అట్లూరి పుండరీకాక్షయ్య
This article includes a list of references, related reading or external links, but its sources remain unclear because it lacks inline citations. (2023 ఆగస్టు) |
అట్లూరి పుండరీకాక్షయ్య | |
---|---|
జననం | అట్లూరి పుండరీకాక్షయ్య 1925 ఆగస్టు 19 కృష్ణా జిల్లా కైకలూరు |
మరణం | 2012 ఫిబ్రవరి 2 | (వయసు 86)
వృత్తి | సినిమా నటుడు, నిర్మాత, రచయిత. |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు సినిమా నిర్మాత |
అట్లూరి పుండరీకాక్షయ్య (ఆగష్టు 19, 1925 - ఫిబ్రవరి 2, 2012), తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. ఎన్.టి.ఆర్ తో కలిసి "నేషనల్ ఆర్ట్ థియేటర్" స్థాపించి నాటకాలు వేసిన అనుభవం ఆయనకుంది. మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన, మా వారి మంచితనం లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. మహమ్మద్ రఫీని తెలుగు శ్రోతలకు దగ్గరైంది ఈయన సినిమాల ద్వారానే. కర్తవ్యం సినిమాలో విలన్ గా నటుడిగా తెరమీదకు వచ్చాడు.
బాల్యం
[మార్చు]ఆయన కృష్ణా జిల్లా కైకలూరు దగ్గరున్న మెకాసా కలవపూడిలో ఆగస్టు 19, 1925లో పుట్టాడు. ఐదవ తరగతి వరకు అక్కడే చదివాడు. తరువాత వాళ్ళ తండ్రి బెజవాడకు మకాం మార్చడంతో నాన్నకు సహాయంగా ఉండాలని 8వ తరగతితో చదువు ఆపేశాడు. ప్రహ్లాద సినిమాలో మొట్టమొదటిసారిగా నటించాడు. తరువాత వాళ్ళ మామయ్య రైస్ మిల్లులో అకౌంట్లను చూసే పనిలో కుదురుకుని అప్పుడప్పుడు నాటకాలు వేస్తుండేవాడు. అక్కడే ఎన్.టి.ఆర్తో పరిచయం ఏర్పడింది. తరువాత రామారావు సినిమాల్లో వేషాల కోసం మద్రాసుకు వెళ్ళడంతో ఆయన తమ్ముడు త్రివిక్రమరావుతో కలిసి నేషనల్ ఆర్ట్స్ నిర్వహించేవాడు.
సినిమా పరిచయం
[మార్చు]1951 లో రామారావు పిలుపు మేరకు మద్రాసుకు వెళ్ళాడు. అప్పటికే రామారావు నటుడిగా నిలదొక్కుకొని ఉన్నాడు. ఈయన్ను తీసుకెళ్ళి చక్రపాణికి అప్పగించాడు. అలా విజయా సంస్థలో వంద రూపాయల జీతంతో పనిలో చేరాడు. ఒక రోజు రామారావు వచ్చి తను ఒక కంపెనీ ప్రారంభిస్తున్నాననీ, అందుకు ఆయన్ను ప్రొడక్షన్ కంట్రోలర్ గా ఉండమని కోరాడు.
త్రివిక్రమ రావు నిర్మాతగా నేషనల్ ఆర్ట్స్ బ్యానర్ పై పిచ్చి పుల్లయ్య అనే సినిమా ప్రారంభించారు. అందులో పుండరీకాక్షయ్య ఒక పాట కూడా పాడారు. తరువాత వహీదా రెహమాన్ కథానాయికగా జయసింహ అనే సినిమా తీశారు. ఆ తర్వాత రేచుక్క పగటి చుక్క, పాండురంగ మహాత్యం, సీతారామకళ్యాణం మొదలైన సినిమాలకు ప్రొడక్షన్ కంట్రోలర్ గా పనిచేశాడు. సీతారామకళ్యాణం విడుదల సమయంలో అనారోగ్యం పాలయ్యాడు. అదే సమయంలో ఆయన చదివిన అప్పాజీ నవలను సినిమాగా తీయాలనుకున్నారు. అలా ప్రారంభమైందే మహామంత్రి తిమ్మరుసు. ఈ సినిమా గుమ్మడికి బాగా పేరు తెచ్చిన చిత్రం. దీనికి కేంద్ర ప్రభుత్వ నుండి రజత పతకం కూడా లభించింది.
నటుడిగా
[మార్చు]కర్తవ్యం సినిమా కోసం బయటకు చూడ్డానికి సౌమ్యంగా కనిపిస్తూ లోపల విలనీ ఆలోచనలుండే ఒక పాత్రను పరుచూరి బ్రదర్స్ తో రాయించారు మోహన గాంధీ. ఆ వేషం వేయాల్సిందిగా ఏ.యం.రత్నం పుండరీకాక్షయ్యను కోరాడు. ఆయన మొదట్లో ఒప్పుకోకున్నా, తరువాత బలవంతంగా ఒప్పించారు. తరువాత మామా కోడలు, శివయ్య, పోలీస్ బ్రదర్స్, బ్రహ్మ, అసాధ్యులు (1992) మొదలైన 20 తెలుగు, 5 కన్నడ సినిమాల్లో నటించాడు.
సినిమాని కమర్షియల్ గా తీసినా జనానికి సందేశం ఇవ్వాలన్నది ఆయన పాలసీ. అయితే రామారావుని అర్జునుడిగా, నాగేశ్వరరావును కృష్ణుడిగా పెట్టి నరనారాయణ అను శ్రీకృష్ణార్జునులు అనే సినిమా తీయాలని ఉన్నా అది కలగానే మిగిలిపోయింది.
మరణం
[మార్చు]పుండరీకాక్షయ్య చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2012, ఫిబ్రవరి 2 గురువారం నాడు ఉదయం ఆరు గంటలకు కన్నుమూసారు.
మూలాలు
[మార్చు]- అట్లూరి పుండరీకాక్షయ్య గురించి TV9 వార్త
- తెలుగోడు వెబ్ లో అట్లూరి పుండరీకాక్షయ్య గురించిన వ్యాసం[permanent dead link]