గౌరవెల్లి ప్రాజెక్టు
గౌరవెల్లి ప్రాజెక్టు | |
---|---|
ప్రదేశం | గౌరవెల్లి, అక్కన్నపేట మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ |
స్థితి | నిర్మాణంలో ఉంది |
నిర్మాణం ప్రారంభం | 2018 |
యజమాని | తెలంగాణ ప్రభుత్వం |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | బ్యారేజి |
జలాశయం | |
సృష్టించేది | గౌరవెల్లి ప్రాజెక్టు |
మొత్తం సామర్థ్యం | 8.23 టీఎంసీ |
విద్యుత్ కేంద్రం | |
నిర్వాహకులు | తెలంగాణ రాష్ట్రం |
Type | జలాశయం |
గౌరవెల్లి ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, అక్కన్నపేట మండలం లోని గౌరవెల్లిలో నిర్మించిన ప్రాజెక్టు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతంలోని 1.60 లక్షల ఎకరాలకకు సాగునీరు అందించే ఉద్దేశంతో సముద్ర మట్టానికి దాదాపు 420మీటర్ల ఎత్తులో ఈ ప్రాజెక్టు నిర్మించబడింది. అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లోని 15, కోహెడ మండలంలోని 8, చిగురుమామిడి మండలంలోని 10, భీమదేవరపల్లి మండలంలోని 12, ధర్మసాగర్ మండలంలోని 13, ఘన్‌పూర్‌లోని 10, సైదాపూర్‌లోని 3, హన్మకొండ, జాఫర్‌ఘడ్, రఘునాథపల్లి మండలాల్లోని ఐదు గ్రామాలకు కుడి కాలువ ద్వారా 90 వేలు, ఎడమ కాలువ ద్వారా 16 వేల ఎకరాలకు, గండిపల్లి కుడి-ఎడమ కాల్వల ద్వారా 14 వేల ఎకరాలు కలిపి మొత్తంగా ప్రాజెక్టు ద్వారా 1,20,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది.[1]
కాళేశ్వరం నుంచి మిడ్ మానేర్, అటునుంచి బెజ్టంకి మండలం కొత్తపల్లి వద్ద నిర్మించిన కొత్తపల్లి రిజర్వాయర్ కు చేరుకుంటాయి. అక్కడినుండి 11 కి.మీ.ల గ్రావిటీ కెనాల్ ద్వారా వచ్చే నీరు మరో 16 కి.మీ.లు టన్నెల్ ద్వారా ప్రయాణించి అక్కన్నపేట మండలం రేగొండ వద్ద నిర్మించిన సర్జిఫూల్ (గౌరవెల్లి ప్రాజెక్టు పంపుహౌస్)కు చేరుకుంటాయి. అక్కడ నిర్మించిన మూడు భారీ మోటార్ల ద్వారా గౌరవెల్లి ప్రాజెక్టులోని నీటిని పంపింగ్ చేస్తున్నారు.[2]
చరిత్ర
[మార్చు]2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1.43 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ ప్రాజెక్టును సందర్శించిన తరువాత, తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.43 టీఎంసీల నుండి 8.23 టీఎంసీలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు డిజైన్లను కూడా మార్చింది.[3][4] అప్పటి నీటి పారుదల శాఖామంత్రి టి. హరీష్ రావు చేతులమీదుగా 2018లో నిర్మాణ పనులు ప్రారంభమై, నాలుగు సంవత్సరాల వ్యవధిలో 2022 జూలై నాటికి నిర్మాణం పూర్తయింది.
భూసేకరణ
[మార్చు]ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సేకరించాల్సిన 3900 ఎకరాల భూసేకరణ జరిగింది. భూనిర్వాసితుల ఎకరానికి 15 లక్షల పరిహారం ఇస్తున్నామని, 500 మంది మేజర్లకు జీవో 68 ప్రకారం ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏర్పాటు చేసి అందులో ఒక ఫ్లాట్, ఎమ్మెల్యే కోటా నుంచి ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.[5][6]
రిజర్వాయర్ పరిధిలో మొత్తం 1,124 కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్ పరిహారం చెల్లింపులు జరిగాయి. మొత్తం 742 ఇళ్ళకు పరిహారం చెల్లించారు. 2015 కటాఫ్ తేదీతో లెక్కించి అప్పటివరకు ఉన్న 144 మంది తాజా మేజర్లకు సైతం ప్రభుత్వం ఒక్కొక్కరికి 6లక్షల రూపాయల చొప్పున చెల్లించింది. వారంతా ఇతర ప్రాంతాలలో స్థలాలు కొనుగోలు చేసి ఇళ్ళను నిర్మించుకున్నారు.
