Jump to content

చాపెల్-గంగూలీ వివాదం

వికీపీడియా నుండి

2005 చివరలో, 2006 ప్రారంభంలో భారత క్రికెట్ జట్టుకు కొత్తగా నియమించబడిన కోచ్ గ్రెగ్ చాపెల్‌కు కెప్టెన్ సౌరవ్ గంగూలీకీ మధ్య జరిగిన అంతర్గత పోరుకు సంబంధించిన సంఘటనలే చాపెల్-గంగూలీ వివాదం. ఈ వివాదం ఫలితంగా 2005 నవంబరులో గంగూలీని కెప్టెన్‌గా తొలగించి, అతని స్థానంలో వైస్-కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ని కెప్టెనుగా నియమించారు. గంగూలీని వన్‌డే జట్టు నుండి తొలగించారు. 2006 జనవరి చివరిలో గంగూలీని టెస్ట్ జట్టు నుండి కూడా తొలగించారు. ఈ వివాదం గంగూలీ స్వస్థలమైన కోల్‌కతాలోను, స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లోనూ వీధులలో నిరసనలు జరపడం నుండి, భారత పార్లమెంటులో ప్రసంగాల దాకా భారతదేశంలో బలమైన భావోద్వేగాలను రేకెత్తించింది.[1] 2006 చివరిలో చివరికి గంగూలీ స్థానంలో తీసుకున్న ఆటగాళ్ళు ఫామ్ కోల్పోవడంతో అతన్ని రెండు రకాల క్రికెట్‌లలోనూ జట్టులోకి తిరిగి తీసుకున్నారు. 2007 క్రికెట్ ప్రపంచ కప్ భారత జట్టుకు ఎంపికయ్యాడు.

నేపథ్యం

[మార్చు]
సౌరవ్ గంగూలీ

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అప్పటి భారత కోచ్ అయిన జాన్ రైట్ 2004/05 చివరిలో తన పదవి నుండి తప్పుకోవడంతో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్‌ను, కొత్త భారత కోచ్‌గా తీసుకున్నారు. 2004–05 సీజన్‌లో భారతజట్టు బాగా ఆడలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ నుండి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో ఓడిపోయింది, 1969 తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్ ఓడిపోయింది, పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సాధించిన 1-0 ఆధిక్యాన్ని కోల్పోయి, 1-1తో సమం చేసుకుంది, ఆ తర్వాత అదే పాకిస్తాన్‌పై చివరి నాలుగు వన్‌డేలు ఓడిపోయి, వన్‌డే సిరీస్‌ను 4-2తో కోల్పోయింది. అయితే, జాన్ రైట్ పదవీకాలంలో 2003 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఫైనల్స్‌లోకి ప్రవేశించడం, 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో విజయాన్ని పంచుకోవడం, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్‌లలో సుప్రసిద్ధ టెస్టు విజయాలు సాధించడం వంటివి చూసింది. చారిత్రాత్మక విజయాలలో జాన్ రైట్ పాత్ర భారత క్రికెట్‌లో కోచ్ పదవికి ప్రాముఖ్యతను, ప్రతిష్టనూ తెచ్చిపెట్టింది.

గ్రెగ్ చాపెల్, కోచ్ పదవి కోసం డేవ్ వాట్‌మోర్, మొహిందర్ అమర్‌నాథ్, గ్రాహం ఫోర్డ్, డెస్మండ్ హేన్స్, టామ్ మూడీ, జాన్ ఎంబురీలతో పోటీపడి ఎంపికయ్యాడు. తన ప్రత్యర్థులకున్న అనుభవం, కోచింగ్ అనుభవం లేకపోయినా చాపెల్, మీడియాలో ఫేవరెట్‌గా ఎదిగాడు. 2003-04 లో ఆస్ట్రేలియాలో పర్యటించిన సమయంలో చాపెల్ నుండి బ్యాటింగ్ చిట్కాలను తీసుకున్న భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ, అతని అభ్యర్థిత్వానికి మద్దతు నివ్వడం చాపెల్ నియామకం పొందడంలో దోహదపడింది. జాతీయ జట్టులోని ఇతర సీనియర్ సభ్యులను ఈ విషయంపై సంప్రదించకపోయినా, గంగూలీ చాపెల్ పేరును రెండుసార్లు ప్రస్తావించాడు.[2] చాపెల్ త్వరలోనే భారతీయ మీడియా దృష్టికి కేంద్రంగా మారాడు. అతని ప్రాముఖ్యత, ఆధిపత్య వ్యక్తిత్వంతో త్వరలోనే గంగూలీతో గొడవపడటం మొదలుపెట్టాడు. అప్పటికే గంగూలీ విజయవంతమైన, దృఢమైన కెప్టెన్‌గా పేరు సంపాదించాడు.

చాపెల్ నేతృత్వంలో భారతదేశపు మొదటి టోర్నమెంటు 2005లో శ్రీలంకలో జరిగిన ఇండియన్ ఆయిల్ కప్. రాహుల్ ద్రవిడ్ ఆ జట్టుకు సారథ్యం వహించాడు. 2005 ప్రారంభంలో పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అప్పటి కెప్టెన్ గంగూలీని 4 మ్యాచ్‌లకు సస్పెండు చెయ్యడంతో అతని స్థానంలో ద్రవిడ్ ఎంపిక జరిగింది. టోర్నమెంట్‌లో గంగూలీ సస్పెన్షన్, VVS లక్ష్మణ్ తొలగింపుల వల్ల సురేశ్ రైనా, వేణుగోపాల్ రావు వంటి యువ బ్యాట్స్‌మెన్‌లను చాపెల్ పరిచయం చేశాడు. గంగూలీ సస్పెన్షన్ గడువు ముగియడంతో, జింబాబ్వే పర్యటనలో అతన్ని తిరిగి కెప్టెన్‌గా నియమించారు. 2003 చివర్లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాపై 144 పరుగులు చేసిన తర్వాత దాదాపు రెండేళ్లపాటు గంగూలీ టెస్టుల్లో శతకం చేయలేదు. ఆ స్థితిలో అతను సిరీస్‌లోకి తిరిగి ప్రవేశించాడు.

