫరా ఆపేశారు. ఆపైన బారాముల్లా పట్టణానికి చేరుకుని హిందువులనీ, ముస్లింలనీ, క్రైస్తవులనీ పట్టించుకోకుండా దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు చేశారు. ఆక్రమణదారులు శ్రీనగర్ అన్న లక్ష్యాన్ని మరచిపోయి, బారాముల్లా పట్టణాన్ని పీడించే పనిలో పడినప్పుడు శ్రీనగర్‌లో అధికార వర్గానికి దడపుట్టింది.
కాశ్మీరు విలీనం, సైన్యం తరలింపు
[మార్చు]ఈ ఘటనలు ప్రారంభం కాగానే మహారాజు సహాయాన్ని అభ్యర్థిస్తూ ఢిల్లీకి తంతి పంపాడు. 25న సంస్థానాల శాఖ కార్యదర్శి వి.పి.మీనన్ శ్రీనగర్‌కు చేరుకుని మహారాజును జమ్మూకు తరలించి, ప్రధానమంత్రి, అబ్దుల్లాలను తీసుకుని 26 ఉదయాన ఢిల్లీ వచ్చాడు. మహారాజు, దివాన్, అబ్దుల్లాలు కూడా వెనువెంటనే శ్రీనగర్‌కి సైన్యాలు పంపాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. విలీనం ఒప్పందం మీద సంతకం తీసుకుంటే తప్ప కాశ్మీరు భారతదేశానిది అవ్వదనీ, కాబట్టి ముందు విలీనం అన్నది ముఖ్యమనీ మౌంట్ బాటన్ వాదించాడు. ప్రజాభిప్రాయానికే తాము కట్టుబడి ఉన్నామంటూ మొదట విలీనానికి నెహ్రూ అంగీకరించకపోవడంతో పటేల్, షేక్ అబ్దుల్లా బతిమాలాల్సి వచ్చింది. చివరకు అంతా విమానాల్లో సైన్యాన్ని తరలించడానికి అనుకూలంగా నిర్ణయించారు, కానీ మౌంట్ బాటన్ మాత్రం ఈ అంశంపై సైన్యాన్ని పంపకూడదనే వాదించి ఓడిపోయి మిన్నకున్నాడు. అయితే శాంతిభద్రతలు నెలకొన్నాకా జనాభిప్రాయ సేకరణ జరపగలమని నెహ్రూ, పటేల్‌లు ప్రకటించేలా వారిని మౌంట్ బాటన్ ఒప్పించాడు. నెహ్రూ సహా అందరూ విలీనానికి అంగీకరించడంతో 26 తేదీనే మీనన్ మరో విమానంలో జమ్మూ వెళ్ళి మహారాజు వద్ద విలీన పత్రాలపై సంతకం తీసుకుని ఢిల్లీ తిరిగివచ్చాడు. 27 తెల్లవారుజామున 28 డకోటా విమానాలతో శ్రీనగర్‌కు భారతీయ సైనికులు బయలుదేరి వెళ్ళారు. అప్పటికే శ్రీనగర్‌లో ప్రజలను ఆక్రమణకు వ్యతిరేకంగా నిలబెడుతూ వ్యవస్థీకరిస్తూ, ప్రసంగాలు చేస్తూ వీధుల్లో పనిచేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తలు కనిపించారు. ముందు శ్రీనగర్ రక్షణ కోసం కొద్దిరోజులు కాపుకాసిన సైన్యం, నగరం పతనం కాదని నిర్ధారణ కాగానే లోయలోని ఇతర ప్రాంతాలకు పురోగమించి బారాముల్లా, ముహుతా, యూరీ పట్టణాలను పట్టుకుంది. చలికాలం ప్రారంభం కావడంతో ముందుకు సాగలేదు.
