ఇమ్మానేని హనుమంతరావు నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇమ్మానేని హనుమంతరావు నాయుడు
ఇమ్మానేని హనుమంతరావు నాయుడు
జననంకొత్తపట్నం
ప్రసిద్ధినటుడు, ప్రయోక్త, నాటక సమాజ నిర్వాహకుడు

ఇమ్మానేని హనుమంతరావు నాయుడు నటుడు, ప్రయోక్త, నాటక సమాజ నిర్వాహకుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇమ్మానేని హనుమంతరావు నాయుడు ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం గ్రామానికి చెందినవాడు. ఆదివెలమ కులస్థుడు.[1] ఇతడు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడై ఒంగోలు లోని మిషన్ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అప్పటికి ఇతని వయసు 25 సంవత్సరాలు. ఇతడు లెక్కలు బోధించడంలో ప్రతిభ కలవాడు. బి.ఎ.క్లాసు విద్యార్థులు ఇతని వద్ద లెక్కలు నేర్చుకునేవారు. ఆ సమయంలో ఒంగోలుకు ఒక పూనా కంపెనీ ప్రమీలా స్వయంవరం, పీష్వా నారాయణరావు వధ, ఉషా పరిణయం, కీచక వధ మొదలైన హిందీ నాటకాలను ప్రదర్శించింది. వాటిని చూచిన హనుమంతరావు నాయుడుకు నాటకాలపై వ్యామోహం కలిగింది. విద్యార్థులతో నాటకాలు ప్రదర్శింపచేసి ఇతడూ నాటకాలలో పాత్రలు ధరించేవాడు. అప్పుడే టంగుటూరి ప్రకాశం పంతులను కూడా నాటకాలలో ప్రవేశ పెట్టాడు. విద్యాభ్యాసానికి టంగుటూరు నుండి ఒంగోలు వచ్చిన ప్రకాశం పంతుల ఆర్థిక సమస్యను పరిష్కరించి ఇతడు టంగుటూరి ప్రకాశం కు మార్గదర్శిగా ఉండి అతని అభివృద్ధికి మూలకారకుడయ్యాడు. ఇతని వద్ద విద్యనేర్చుకున్నవారిలో దేశభక్త కొండా వెంకటప్పయ్య కూడా ఉన్నాడు. ఇతడు శిష్యులకు చేసే సహాయాల వల్ల అతనికి వచ్చే 30 రూపాయల జీతం సరిపోయేది కాదు. అప్పుల బాధ మితిమీరడం వల్ల మంచి ఉద్యోగానికై ఇతడు రాజమండ్రి కి వెళ్లాడు. మిత్రుల సహాయంతో అక్కడ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. రాజమండ్రిలో లభించిన ప్రోత్సాహంతో నాటకాలను ప్రదర్శించేవాడు. ఒక పక్క ఉద్యోగ బాధ్యతను నెరవేరుస్తూ మరో పక్క నాటకాలను ప్రదర్శించేవాడు. ఇతని 1902లో పక్షవాతం వచ్చేవరకూ నాటకాలను విరివిగా ప్రదర్శించాడు.

నాటకరంగంలో సేవ

[మార్చు]

ఇతడు రాజమండ్రి చేరిన సమయానికి అక్కడ నాటకోత్సాహం వెల్లివిరిసింది. కందుకూరి వెంకటరత్నం, దాసు మాధవరావు మొదలైనవారు ఇంగ్లీషులో షేక్‌స్పియర్ నాటకాలు ఆడుతూ ఉండేవారు. ఆ ఉత్సాహంలో చిలకమర్తి లక్ష్మీనరసింహంతో గయోపాఖ్యానము, పారిజాతాపహరణం నాటకాలు వ్రాయించి ప్రదర్శన ప్రారంభించాడు. ఇతడు గయుడు పాత్ర ధరిస్తే ప్రకాశం చిత్రరేఖ పాత్ర ధరించేవాడు. ఇలా నాటకాలు తయారు చేసుకుని స్వంత సమాజంతో అమలాపురం, కాకినాడ మొదలైన పట్టణాలలో ప్రదర్శనలు ఇచ్చాడు. 1889లో రాజమహేంద్రవరం హిందూనాటక సమాజం స్థాపించాడు. ఈ సమాజం తరఫున శాకుంతలం, రత్నావళి, చమత్కార రత్నావళి, సత్యహరిశ్చంద్ర, వేణీ సంహారం, విక్రమోర్వశీయం, చిత్రనళీయం, గయోపాఖ్యానం, పారిజాతాపహరణం, శ్రీరామ జననం, ద్రౌపదీ పరిణయం, నలనాటకం, సీతా కళ్యాణం మొదలైన ఎన్నో నాటకాలను ప్రదర్శించాడు. ఈ నాటకాలన్నింటిలో ఇతడు ప్రముఖ పాత్రలను ధరించాడు. వాచిక విధానంలోనూ, సాత్వికాభినయంలోనూ ప్రతిభ గలవాడిగా పలువురిచే గుర్తించబడ్డాడు. ఇతని సహనటులుగా దుర్గి గోపాలకృష్ణారావు, అయినవోలు తాతయ్య నాయుడు, నేతి సుబ్బయ్య, సరిపల్లె కామేశ్వరరావు, ధరణిప్రగడ వెంకటశివరావు, సత్యవోలు గున్నేశ్వరరావు, బంగారురాజు మొదలైనవారు ఉండేవారు. ఇతడు నాటక సమాజంలోని నటులకు వివాహాలు జరిపించాడు. తరచూ నాటకసమాజంలో విందులు, వినోదాలు జరుగుతుండేవి. ఈ విధంగా ఇతడు నటుడిగా, నాటక సమాజ నిర్వాహకుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ధర్మదాతగా, అభ్యుదయ భావకుడిగా అన్నిరంగాలలో సేవ చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "నటరత్నాలు - [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]] - ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక - 19-04-1972, పేజీ:21". Archived from the original on 2016-03-04. Retrieved 2015-12-23.