ప్రాజెక్టు వివరాలు
[మార్చు]గౌరవెల్లి ప్రాజెక్ట్ పంపుహౌస్ ను 130 మీటర్ల లోతులో, 17 మీటర్ల వెడల్పు, 85 మీటర్ల పొడవుతో నిర్మించారు. మూడు భారీ మోటార్స్ (మెగా బహుబలి మోటార్స్) ఒక్కొక్క మోటార్ 32 మెగావాట్ల సామర్థ్యంతో మూడు మోటార్స్ 96 మెగావాట్ల సామర్థ్యం కలిగి లక్ష్మీపూర్ పంపుహౌస్ కంటే పెద్ద హెడ్ కలిగి ఉండి 126 మీటర్ల ఎత్తులోకి నీటిని సరఫరా చేస్తాయి. ఒక్కో మోటరు సెకనుకు 2వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తాయి.[7] కట్ట పొడవు 10.56 కి.మీ.లు ఉంది.
ఈ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసేందుకు టన్నెల్ నిర్మాణం, పంపుహౌస్, మోటర్లు, విద్యుత్ (50 ఎంవీఏ సామర్థ్యం కలిగిన ఐదు భారీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు) వంటి సౌకర్యాలకోసం 770 కోట్ల రూపాయలు వెచ్చించారు. కోహెడ మండలం నారాయణపూర్ గ్రామం నుంచి రేగొండ పంపుహౌస్ వరకు 12కి.మీ.ల మేర సొరంగ మార్గాన్ని నిర్మించి, రేగొండ సమీపంలో రెండు సర్జిఫూల్ ట్యాంకులు, పంపుహౌస్ నిర్మించారు. ఇక్కడ 132 విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేసి పంపులను రన్ చేసేందుకు పంపుహౌస్ పక్కనే 50ఎంవీఏ సామర్థ్యం కలిగిన 5 భారీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటుచేశారు.[8]
ట్రయల్ రన్
[మార్చు]2022 జూలై నాటికి ప్రాజెక్టులో కీలకంగా ఉండే పంపుహౌస్ బిగింపు పనులు పూర్తయ్యాయి. దాంతో, 2022 జూలై 31న హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఈ రిజర్వాయర్ సమీపంలో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి, ట్రయల్ రన్ ను ప్రారంభించాడు. అక్కన్నపేట మండలంలోని రేగొండ గ్రామ శివారులో ఉన్న పంపుహౌస్, సర్జిఫూల్ ట్యాంకుల నుంచి గోదావరి నీళ్ళు రిజర్వాయర్‌లోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[8]
2023 జూన్ 29న మరోసారి ట్రయల్ రన్ (ఒకటో నంబర్ మోటర్‌ను కంప్యూటర్ ద్వారా ఆన్) చేసి గోదావరి నీటిని రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. ఒక మోటరు ద్వారా సెకనుకు 700 క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తుంది.[9][10]
మూలాలు
[మార్చు]- ↑ Nagaraju, Pandari (2022-06-11). "త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టుకు నీటి ట్రయల్ రన్." Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 2022-07-31. Retrieved 2022-07-31.
- ↑ "త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టుకు నీటి ట్రయల్ రన్: బోయినపల్లి వినోద్‌కుమార్". Prabha News. 2022-06-11. Archived from the original on 2022-06-11. Retrieved 2022-07-31.
- ↑ Thum, Jayadeep (2018-02-03). "గౌరవెల్లి రిజర్వాయర్‌కు భూమిపూజ". తెలంగాణ. Archived from the original on 2022-07-31. Retrieved 2022-07-31.
- ↑ "'గౌరవెల్లి' పనులు పూర్తి.. ప్రయోగానికి ఏర్పాట్లు". EENADU. 2022-05-14. Archived from the original on 2022-05-14. Retrieved 2022-07-31.
- ↑ "Gouravelli project: No one will be forcibly evicted, assures TS Finance Minister Harish". The New Indian Express. 2022-06-16. Archived from the original on 2022-06-16. Retrieved 2022-07-31.
- ↑ "Telangana News: గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన... రంగంలోకి మంత్రి హరీశ్‌రావు". EENADU. 2022-06-15. Archived from the original on 2022-06-15. Retrieved 2022-07-31.
- ↑ "Godavari water for Gouravelli reservoir soon". The Hindu. Special Correspondent. 2022-06-11. ISSN 0971-751X. Archived from the original on 2022-06-11. Retrieved 2022-07-31.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ 8.0 8.1 telugu, NT News (2022-08-01). "మెట్టలో గోదారమ్మ జల తాండవం". Namasthe Telangana. Archived from the original on 2022-07-31. Retrieved 2022-07-31.
- ↑ "Trial run of Gouravelli project conducted in Telangana". The New Indian Express. 2023-06-30. Archived from the original on 2023-06-30. Retrieved 2023-07-10.
- ↑ "Trial run of Gouravelli reservoir held successfully". The Hindu. 2023-06-29. ISSN 0971-751X. Archived from the original on 2023-06-29. Retrieved 2023-07-10.