చదలవాడ పిచ్చయ్య
చదలవాడ పిచ్చయ్య | |
---|---|
జననం | |
మరణం | 1987 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సంపాదకుడు |
వీటికి ప్రసిద్ధి | అభ్యుదయ రచయితల సంఘం, అభ్యుదయ మాసపత్రిక, నవభారతి మాసపత్రిక |
గుర్తించదగిన సేవలు | ఇదేనా విముక్తి?, ప్రతీక్ష |
తల్లిదండ్రులు | చదలవాడ కృష్ణయ్య |
చదలవాడ పిచ్చయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, అభ్యుదయ రచయిత, పాత్రికేయుడు. అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపకులలో ఒకడు.
జీవిత విశేషాలు
[మార్చు]చదలవాడ పిచ్చయ్య 1911 జూన్ 6న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా(ప్రస్తుతం బాపట్ల జిల్లా, అమృతలూరు మండలం)లోని పెదపూడి గ్రామంలో ఒక రైతుకుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు చదలవాడ కృష్ణయ్య. ఇతడు గాంధీజీ సత్యాగ్రహంలో పాల్గొని వీధులలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి అరెస్ట్ అయ్యాడు. బాలుడు అయినందువల్ల అధికారులు ఎటువంటి కఠినమైన శిక్ష విధించలేదు, బదులుగా తంజావూరు, తిరుచిరాపల్లి బోస్టన్ పాఠశాలకు పంపారు. ఈ పాఠశాలల్లో పరిస్థితులు చాలా కఠినంగా దుర్భరంగా ఉండేవి. పిచ్చయ్య అక్కడ విద్యార్థులను సమీకరించి సంస్కరణల కోసం పోరాడాడు. అధికారుల నుండి హింసను ఎదుర్కొన్నాడు. ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, బేషరతుగా విడుదలయ్యే వరకు ఇతడు తన నిరసనలను కొనసాగించాడు.
విడుదలైన తర్వాత, పిచ్చయ్య అనారోగ్యం నుండి కోలుకోనప్పటికీ, గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నాడు. 1930 తర్వాత, ఇతడు స్వదేశీ ఉత్పత్తుల వాడకాన్ని చురుకుగా ప్రోత్సహించాడు. విదేశీ దుస్తులను, వస్తువులను తగలబెట్టాడు. ఇతడు గ్రామగ్రామాల్లో ప్రచారం చేస్తూ, ప్రజలను చేనేత దుస్తులు ధరించమని అభ్యర్థించాడు. మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తూ తరచుగా మద్యందుకాణాల ముందు పికెటింగ్ చేశాడు. ఇతని ఈ క్రియాశీలత అరెస్టుకు దారితీసింది. రాజమండ్రి, బళ్లారి, కన్నూర్ జైళ్లలో ఆరు నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాడు.
1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో, ఇతని స్వాతంత్ర్య కోరిక ప్రజలలో ప్రతిధ్వనించింది. ఇతడు రాజకీయ సెమినార్లు నిర్వహించి, వివిధ మార్గాల్లో స్వాతంత్ర్య ఉద్యమానికి దోహదపడ్డాడు. సోషలిస్ట్ ఆదర్శాలచే ప్రభావితమైన చదలవాడ రైతుల కార్మికుల ఐక్యత కోసం కృషి చేశాడు. రైతు సంఘాలకు నాయకత్వం వహించాడు.
చదలవాడ పిచ్చయ్య 1987లో మరణించాడు.[1]
అభ్యుదయ రచయితల సంఘం
[మార్చు]జాతీయ స్థాయిలో 1936వ సంవత్సరంలో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. లక్నోలో జరిగిన తొలి సభలు రవీంద్రనాథ్ టాగోర్, ప్రేమ్‌చంద్ వంటివారి మద్దత్తు, మంటో, చుగ్తాయ్, ముల్క్ రాజ్ ఆనంద్ వంటివారి భాగస్వామ్యంతో జరగడం వల్ల ఈ సభలు దేశం నలుమూలలా రచయితలను ఆకర్షించాయి. పిదప 1943 సంవత్సరం విజయనగరంలో కూడా చాగంటి సోమయాజులు, సెట్టి ఈశ్వరరావు వంటి రచయితలు ఇటువంటి వేదిక ఆవిర్భావం కొరకు ఆలోచిస్తున్న సమయంలో తెనాలి నుంచి చదలవాడ పిచ్చయ్య కూడా వీరితో కలిశాడు. ఇతని పూనికతో తెనాలిలో 1943 ఫిబ్రవరి 13, 14 తేదీలలో తొలి ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం సభలు జరిగాయి. వీటికి తాపీ ధర్మారావు అధ్యక్షత వహించాడు. ఇతడు అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శిగా కొంతకాలం పనిచేశాడు.
రచనలు
[మార్చు]ఇతడు వ్రాసిన కవితలు, వ్యాసాలు చిత్రగుప్త, కాగడా, వీణ మొదలైన పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇతడు కొన్ని నాటికలను రచించాడు. వాటిలో కొన్ని:
- ఇదేనా విముక్తి?
- నాకూ హక్కు ఉంది
- ప్రతీక్ష
పత్రికా సంపాదకత్వం
[మార్చు]చదలవాడ పిచ్చయ్య అభ్యుదయ రచయితల సంఘం వారి పత్రిక అభ్యుదయ మాసపత్రికకు సంపాదకత్వం వహించి కొంతకాలం పత్రికను నడిపాడు. 1959లో విజయవాడ నుండి వెలువడిన నవభారతి మాసపత్రికకు సంపాదకత్వం వహించాడు. ఈ పత్రిక 1970వ దశకంలో హైదరాబాదు నుండి వెలువడసాగింది.
మూలాలు
[మార్చు]- ↑ web master. "Chadalavada Pichayya". Digital District Repository. Ministry of Culture, Government of India. Retrieved 7 March 2025.