జింబాబ్వే పర్యటన, ఈమెయిలు లీకు

[మార్చు]

జింబాబ్వే పర్యటన ప్రాక్టీసు ఆటతో మొదలైంది. ఈ సమయంలో చాపెల్ గంగూలీని, కెప్టెన్సీ నుండి వైదొలిగి తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని కోరాడు. గంగూలీ బ్యాటింగ్ ఫామ్‌లో క్షీణత అతని ఆటలోని ఇతర రంగాలపై ప్రభావం చూపుతోందని చాపెల్ చెప్పాడు. అయితే గంగూలీ, పర్యటనలో తాను తిరిగి ఫామ్‌ లోకి వస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు.[3]

మొదటి టెస్ట్‌కు ముందు చాపెల్, మ్యాచ్‌కి అత్యుత్తమమైన 11 మందిని ఎంచుకోవాలని, ఆ సంగతి తనకు గనక వదిలేస్తే, గంగూలీ కంటే ముందుగా యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్‌లను ఎంపిక చేస్తానని అతను గంగూలీకి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన గంగూలీ, తన బ్యాగ్‌లను సర్దుకుని పర్యటనను మధ్యలోనే వదిలేసి వెనక్కి పోవాలని నిర్ణయించుకున్నాడు. చాపెల్, ద్రవిడ్‌, జట్టు డైరెక్టరు అమితాబ్ చౌదరిలు అతను జట్టులో కొనసాగాలని పట్టుబట్టారు. పర్యటన మధ్యలో కెప్టెన్ జట్టును విడిచిపెడితే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పారు. మ్యాచ్‌లో గంగూలీ గాయపడినట్టు నటించాడని పుకార్లు వెలువడడంతో, అతను దాన్ని ఖండిస్తూ మీడియాతో వ్యాఖ్యలు చేశాడు. జట్టు మేనేజ్‌మెంట్ సభ్యులే తనను కెప్టెన్‌ పదవికి రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించాడు. అయితే వారెవరో అతను చెప్పలేదు.[4] టెస్టుకు ముందు వైదొలగాలని తనను అడగడంతో ఈ ఇన్నింగ్స్‌లో ఆడేందుకు మరింత పట్టుదల కలిగిందని అతను పేర్కొన్నాడు.

కొన్ని రోజుల తర్వాత చాపెల్ రాజీనామా చేస్తానని బెదిరించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, చాపెల్ ఈ నివేదికలను తోసిపుచ్చాడు, "నేను రాజీనామా చేస్తానని బెదిరించనూ లేదు. నాకా ఉద్దేశమూ లేదు" అని చెప్పాడు. గంగూలీతో జరిగిన ప్రైవేట్ చర్చ "బులవాయో టెస్ట్ మ్యాచ్‌లో బాగా ఆడేందుకు అతన్ని ఉత్తేజపరచే లక్ష్యంతో చేసాను" అని అతను ఒక ప్రకటన చదివాడు. తనకు, గంగూలీకీ మధ్య "చాలా కాలం నుండి బలమైన పరస్పర గౌరవం" ఉందని కూడా అతను చెప్పాడు.[5] డ్రెస్సింగ్ రూమ్ చర్చ ప్రైవేట్‌గా ఉండాల్సిందని టెండూల్కర్ ఈ అంశంపై వ్యాఖ్యానించారు.[6]

తర్వాత పర్యటన సమయంలో, చాపెల్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకు ఒక ఈమెయిలు పంపాడు. అందులో, గంగూలీ జట్టును నడిపించడానికి "మానసికంగానూ, శారీరకంగానూ సరిపోడని" విమర్శించాడు. గంగూలీ "నెగటివ్ వైఖరి" 2007 ప్రపంచ కప్ కోసం భారతజట్టు ఏకోన్ముఖంగా అభివృద్ధి చెందడంలో ఆటంకం కలిగిస్తుందనీ, గంగూలీకి తగిలిన గాయాలు "ఊహాత్మకమైనవి" అనీ చాపెల్ అందులో రాసాడు. గంగూలీ కెప్టెన్సీని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని, అతను "తన సహచరుల విశ్వాసాన్ని, గౌరవాన్నీ కోల్పోయాడని" అతను ఆరోపించాడు. [7] ఈ ఈమెయిలు లీకైంది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత గంగూలీ చాపెల్ ఇద్దరినీ ముంబైలో BCCI బోర్డు సమావేశానికి పిలిచారు. [8] సమావేశానికి ముందు గంగూలీ, కోల్‌కతాకు చెందిన ఒక వార్తాపత్రికతో మాట్లాడుతూ, “బోర్డుకి నేను చెప్పాలనుకున్నది చెబుతాను. బోర్డు నాకు వివరించడానికి అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నాను. సంధి జరిగిన కొన్ని గంటల్లోనే వెళ్లి అలాంటి ఈమెయిలు వ్రాసే వ్యక్తి ఎలాంటివాడో మీరు ఊహించుకోవచ్చు." అన్నాడు. [9] బోర్డు సమావేశం ముగింపులో, "భారత క్రికెట్ ఉత్తమ ప్రయోజనాల" కోసం ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. [10]

ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత చాపెల్‌పై బహిరంగంగా దాడి చేస్తూ, గంగూలీని సమర్థించడంతో అతనిపై క్రికెట్ అధికారులు ఆగ్రహం చెందడంతో జట్టులో అసమ్మతి బహిరంగమైంది. [11] చాపెల్ "ద్వంద్వ ప్రమాణాలను" ఉపయోగించాడనీ, జట్టులో "భయాన్ని, అభద్రతనూ" నింపాడని హర్భజన్ పేర్కొన్నాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అతని వివరణ కోరింది.[12] అతను క్షమాపణ చెప్పడంతో అతనికి శిక్ష విధించలేదు. [13] ఈ సమయంలో భారత జట్టులోని పలువురు సభ్యులు గంగూలీకి మద్దతు పలికారు. కొన్ని వార్తాపత్రికల ప్రకారం, చాపెల్ వ్యవహారశైలి పట్ల వారు అసంతృప్తిగా ఉన్నారు. [14] దీంతో జట్టు సభ్యులపై నోరు విప్పవద్దనే ఆదేశాలు విధించారు. [15]

