గౌతమీ గ్రంథాలయం (రాజమండ్రి)
దేశము | భారత దేశము |
---|---|
తరహా | ప్రైవేటు |
ప్రదేశము | రాజమండ్రి |
భౌగోళికాంశాలు | 016°58′48″N 081°46′48″E / 16.98000°N 81.78000°E |
గ్రంధ సంగ్రహం / సేకరణ | |
గ్రంధాల సంఖ్య | 20, 000 |
గౌతమీ గ్రంథాలయం, రాజమండ్రి నగరానికే తలమానికమైన 100 ఏళ్లపైన చరిత్రగల గ్రంథాలయం. దీనిలో 20 వేల పైచిలుకు గ్రంథాలున్నాయి.
చరిత్ర
[మార్చు]1898లో నాళం కృష్ణారావు నాళం వారి సత్రంలో గ్రంథాలయం స్థాపించి తర్వాత దానికి శ్రీ వీరేశలింగం పుస్తక భాండాగారమని పేరుపెట్టి నడిపాడు. 1911లో అద్దంకి సత్యనారాయణశర్మ స్థాపించిన వసురాయ గ్రంథాలయం, 1914లో ప్రారంభమైన సర్వజన పుస్తక భాండాగారం వంటివి ప్రారంభమయ్యాయి. కొన్నేళ్ళకు నాళం కృష్ణారావు వసురాయ, సర్వజన గ్రంథాలయాలను తాను స్థాపించిన శ్రీ వీరేశలింగం పుస్తక భాండాగారంలో విలీనం చేశాడు. ఇదే గౌతమీ గ్రంథాలయంగా రూపొందింది. గ్రంథాలయ సంఘ కార్య దర్శి అయిన పాటూరి నాగేశ్వరరావు ప్రోద్భలంతో 1920లో వావిలాల గోపాలకృష్ణయ్య సహకారంతో రిజిస్టర్ చేసి అప్పటివరకూ ఇన్నీసు పేటలో ఉన్న గ్రంథాలయాన్ని ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి మార్చారు. గౌతమీ గ్రంథాలయంగా మారిన కొన్నేళ్ళకు కొక్కొండ వేంకటరత్నం పంతులు స్థాపించిన రత్నగని గ్రంథాలయం కూడా ఇందులో విలీనమైంది.
1920 నుంచి దశాబ్దాల పాటు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం, వేదుల సత్యనారాయణశాస్త్రి వంటి సాహిత్య ప్రముఖులు గ్రంథాలయ కమిటీలో పలు హోదాల్లో గ్రంథాలయాన్ని అభివృద్ధి చేశారు. 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణలోనూ ఈ గ్రంథాలయానికి కేంద్ర గ్రంథాలయమయ్యే అవకాశం, ప్రభుత్వ గుర్తింపు పొందే అవకాశం చేజారాయి. 70వ దశకం తుదివరకూ గ్రంథాలయం ప్రైవేటు నిర్వహణలోనే ఉంది. 1962లో గ్రంథాలయ కమిటీ కార్యదర్శిగా మహీధర జగన్మోహనరావు బాధ్యతలు చేపట్టి చాలా సమర్థవంతంగా నిర్వహించాడు. దాతలను, పండితులను వెంటబడి, బ్రతిమాలి మరీ పుస్తకాలు, సామాగ్రి విరాళంగా తెచ్చి గ్రంథాలయాన్ని సుసంపన్నం చేశాడు. మహీధర జగన్మోహనరావు రాజీనామా తర్వాత నరసింహ శర్మ, ప్రసాదరావు, సుబ్రహ్మణ్యం వంటి గ్రంథాలయ సిబ్బంది గ్రంథాలయాన్ని కాపాడుకుని అభివృద్ధికి కృషిచేశారు.
1970ల్లో వై.ఎస్.నరసింహారావు స్థాపించిన ఆంధ్రకేసరి యువజన సమితి గ్రంథాలయాన్ని ప్రభుత్వం స్వీకరించి అభివృద్ధి చేయాలని ఉద్యమ స్థాయిలో పనిచేసింది. రాజమండ్రితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల ప్రముఖులు, సాహిత్యవేత్తలను కదిలించి గ్రంథాలయాన్ని ప్రభుత్వం స్వీకరించాలని ఉత్తరాలు రాయించి కార్డుల ఉద్యమం చేపట్టారు. ఎట్టకేలకు 1979లోప్రభుత్వం దీని నిర్వహణ చేపట్టింది. 1983-84లో గౌతమీ గ్రంథాలయం పాత భవనం కూలిపోయింది. క్రమేపీ కొత్తభవనాన్ని ఏర్పరిచారు. 1986లో గ్రంథాలయాన్ని ప్రభుత్వం కొత్తగా అకాడమీలను విలీనం చేసి ఏర్పాటుచేసిన పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేస్తామని ప్రతిపాదించింది. ప్రజలు అభివృద్ధి చేసుకుని అపురూపమైన గ్రంథాలతో, ఎంతో చరిత్రతో రూపొందించిన ఈ గ్రంథాలయాన్ని హఠాత్తుగా విశ్వవిద్యాలయంలో విలీనం చేస్తాననడంతో ప్రజలు తిరగబడ్డారు. వావిలాల గోపాలకృష్ణయ్య సహా పలువురు గ్రంథాలయ ప్రముఖులు ఈ విలీనాన్ని వ్యతిరేకించారు. ప్రజా వ్యతిరేకతకు భయపడ్డ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని తుదకు విరమించుకుంది.[1]
ప్రభుత్వ గ్రంథాలయ విభాగం నిర్వహణలో కొనసాగుతున్న గౌతమీ గ్రంథాలయానికి 2017-18 కాలంలో కొత్త భవనాలు నిర్మిస్తున్నారు.
అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖులు
[మార్చు]- కంచిమర్తి సీతారామచంద్రరావు
- రాజా విక్రమదేవ వర్మ
- చిలకమర్తి లక్ష్మీనరసింహం
- భమిడిపాటి కామేశ్వరరావు
- కాశీనాధుని నాగేశ్వరరావు
- కట్టమంచి రామలింగారెడ్డి
- పాతూరి నాగభూషణం
చిత్రాలు
[మార్చు]ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఎం., సతీష్ చందర్ (9 November 1986). "'తెలుగు' సముద్రంలో గ్రంథాల గౌతమి". ఉదయం.