Jump to content

గురు హర్ రాయ్

వికీపీడియా నుండి
గురు హర్ రాయ్
ਗੁਰੂ ਹਰਿਰਾਇ
జననంJanuary 16, 1630 (1630-01-16)
మరణంOctober 6, 1661 (1661-10-07) (aged 31)
ఇతర పేర్లు'ఏడవ గురువు'
క్రియాశీల సంవత్సరాలు1644–1661
అంతకు ముందు వారుగురు హర్ గోబింద్
తరువాతివారుగురు హర్ క్రిషన్
జీవిత భాగస్వామిమాతా క్రిషేన్ కౌర్
పిల్లలుబాబా రామ్ రాయ్, బాబా హర్ క్రిషన్
Guru Har Rai
గురు హర్ రాయ్

గురు హర్ రాయ్ (పంజాబీ:ɡʊru həɾ ɾɑɪ; 1630 జనవరి 16 – 1661 అక్టోబరు 6) పదిమంది సిక్ఖు గురువుల్లో ఏడవవారు. 1644 మార్చి 8న ఆయన తన తాతగారి నుంచి గురు పరంపర వారసత్వాన్ని స్వీకరించారు. 31 సంవత్సరాల వయసులో మరణించబోతూ గురు హర్ రాయ్ తన కుమారుడు ఐదేళ్ళ గురు హర్ క్రిషన్ కు గురు పరంపరలో వారసత్వాన్ని ఇచ్చారు. ఆరవ సిక్ఖు గురువైన గురు హర్ గోబింద్ కుమారుడు బాబా గుర్ దితా. బాబా గుర్ దితా, మాతా నిహాల్ కౌర్ (మాతా ఆనతిగానూ ప్రసిద్ధురాలు) దంపతుల కుమారుడు గురు హర్ రాయ్. దయా రామ్ కుమార్తె అయిన మాతా కిషన్ కౌర్ (కొన్నిసార్లు సులేఖగానూ పేర్కొంటారు) ను గురు హర్ రాయ్ వివాహం చేసుకున్నారు. ఆయనకి రామ్ రాయ్, గురు హరిక్రిషన్ అన్న కుమారులు ఉన్నారు.

గురు హర్ రాయ్ శాంతి కాముకుడు అయినా మునుపటి గురువు, ఆయన తాత అయిన గురు హర్ గోబింద్ విజయవంతంగా నడిపించిన 12 వందల మంది సిక్ఖు వీరుల సైన్యాన్ని వదలలేదు. సిక్ఖుల సైనిక స్ఫూర్తిని ఎప్పుడూ అభినందన పూర్వకంగా ప్రస్తావించేవారు, కానీ ఆయన ఎప్పుడూ ముఘల్ సామ్రాజ్యంతో ప్రత్యక్ష రాజకీయ, సైనిక యుద్ధంలో తలపడలేదు.

దారా షిఖో తన దాయాది ఔరంగజేబు ప్రారంభించిన వారసత్వ యుద్ధంలో తనకు సహాయపడమని గురు హర్ రాయ్ ను కోరారు. గురు హర్ రాయ్ తన తాతకు ఇచ్చిన మాట ప్రకారం సిక్ఖు సైన్యాన్ని రక్షణ కోసమే వినియోగించాలి. దాంతో మధ్యేమార్గంగా సిక్ఖు సైన్య సహకారంతో ఆయనను రహస్యంగా తరిలించి ఔరంగజేబు చేతి నుంచి తప్పించారు. ఈ క్రమంలో ఎక్కడా ఆయుధాన్ని వినియోగించలేదు. మాళ్వా, దోఅబా ప్రాంతాలను గురు హర్ రాయ్ సందర్శించి తిరిగివస్తుండగా గురు హర్ గోబింద్, ఆయన సిక్ఖు సైన్యంతో తలపడి యుద్ధంలో మరణించిన ముఖ్లిస్ ఖాన్ కుమారుడు మహమ్మద్ యార్బేగ్ ఖాన్ ససైన్యంగా ఎదురయ్యారు. గురు హర్ రాయ్ అనుచర సహితంగా ఉన్నారు. ఈ దాడిని కేవలం కొద్ది వందల మంది సిక్ఖులు తిప్పికొట్టారు. ఖాన్ సైన్యాలు తీవ్రమైన జన నష్టంతో ఆ ప్రదేశం నుంచి పారిపోయారు. గురు హర్ రాయ్ తరచుగా సిక్ఖు వీరులను గౌరవిస్తూ, సత్కరిస్తూండేవారు. దారా షికో తప్పించుకోవడంలో సహాయం చేసినందుకు కక్ష కట్టిన ఔరంగజేబు గురు హర్ రాయ్ పై నేరారోపణలు చేశారు, గురు గ్రంథ్ సాహిబ్ లోని భాగాలు ముస్లిం వ్యతిరేకమని, దైవదూషణ అనీ ఆరోపిస్తూ ప్రశ్నలు సంధించారు.[1]

