Jump to content

ఏనుగు లక్ష్మణ కవి

వికీపీడియా నుండి
ఏనుగు లక్ష్మణ కవి
జననంఏనుగు లక్ష్మణ కవి
సా.శ.18 వ శతాబ్ది
పెద్దాడ
ఇతర పేర్లుఏనుగు లక్ష్మణ కవి
వృత్తితెలుగు కవి
ప్రసిద్ధిభర్తృహరి సుభాషితాలను అనువాదం చేసినవాడు
మతంహిందూ మతము
తండ్రితిమ్మకవి
తల్లిపేరమాంబ

ఏనుగు లక్ష్మణ కవి సా.శ.18 వ శతాబ్దికి (1797) చెందిన వాడు. కవి తల్లి గారి పేరు పేరమాంబ, తండ్రిగారి పేరు తిమ్మకవి. జన్మ స్థలము పెద్దాడ (ప్రస్తుత తూర్పుగోదావరిజిల్లాలోని గొల్లల మామిడాడకు దగ్గరలో ఉన్నది). లక్ష్మణ కవి ముత్తాత "పైడిపాటి జలపాలామాత్యుడు". ఈయన పెద్దాపుర సంస్థానాధీశ్వరుల వద్ద ఏనుగును బహుమానముగా పొందుట చేత కాలక్రమేణ వీరి యింటి పేరు "పైడిపాటి" నుండి "ఏనుగు" వారిగా స్థిర పడినది. ఆ జలపాల మంత్రి ముని మనుమడు లక్ష్మణ మంత్రి. ఆయన మనుమడు ఏనుగు లక్ష్మణ కవి. ఈ వంశము కవుల వంశముగనే కనబడుతున్నది. శ్రీ వత్సవాయి తిమ్మజగపతి వద్ద ఉన్న ప్రసిద్ధ కవి 'కవి సార్వభౌమ కూచిమంచి తిమ్మకవి, లక్ష్మణకవికి సమ కాలికుడు.లక్ష్మణ కవి, భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతి తెలుగులోనికి "సుభాషిరత్నావళి" పేరు మీద అనువాదం చేసాడు. సుభాషిరత్నావళి నీతి, శృంగార, వైరాగ్య శతకములని మూడు భాగములు. భర్తృహరి సుభాషితములను తెలుగులోనికి అనువాదము చేసినవారు ముగ్గురు 1. ఏనుగు లక్ష్మణ కవి 2. పుష్పగిరి తిమ్మన 3. ఏలకూచి బాలసరస్వతి. వీటన్నింటిలోను ప్రజాదరణ పొంది అందరి నోళ్ళలో నానినవి "ఏనుగు లక్ష్మణ కవి" అనువాదాలు.

ఈ సుభాషిత రత్నావళిని అతి మనోహరముగ, యథామూలముగ, ప్రౌఢముగ, సందర్భసముచిత శైలిలో కవి హృదయమును గ్రహించి రచియించె ననుట పెద్దల యభిప్రాయము. కాని దీని యెడల లోటుపాటులు ఉన్నాయి. పద్యములు రసవంతముగ నుండుటకు వానిని పండితులును పామరులును గూడ పఠించు చుండుటయే సాక్ష్యము.

ఉదాహరణలు:

[మార్చు]

నీతి శతకములోని ఒక పద్యం.

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.

ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి య
స్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గం
గా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్.

ఉరుతర పర్వతాగ్రముననుండి దృఢంబగు ఱాతిమాద స
త్వరముగ త్రెళ్ళి కాయము హతంబుగ చేయుట మేలు, గాలి మే
పరిదొర వాత కేలిడుట బాగు, హుతాశన మధ్యపాతమున్
వరమగు, చారుశీల గుణవర్జన మర్హముకాదు చూడగన్.

లక్ష్మణ కవి ఇతర రచనలు

[మార్చు]
  1. రామేశ్వర మాహాత్మ్యము[1]
  2. విశ్వామిత్ర చరిత్రము
  3. సూర్య శతకము (యిది సంస్కృత భాషలోనిది)
  4. గంగా మహాత్మ్యము
  5. రామ విలాసము[2]
  6. లక్ష్మీనరసింహ శతకము.
  7. జాహ్నవీమాహాత్మ్యము
  8. విశ్వేశ్వరోదాహరణము
  9. సుభాషితరత్నావళి
  10. ఆంధ్రనామ సంగ్రహము
  11. నృసింహ దండకము

మూలాలు

[మార్చు]