Jump to content

జగదేకవీరుడు అతిలోకసుందరి

వికీపీడియా నుండి
జగదేకవీరుడు- అతిలోక సుందరి
దర్శకత్వంకె. రాఘవేంద్ర రావు
రచనకె. రాఘవేంద్ర రావు,
జంధ్యాల
నిర్మాతసి. అశ్వినీదత్
తారాగణంచిరంజీవి (రాజు),
శ్రీదేవి (ఇంద్రజ),
ఛాయాగ్రహణంఅజయ్ విన్సెంట్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
మే 9, 1990 (1990-05-09)
భాషతెలుగు

జగదేకవీరుడు అతిలోకసుందరి 1990 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఒక సోషియో ఫాంటసీ చిత్రం. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించాడు. రాఘవేంద్రరావు, జంధ్యాల కలిసి స్క్రీన్ ప్లే రాశారు. చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో అమ్రిష్ పురి, కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, రామిరెడ్డి సహాయ పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందించాడు.

1990 మే 9 నాడు విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.

శ్రీ ఆంజనేయస్వామి భక్తుడైన రాజు (చిరంజీవి) ఒక గైడ్. అనాథ పిల్లలని నలుగురిని తనతో బాటు పెంచుకుంటూ ఉంటాడు. ఆ పిల్లలలో ఒక అమ్మాయికి ఒక ప్రమాదంలో కాలు విరిగిపోతుంది. హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే ఒక మూలికతో ఆ అమ్మాయిని మళ్ళీ నడిచేలా చేయవచ్చని ఒక స్వామి చెప్పటంతో రాజు హిమాలయాలకి బయలుదేరతాడు. ఆ మూలికను సంపాదించి తిరిగి వస్తుండగా, దారి తప్పి మానససరోవరానికి వస్తాడు. స్వర్గలోకాన ఇంద్రుని పుత్రిక అయిన ఇంద్రజ (శ్రీదేవి) భూలోకాన మానససరోవరం అందంగా ఉంటుందని తెలుసుకొని తండ్రి వద్ద అనుమతి తీసుకొని అక్కడకు వస్తుంది. తిరిగి వెళ్ళు సమయంలో స్వర్గలోక ప్రవేశం గావించే ఉంగరాన్ని జారవిడుచుకొంటుంది. దానితో ఆమెకి స్వర్గలోక ద్వారాల వద్దే నిషేధం కలుగుతుంది. రాజు వద్ద తన ఉంగరం ఉందని తెలుసుకొన్న ఇంద్రజ పిల్లల ద్వారా అతనికి చేరువై ఆ ఉంగరాన్ని సంపాదించే ప్రయత్నంతో నిజంగానే అతనిని ప్రేమిస్తుంది. మహాదృష్ట (అమ్రిష్ పురి) అనే దృష్ట మాంత్రికుడు దేవకన్యను బలిస్తే తనకి మరిన్ని శక్తులు వస్తాయని ఇంద్రజని అపహరిస్తాడు. ఇంద్రజ అమాయకత్వానికి, స్వచ్ఛమైన ప్రేమకి ముగ్ధుడైన రాజు మహాదృష్ట నుండి ఆమెను రక్షించటంతో, ఉంగరాన్ని, స్వర్గలోక ప్రవేశాన్ని త్యజించి, మనిషిగా రాజుతోనే జీవించాలని నిర్ణయించుకోవటంతో చిత్రం సుఖాంతమౌతుంది.

తారాగణం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

నిర్మాత అశ్వనీదత్ కు ఎప్పటి నుంచో ఎన్. టి. ఆర్ నటించిన జగదేకవీరుని కథ లాంటి ఫాంటసీ కథాంశంగా చిరంజీవితో సినిమా తీయాలని కోరికగా ఉండేది. అది తనకు బాగా అనుబంధం ఉన్న కె. రాఘవేంద్రరావు అయితే తీయగలడన్న నమ్మకం కూడా ఉండేది. నాగార్జున, శ్రీదేవి కాంబినేషన్లో ఆఖరి పోరాటం తీసిన తర్వాత చిరంజీవితో సినిమా చేద్దామనుకున్నాడు అశ్వనీ దత్.[1]

దేవలోకం లోని ఒక దేవకన్య ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. దాన్ని వెతుక్కుంటూ దేవేంద్రుడు కూతురు ఇంద్రజ భూలోకానికి వస్తుంది. ఈ కథాంశాన్ని చక్రవర్తి అనే రచయిత నిర్మాత అశ్వనీదత్ కు చెప్పాడు. దీని ఆధారంగా కథను రాసిన జంధ్యాల దర్శకుడు రాఘవేంద్రరావు ఇచ్చాడు. తర్వాత ఈ సినిమాకు జంధ్యాల మాటలు కూడా రాశాడు.

