Jump to content

ఖండవల్లి లక్ష్మీరంజనం

వికీపీడియా నుండి
ఖండవల్లి లక్ష్మీరంజనం శత జయంతి, కళాశాల స్వర్ణోత్సవ సంచిక ముఖచిత్రం.

ఖండవల్లి లక్ష్మీరంజనం (1908 మార్చి 1- 1986 జూన్ 18) సుప్రసిద్ధ సాహిత్యవేత్త, పరిశోధకులు.

జీవిత సంగ్రహం

[మార్చు]

ఇతను తూర్పు గోదావరి జిల్లా బెల్లంపూడి గ్రామంలోని మాతామహులైన కోరాడ నరసింహులు ఇంటివద్ద 1908 మార్చి 1న జన్మించాడు. సూర్యనారాయణ, సీతమ్మ వీరి తల్లిదండ్రులు. తండ్రి ఉద్యోగ రీత్యా వరంగల్లుకు వచ్చారు.

ఇతని మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యలు మట్టెవాడలోను, హనుమకొండలోను పూర్తయ్యాయి. తరువాత ఉన్నత విద్యకై హైదరాబాదు వచ్చి 1928లో నిజాం కళాశాలలో తెలుగు, సంస్కృతం, ప్రాచీన భారత చరిత్రలలో బి.ఎ. పట్టా పొందారు. తరువాత సిటీ కళాశాలలో అధ్యాపకులుగా చేరి 1936లో తెలుగు, సంస్కృతాలలో ఎం.ఎ. పరీక్షలో మద్రాసు ప్రెసిడెన్సీలో సర్వ ప్రథములుగా ఉత్తీర్ణులయ్యారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరి, తరువాత 1946లో ఆ శాఖకు అధ్యక్షులై, 1964లో పదవీ విరమణ చేశారు. ఇతని కాలంలో తెలుగు శాఖ బాగా అభివృద్ధి చెంది, తెలుగు ఎం.ఎ. చదివే విద్యార్ధుల సంఖ్య పెరిగి, 1952 నుండి తెలుగులో పి.హెచ్.డి. పట్టాలకు పరిశోధన ప్రారంభమైంది. ఇతను ఆంధ్ర మహాభారతం పరిశోధన ప్రతిని ఎనిమిది సంపుటాలుగా తెలుగు శాఖ పక్షాన ప్రకటించారు.

వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఒక విద్యాసంస్థను ప్రారంభించి బాలబాలికలకు వేరువేరుగా ఉన్నత పాఠశాలలను నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రథమంగా ప్రాచ్య కళాశాలను, తెలుగు మీడియం సాయం కళాశాలను, ఒక సంగీత పాఠశాలను నెలకొల్పి, వాటికి విశాలమైన భవనాలు కట్టించారు. తన ఇంటిలోనే వేదపాఠశాలను 1980లో స్థాపించి సర్వ వర్ణాల వారికి తానే వేదాన్ని బోధించాడు. ఆంధ్ర రచయితల సంఘానికి 1957లో అధ్యక్షులై అనేక గ్రంథాలను ముద్రించారు. వీరు ఇంగ్లీషు, తెలుగు భాషలలో శరవేగంగా రాసేవారు. మద్రాసు మెయిల్, దక్కన్ క్రానికల్, భారతి, కృష్ణా, స్రవంతి మొదలైన పత్రికలలో అనేకమైన వ్యాసాలు ప్రకటించారు.

కొమర్రాజు లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం ముద్రించడంలో వీరు విశిష్టమైన కృషిచేశాడు. 'ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము' అనే చక్కని రచన చేశాడు. సోదరుడు ఖండవల్లి బాలేందు శేఖరంతో కలసి తెలుగులోను, ఇంగ్లీషులోను రచించిన 'ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి' అమూల్యమైన గ్రంథం.

ఇతను 1986 జూన్ 18 న పరమపదించాడు. ఇతను స్థాపించిన ఆంధ్ర ప్రాచ్య కళాశాల ప్రస్తుతం ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రభుత్వ ప్రాచ్య కళాశాలగా అభివృద్ధి చెందింది. ఇతని శత జయంతి, కళాశాల స్వర్ణోత్సవాలు 2008లో హైదరాబాదులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక సంచికను ప్రచురించారు.

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
  • ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి శత జయంతి, కళాశాల స్వర్ణోత్సవ సంచిక, హైదరాబాదు, 2008.