కాశ్మీరు భవిష్యత్తుపై సంప్రదింపులు
[మార్చు]"కాశ్మీరు స్వాతంత్రం అవుతుందా, భారతదేశంలో భాగమవుతుందా అన్నది పెద్ద ప్రాముఖ్యత కలిగిన అంశాలు కావనీ, అయితే పాకిస్తాన్ దోపిడీలో భాగం అయితే మాత్రం దారుణం జరిగేదని" భావించిన నెహ్రూ లోయలోకి సైన్యం పురోగమించడంతో సంతృప్తి చెందాడు. ఇక కాశ్మీరు భవిష్యత్తు ప్రజలే నిర్ణయిస్తారని, షేక్ అబ్దుల్లా అక్కడి మంత్రివర్గ నాయకుడు కావాలని ఆశించాడు. మరోవైపు కాశ్మీర్ మీదికి దండెత్తి పొమ్మని జిన్నా చేసిన సూచనను బ్రిటీష్ సైన్యాధికారే తిరస్కరించాడు. మౌంట్ బాటన్‌తో జరిగిన చర్చల్లో విలీనం తగదనీ జిన్నా మండిపడ్డాడు. కాశ్మీర్ గురించి ఢిల్లీలో పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్, భారతదేశ ప్రధానిగా నెహ్రూ, మౌంట్ బాటన్ మధ్యవర్తిగా కలిశారు. ఫలప్రదం కాని ఈ చర్చల తర్వాత 1947 డిసెంబరులో కాశ్మీర్ ప్రతిష్టంభన పరిష్కరించేందుకు గల మార్గాలను కాశ్మీర్ మహారాజు హరిసింగ్‌కు రాసిన ఉత్తరంలో అన్వేషించాడు. ప్రధానంగా నాలుగు మార్గాలు అతనికి తోచాయి. మొదటిది: రాజ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపడం, రెండోది కాశ్మీర్ స్వతంత్ర దేశం కావడం, అయితే దాని స్వాతంత్ర్యాన్ని బలప్రయోగంతో భంగపరచమని భారతదేశం, పాకిస్తాన్ హామీ ఇవ్వాలి. మూడోది రాజ్యాన్ని విభజించి - [ముస్లిమేతరులు అధిక సంఖ్యలో ఉండే] జమ్మును భారతదేశానికి, [ముస్లింలు ఎక్కువగా ఉన్న] కాశ్మీరు లోయను పాకిస్తాన్‌లో భాగం చేయాలి. నాలుగవ మార్గం ప్రకారం పూంచ్ నుంచి పశ్చిమానికి ఉన్న భూభాగాన్ని పాకిస్తాన్‌కు ఇచ్చేస్తే మిగిలిన భూభాగం భాతరదేశంలో కలుస్తుంది.. 1947 చివరి నాటికి కాశ్మీర్ సమస్యపై ఏడు దశాబ్దాల తర్వాత కూడా చర్చల్లో ఈ నాలుగు అంశాలే ఉన్నాయి.[74] నిజానికి కాశ్మీర్‌లో పూంఛ్ అవతల పశ్చిమానికి, వాయువ్యానికి ఉన్న భాగంలో పాకిస్తాన్ పట్ల తీవ్రమైన అభిమానం ఉన్నందున ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లో కలిపి, మిగతా సంస్థానాన్ని (జమ్ము, లడాఖ్, కాశ్మీరులోయ) భారతదేశంలో ఉంచి రాజీమార్గంలో సమస్యను పరిష్కరించేందుకు నెహ్రూ సిద్ధంగానే ఉన్నాడు.[75] అయితే షేక్ అబ్దుల్లా నాయకత్వంలో లౌకిక వాదానికి గట్టి మద్దతు ఇస్తున్న కాశ్మీరు లోయ మొత్తాన్ని కేవలం మత ప్రాతిపదికన పాకిస్తాన్‌లో కలపడానికి మాత్రం తీవ్ర వ్యతిరేకిగా ఉన్నాడు.[74]
ఐక్యరాజ్య సమితి ముందుకు సమస్య
[మార్చు]భారతదేశంలో కాశ్మీరు సంస్థానం విలీనం అయిన విషయాన్ని గుర్తిస్తూ సమస్యను పరిష్కరించమంటూ పాకిస్తాన్‌కు తుది హెచ్చరిక చేసి, ఆ గడువు సమయం ముగిసిన వెంటనే పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించమని షేక్ అబ్దుల్లా భారత ప్రభుత్వానికి సూచించాడు. నెహ్రూకి ఈ అంశంపై పాకిస్తాన్‌తో యుద్ధం చేయడం ఇష్టం లేదు కాబట్టి సూచనను తిరస్కరించాడు. 1947 డిసెంబరులో కాశ్మీర్ సమస్య పరిష్కారం విషయమై అంతర్గతంగా పలు చర్చలు జరిగాయి. మౌంట్ బాటన్ ఉద్దేశంలో యుద్ధాన్ని నివారించడానికి సాధారణ పద్ధతిలో ఐక్యరాజ్య సమితికి నివేదించి ఆపైన ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. ఐక్యరాజ్య సమితికి సమస్య నివేదించడం విషయమై నెహ్రూని మౌంట్ బాటన్ ఒప్పించాడు. అయితే కాశ్మీరు సమస్యగా దీన్ని నివేదిస్తూ, పాకిస్తాన్ దురాక్రమణను ప్రత్యేకించి ప్రస్తావించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థానాల వ్యవహారాలను చూస్తున్న ఉప ప్రధాని పటేల్‌కు అసలు కాశ్మీరు వ్యవహారాన్ని ఐక్యరాజ్య సమితికి నివేదించడం ఏమాత్రమూ నచ్చలేదు, నెహ్రూ-మౌంట్ బాటన్ నిర్ణయం మేరకు మరేం చేయలేకపోయినా అతనికి సమితికి నివేదించడం ఆమోదయోగ్యం కాలేదు. నెహ్రూ ఈ అంశంపై ముసాయిదా ప్రతిని గాంధీకి చూపించగా, గాంధీ ముసాయిదాలో భారత, పాకిస్తాన్ దేశాల్లో ఏదోక దానిలో చేరిపోవడమనే అవకాశంలో స్వతంత్రత అన్న అంశాన్ని తొలగించి సంకోచిస్తూనే అంగీకరించాడు.
