అంజి (సినిమా)
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అంజి | |
---|---|
![]() | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
రచన |
|
నిర్మాత | శ్యామ్ ప్రసాద్ రెడ్డి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
కూర్పు | కె. వి. కృష్ణారెడ్డి |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | ఎం. ఎస్. ఆర్ట్ మూవీస్ |
విడుదల తేదీ | జనవరి 15, 2004 |
సినిమా నిడివి | 148 ని. |
భాష | తెలుగు |
అంజి 2004 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో, శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఎం. ఎస్. ఆర్ట్ మూవీస్ పతాకంపై రూపుదిద్దుకున్న ఒక సోషియో ఫాంటసీ తెలుగు చిత్రం. చిరంజీవి, నమ్రతా శిరోద్కర్, టినూ ఆనంద్ ఇందులో ప్రధాన పాత్రధారులు. ఎం. ఎస్. ఆర్ట్స్ మూవీస్ యూనిట్ ఈ చిత్ర కథ, స్క్రీన్ ప్లే సిద్ధం చేయగా, పి. సత్యానంద్ మాటలు రాశాడు. ఛోటా కె. నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించాడు. కె. వి. కృష్ణారెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నాడు.
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందించాడు. 1998 లో ప్రారంభమైన ఈ చిత్రం ఆరేళ్ళ సుదీర్ఘకాలంపాటు నిర్మాణం జరుపుకుని 2004 లో విడుదలైంది. ఈ సినిమాకు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ పురస్కారం అందుకుంది. ఇవే కాక రెండు కెమెరా, మేకప్ విభాగాల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకుంది.
కథ
[మార్చు]- ఉపోద్ఘాతం
భగీరథుడు తన పూర్వీకులను బతికించడం కోసం ఆకాశ గంగను భూమి మీదకు తేవాలనుకుంటాడు. అయితే ఆ శక్తిని తట్టుకోవడం కోసం తన ఆత్మశక్తితో తయారు చేసిన ఆత్మలింగాన్ని భూమి మీద ప్రతిష్టింప జేస్తాడు శివుడు. అలా ఒక ప్రణవ మహాశివరాత్రి నాడు ఆకాశగంగ భూమికి దిగి వచ్చి ఆత్మలింగాన్ని అభిషేకిస్తూ కిందికి ప్రవహిస్తుంది. ఈ ఆత్మలింగం అద్భుతమైన శక్తులను కలిగి ఉంటుంది. ప్రతి 72 ఏళ్ళకు (ఆరు పుష్కరాలు) ఒకసారి వచ్చే ప్రణవ మహాశివరాత్రికి, ఆకాశ గంగ స్వయంగా భూమికి దిగి వచ్చి ఆత్మలింగాన్ని అభిషేకిస్తుంది. ఆ సమయంలో ఆ పవిత్ర జలాన్ని సేవించిన వారికి మరణముండదు. నిత్య యవ్వనులవుతారు. వారికి అద్భుత శక్తులు ప్రాప్తిస్తాయి.
- అసలు కథ
1932 లో భాటియా (భూపిందర్ సింగ్) అనే వ్యక్తి ఎలాగైనా ఆ ఆత్మ లింగాన్ని సంపాదించి ఆకాశ గంగను తాగాలని ప్రయత్నం చేస్తాడు. ఆత్మ లింగాన్ని కాపాడుతూ రెండు ప్రమద గణ శక్తులు కాపలా ఉంటాయి. భాటియా ఒక మాంత్రికుని సాయంతో ఒక ఆ ఆత్మలింగాన్ని చేజిక్కించుకోవాలనుకుంటాడు కానీ ఆ ప్రయత్నంలో విఫలమై తన కుడి చేయిని కోల్పోతాడు. 72 ఏళ్ళ తర్వాత 2004 లో భాటియా అమెరికాలో ఉంటాడు. ఆయన అప్పుడు 99 ఏళ్ళ వృద్ధుడవుతాడు. ఆత్మలింగాన్ని గురించి వెతికి వెతికి విసిగి వేసారి పోయి ఉంటాడు. అదే సమయంలో ఆత్మలింగం గురించి జీవితకాలం పరిశోధన చేసిన ఒక ప్రొఫెసర్ గురించి తెలుస్తుంది. ఆయన తన పరిశోధనలో కనుగొన్న విషయాలన్నీ తన డైరీలో పొందుపరచి ఉంటాడు. దాన్ని ఎలాగైనా కాజేయాలని చూస్తున్న భాటియా నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసిన ప్రొఫెసర్ అమెరికాలో ఉన్న తన విద్యార్థియైన స్వప్న (నమ్రతా శిరోద్కర్) కు చేరవేస్తాడు. దాన్ని అందుకున్న స్వప్న తన ప్రొఫెసర్ కు సహాయం చేయాలనే ఉద్దేశంతో భారతదేశానికి తిరిగి వస్తుంది. కానీ అప్పటికే భాటియా మనుషులు ఆయన్ను చంపేసి ఉంటారు. అదే మనుషులు ఆమెను కూడా వెంబడించడంతో అంజి (చిరంజీవి) తారసపడతాడు. అంజి ఉరవకొండ అరణ్య ప్రాంతంలో ఒక ఆశ్రమం నిర్మించి అక్కడి ప్రజలకు ఆయుర్వేద వైద్యం చేస్తూ, అనాథ పిల్లల్ని చేరదీస్తూ జీవనం సాగిస్తున్న శివన్న (నాగేంద్ర బాబు) దగ్గర పనిచేస్తూ పరోపకారిగా ఉంటాడు.