వన్డేలకు దూరం చేసారు

[మార్చు]

2005 అక్టోబరులో గంగూలీ గాయంతో బాధపడ్డాడు. దీంతో అతను శ్రీలంకతో జరిగిన ఏడు మ్యాచ్‌ల వన్‌డే సిరీస్‌లో మొదటి నాలుగు వన్‌డేలకు అందుబాటులో ఉండలేకపోయాడు. దీంతో గంగూలీని భారత కెప్టెన్‌గా కొనసాగిస్తారా లేదా అనేదానిపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది. అతని స్థానంలో ద్రావిడ్‌ను నియమించారు. జట్టు సిరీస్‌లో 4-0 ఆధిక్యం సాధించిన తర్వాత, చివరి మూడు మ్యాచ్‌ల కోసం జట్టు కూర్పును సమీక్షించారు. జట్టులో కొన్ని మార్పులు చేసినప్పటికీ, గంగూలీని పట్టించుకోలేదు. మిగిలిన సిరీస్‌లో కూడా జట్టుకు ద్రవిడే నాయకత్వం వహించాడు. భారతదేశం 6-1తో సిరీస్ గెలుచుకుంది. ఆ తరువాత దక్షిణాఫ్రికాతో జరిగిన వన్‌డే సిరీస్‌కు గంగూలీని మళ్లీ తొలగించారు.

దక్షిణాఫ్రికా సిరీస్‌లో మూడో వన్డే కోసం భారత జట్టు కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌కు చేరుకున్నప్పుడు, కోపంతో ఉన్న అక్కడి ప్రజలు చాపెల్‌కు వ్యతిరేకంగా, గంగూలీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ బ్యానర్‌లు ఊపి జట్టు బస్సుకు స్వాగతం పలికారు. బస్సు నుండి నిరసనకారులకు మధ్య వేలును చూపించిన దృశ్యాన్ని కెమెరాలు బంధించాయి. అది చేసినది ఛాపెలేనని అన్నారు. ఈ మ్యాచ్‌లో పది వికెట్ల విజయం సాధించిన దక్షిణాఫ్రికాకు ప్రేక్షకులు జేజేలు కొడుతూ, భారత బ్యాట్స్‌మెన్‌లను గేలి చేసారు.

జట్టులో స్థానం కోసం గంగూలీకి పోటీగా ఉన్న యువరాజ్ సింగ్.

శ్రీలంకతో తదుపరి టెస్ట్ సిరీస్ కోసం జట్టును ప్రకటించినప్పుడు, బౌలరు జహీర్ ఖాన్ ను తీసేసి గంగూలీని చేర్చారు. ఆ సమయంలో, BCCI సెలెక్టర్ల ఛైర్మన్ కిరణ్ మోరే గంగూలీ టెస్టు బౌలింగ్ సగటు 50 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, గంగూలీని "బ్యాటింగ్ ఆల్ రౌండర్ "గా చేర్చడాన్ని సమర్థించాడు. ఈ ప్రకటనతో కెప్టెన్సీ సమస్య కూడా పరిష్కారమైంది. ద్రావిడ్‌ను కెప్టెన్‌గాను, వీరేంద్ర సెహ్వాగ్‌ను వైస్ కెప్టెను గానూ నియమించారు.

టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు, జాతీయ సెలక్షన్ ప్యానెల్‌ నుండి తీసేసిన యశ్‌పాల్ శర్మ, చాపెల్ తన చిత్తశుద్ధిని ప్రశ్నించాడని, జట్టు ఎంపికలో జోక్యం చేసుకున్నాడనీ ఆరోపించాడు.[16] దాని తరువాత చాపెల్, గంగూలీతో తన వాగ్వాదాన్ని "బాగా పెద్దది చేసారు" అని వ్యాఖ్యానించాడు. ఇంకా, "యశ్‌పాల్, తాను కోరుకున్న ఉద్యోగాన్ని కోల్పోయినందుకు నిరాశ చెందాడన్నది స్పష్టం. తన ఉద్యోగ పోవడంలో నా పాత్ర ఏమీ లేదు. కాకపోతే అతను తన కక్షను ఎవరో ఒకరి మీద తీర్చుకోవాలి గదా" అని కూడా అన్నాడు. [17]

చెన్నైలో జరిగిన మొదటి టెస్టుకు ముందు, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్‌ను మిడిల్ ఆర్డర్‌లో గంగూలీ స్థానంలో తీసుకుంటారా అనే దానిపై చర్చ జరిగింది. వర్షంతో ప్రభావితమైన ఆ మ్యాచ్‌లో గంగూలీని కొనసాగించారు, కానీ ఎక్కువ స్కోరు చేయలేదు. సెహ్వాగ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో, ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన రెండో టెస్టులో యువరాజ్, గంగూలీ ఇద్దరినీ తీసుకున్నారు. టెస్టులో గంగూలీ 39, 40 పరుగులు చేయగా, యువరాజ్ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 75 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని నిర్దేశించాడు. టెస్టు ముగిశాక, గంగూలీని జట్టు నుండి తొలగించినట్లు మోరే ప్రకటించాడు.

జట్టు నుంచి తొలగించిన తర్వాత గంగూలీ ఏడ్చినట్లు సమాచారం.[18] అతన్ని తొలగించాలనే నిర్ణయంతో, అతని పట్ల సానుభూతి ఏర్పడి, ఫలితంగా కలకత్తాలో వీధి నిరసనలు జరిగాయి. బెంగాల్‌లో రైలు రవాణాను దిగ్బంధించడంతో సహా సంస్థలు, రాజకీయ నాయకులు అనేక నిరసనలు జరిపారు. లోక్‌సభలో సభ్యులు గంగూలీ సమస్యను చర్చించారు.

వన్‌డే, టెస్ట్ జట్ల నుండి తొలగించబడినప్పటికీ, 2006 డిసెంబరు చివరిలో, గంగూలీ తన A-గ్రేడ్ BCCI కాంట్రాక్ట్‌ను కొనసాగించాడు. అయితే అతని స్థానంలో వచ్చి టెస్ట్ జట్టులోను, వన్‌డే జట్టులోనూ స్థిరపడిన యువరాజ్, కైఫ్‌లు B-గ్రేడ్ ఒప్పందం లోనే కొనసాగారు.

