Jump to content

అలపర్తి వెంకటసుబ్బారావు

వికీపీడియా నుండి
అలపర్తి వెంకటసుబ్బారావు
అలపర్తి వెంకటసుబ్బారావు
పుట్టిన తేదీ, స్థలం (1934-05-15) 1934 మే 15 (వయసు 90)
అంగలకుదురు, గుంటూరు జిల్లా
వృత్తిబాలల రచయిత, కవి
భాషతెలుగు
జాతీయతభారతీయుడు
విద్యఎస్.ఎస్.ఎల్.సి
గుర్తింపునిచ్చిన రచనలుస్వర్ణపుష్పాలు, పాలవెన్నెల
పురస్కారాలుసాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం - 2016
తండ్రివీరయ్య
తల్లికౌసల్య

అలపర్తి వెంకటసుబ్బారావు బాలసాహిత్య రచయిత.[1] సుబ్బారావు రచించిన ‘స్వర్ణ పుష్పాలు’ అనే కవితా సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం 2016 ను అందుకున్నారు.[2] ఆకాశవాణి, బొమ్మరిల్లు, పాలవెల్లి కార్యక్రమాల్లో ఆయన రాసిన గేయాలు, గేయకథలు, సంగీత రూపకాలు, నాటకాలు ప్రసారమయ్యాయి.[3]

జీవిత విశేషాలు

[మార్చు]

అలపర్తి వెంకటసుబ్బారావు గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన అంగలకుదురులో 1934, మే 15వ తేదీన కౌసల్య, వీరయ్య దంపతులకు జన్మించారు. ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివి వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించారు.[4] ప్రస్తుతం తెనాలికి దగ్గర్లోని దుగ్గిరాలలో నివాసముంటున్నారు. ఆయన అరవై సంవత్సరాలుగా బాలలకోసం రచనలు చేస్తున్నారు. ఆయన రచించిన కథలు, చిట్టి కవితలు, కథాగేయాలు మొత్తం 34 పుస్తకాలుగా వెలువడ్డాయి. ఆయన రచించిన 'శృతిలయలు'కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారి పురస్కారం దక్కింది.

1952లో "బాబు" అనే పత్రికలో ఆయన రాసిన కథ 'రాయి చెప్పింది' కథతో రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టారు. ఆయన మొదటి గేయం "బాలభారతి" పత్రికలో "పిల్లలంటే ఎవ్వరు?" ప్రచురితమైంది. ఆయన రాసిన గేయాలు, గేయకథలు, పద్యాలు అన్నీ కలిపి 1955లో "బాలానందం" అనే పుస్తకాన్ని ఆయనే స్వయంగా దీప్తి పబ్లికేషన్స్‌ తరఫున ముద్రించారు. ఇది ఆయన సొంత పబ్లికేషన్‌. ఆయన రాసిన "చిట్టి కథలు" పుస్తకాన్ని సాహితీ కేంద్రం, తెనాలి వారు, "పాలవెన్నెల" పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ వారు ప్రచురించారు. "శృతిలయలు" పుస్తకం చినుకు ప్రచురణ, "స్వర్ణపుష్పాలు" పుస్తకం మంచిపుస్తకం ప్రచురణ.[3]

1955లో బాలానందం ప్రచురించాక బాలసాహితీవేత్తగా గుర్తింపు లభించింది. పాటలంటే ఇష్టపడని పిల్లలుండరు. గేయం పాడుకోడానికి అనుకూలంగా ఉంటుంది. పిల్లలకు నీతులు చెప్పాలన్నా, ఆటపాటల గురించి, పండగల గురించి చెప్పాలన్నా గేయం అనుకూలంగా ఉంటుందని గేయాలలో నీతిని ప్రబోధించేటట్లు రచనలు చేసారు. ఆయన పిల్లల చేష్టలు వారి మనస్తత్త్వాలు - అలగడం - యుక్తి - చమత్కారం ఇలా ఒకటేమిటి ఎన్నో గేయాలను రాశారు. గేయాలను లయ ప్రధానంగా రాయడం, ఆది అంత్య ప్రాసలతోనే రాయడం ఆయన ప్రత్యేకత. 1984లో ఎస్.సి.ఇ.ఆర్.టి వారి 4వ తరగతి తెలుగు వాచకాన్ని మొత్తం ఆయనే రూపొందించారు. అదే సంవత్సరం రెండో తరగతి తెలుగు వాచకంలో 'తొలకరి' గేయం పాఠ్యాంశంగా అందించారాయన. ఈ గేయం చాలా లయబద్ధంగా సాగుతుంది. ఇది చాలా పాపులర్ అయింది. ఇది ధ్వని ప్రధానంగా సాగుతుంది.[3]

