గాంధారి ఖిల్లా
గాంధారి ఖిల్లా | |
---|---|
బొక్కలగుట్ట, మందమర్రి మండలం, మంచిర్యాల జిల్లా, తెలంగాణ | |
భౌగోళిక స్థితి | 18°57′00″N 79°24′53″E / 18.9501°N 79.4146°E |
రకము | కోట |
స్థల సమాచారం | |
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతి | అవును |
స్థల చరిత్ర | |
వాడిన వస్తువులు | రాతి |
గాంధారి ఖిల్లా, మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామానికి దగ్గరలోని కొండమీద ఉన్న కోట.[1] ‘గోండు’, ‘గిరిజన’ జాతి కోసం చివరి వరకు పోరాటం చేసిన రాజ్ గోండ్’ లు ఈ కోటను నిర్మించారు.[2] దట్టమైన అటవీ ప్రాంతంలో నిర్మించబడిన ఈ ఖిల్లాకు 400 సంవత్సాల చరిత్ర ఉంది. ఈ ఖిల్లాలో వున్న మైసమ్మ దేవతను ఆ ప్రాంతాల ప్రజలు, గిరిజనులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఏడాది జరిగే ఉత్సవాల్లో దున్నపోతును సైతం బలిస్తారు. ఇలా గిరిజనుల ఇష్టదైవంగా ఉన్న ఈ ప్రాంతానికి పర్యాటకులు సైతం ఇక్కడకు వస్తుంటారు. గోండు, గిరిజన శిల్పులు ఈ గాంధారి ఖిల్లాను ఒక గుట్టలోనే చెక్కారని చెబుతారు.[3] ఇక్కడ గాంధారి మైసమ్మ ఆలయం కూడా ఉంది.[4]
చరిత్ర
[మార్చు]ఈ కోటను 12 వ శతాబ్దంలో వరంగల్ కాకతీయ రాజుల కాలంలో గోండు రాజులు నిర్మించారు. రాష్ట్రకూట యుగం (సా.శ. 1200 కి ముందు) ప్రారంభమై 16వ శతాబ్దం వరకు కోట నిర్మాణం కొనసాగిందని పురావస్తు పరిశోధన ప్రకారం తెలుస్తోంది.[5] ఈ కోటను కేంద్రంగా చేసుకున్న గోండు రాజులు పాలన సాగించారని, కొంతకాలం వడ్డె రాజులు, రెడ్డిరాజులు కూడా పరిపాలించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.
నిర్మాణ శైలి
[మార్చు]ఇక్కడ అనే కళారూపాలు, శిల్పాలు, విగ్రహాలు, దేవాలయాలు ఉన్నాయి. కోటపైకి దండెత్తి శత్రువుల రాకను తెలుసుకొని కోటలోని వారిని అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక నిర్మాణం (నగారా గుండు) ఏర్పాటు చేశారు. లోపల రెండు దేవాలయాలు, సొరంగ మార్గం, పెద్ద నాట్య స్థలం, లైట్లతో చూస్తే కనిపించే ఒక దేవి విగ్రహం, పడగతో ఉన్న నాగుపాము, ఏనుగు బొమ్మలు, మైసమ్మ, హనుమంతుడు, కాలభైరవుడి విగ్రహాలు బండకే చెక్కి ఉన్నాయి. లోపల ప్రథమ ద్వారం కాపలా దేవుళ్ల గుడి, ద్వితీయ ద్వారం వద్ద మైసమ్మ గుడి, నంది గుడి, ఖిల్లాపై మూడు మంచినీటి బావులు (ఎప్పటికి కొలనులో నీరు ఎండిపోకుండా ఉంటాయి) ఉన్నాయి. ఈ బావుల లోతు ఎనిమిది నులక మంచాలంత ఉంటుందని చెబుతారు. ఈ బావులను ‘సవతుల బావులని’ పిలుస్తారు. బయట ఒక నీటి మడుగు ఉంటుంది. గుట్ట బండపై చాలా చోట్ల పాము పుట్టలు ఉన్నాయి. బావులలో ఏనుగులు వచ్చి నీళ్లు తాగేటివని చెబుతుంటారు. ఖిల్లా చివరివరకు మెట్లు గుట్టకే చెక్కబడి ఉన్నాయి. ఈ నీటి మడుగు చాలా లోతుంటుందని చెబుతారు. కొండ పైకి వెళ్ళేందుకు మెట్లు కూడా నిర్మించారు. గుర్రాలు, ఏనుగులు వెళ్ళడం కోసం ప్రత్యేక మార్గాన్ని కూడా నిర్మించారు. భద్రతా సిబ్బంది కోసం గదులు నిర్మించారు.
