Jump to content

అందె వేంకటరాజము

వికీపీడియా నుండి
అందె వేంకటరాజము
అందె వేంకటరాజము
జననంఅందె వేంకటరాజము
(1933-10-14)1933 అక్టోబరు 14
India కోరుట్ల గ్రామం, జగిత్యాల జిల్లా, తెలంగాణా రాష్ట్రం
మరణం2006 సెప్టెంబరు 11
మరణ కారణంచికున్ గున్యా
వృత్తిఅధ్యాపకుడు, గృహవాస్తు పండితుడు
మతంహిందూ
తండ్రిలింబయ్య
తల్లిభూదేవి

అందె వేంకటరాజము తెలంగాణా ప్రాంతానికి చెందిన అవధాని.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1933 అక్టోబరు 14కు సరియైన శ్రీముఖ నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ నవమినాడు లింబయ్య, భూదేవి దంపతులకు జన్మించాడు. ఈతని జన్మస్థలము కరీంనగర్ జిల్లా కోరుట్ల గ్రామం. పద్మశాలి కులస్థుడు. కోరుట్లలో ఏడో తరగతి వరకు చదివిన అందె వేంకటరాజము ఎనిమిదో తరగతి నుండి జగిత్యాల హైస్కూలులో చదివాడు. 1951లో హెచ్చెస్సీ ఉత్తీర్ణుడయ్యాడు.హెచ్చెస్సీ పాసైన తర్వాత అందె వేంకటరాజము నిజామాబాద్ జిల్లాలోని భిక్కునూర్‌లో ఉపాధ్యాయులుగా చేరాడు. ఇతడు మొదట ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. తర్వాత తెలుగు భాషా పరీక్షలను రాసి తెలుగు పండితుడు అయ్యాడు. ఆనాటి తెలుగు భాష పాఠ్యగ్రంథాలు గ్రాంథిక భాషలో ఉండేవి. వాటిని చదివి గ్రాంథిక భాషలో కవిత్వం రాయడం నేర్చుకున్నాడు. అయినప్పటికీ చిన్నప్పటినుంచి చుట్టూ ప్రజలు పాటలు పాడడం విని తాను ఎన్నో పాటలు కట్టాడు. కాని పాటకు పాఠ్యపుస్తకాల్లో సాహిత్య గౌరవం లేకపోవడంతో దాన్ని అలానే వుంచి పద్యం రాయడం నేర్చుకున్నాడు.అష్టావధాన ప్రక్రియలో ప్రవేశించి 88 అష్టావధానాలను పూర్తిచేశాడు.[1] ఇతడు ఎం.ఏ చదివాడు. కాకతీయ విశ్వవిద్యాలయంలో వానమామలై వరదాచార్యులవారి కృతులు-అనుశీలనము అనే సిద్ధాంతగ్రంథాన్ని సమర్పించి డాక్టరేట్ పట్టా పొందాడు. కోరుట్ల డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేసి 1992 జూన్ 30వ తేదీన రిటైరయ్యాడు. గృహవాస్తు పండితుడిగా కూడా ఇతడు రాణించాడు. ఇతడు సెప్టెంబరు 11 సోమవారం 2006న తన 73వ యేట మరణించాడు.

రచనలు

[మార్చు]

అందె వేంకటరాజము వచన కవిత తప్ప మిగతా సాహిత్య ప్రక్రియలన్నీ చేపట్టాడు. నాటకాలు రాశాడు. పాటలు రాశాడు. సాహిత్య విమర్శ రాశాడు. దాదాపు డెబ్భయి కథలు రాశాడు. అర్థరాత్రి సుప్రభాతం, పసివాని మూడో పెళ్ళి, మైసమ్మ భయం, అంగడి వింతలు, విచిత్రమైన భక్తురాలు మొదలైన కథలు కొన్ని ఉదాహరణలు.[2] ఇతడు రచించిన పుస్తకాల జాబితా

  1. నవోదయము (కవితాసంపుటి)
  2. మణిమంజూష (కవితాసంపుటి)
  3. భారతరాణి (నాటికల సంపుటి)
  4. భువనవిజయము (నాటిక)
  5. వానమామలై వరదాచార్యుల వారి కృతులు - అనుశీలనము (సిద్ధాంత గ్రంథము)
  6. మానసవీణ (కవితాసంపుటి)
  7. ఈశ్వర శతకము[3]
  8. మాధవవర్మ[4] (నాటకము)
  9. సాహితీ జీవన తరంగాలు (సాహిత్యవ్యాసాలు)
  10. అవధాన పద్యమంజరి
  11. కళాతపస్విని (కావ్యము)
  12. భజన గీతాలు
  13. శ్రీ గోవిందగిరి తత్వ గీతమాల
  14. నింబగిరి నరసింహ శతకము
  15. విచిత్రగాథలు
  16. స్వర్ణ భారతము (పాటల సంపుటి)

బిరుదములు

[మార్చు]
  1. కవిశిరోమణి
  2. అవధాన యువకేసరి
  3. అవధాన చతురానన[5]

మూలాలు

[మార్చు]
  1. బి.యస్., రాములు. "అష్టావధాని, కవిశిరోమణి అందె వెంకటరాజం గారి సాహితీసేవ". తెలంగాణా సోయి. Archived from the original on 2014-01-14. Retrieved 2014-12-02.
  2. బి.వి.ఎన్., స్వామి. "ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం". తెలంగాణా సోయి. Archived from the original on 2014-12-27. Retrieved 2014-12-02.
  3. అందె, వేంకటరాజము (1 November 1993). ఈశ్వర శతకము. కోరుట్ల: మహేశ్వరీ గ్రంథమండలి.
  4. అందె, వేంకటరాజము (నవంబరు 1993). మాధవవర్మ (1 ed.). కోరుట్ల: మహేశ్వరీ గ్రంథమండలి.
  5. శతకమధురిమ, తెలుగు దివ్వెలు,10 వ తరగతి తెలుగు వాచకం,ప్రభుత్వ ప్రచురణ,2014,పుట-47