పాకిస్థాన్ పర్యటన

[మార్చు]
ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ (చిత్రం) తొలగించి, గంగూలీని తీసుకున్నారు.

2006 జనవరిలో పాకిస్థాన్‌లో పర్యటించేందుకు జట్టును ప్రకటించడంతో, గంగూలీని మళ్లీ టెస్టు జట్టులోకి పిలిపించి, కైఫ్‌ని తొలగించారు. లాహోర్‌లో జరిగిన మొదటి టెస్ట్‌కి ముందు యువరాజ్ వరుసగా అర్ధ సెంచరీలు నమోదు చేయడంతో, గంగూలీ జట్టుకు దూరంగా ఉన్నట్లే అనిపించింది. టెస్ట్ ప్రారంభానికి ముందు స్టేడియం మధ్యలో చాపెల్, ద్రవిడ్‌లతో జరిగిన చర్చ తర్వాత (పరిశీలకులు ఆ చర్చ వేదిగా జరిగినట్లు భావించారు), స్పెషలిస్ట్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ను తీసేసి, గంగూలీని జట్టులోకి తీసుకున్నారు. అతనికి చోటు కల్పించడం కోసం డ్రావిడ్‌, సెహ్వాగ్‌తో పాటు తాత్కాలిక ఓపెనరుగా ఆడవలసి వచ్చింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ మీద, పాకిస్థాన్ 679/7 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ద్రావిడ్, సెహ్వాగ్ 410 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంతో ప్రతిస్పందించారు. అది, 1956లో వినూ మన్కడ్, పంకజ్ రాయ్ లు నెలకొల్పిన ప్రపంచ టెస్ట్ రికార్డుకు మూడు పరుగులే తక్కువ. సెహ్వాగ్ ఔట్ అయిన తర్వాత, వెలుతురు తక్కువగా ఉన్నందున మ్యాచ్ ముగిసింది. దీంతో గంగూలీకి బ్యాటింగు చేసే అవకాశం దక్కలేదు.

ఫైసలాబాద్‌లో రెండో టెస్టులో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ కారణంగా, భారత జట్టులో అదనపు బౌలర్‌ని తీసుకోవడంతో గంగూలీని తొలగించారు. ద్రవిడ్ మళ్ళీ తాత్కాలిక ఓపెనర్‌గా కొనసాగాడు. ఫైసలాబాద్ టెస్ట్ మరో అత్యధిక స్కోరింగ్ డ్రాగా ముగిసిన తర్వాత, మూడో టెస్ట్ కరాచీలో బౌలర్లకు అనుకూలంగా ఉండే వికెట్‌పై జరిగింది. ఆరుగురు బ్యాట్స్‌మన్లు అవసరం కావడంతో, స్పెషలిస్ట్ ఓపెనరు గంభీర్‌కు బదులుగా గంగూలీని తీసుకున్నారు. ఈ పాత్రలో వరుసగా సెంచరీలు సాధించిన ద్రవిడ్‌నే తాత్కాలిక ఓపెనర్‌గా కొనసాగించాలని భారత్ నిర్ణయించుకుంది. కానీ ద్రవిడ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒక అంకె దాటలేకపోయాడు. భారత బ్యాట్స్‌మెన్‌లు సీమింగ్ పరిస్థితులను తట్టుకోలేక ఆ టెస్టును సిరీస్‌నూ 1-0తో కోల్పోయారు. యువరాజ్ సెంచరీతో అత్యధిక స్కోరు సాధించగా, గంగూలీ 34, 37 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రాష్ స్ట్రోక్‌లకు ఔటయ్యాడు. టెస్టు జట్టులో గంగూలీకి చోటు కల్పించిన ద్రావిడ్ ఓపెనింగ్ ప్రయోగం లోని సమర్థతను విమర్శకులు ప్రశ్నించారు.

యువరాజ్ తదుపరి వన్‌డే సిరీస్‌లో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఒక శతకంతో, 100 కంటే ఎక్కువ సగటుతో వరుసగా రెండవ వన్‌డే సిరీస్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. గంగూలీని వన్‌డే జట్టులోకి తీసుకోలేదు. వన్‌డే జట్టు 4-1 ఫలితంతో తన గత విజయాన్ని కొనసాగించింది.

ఇంగ్లండ్ సిరీస్

[మార్చు]

2006 మార్చిలో ఇంగ్లాండ్‌, భారత పర్యటనకు వచ్చినపుడు యువరాజ్‌కు గాయం కారణంగా నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్టుకు అతను దూరమయ్యాడు. దాంతో గంగూలీ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువయ్యాయి. గంగూలీని జట్టులోకి తీసుకురావాలని యువరాజ్ బహిరంగంగా మద్దతు ఇచ్చినప్పటికీ, సెలెక్టర్లు గంగూలీని జట్టు నుండి పూర్తిగా తొలగించారు. కైఫ్‌ను తిరిగి తీసుకున్నారు. స్పెషలిస్టు వన్‌డే బ్యాట్స్‌మెన్ సురేష్ రైనాను అతని మొదటి టెస్ట్ సిరీస్‌కి ఎంపిక చేశారు. యువరాజ్ గాయం నుండి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత, అతన్ని కైఫ్ స్థానంలో మిడిల్ ఆర్డర్‌లో తీసుకున్నారు. పాకిస్తాన్‌ను ఓడించిన జట్టు కూర్పును అలాగే ఉంచాలని సెలక్టర్లు పట్టుదలతో ఉన్నందున, గంగూలీని వన్‌డే సిరీస్‌కు మళ్లీ పట్టించుకోలేదు. జట్టు ఇంగ్లండ్‌పై 5-1తో సమగ్ర విజయం సాధించింది.