దీని ముందు ఒక పెద్ద ఊర చెరువు ఉంది. దీని కింద వందల ఎకరాలు వ్యవసాయం చేస్తుండేవారు.హాజీపూర్ మండలం లోని లోని గఢ్‌పూర్ గ్రామానికి చెందిన రెడ్డ గోండులు ఇక్కడ పూజారులుగా వ్యవహరించారు. రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడ నాయక్‌పోడ్ గిరిజనులు జాతర జరుపుకుంటారు. గత పదేండ్ల క్రితం ఒకసారి ఈ గుట్టల్లో ఎన్‌కౌంటర్ జరిగి ముగ్గురు పనిబాగ్చీ గ్రూపుకు చెందిన వారు మరణించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికి కొంత మంది పర్యాటకులు అప్పుడప్పుడు గాంధారి ఖిల్లా వరకు పిక్‌నిక్‌లకు, పూజలకు వెళుతుంటారు.
ఉత్సవం
[మార్చు]ఇక్కడ జరిగే గాంధారి మైసమ్మ జాతరలో మైసమ్మ పటం కొలుపు అనేది ప్రధాన ఘట్టం. అర్ధరాత్రి దాటిన తర్వాత పద్మనాయక పూజారి, ఝాట్టీలు కోటలోని ప్రధాన దర్వాజా ఎడమ పట్టీకి చెక్కి ఉన్న విగ్రహం ముందట మైసమ్మ ఆకారంలో పసుపు కుంకుమలతో పట్నం గీసి దాని గాజులు, గంధం, నిమ్మకాయలతో అలంకరించి పూజలు చేస్తారు. ఆ తర్వాత దున్నపోతు బలిస్తారు.
ఇతర వివరాలు
[మార్చు]గాంధారి కోటలోని అడవి ఔషధ మొక్కలకు ముఖ్యమైన వనరుగా ఉంది. పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు ఔషధ మొక్కలను సేకరించి సమీప పట్టణాల్లో విక్రయిస్తుంటారు. ఈ మొక్కలను గుర్తించడానికి, హెర్బేరియం నమూనాలను తయారు చేయడానికి విద్యార్థులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఔషధ మొక్కలకు ఈ ప్రాముఖ్యత దృష్ట్యా, కోట ప్రాంతంలోని అడవిని ఔషధ మొక్కల సంరక్షణ ప్రకటించాలన్న కేంద్రం సూచనమేరకు, తెలంగాణకు హరితహారంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 134 హెక్టార్ల విస్తీర్ణాన్ని గాంధారి వనంగా మార్చింది. 40 ఎకరాల స్థలంలో జింకల పార్కు, హెర్బల్ గార్డెన్, నవగ్రహ వనం, రాశివనం, పిల్లల పార్కు మొదలైనవి ఏర్పాటుచేసింది.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Ramalakshman, A., ed. (2002). Andhra Pradesh Archaeology: A Review, 1987-2001. Hyderabad: Department of Archaeology and Museums, Government of Andhra Pradesh. p. 10. OCLC 71843154.
- ↑ తెలంగాణ మాగజైన్. "గందారి కొట". magazine.telangana.gov.in. Retrieved 8 February 2017.
- ↑ Vellampalli, Jaya (25 August 2015). "Reflecting tribal heritage". Metro India. Archived from the original on 26 August 2015.
- ↑ "1,000-year-old historic fort lies in neglect". The Hans India. Hyderabad Media House Limited. 5 October 2014. Archived from the original on 27 August 2015.
- ↑ "Gandharikota". Monuments of Adilabad. Department of Archaeology and Museums, Telangana. Archived from the original on 27 August 2015.
ఇతర లంకెలు
[మార్చు]- మంచిర్యాల జిల్లాలో గాంధారి ఖిల్లా. Archived 2021-07-21 at the Wayback Machine
- http://www.vaarthanidhi.in/ Archived 2021-07-21 at the Wayback Machine July 20, 2021
- యూట్యూబ్ లో గాంధారి ఖిల్లా గురించిన వీడియో
- గాంధారి కోట Archived 2017-10-07 at the Wayback Machine;
- "గోండు రాజుల గాంధారి ఖిల్లా (Photos of Gandhari Kota)". Archived from the original on 27 August 2015. Retrieved 27 August 2015.