మౌంట్ బాటన్ పట్టుదల మీద, నెహ్రూ ఆమోదంపై కాశ్మీరు సమస్య ఐక్యరాజ్య సమితికి 1947 డిసెంబరు 31న విజ్ఞప్తి చేయగా, ఐరాస 1948 జనవరి 1న పరిశీలనకు స్వీకరించింది. భారతదేశం వైపు నుంచి ఇదొక చారిత్రక తప్పిదంగా మిగిలిపోయింది. ఐక్యరాజ్య సమితిలో కాశ్మీరు అంశంలో భారతదేశానికి అన్నివిధాలా నష్టదాయకంగా, నెహ్రూ నిర్ణయాల్లో అత్యంత ఖరీదైన తప్పిదంగా నిలిచిపోయేలా జరిగింది. తాను తీసుకున్న ఈ నిర్ణయం చాలా పొరపాటని అంగీకరిస్తూ నెహ్రూ ప్రగాఢమైన పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
ఇతర కార్యకలాపాలు
[మార్చు]విదేశాంగ వ్యవహారాలు
[మార్చు]1946 సెప్టెంబరులో తాను మధ్యంతర ప్రభుత్వానికి (వైస్రాయ్ కౌన్సిల్) అధిపతి కాగానే "భారతదేశం ప్రపంచ వ్యవహారాలతో క్రియాశీలమైన సంబంధం కలిగి ఉంటూనే తన జాతీయ ప్రయోజనాలకు అనుకూలమైన స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తుంది" అని స్పష్టం చేశాడు. ఈ ప్రకటన తర్వాతికాలంలో నెహ్రూ రూపొందించిన అలీన విధానానికి సూత్రప్రాయమైన రూపం. నెహ్రూ మరణించేవరకూ విదేశాంగ విధానం విషయంలో దీన్నే భారతదేశం అనుసరించింది. సైద్ధాంతికంగా ఒక సూత్రరూపంలో ఇది 1946 నాటికే నెహ్రూ ప్రకటనలో కనిపించినా దీన్ని ఆచరణలోకి తీసుకురావడం, కార్య ప్రణాళికగా మలచడం మాత్రం 1947 తర్వాతే క్రమేపీ సాధ్యపడింది.
జవాహర్ తనకెంతో ఆసక్తిదాయకమైన కార్యరంగం: ఆసియా వ్యవహారాల మహాసభ నిర్వహణలో పనిచేశాడు. 1947 మార్చి 23 నుంచి ఏప్రిల్ 2 వరకూ ఈజిప్టును కూడా కలుపుకుని ఆసియా దేశాల అభిప్రాయాలన్నిటికీ ప్రాతినిధ్యం వహించేలాంటి ప్రతినిధులతో కొత్త ఢిల్లీలో ఈ మహాసభ జరిగింది. 1945 డిసెంబరు నుంచే అలాంటి మహాసభ జరపాలన్న ఆలోచనతో ఉన్న జవాహర్‌లాల్ నెహ్రూ ఇందుకోసం 1946 సెప్టెంబరు నుంచి పనిచేస్తూ వచ్చాడు. పెద్దగా వివాదాస్పదం కాని అంశాలతో, కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్న ఆసియా ఖండ నాయకులు అంతా ఒకచోట కలుసుకునే ఉద్దేశంతో దీన్ని నిర్వహించాడు. పెద్దగా వివాదాస్పదం కాని అంశాలతో, కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్న ఆసియా ఖండ నాయకులు అంతా ఒకచోట కలుసుకునే ఉద్దేశంతో దీన్ని నిర్వహించాడు. అయితే పలు దేశాల్లో సంస్థ జాతీయ యూనిట్లు నెలకొల్పాలని, ఆసియా అధ్యయన కేంద్రం ఏర్పడాలని తీర్మానాలు చేసుకున్నా, రెండవ ఆసియా వ్యవహారాల మహాసభ నిర్వహించాలని నిశ్చయించుకున్నా అవేమీ ఆచరణలోకి రాలేదు. అయితే తన భావావేశానికి అభివ్యక్తి అని ఈ మహాసభ పట్ల నెహ్రూ సంతృప్తి చెందాడు.
రాజ్యాంగం
[మార్చు]భారతదేశ రాజ్యాంగ రూపకల్పన 1946 డిసెంబరులో ప్రారంభమైంది 1949 డిసెంబరు వరకూ కొనసాగింది. మన పరిశీలనా కాలమైన 1947లోనూ చెప్పుకోదగ్గ చర్చలు, నిర్ణయాలు జరిగాయి. అయితే ఎక్కువభాగం నిర్ణయాలు, చర్చలు, ముసాయిదా రూపకల్పన వంటివి తర్వాతి రెండేళ్ళలోనే జరిగాయి.