వెస్టిండీస్ పర్యటన

[మార్చు]

సచిన్ టెండూల్కర్ గాయపడినప్పటికీ, టెస్ట్ జట్టును ప్రకటించినప్పుడు గంగూలీని మళ్లీ పట్టించుకోలేదు. BCCI దృష్టిలో అతను అగ్రశ్రేణి ఎనిమిది మంది టెస్టు బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో లేకుండా పోయినట్లైంది. ద్రావిడ్ నియామకం నాటి నుండి 17 విజయాలు, ఐదు ఓటములను నమోదు చేసిన జట్టునే సెలక్టర్లు కొనసాగించి గంగూలీని వన్‌డే జట్టులోకి తీసుకోలేదు. జూలైలో సీజన్ ముగింపులో జట్టు భారతదేశానికి తిరిగి రావడంతో, గంగూలీ ఐదు నెలల పాటు రెండు రకాల ఆటలలోనూ జట్టుకు దూరంగా ఉన్నాడు.

దక్షిణాఫ్రికా పర్యటన

[మార్చు]

2006 ICC ఛాంపియన్స్ ట్రోఫీ లో పేలవమైన ప్రదర్శన, [19] దక్షిణాఫ్రికాలో జరిగిన వన్‌డే సిరీస్‌ను 4-0తో కోల్పోయిన తరువాత [20] గంగూలీని టెస్టు జట్టులోకి తిరిగి తీసుకున్నారు. [21] వసీం జాఫర్, జహీర్ ఖాన్, అనిల్ కుంబ్లే లు కూడా పేలవమైన ప్రదర్శనలు చేసినప్పటికీ, అంతకుముందు వన్డే జట్టుకు ఎంపికయ్యారు. [22] మిగతా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు స్కోరు 37/4 వద్ద ఉన్నప్పుడు వచ్చిన గంగూలీ, 87 పరుగులు చేయడంతో భారత్ ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది. [23] ఆ మ్యాచ్‌లో గంగూలీ, తన బ్యాటింగ్ శైలిని మార్చుకుని మిడిల్-స్టంప్ గార్డ్‌ను తీసుకున్నాడు.[24] జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాకు వ్యతిరేకంగా అతని పునరాగమనం తర్వాత ఆడిన మొదటి టెస్టు ఇన్నింగ్స్‌లో అతని స్కోరు (51) భారత్‌కు విజయాన్ని అందించింది. ఇది దక్షిణాఫ్రికాలో భారత జట్టుకు మొదటి టెస్ట్ మ్యాచ్ గెలుపు [25] [26] భారత్ ఆ సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, స్కోరింగ్ చార్ట్‌లో గంగూలీ అత్యధిక పరుగులు చేశాడు. [27] టెస్టుల్లో విజయవంతంగా తిరిగి వచ్చాక, అతన్ని వన్‌డే జట్టుకు కూడా తిరిగి తీసుకున్నారు. భారతదేశం వెస్టిండీస్ [28] శ్రీలంక [29] లకు వన్‌డే టోర్నమెంట్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. దాదాపు రెండు సంవత్సరాల తరవాత ఆడిన తన మొదటి వన్‌డే ఇన్నింగ్స్‌లో గంగూలీ, [30] 98 పరుగులు చేసి, జట్టును గెలిపించాడు. [31]

వన్డేల్లో గంగూలీ పునరాగమనం

[మార్చు]

దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో గంగూలీ, బ్యాటింగులో అగ్రస్థానంలో నిలిచిన తర్వాత, వెస్టిండీస్‌తో జరిగిన వన్‌డే సిరీస్‌కు, ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్‌కూ అతన్ని తిరిగి తీసుకున్నారు. అతను ఆ రెండు సిరీస్‌లలో దాదాపు 70 సగటుతో మంచి ప్రదర్శన కనబరిచాడు.[30] శ్రీలంకపై మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. [32]

2007 ప్రపంచకప్ పరాజయం

[మార్చు]

2007 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల నుండి భారత జట్టు ముందుగానే నిష్క్రమించడంతో, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, గ్రెగ్ చాపెల్ చుట్టూ ఉన్న వివాదాలు, ఉద్రిక్తతలు మొదలైనవన్నీ ముగిసాయి. రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో గంగూలీ జట్టులో భాగంగా ఎంపికయ్యాడు. టోర్నమెంటును గెలవడానికి ఫేవరెట్‌లలో భారతదేశం కూడా ఒకటి. అయితే భారత జట్టుతో గ్రెగ్ చాపెల్ కొనసాగడాన్నీ, అతని కోచింగ్ పద్ధతుల విశ్వసనీయతనూ ప్రపంచ కప్‌లో భారత ప్రదర్శన నిర్ణయిస్తుందని సీనియర్ BCCI అధికారులు అభిప్రాయపడ్డారు.

తొలి గ్రూప్ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్‌తో ఘోర పరాజయం పాలైంది. సౌరవ్ గంగూలీ అత్యధికంగా 66 పరుగులు చేసినప్పటికీ, అతను మందకొడిగా స్కోరు చేయడంపై విమర్శలు వచ్చాయి. భారత బ్యాట్స్‌మెన్‌లు తమ రెండో మ్యాచ్‌లో కొత్తగా వచ్చిన బెర్ముడాపై సులువుగా విజయం సాధించడానికి 400 కంటే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ, గంగూలీ 87 పరుగులు చేసినప్పటికీ, ఇప్పటికీ జట్టు నాయకత్వాన్ని, ఆటగాళ్లనూ తీవ్రంగా విమర్శించింది. ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడిన భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది. శ్రీలంక 250 పరుగులకు పైగా చేసి, భారత బ్యాటింగ్ ఆర్డర్‌కు సవాలు విసిరింది. భారత జట్టు నాటకీయంగా విఫలమైంది. బంగ్లాదేశ్ తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో బెర్ముడాపై విజయాన్ని సాధించే వరకు అధికారికంగా కానప్పటికీ, భారత ప్రపంచ కప్ ఆట శ్రీలంకతో ఓటమి తోనే ముగిసింది.