కథానాయిక, నాయకుడు కలుసుకునే తొలి సన్నివేశం మొదటగా ఇలా అనుకున్నారు. గాయపడిన పాపకు చికిత్స చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రుడు మీదకి వెళ్ళేందుకు ఒక మిషన్ నిర్వహించాలనుకుంటుంది. అంతరిక్ష నౌకలో చంద్రుడి మీదకి వెళ్ళివచ్చినవారికి కోట్ల డబ్బులు ఇస్తామని చెబుతుంది. పాపకోసం అందుకు ఒప్పుకున్న కథానాయకుడు చంద్రుడి మీదకి వెళతాడు. అక్కడ విహారానికి వచ్చిన ఇంద్రుడి కుమార్తె ఉంగరం పోగోట్టుకొంటుంది. అది కథానాయకుదికి దొరకడంతో దాన్ని వెతుక్కుంటూ ఆమె భూమి మీదికి వస్తుంది. తర్వాత చంద్రుడు, అంతరిక్ష నౌక అంత సహజంగా చిత్రీకరించలేమని భావించిన దర్శకుడు రాఘవేంద్రరావు ఇద్దరూ మానససరోవరంలో కలుసుకునే ఆలోచనను చిరంజీవి స్వయంగా సూచించాడు.[2]

ప్రత్యేకతలు

[మార్చు]
  • ఈ చిత్రం విడుదలకు ముందు రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి.[3] అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకొంది.[4]
  • శాలిని, శామిలి[5] ఇందులో బాలతారలు. శాలిని సఖి ద్వారా కథానాయిక గా పరిచయం అయితే, శామిలి ప్రియురాలు పిలిచిందిలో చిన్న పాత్రని పోషించింది. ఓయ్ సినిమాతో కథానాయికగా పరిచయం అయింది.వారి సోదరుడు రిషికూడా బాలనటుడిగా నటించారు.
  • బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్యాషన్ స్టైలిస్ట్ నీతా లుల్లా ఈ చిత్రానికి దుస్తులు రూపొందించింది.

సంభాషణలు

[మార్చు]
  • ఇంద్రజ: మానవా!
  • రాజు: నువ్వా పిలుపు మానవా?
  • ఈ మానవుని చెంత చేరి, అచ్చిక బుచ్చికలాడి, మచ్చిక చేసుకొని, నా అంగుళీయకము సంపాదించెద.
  • ఇంద్రజ: ఒక్క పర్యాయము నీ వామ హస్తాన్ని నా దక్షిణ హస్తానికి అందించెదవా?
  • ఓరీ, వృద్ధ మానవా!

అల్లు: అమ్మా నా పేరు వృద్ధ మానవా,గడ్డ ముక్కూ గాదు!

  • ఆహా ఎక్కడికో వెళ్లిపోయావు రా మాలోకం!

అవును సర్,హిమాలయాల అంచుల దాకా వెళ్ళాను సర్!

  • మానవా! అధరములు మండి పోవు అగ్ని పుట్టినది!అమృతం లేదా మీ ఇంటా!

ఈ చిత్రంలోని పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని అన్ని పాటలు అత్యంత జనాదరణ పొందినవి.

పాటల రచయిత: వేటూరి సుందర రామమూర్తి

  • మన భారతంలో, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • అందాలలో అహో మహోదయం, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ .జానకి
  • జై చిరంజీవా! జగదేకవీరా! శైలజ బృందం, రచన: వేటూరి సుందర రామమూర్తి
  • యమహో నీ యమా యమా అందం , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,. ఎస్ జానకీ
  • అబ్బనీ తీయనీ దెబ్బ ,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,,కె ఎస్ చిత్ర
  • ప్రియతమా, నను పలకరించు ప్రణయమా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • ధినక్కుతా కసక్కురో , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

పురస్కారాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

చిరంజీవి నటించిన సినిమాల జాబితా

మూలాలు

[మార్చు]
  1. "'జగదేకవీరుడు అతిలోకసుందరి' గురించి నాని చెప్పిన తొలి ముచ్చ‌ట‌". ntnews. 2020-05-06. Retrieved 2021-01-22.
  2. "జగదేకవీరుడు అతిలోకసుందరి అసలు కథ అది కాదట.. ఇంతకీ ఏమిటంటే." News18 Telugu. 2020-05-08. Retrieved 2021-01-22.
  3. Mary, S. B. Vijaya (2020-05-07). "Celebrating 30 years of the Chiranjeevi-Sridevi Telugu blockbuster 'Jagadeka Veerudu Athiloka Sundari'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-01-22.
  4. "Boney Kapoor says 'Jagadeka Veerudu Atiloka Sundari' was a special movie for Sridevi". Deccan Herald (in ఇంగ్లీష్). 2020-05-10. Retrieved 2021-01-22.
  5. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.