విమర్శలు, వివాదాలు
[మార్చు]జవాహర్‌లాల్ నెహ్రూ ఈ దశలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, తర్వాత భారతదేశ ప్రభుత్వాధినేతగా సమష్టిగానూ, స్వంత బాధ్యతపైనా పలు నిర్ణయాలు తీసుకున్నాడు. అయితే దేశ చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన ఈ సమయంలో నెహ్రూ తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని చాలా విమర్శలకు తావు ఇచ్చాయి. అతని విమర్శకుల్లో కొందరు ఉద్దేశాన్ని తప్పుపట్టకుండా కేవలం ఆయా నిర్ణయాల విషయంలో అతని వైఖరిని మాత్రమే తప్పు పట్టగా, మరికొందరు ఉద్దేశాలను కూడా తప్పు పడుతున్నారు.
ఈ కాలంలో నెహ్రూ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత వివాదాస్పదమైనదీ, ప్రభావశీలమైనదీ కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితికి నివేదించాలన్న నిర్ణయం. 1947 డిసెంబరు నాటికి భారత దళాలు కాశ్మీర్ సంస్థానంలో ఉన్నాయి. కాశ్మీరీల నాయకుడు షేక్ అబ్దుల్లా భారతదేశంలో విలీనానికి మౌలికంగా అనుకూలంగానే ఉన్నాడు. అప్పటికి మహారాజు విలీన పత్రంపై సంతకాలు చేయడం కూడా జరిగింది. అయితే పశ్చిమ, ఉత్తర ప్రాంతాలు పాకిస్తాన్ నుంచి వచ్చిన చొరబాటుదారుల ఆక్రమణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెహ్రూ చరిత్రకారుడి ప్రకారం "అంతర్జాతీయ వ్యవహారాల్లో బొత్తిగా అనుభవం లేని" వైస్రాయ్ మౌంట్ బాటన్ ఒత్తిడికి, ప్రభావానికి లొంగి, సంస్థానాల వ్యవహారాల శాఖ మంత్రి వల్లభ్‌భాయ్ పటేల్ అభ్యంతరాలను, వ్యతిరేకతను ఉపేక్షించి జవాహర్‌లాల్ నెహ్రూ కాశ్మీరు సమస్యను ఐరాస ముందుకు తీసుకుపోవాలన్న నిర్ణయం తీసుకున్నాడు. 1947 నవంబరు నెల చివరి వరకూ నెహ్రూ, పటేల్ ఇద్దరూ ఐరాస వద్దకు సమస్యను తీసుకుపోవడంపై సుముఖంగా లేరు. అయితే మౌంట్ బాటన్ డిసెంబరు మాసాంతానికల్లా వారిద్దరిలో నెహ్రూను తన వాదనవైపుకు తిప్పుకోగలిగాడు. 1947 సంవత్సరాంతానికి ఐరాసకు భారత ప్రభుత్వం కాశ్మీరు సమస్య అన్న పేరుతో నివేదిస్తూ పాకిస్తాన్ దురాక్రమణను వివరించింది. కానీ భారతదేశం ఐరాసలో కాశ్మీరు సమస్యలో చాలా నష్టపోయింది. ఆక్రమించుకున్న ప్రదేశాల నుంచి ఆక్రమణదారులను తొలగించేలా పురోగమించే హక్కును సైతం తర్వాతి రోజుల్లో కోల్పోయింది. తన నిర్ణయం పొరపాటైనదని తర్వాతిరోజుల్లో నెహ్రూ స్వయంగా పశ్చాత్తాపం ప్రకటించాడు.