విమర్శలు, ప్రజల ఆగ్రహం, BCCI నుండి మద్దతు లేకపోవడం వగైరాలతో గ్రెగ్ చాపెల్, భారత కోచ్ పదవికి రాజీనామా చేశాడు. చాలా చర్చల తర్వాత, BCCI 2007 వేసవికి భారత కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. అయితే ప్రస్తుతానికి ప్రముఖులను కోచ్‌గా నియమించకూడదని నిర్ణయించుకుంది. భారత మాజీ ఆటగాళ్ళు వెంకటేష్ ప్రసాద్, రాబిన్ సింగ్ లను స్పెషలిస్టు బౌలింగు, ఫీల్డింగు కోచ్‌లుగా నియమించారు. భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రిని తాత్కాలికంగా బంగ్లాదేశ్ పర్యటనలో కోచ్-కమ్-మేనేజర్‌గా నియమించారు. శాస్త్రి తర్వాత చందూ బోర్డేను భారత ఇంగ్లండ్ పర్యటనకు మేనేజర్‌గా నియమించారు.

అనంతర పరిణామాలు

[మార్చు]

2007లో గంగూలీ టెస్టుల్లో, వన్‌డేల్లో రాణించాడు. ఆ సంవత్సరం అతను 61.44 సగటుతో 1106 టెస్టు పరుగులు చేశాడు (మూడు శతకాలు, నాలుగు అర్ధశతకాలతో). జాక్వెస్ కలిస్ తర్వాత ఆ సంవత్సరంలో టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.[33] 2007లో వన్‌డేలలో 44.28 సగటుతో 1240 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళలో ఐదవ స్థానంలో నిలిచాడు.[34] 2008లో గంగూలీ అధికారికంగా పదవీ విరమణ చేశాడు. 2008లో, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ గ్యారీ కిర్‌స్టెన్, జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. కిర్‌స్టన్ మెంటల్ కోచ్‌గా ప్యాడీ ఆప్టన్‌ని తీసుకువచ్చారు. ప్రసాద్, సింగ్‌లు వారి నైపుణ్య కోచ్‌ల పదవులను నిలుపుకున్నారు.

2007 నవంబరులో చాపెల్, 2007 జనవరిలో భువనేశ్వర్ విమానాశ్రయంలో తనపై "జాత్యహంకార దాడి" జరిగిందని ఆరోపించాడు. ఒక అభిమాని తనను చెవి వెనుక "కొట్టాడని" BCCI ఈ సమస్యను కప్పిపుచ్చిందనీ ఆరోపించాడు. “నేను బీసీసీఐకి ఒక లేఖలో చెప్పినట్లుగా, అద్ఫే దాడి ఆటగాళ్లలో ఎవరిపైనైనా జరిగి ఉంటే దాన్ని ఖండనలు వెల్లువెత్తేవి. కానీ అది నాపై జరిగింది కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. నేను జాత్యహంకార వ్యాఖ్యలు చేసానని, అందుకే ఆ దాడి జరిగిందనీ నాకు తిరుగు సమాధానం వచ్చింది." అని అంటూ ఇంకా ఇలా అన్నాడు, "దాన్ని దాచే ప్రయత్నం చేసారు. అందరూ దాచి పెట్టే ప్రయత్నం చేసారు. అది తీవ్రమైన దాడి అనేది చాలా స్పష్టం. మీడియాను నమ్మించినట్లుగా అది కేవలం నెట్టడం కాదు. ఆ మొత్తం వ్యవహారాన్ని చాలా చిన్నది చేసి చూపారు. BCCI నుండి నాకు వచ్చిన ఏకైక ఫోన్ కాల్‌లో వాళ్ళు అసలది నిజంగానే జరిగిందా అని అడిగారు." [35] దీనిపై బీసీసీఐ సెక్రటరీ నిరంజన్ షా క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడుతూ, “దీనిని జాత్యహంకారం అనడానికి వీల్లేదు. మరే ఇతర భారతీయ ఆటగాడితోనైనా మేము ఎలా వ్యవహరిస్తామో అలాగే ఈ సమస్యతోనూ వ్యవహరించాం. నేను అతనికి ఫోన్ చేసి సమస్య తెలుసుకున్నట్లు గుర్తు. మేము భద్రతను కూడా పెంచి, తగిన రక్షణను కలిగించాం. స్థానిక పోలీసులు కూడా మాకు సహాయం అందించారు. తదనంతర కాలంలో ఆ చాపెల్, ఆ సంఘటనను తక్కువ చేస్తూ, తన వ్యాఖ్యలు "భావోద్వేగ సమయంలో" చేసానని చెప్పాడు. [36]

స్పందనలు

[మార్చు]

2014 నవంబరులో తన ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వేలో టెండూల్కర్, చాపెల్‌ను విమర్శిస్తూ, "ఆటగాళ్ళు సౌకర్యంగా ఉన్నారా లేదా అనేదాని గురించి పట్టింపే లేకుండా వారిపై తన ఆలోచనలను రుద్దిన రింగ్‌మాస్టర్" అని వర్ణించాడు. సౌరవ్ పట్ల అతని వైఖరి ఆశ్చర్యం కలిగించిందని అతను అన్నాడు. సౌరవ్ వల్ల తనకు ఉద్యోగం వచ్చి ఉండవచ్చని చాపెల్ చెప్పాడు. అయితే దానర్థం తాను జీవితాంతం సౌరవ్‌కు ఉపకారం చేయబోతున్నానని కాదు. వాస్తవానికి, భారతదేశం సృష్టించిన అత్యుత్తమ క్రికెటర్లలో సౌరవ్ ఒకడు. జట్టులో భాగం కావడానికి అతనికి చాపెల్ సహాయమేమీ అక్కర్లేదు". 2007 ప్రపంచ కప్‌కు కొన్ని నెలల ముందు ఛాపెల్, టెండూల్కర్ ఇంటికి వచ్చి, "మనిద్దరం కలిస్తే, భారత క్రికెట్‌ను కొన్నేళ్ళ పాటు నియంత్రించగలం" అంటూ భారత కెప్టెన్సీని తీసుకోవాలని తనను కోరాడని టెండూల్కర్ ఆరోపించాడు. [37]