గురు హర్ రాయ్ కిరాత్ పూర్ సాహిబ్ లో ఆయుర్వేద ఆసుపత్రి, పరిశోధన కేంద్రాలను నెలకొల్పారు. ఆయన ఒక జంతు ప్రదర్శనశాల కూడా నిర్వహించేవారు. ఒకసారి దారా షికో తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు ఎవరూ నయం చేయలేకుంటే గురు హర్ రాయ్ కొన్ని ఔషధ మూలికలు పంపగా గుణం చూపింది. ప్రాణ ప్రమాదమైన జబ్బు నయం చేసినందుకు జాగీరు ఇస్తాననగా ఆయన నిరాకరించారు.

గురు హర్ రాయ్ సిక్కు మత ప్రచారంలో, బోధనల్లో భాగంగా పంజాబ్ లోని దోఅబా, మాళ్వా ప్రాంతాలను సందర్శించారు. లాహోర్, సియాల్ కోట్, పఠాన్ కోట్, సంబా, రాంఘర్, జమ్ము కాశ్మీర్ లో వివిధ ప్రదేశాలు ఆయన సందర్శించారు. తన హయాంలో గురు హర్ రాయ్ కొన్ని తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నారు. మసంద్ లు, ధిర్ మల్, మినాలు అవినీతిపరులై సిక్ఖు విశ్వాసం వ్యాప్తిని అడ్డుకున్నారు. మూడవ సిక్ఖు గురువు గురు అమర్ దాస్ మంజి, పిరి వ్యవస్థ ప్రారంభిస్తూ 94 మందిని మంజీలుగా, పిరీలుగా సిక్ఖు మతం విస్తరించేందుకు ఏర్పరిచారు.[2] మసంద్ వ్యవస్థను సంస్కరించేందుకు గురు హర్ రాయ్ 360 సిక్ఖు మత ప్రచార పీఠాలు - మంజీలు అదనంగా ఏర్పాటుచేస్తూ వ్యవస్థను విస్తరించారు. పాత అవినీతి పరులైన మసంద్ లను తొలగించి, నిబద్ధులైన కొత్త వ్యక్తులను మంజి పెద్దలుగా స్వీకరించారు.

ఔరంగజేబు ఆయనను నేరారోపణ చేసి విచారించినా గురు హర్ రాయ్ సహజ మరణం పొందారు. ఆయన ఐదేళ్ళ వాడైన తన కుమారుడు హర్ క్రిషన్ ను తన వారసునిగా మరణానంతరం 8వ గురువుగా ప్రకటించారు.

మూలాలు

[మార్చు]
  • Macauliffe, M.A. (1909). The Sikh Religion: Its Gurus Sacred Writings and Authors. Low Price Publications. ISBN 81-7536-132-8.
  • Singh, Khushwant (1963). A History of the Sikhs: 1469-1839 Vol.1 (2nd ed.). Oxford University Press. ISBN 0-19-567308-5.
  1. "Guru Har Rai". Archived from the original on 2015-02-08. Retrieved 2016-07-31.
  2. "Piri system". Archived from the original on 2016-07-23. Retrieved 2016-07-31.