1946లో క్యాబినెట్ మిషన్ పథకాన్ని చెరొక పద్ధతిలోనూ కాంగ్రెస్, ముస్లింలీగ్ తమకు అనుకూలమైన వ్యాఖ్యానంతో అర్థం చేసుకుని, తమ ఆమోదాన్ని తెలిపాయి. ఈ నేపథ్యంలో ముందు ఆమోదించిన క్యాబినెట్ మిషన్లోని అంశాలన్నిటినీ జూలై 7న, 10న తిరస్కరిస్తూ, రాజ్యాంగ సభలో చేరడాన్ని తప్ప మరి ఏ అంశానికీ కాంగ్రెస్ కట్టుబడి ఉండక్కర్లేదంటూ నెహ్రూ చేసిన బహిరంగ ప్రకటనలు కలకలం రేపాయి. ఈ ప్రకటనకు ప్రతిస్పందనగా జిన్నా ఆ నెలాఖరు నాటికి క్యాబినెట్ మిషన్ పథకం నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించాడు. మరుసటి నెలలో పాకిస్తాన్ కోసం, ప్రమాదంలో పడిన ఇస్లాం కోసం అంటూ జిన్నా పిలుపునిచ్చిన ప్రత్యక్ష కార్యాచరణ దినం 1946-47ల్లో జరిగిన దారుణమైన మతహింసకు నాందిగా చరిత్రలో నిలించింది. ఇలా నెహ్రూ చేసిన ఒక ప్రకటన మొత్తం పరిణామాలను హింసాత్మకంగా మార్చేసిందన్న విమర్శలు అతనిపై ఉన్నాయి. పలువురు చరిత్రకారులు నెహ్రూ చేసిన ప్రకటన రెచ్చగొట్టే ధోరణిలో ఉందని, జిన్నా రెచ్చిపోవడానికి ఇది ప్రధానమైన కారణమని భావిస్తున్నారు. అయితే నెహ్రూ జీవితచరిత్ర కారుడు ఎస్. గోపాల్ మాట్లాడుతూ కేబినెట్ ప్రతిపాదనల విషయమై కాంగ్రెస్ అధికారికంగా ఆమోదించింది కేవలం రాజ్యాంగ సభలో చేరిక మాత్రమేనని, ఎలాగైనా ఈ క్యాబినెట్ మిషన్ నుంచి తాను బయటకు రావాలని నిర్ణయించుకున్న జిన్నా దీన్ని ఒక అవకాశం తీసుకున్నాడని నెహ్రూను సమర్థించాడు. బిపిన్ చంద్ర కూడా జిన్నా కాబినెట్ మిషన్ నుంచి బయటకు రావడానికి నెహ్రూ వ్యాఖ్యలను అవకాశంగా తీసుకుని బయటకు వచ్చాడని పేర్కొన్నాడు. నెహ్రూ వ్యాఖ్యకీ, జిన్నా చర్యకీ మధ్య సంబంధం మాత్రం ఎవరూ తిరస్కరించలేనిది.
ఈ m నెహ్రూపై వచ్చిన ఆరోపణలన్నిటిలోకీ తీవ్రమైనది, వివాదాస్పదమైనది - మౌంట్ బాటన్ దంపతులు అతని నిర్ణయాలను ప్రభావితం చేయడం గురించినది. నెహ్రూకీ, మౌంట్ బాటన్ భార్య ఎడ్వినాకీ మధ్య అనుబంధం లైంగికమైనదా కాదా అన్నదానిపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా, పదమూడేళ్ళ పాటు గాఢంగా సాగిన అనురాగపూరితమైన అనుబంధం అన్నదానిని అందరూ అంగీకరిస్తారు.[76][77] మరోపక్క మౌంట్ బాటన్‌తో కూడా నెహ్రూకు మంచి స్నేహం ఉంది. నెహ్రూ చరిత్రకారుడు ఎస్.గోపాల్ ప్రకారం "మౌంట్ బాటన్‌తో ఏర్పడిన సన్నిహిత మైత్రి జవహర్‌లాల్ యొక్క చిరచిరలాడే స్వాభావాన్ని కొంత తగ్గించింది."[31] అయితే ఈ దంపతులతో నెహ్రూకున్న ప్రత్యేకమైన వ్యక్తిగత అనుబంధం భారతదేశానికి అత్యంత కీలకమైన 1947 సంవత్సరంలో జాతిప్రయోజనాలు సైతం దెబ్బతినే ధోరణిలోని అనేక నిర్ణయాలు తీసుకునేలా ప్రభావితం చేసిందన్న విమర్శ నెహ్రూ మీద వచ్చిన విమర్శల్లోకెల్లా అత్యంత తీవ్రమైనది. నెహ్రూ-ఎడ్వినాల సంబంధం వల్ల దేశానికి అత్యంత కీలకమైన దేశ విభజన అంశంపై మౌంట్ బాటన్‌తో జరిగిన చర్చల్లో మెత్తబడ్డాడన్నట్టు చిరకాల కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పెద్దల నిర్ణయం వల్ల నష్టభావన కలిగివున్న ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ దశాబ్దాల తర్వాత కూడా ఆరోపించాడు. అయితే తర్వాతికాలంలో మరెంతోమంది అంతకన్నా ఘాటుగా నెహ్రూను, అతని వ్యక్తిగత అనుబంధాలను అందువల్లే జాతికి చేటు జరిగిందని వారు భావించే సంఘటనలు తలుచుకుని విమర్శిస్తూనే ఉన్నారు.
నోట్స్
[మార్చు]- ↑ ఈ ఆలోచన 1945 ఆగస్టులో జైలు నుంచి విడుదల కాగానే నెహ్రూకు ఎలా ఉందో, 1946 ఏప్రిల్ నాటికి కేంద్ర, రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో ముస్లింలీగ్ ప్రభావం స్పష్టమయ్యాకా కూడా అలానే ఉంది. అయితే ఆ సరికే కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన వల్లభ్ భాయ్ పటేల్ పాకిస్తాన్ ఏర్పాటు తప్పకపోవచ్చునన్న అవగాహనకు వస్తూ ఒకవేళ తప్పకపోతే అది పంజాబ్, బెంగాల్ విభజనల ద్వారా జరగాలన్న వ్యూహాన్ని కూడా ఆలోచించిపెట్టుకుంటున్నాడు.