టెండూల్కర్ ఆరోపణలను జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, VVS లక్ష్మణ్ వంటి మాజీ సహచరులు సమర్థించారు. జహీర్, చాపెల్‌కు "కంట్రోలు చెయ్యడమంటే పిచ్చి" అని చెబుతూ, "అతను భారత జట్టుకు కోచ్‌గా నియమితుడైన తర్వాత ఒకసారి నాతో, "జహీర్, నేను కోచ్‌గా ఉండే వరకు నువ్వు భారతదేశానికి ఆడలేవు అన్నాడు" అని చెప్పాడు. అతను చాపెల్ ఆధ్వర్యంలోని రెండు సంవత్సరాల పదవీకాలం "అత్యంత అధ్వాన్నమైన, చీకటి దశ" అని కూడా చెప్పాడు. హర్భజన్ మాట్లాడుతూ, "చాపెల్ భారత క్రికెట్‌ను ఎంతగా నాశనం చేసాడంటే, అది మళ్లీ ఊపు లోకి రావడానికి కనీసం 3 సంవత్సరాలు పట్టింది. అన్నిటికంటే చెత్త సంగతి ఏమిటంటే, ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్ళు, కోచ్‌ను కాకా పట్టేందుకు అతనికి చాడీలు చెప్పి చీలికలను పెద్దది చేసేందుకు సహకరించడం".

అతను ఈమెయిలు లీక్ గురించి కూడా మాట్లాడాడు, "ఓ పక్క సౌరవ్ మైదానంలో బ్యాటింగ్ చేస్తూంటే ఈ వ్యక్తి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని సౌరవ్‌కి వ్యతిరేకంగా ఈమెయిలు‌ను టైప్ చేస్తున్నాడు. మ్యాచ్‌పై అతనికి ఆసక్తి లేదు. అతను వదిలించుకోవాలనుకున్న ఆటగాళ్ళు ఏడుగురు. సౌరవ్ అతని ప్రధాన లక్ష్యం కాగా మిగతావాళ్ళు నేను, వీరేంద్ర సెహ్వాగ్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్". తన కోచింగ్ పదవీ కాలంలో చాపెల్ భారత క్రికెట్‌ను "వెనుకకు" తీసుకెళ్లాడని లక్ష్మణ్, చాపెల్‌ను విమర్శించాడు. 2006లో జరిగిన ఒక సంఘటనను కూడా లక్ష్మణ్ గుర్తుచేసుకున్నాడు, "ఇది 2006లో వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్‌తో ఆడుతున్నప్పుడు జరిగింది. నాకంటే ముందుగా యువరాజ్ సింగ్ ఎంపికయ్యాడు. మేము ఆ తర్వాత నాలుగు టెస్టుల సిరీస్ కోసం వెస్టిండీస్‌కు వెళ్ళాల్సి ఉంది. నువ్వు ఓపెనింగ్ చేస్తావా అని అతను నన్ను అడిగాడు. మొదటి నాలుగు సంవత్సరాలలో ఓపెనింగు స్థానంలో సరిగా ఆడలేకపోయినందున ఇకపై ఆ స్థానంలో ఆడకూడదని 2000 లోనే నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా ఆడుతున్నాను అని అతనికి చెప్పాను. చాపెల్ నన్ను, నా వయసెంత అని అడిగి, 'ఇంట్లో కూర్చోవడానికి 31 చాలా చిన్న వయస్సు అనిపించడం లేదా నీకు?' అని అన్నాడు. ఇది విని నేను విస్తుపోయాను. అతని ఆధ్వర్యంలో నేను చాలా బాగా ఆడాను. అతని కింద అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాణ్ణి నేను." [38] [39]

2015లో, మొహమ్మద్ కైఫ్ ఇలా అన్నాడు, "చాపెల్ నా ఫీల్డింగ్ టెక్నిక్‌ని ప్రశ్నించాడు. అది నన్ను చాలా గందరగోళానికి గురిచేసింది. తరువాతి గేమ్‌లోనే నేను క్యాచ్‌ పట్టుకోలేకపోయాను. చాపెల్, ఆటగాళ్ళు తమ ప్రదర్శనలపై దృష్టి పెట్టకుండా ఒకరినొకరు తిట్టుకునే వాతావరణాన్ని సృష్టించాడు." [40] 2017లో, రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ఆశిష్ నెహ్రా ఇలా గుర్తుచేసుకున్నాడు, "గ్రెగ్ చాపెల్ కోచ్‌గా ఉండగా 2005లో రెండు సిరీస్‌లలో తప్పించి నేను ఆడలేదు. గ్రెగ్‌ ఉంటే బిర్యానీ, ఖిచ్డీగా మారుతుందని నాకు తెలుసు." [41]

చాపెల్ ఈమెయిలు గురించి గంగూలీకి తెలియజేసినది తానేనని వీరేంద్ర సెహ్వాగ్ 2018 లో వెల్లడించాడు. [42] అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో సెహ్వాగ్ ఇలా పేర్కొన్నాడు, "చాపెల్‌తో సమస్య ఏమిటంటే, మీరు అతనితో ఏమి చెప్పినా, అది వెంటనే మీడియాకూ, సెలెక్టర్లకూ చేరిపోతుంది. అతను అలా మాట్లాడి, పరస్పర నమ్మకాన్ని దెబ్బతీశాడు. నేను అతనితో సౌఖ్యంగా లేను." [43] మరొక ఇంటర్వ్యూలో సెహ్వాగ్, చాపెల్‌కు వ్యక్తులతో వ్యవహరించే నైపుణ్యాలు "పూర్తిగా శూన్యం" అని పేర్కొన్నాడు.[44] 2020 జూన్‌లో హర్భజన్ సింగ్ ఆకాష్ చోప్రాతో మాట్లాడుతూ, గ్రెగ్ చాపెల్‌ది విభజించి పాలించే విధానం అని అన్నాడు. "2007 వన్‌డే వరల్డ్ కప్ నా కెరీర్‌లో అత్యంత నిమ్న స్థాయి. మనకది చాలా కష్టతరమైన సమయం అని నేను భావిస్తాను. భారతదేశం కోసం ఆడటానికి అది సరైన సమయం కాదని కూడా నేను అనుకున్నాను. తప్పు వ్యక్తులు భారత క్రికెట్‌లో అధికారంలో ఉన్నారు. గ్రెగ్ చాపెల్ ఎవరసలు, అతను ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. విభజించి పాలించే విధానంలో అతను పనులు చేసేవాడు" [45]