రచనలు

[మార్చు]
  1. బాలానందం (గేయాలు)
  2. శృతిలయలు (గేయాలు)
  3. చిట్టి కథలు (కథల సంపుటి)
  4. పెద్ద చిన్న (కథల సంపుటి)
  5. మబ్బుతెరపై మసక బొమ్మలు (కథల సంపుటి)
  6. అడుక్కుతినే అబ్బాయి (కథల సంపుటి)
  7. గాలిపటం చెప్పింది (కథల సంపుటి)
  8. పిల్లనగ్రోవి (గేయాలు)
  9. చిన్నారిలోకం (గేయాలు)
  10. పండుగ పాటలు (గేయాలు)
  11. ఆటలు పాటలు (గేయాలు)
  12. తాయం (గేయాలు)
  13. మావూరివారు (గేయాలు)
  14. చిట్టికవితలు (గేయాలు)
  15. పాలవెన్నెల
  16. ఏకలవ్యుడు (గేయ కథలు)
  17. చివరకు మిగిలేది (నాటికలు)
  18. నెమలికన్నులు (గేయకావ్యం)
  19. వీర్‌బల్ వినోదాలు (గేయకావ్యం)
  20. నిమ్మతొనలు (గేయకావ్యం)
  21. వారసత్వం (నాటికలు)
  22. ఇందిర అలుక మానింది (కథల సంపుటి)
  23. బంగారుపాప (పద్యకవిత)
  24. స్వర్ణపుష్పాలు[5]
  25. స్నేహధర్మం (గేయ కథ)
  26. అక్కయ్య జాబు (పెద్దకథ)
  27. శాంతిప్రియుడు
  28. ఉద్దేశం ఉంటే చాలు
  29. సాటివారికి సాయం
  30. భారత కథ
  31. రామ కథ
  32. భాగవత కథలు
  33. ఐకమత్యమే మహాబలం
  34. కలిసి ఉంటే కలదు సుఖం

పురస్కారాలు, సత్కారాలు

[మార్చు]
  • 1996లో చింతా దీక్షితులు శతజయంతి సందర్భంగా సన్మానం.
  • 1997లో కొలసాని - చక్రపాణి అవార్డు.
  • 2010లో ఆంధ్ర సారస్వత సమితివారి ఉగాది పురస్కారం.
  • 2012లో బాలసాహిత్య పరిషత్‌ నిర్వహించిన రాష్ట్రస్థాయి గ్రంథాల పోటీల్లో శ్రుతిలయలుకు ప్రథమ బహుమతి.
  • 2012లో మంగాదేవి పురస్కారం.
  • 2012లో గుంటూరు శ్రీవెంకటేశ్వర బాల కుటీర్ వారిచే బాలబంధు బిరుదు ప్రదానం.[6]
  • 2012 లో శృతిలయలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం.[7]
  • 2014లో పార్వతీపురంలో వారి బాలసాహిత్య పురస్కారం.
  • 2015లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2012 (శృతిలయలు పుస్తకానికి)[8]
  • 2016లో "స్వర్ణపుష్పాలు" గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం.

మూలాలు

[మార్చు]
  1. రచయిత: అలపర్తి వెంకటసుబ్బారావు - కథానిలయం వెబ్‌సైటులో
  2. "Chaitanya, Subba Rao win Sahitya Awards". Archived from the original on 2016-06-17. Retrieved 2016-06-30.
  3. 3.0 3.1 3.2 పిల్లల కోసం రాయడం ఇష్టం
  4. పైడిమర్రి, రామకృష్ణ. బాలసాహితీశిల్పులు. హైదరాబాదు: పైడిమర్రి రామకృష్ణ. p. 3.
  5. పింగళి చైతన్యకు యువ పురస్కారం 17-06-2016[permanent dead link]
  6. 10న గుంటూరులో ‘అలపర్తి’కి బాల బంధు బిరుదు ప్రదానం[permanent dead link]
  7. "ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు". Archived from the original on 2020-07-21. Retrieved 2016-06-30.
  8. నవ తెలంగాణ, స్టోరి (16 June 2015). "ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు". NavaTelangana. Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.

ఇతర వనరులు

[మార్చు]