- ↑ వేవెల్ ఎప్పటిలానే ముస్లింలీగ్ పక్షానే మాట్లాడుతూన్నా లండన్ లోని ఇండియా కార్యాలయం వారు మాత్రం స్వాతంత్ర్యానంతరం భారతదేశంతో బ్రిటీష్ సంబంధాలు బలంగా ఉండాలని ఆశించి కాంగ్రెస్ అనుకూలమైన విధానం నిర్ణయిస్తూ వస్తోంది. ముస్లింలీగ్ కి బ్రిటీష్ ప్రభుత్వంపై ఉన్న పట్టు సడలిపోయిందన్న అంచనాతో నెహ్రూ స్వతంత్రించి ఈ వ్యాఖ్య చేశాడు.
- ↑ నెహ్రూ జీవితచరిత్రకారుడు ఎస్.గోపాల్ ఈ నేరాన్ని నెహ్రూ మీద తోయడం సరికాదంటూ, తనకు సమ్మతం కాని క్యాబినెట్ మిషన్ పథకం నుంచి తప్పుకునేందుకు జిన్నా దీన్నొక సాకుగా వినియోగించుకున్నాడని అన్నాడు. జిన్నా దీన్ని సాకుగా వాడుకున్నాడనే చరిత్రకారుడు బిపిన్ చంద్ర కూడా పేర్కొన్నాడు. అయితే చాలామంది చరిత్రకారులు నెహ్రూ చేసిన ఈ వ్యాఖ్య రెచ్చగొట్టడాన్ని నమోదుచేశారు.
- ↑ ఇది ఐదు అంశాల ప్రతిపాదన: మొదటి అంశం ప్రకారం తన ఇష్టానుసారం ఎవరితోనైనా మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం జిన్నాకు ఇవ్వాలి, రెండోదాని ప్రకారం జాతీయ ప్రయోజనాలకు భంగమని వైస్రాయ్ వంటి నిష్పాక్షిక మధ్యవర్తి అభ్యంతర పెడితే తప్ప జిన్నా చర్యలన్నిటికీ అసెంబ్లీలో కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలి, మూడో సూత్రం దేశంలో కల్లోలాన్ని రేపుతున్న ప్రైవేటు సైన్యాలన్నిటినీ రద్దుచేసి నిరాయుధీకరించాలంటుంది, నాలుగో సూత్రం ప్రకారం దేశంలో ముస్లిం గ్రూపింగ్ చేయవచ్చు, కానీ అవన్నీ ఐచ్ఛిక ప్రాతిపదికన జరగాలి, అయిదో సూత్రం ప్రకారం ఈ అంశాలపై ముస్లింలీగ్ కానీ, జిన్నా కానీ ప్రభుత్వం ఏర్పరిచేందుకు సుముఖులు కాకపోతే ఇవే ప్రాతిపదికల మీద సుసంఘటిత ప్రభుత్వ ఏర్పాటు అవకాశాన్ని కాంగ్రెస్, నెహ్రూలకు ఇవ్వాలి.
- ↑ బాల్కనైజేషన్ పథకం మనసులో అప్పటికప్పుడు స్ఫురించిందని మౌంట్ బాటన్ చెప్పినా, అప్పటికే దాన్ని జాగ్రత్తగా ఆలోచించి చక్కగా సిద్ధం చేశారు. దాని స్థూల స్వరూపం అస్పష్టంగా తెలిసినా వివరంగా అప్పటిదాకా కాంగ్రెస్ నాయకులకు చెప్పలేదు
- ↑ ఈ దశలో పూర్తి అధికారం స్వీకరించాలని ఆత్రపడింది దేశంలో ప్రబలిపోతున్న అరాజకత్వాన్ని అదుపుచేసి, మతకల్లోలాలు నివారించడానికి.
- ↑ రాడ్‌క్లిఫ్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ సమాచార విభాగంలో డైరెక్టర్ జనరల్ హోదాలో పనిచేసినవాడు, న్యాయవాది. అతను అంతవరకూ తన జీవితంలో భారతదేశం కాదు కదా, ఐరోపాలో కూడా తూర్పు దిక్కున ప్యారిస్ మించి ప్రయాణించినవాడు కాదు. రాడ్‌క్లిఫ్‌కు విభజన రేఖ గీసేందుకు ఐదువారాల సమయం ఇచ్చారు. తన దగ్గర ఉన్న కాలం చెల్లిన మ్యాప్‌లతో, ఖచ్చితంగా తప్పుడుదని తెలిసిన జనాభా లెక్కలతో ఉద్విగ్నంగా, విభేదాలతో హింస రాజేస్తున్న ప్రజల మధ్య ఓ రేఖ గీయడం అన్న అత్యంత కష్టమైన పనిని అతని ముందుపెట్టారు. తనకు అప్పగించిన పనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి, తన పరిధిలో, తనకిచ్చిన సమయం కన్నా త్వరితంగా పూర్తిచేశాడు. తన పరిధిని మించిన కారణాల వల్లనే అయినా చివరకు లక్షలాదిమంది మరణానికి కారణమైనదన్న ఉద్దేశంతో భారతదేశానికి, పాకిస్తాన్ కు విభజనరేఖ గీసేందుకు తనకు ఇచ్చిన పని పూర్తిచేసిందుకు గాను ప్రభుత్వం ఇచ్చిన జీతం రూ.40 వేలు తిరస్కరించి ఇంగ్లాండ్ వెళ్ళిపోయినవాడు.