మూలాలు

[మార్చు]
  1. "ExpressIndia Report on Loksabha Discussions". Archived from the original on 6 February 2006. Retrieved 2007-03-06.
  2. "Ganguly bats for Greg Chappell". ESPNcricinfo. Retrieved 3 November 2014.
  3. "The Ganguly-Chappell monitor". ESNcricinfo. Retrieved 3 November 2014.
  4. Cricinfo – 'I was asked to step down as captain' – Ganguly
  5. "Ganguly and Chappell patch things up on eve of Test". ESNcricinfo. Retrieved 4 November 2014.
  6. "Tendulkar: dressing-room chat should stay just that". ESPNcricinfo. Retrieved 4 November 2014.
  7. "Chappell questions Ganguly's attitude". ESPNcricinfo. Retrieved 3 November 2014.
  8. Cricinfo – India awaits judgment day
  9. "Chappell Wants Captain Ganguly Out or Else..." Arab News. Retrieved 4 November 2014.
  10. Cricinfo – Chappell and Ganguly both stay
  11. "Harbhajan comes to Ganguly's defense". ESPNcricinfo. 25 September 2005. Retrieved 2007-02-07.
  12. "Harbhajan asked to appear before Punjab board". ESPNcricinfo. 27 September 2005. Retrieved 2007-02-07.
  13. "Harbhajan escapes rap for comments". ESPNcricinfo. 29 September 2005. Retrieved 2007-02-07.
  14. "Players back embattled Ganguly". ESPNcricinfo. Retrieved 4 November 2014.
  15. Cricinfo – Indian board gags players
  16. "Chappell caught in yet another Indian storm". smh.com.au. Retrieved 3 November 2014.
  17. "Sourav spat was 'blown out of proportion' - Chappell". ESPNcricinfo. Retrieved 3 November 2014.
  18. "Ganguly cried on being dropped". Rediff. Retrieved 3 November 2014.
  19. "Cricinfo Statsguru – India – Champions Trophy 2006 – Team analysis". Cricinfo Magazine. ESPN. Retrieved 2008-05-24.
  20. "Cricinfo Statsguru – India Vs. South Africa 2006–07 – Team analysis". Cricinfo Magazine. ESPN. Retrieved 2008-05-24.
  21. Reporter (30 November 2006). "Ganguly in, Laxman appointed vice-captain". Cricinfo Magazine. ESPN. Retrieved 2008-05-24.
  22. Reporter (25 March 2006). "Jaffer, Zaheer and Kumble added to ODI squad". Cricinfo Magazine. ESPN. Retrieved 2008-05-24.
  23. "Tour Match: Rest of South Africa v Indians at Potchefstroom, December 7–9, 2006". Cricinfo Magazine. ESPN. Retrieved 2008-05-24.
  24. Alter, Jaime (13 December 2006). "Exorcising the demons". Cricinfo Magazine. ESPN. Retrieved 2008-05-24.
  25. "1st Test: South Africa v India at Johannesburg, December 15–18, 2006". Cricinfo Magazine. ESPN. Retrieved 2008-05-24.
  26. Patwardhan, Deepti (18 December 2006). "India score maiden Test win in South Africa". Rediff.com. Retrieved 2010-01-15.
  27. "India in South Africa Test Series, 2006/07 – Most runs". Cricinfo Magazine. ESPN. Retrieved 2008-05-24.
  28. Vasu, Anand (12 January 2007). "Sehwag out, Ganguly picked for ODIs". Cricinfo Magazine. ESPN. Retrieved 2008-05-24.
  29. Vasu, Anand (12 February 2007). "Sehwag and Munaf back for SL series". Cricinfo Magazine. ESPN. Retrieved 2008-05-24.
  30. 30.0 30.1 "Cricinfo Statsguru – SC Ganguly – One-Day Internationals". Cricinfo Magazine. ESPN. Retrieved 2008-05-24.
  31. Vaidyanathan, Siddarth (21 January 2007). "India edge past despite Chanderpaul's masterclass". Cricinfo Magazine. ESPN. Retrieved 2008-05-24.
  32. Reporter (17 February 2007). "Ganguly happy with World Cup preparations". Cricinfo Magazine. ESPN. Retrieved 2008-05-24.
  33. "Most Runs in Test Matches in 2007". Cricinfo Magazine. ESPN. Retrieved 2010-01-19.
  34. "Most Runs in One-Day Internationals in 2007". Cricinfo Magazine. ESPN. Retrieved 2010-01-19.
  35. "Greg Chappell accuses Indian board of cover-up". ESPNcricinfo. Retrieved 21 April 2015.
  36. "Chappell downplays racism comments". ESPNcricinfo. Retrieved 21 April 2015.
  37. "Chappell offered me Dravid's captaincy in 2007 - Tendulkar". ESPNcricinfo. Retrieved 21 April 2015.
  38. "Sachin Tendulkar Book Release Today; It's Greg Chappell vs 'Old' Team India". NDTV. Archived from the original on 7 November 2014. Retrieved 21 April 2015.
  39. "Laxman: Chappell took us backwards - Teammates come out in support of Tendulkar". The Telegraph India. Archived from the original on 17 November 2014. Retrieved 21 April 2015.
  40. "Mohammad Kaif: My shy nature went against me". Cricbuzz. Retrieved 10 July 2019.
  41. "Here's what Ashish Nehra said on Greg Chappell, MS Dhoni, Virat Kohli, Ravi Shastri". The Deccan Chronicle. Retrieved 10 July 2019.
  42. "Virender Sehwag reveals how he exposed Greg Chappell's vile intentions to Sourav Ganguly in 2005". DNA India. Retrieved 10 July 2019.
  43. "I wasn't Comfortable with Greg Chappell: Sehwag". Outlook. Retrieved 10 July 2019.
  44. "Watch: When Virender Sehwag ripped apart Greg Chappell and revealed unpleasant truths about Indian dressing room". DNA India. Retrieved 10 July 2019.
  45. "Greg Chappell had a Divide and Rule Policy: Harbhajan Singh". Sweep Cricket. June 2020. Retrieved 19 June 2020.