- ↑ సరిహద్దు రేఖను ప్రకటించకుండానే భారత్, పాకిస్తాన్‌లు ఏర్పడుతూ, స్వాతంత్ర్యం రావడం అనేది ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి, పుకార్లకు వ్యాప్తినిచ్చింది. మరోవైపు యూనియనిస్టు-కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై నెలలు కావస్తున్నా బ్రిటీష్ గవర్నర్ నిష్పాక్షికంగా కాక పక్షపాత ధోరణుల్లో ప్రవర్తిస్తూండడం, సరిహద్దు దళానికి సమస్యను ఎదుర్కొనేందుకు తగ్గ ధైర్యం కానీ, సంఖ్య కానీ, అసలు అదుపుచేయాలన్న గట్టి సంకల్పం కానీ లేకుండా పోవడం, వీటన్నిటికీ తోడు అకాలంగా కొనసాగుతున్న ఎండాకాలం వర్షాభావాన్ని కరువును ప్రజ్వరిల్లజేయడం వంటి ఎన్నో కారణాలు ప్రజల్లోని మతవిద్వేషాలకు ఆజ్యంపోశాయి.
- ↑ 2 లక్షల మంది నుంచి 6 లక్షల వరకూ చనిపోయివుంటారని పలు అంచనాలు వెల్లడిస్తున్నాయి. మరణించినవారి సంఖ్యను పి. మూన్ రెండు లక్షలుగా లెక్కిస్తే, దాన్ని సరైనదేనని మౌంట్ బాటన్ అంగీకరించాడు. అయితే మరణించినవారి సంఖ్యను జి.డి. ఖోస్లా 4 నుంచి 5 లక్షల మధ్య ఉంటుందని, ఇయాన్ స్టీఫెన్స్ 5 లక్షలు అని, ఎం. ఎడ్వర్డెస్ 6 లక్షలనీ అంచనా వేశారు.
- ↑ అయితే గాంధీ ముందుగా లాహోరులోనో, రావల్పిండిలోనో ముస్లింలను ఈ మతహింస ఆపమని అడిగే హక్కు, ఢిల్లీలో హిందువులను అడిగి సాధించుకోవడం ద్వారానే వస్తుందని నమ్మాడు. ఆ మేరకు ఢిల్లీలో ఉండి ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసను అహింసా పద్ధతిలో ముఖాముఖీ ఎదుర్కొంటూ గడిపాడు.
- ↑ పాకిస్తాన్ వాదన ప్రకారం పూంఛ్ జిల్లాలో బాధలుపడుతున్న తమ సహ ముస్లింల పట్ల సానుభూతితో తమంత తామే సాయుధులై సరిహద్దు దాటి వచ్చారని పాకిస్తాన్ వాదన. అయితే పూంచ్ తిరుగుబాటును అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ పఠాన్లను సాయుధులను చేసి, ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే కాశ్మీర్ ను ఆక్రమించుకోవడానికి చేసిన ఆక్రమణగా దీన్ని భారతదేశం పరిగణిస్తుంది. చరిత్రకారుల్లో కూడా దీనిపై పలు వాదనలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 246.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 247.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 252.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 253.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 254.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 255.
- ↑ 7.0 7.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 261.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 264.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 265.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 266.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 267.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 268.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 269.
- ↑ బిపిన్ et al. 1987, p. 494.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 270.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 271.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 272.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 273.
- ↑ 19.0 19.1 బిపిన్ et al. 1987, p. 495.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 274.
- ↑ రాజ్‌మోహన్ గాంధీ 2006, p. 739.
- ↑ రాజ్‌మోహన్ గాంధీ 2006, p. 740.
- ↑ రాజ్‌మోహన్ గాంధీ 2006, p. 742.
- ↑ రాజ్‌మోహన్ గాంధీ 2006, p. 749.
- ↑ రాజ్‌మోహన్ గాంధీ 2006, p. 751.
- ↑ రాజ్‌మోహన్ గాంధీ 2006, p. 756.
- ↑ 27.0 27.1 27.2 సర్వేపల్లి గోపాల్ 1993, p. 277.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 278.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 279.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 282.
- ↑ 31.0 31.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 280.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 281.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 276.
- ↑ రాజ్‌మోహన్ గాంధీ 2004, p. 182.
- ↑ రాజ్‌మోహన్ గాంధీ 2004, p. 183.
- ↑ రాజ్‌మోహన్ గాంధీ 2004, p. 184.
- ↑ 37.0 37.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 283.
- ↑ రాజ్‌మోహన్ గాంధీ 2006, p. 758.
- ↑ PeaceMongerSoul (2013-01-29), India Pakistan Partition Documentary BBC, retrieved 2017-08-16
- ↑ రామచంద్ర గుహా 2010, p. 14.
- ↑ 41.0 41.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 284.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 292.
- ↑ 43.0 43.1 రామచంద్ర గుహా 2010, p. 15.
- ↑ రామచంద్ర గుహా 2010, p. 5.
- ↑ 45.0 45.1 Sheikh, Majid (13 August 2013). "HARKING BACK: The governor whom Nehru called an 'English Mullah'". Dawn.com. Retrieved 9 November 2018.
- ↑ 46.0 46.1 రామచంద్ర గుహా 2010, p. 17.
- ↑ రాజ్‌మోహన్ గాంధీ 1997, p. 786.
- ↑ రామచంద్ర గుహా 2010, p. 20.
- ↑ నెహ్రూ లేఖలు సంపుటిలో గాంధీ నెహ్రూకి రాసిన ఆఖరు లేఖ
- ↑ రామచంద్ర గుహా 2010, p. 21.
- ↑ రామచంద్ర గుహా 2010, p. 24.
- ↑ 52.0 52.1 52.2 రామచంద్ర గుహా 2010, p. 25.
- ↑ రామచంద్ర గుహా 2010, p. 38.
- ↑ రామచంద్ర గుహా 2010, p. 39.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 258.
- ↑ 56.0 56.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 259.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 260.
- ↑ 58.0 58.1 58.2 సర్వేపల్లి గోపాల్ 1993, p. 286.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 285.
- ↑ 60.0 60.1 రామచంద్ర గుహా 2010, p. 41.
- ↑ 61.0 61.1 రామచంద్ర గుహా 2010, p. 43.
- ↑ రామచంద్ర గుహా 2010, p. 42.
- ↑ 63.0 63.1 రామచంద్ర గుహా 2010, p. 44.
- ↑ 64.0 64.1 రామచంద్ర గుహా 2010, p. 46.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 295.
- ↑ రామచంద్ర గుహా 2010, p. 52.
- ↑ రామచంద్ర గుహా 2010, p. 53.
- ↑ మక్వానా, జయ్ (29 June 2018). "హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?". BBC News తెలుగు. Retrieved 11 November 2018.
- ↑ 69.0 69.1 69.2 69.3 రామచంద్ర గుహా 2010, p. 66.
- ↑ రామచంద్ర గుహా 2010, p. 65.
- ↑ 71.0 71.1 రామచంద్ర గుహా 2010, p. 67.
- ↑ రామచంద్ర గుహా 2010, p. 68.
- ↑ 73.0 73.1 రామచంద్ర గుహా 2010, p. 69.
- ↑ 74.0 74.1 రామచంద్ర గుహా 2010, p. 75.
- ↑ రామచంద్ర గుహా 2010, p. 76.
- ↑ ఆలపాటి, రవీంద్రనాథ్ (September 1991). "ప్రధాని నెహ్రూ ప్రేమలేఖలు". మిసిమి.
- ↑ ఫజల్, రేహాన్ (16 September 2018). "అభిప్రాయం: భారతదేశంలో రాజకీయ నాయకుల ప్రేమలు, పెళ్ళిళ్ళు, వివాహేతర సంబంధాలపై ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడరు. ఎందుకు?". BBC Telugu. Retrieved 18 November 2018.
ఆధార గ్రంథాలు
[మార్చు]- సర్వేపల్లి గోపాల్ (1993). జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్ర. Translated by రామలింగం, డి,. సాహిత్య అకాడెమీ. ISBN 81-7201-212-8.
{{cite book}}
: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: translators list (link) - రామచంద్ర గుహా (2010). గాంధీ అనంతర భారతదేశం. Translated by చక్రపాణి, కాకాని. ఎమెస్కో ప్రచురణలు. ISBN 978-93-80409-25-2.
- రాజ్‌మోహన్ గాంధీ (1997). రాజాజీ జీవిత కథ. Translated by అశోక్, టంకశాల. ఎమెస్కో ప్రచురణలు. ISBN 978-93-85231-30-8తెలుగు అనువాదం 2015లో ప్రచురితం
{{cite book}}
: CS1 maint: postscript (link) - బిపిన్, చంద్ర; మృదులా, ముఖర్జీ; ఆదిత్య, ముఖర్జీ; సుచేతా, మహాజన్; కె.ఎన్., పణిక్కర్ (1987). India's Struggle for Independence. Penguin Books. ISBN 9780140107814.
- రాజ్‌మోహన్ గాంధీ (2006). మోహన్ దాస్:ఒక మనిషీ అతని ప్రజలూ ఒక సామ్రాజ్యపు యథార్థ గాథ. Translated by భాస్కరం, కల్లూరి. ఎమెస్కో ప్రచురణలు. ISBN 978-93-80409-82-5తెలుగు అనువాదం 2011లో ప్రచురితం
{{cite book}}
: CS1 maint: postscript (link)