ఒకరోజు ప్రమాదవశాత్తూ లోయలోపడ్డ అంజికి ఆత్మలింగం తారసపడుతుంది. దానికున్న మహిమ పూర్తిగా తెలియకపోయినా దానికి కొన్ని శక్తులు ఉన్నాయని గ్రహించిన అంజి దానిని ఆశ్రమానికి తీసుకువస్తాడు. దాన్ని గురించి తెలుసుకున్న భాటియా వారిని వెంబడిస్తాడు. ఆకాశగంగ అభిషేకించే రోజు దగ్గరపడుతుండటంతో ఆ ఆత్మలింగాన్ని చేరాల్సిన చోటుకి చేర్చమని అంజికి సలహా ఇస్తాడు శివన్న. దాన్ని అనేక కష్టనష్టాలకోర్చి ఎలా హిమాలయాల్లోకి చేర్చాడు. భాటియాను ఎలా చంపాడన్నది సినిమా చివరి భాగం.
నటీనటులు
[మార్చు]- చిరంజీవి - అంజి
- నమ్రతా శిరోద్కర్ - స్వప్న
- టినూ ఆనంద్ - భాటియా
- భూపిందర్ సింగ్ - చిన్నప్పటి భాటియా
- నాగేంద్ర బాబు - శివన్న
- ఎం. ఎస్. నారాయణ
- రామిరెడ్డి
- సరస్వతమ్మ
- అక్షయ్ రెడ్డి - మాస్టర్ అక్షయ్
- భరత్ - మాస్టర్ భరత్
- వంశీ - మాస్టర్ వంశీ
- మేఘన - బేబీ మేఘన
- కీర్తన - బేబీ కీర్తన
- నిత్య - బేబీ నిత్య
- రమ్యకృష్ణ - ప్రత్యేక గీతం
- రీమా సేన్ - ప్రత్యేక గీతం
- రాజలక్ష్మీ రాయ్ - ప్రత్యేక గీతం
నిర్మాణం
[మార్చు]1998లో శ్యాం ప్రసాద్ రెడ్డి, కోడిరామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన అమ్మోరు చిత్రాన్ని చూసిన చిరంజీవి శ్యాం ప్రసాద్ రెడ్డితో సినిమా చేద్దామన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. శ్యాం ప్రసాద్ కోడి రామకృష్ణను కలిసి ఒక మెగా గ్రాఫిక్ చిత్రాన్ని చేద్దామని చెప్పాడు. కోడి రామకృష్ణ మొదట్లో కొంచెం ఆందోళన పడి ద్విపాత్రాభినయం ప్రధానంగా నడిచే ఒక వ్యాపారాత్మక కథాంశాన్ని చేద్దామని ప్రతిపాదించాడు. కానీ శ్యాం ప్రసాద్ మాత్రం అమ్మోరును మించిపోయే గ్రాఫిక్ చిత్రం వైపే మొగ్గు చూపాడు. చిరంజీవి కూడా అందుకు పూర్తిగా సహకరిస్తానని కోడి రామకృష్ణకు మాట ఇచ్చాడు. అప్పుడు కథా రచనకు పూనుకున్నాడు కోడి రామకృష్ణ.[1]
1998లో ప్రారంభమైన ఈ సినిమా అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం, బడ్జెట్ కావలసి వచ్చింది. ఆరేళ్ళ పాటు ఆలస్యమైన ఈ సినిమా 2004 లో విడుదలైంది. ఒక ఇంటర్వెల్ దృశ్యాలు తీయడానికి సుమారు నెల రోజులు పట్టింది. గ్రాఫిక్స్ పనిని సుమారు ఐదారు దేశాల్లో చేయించారు. ఇందులో కీలకమైన ప్రతినాయకుని పాత్రకు మొదటి నుంచే టినూ ఆనంద్ ను ఎన్నుకున్నారు.[2] సినిమా ప్రారంభంలో ఆత్మలింగం కోసం ప్రయత్నించే ఒక మాంత్రికుడు ఉంటాడు. ఈ పాత్ర కోసం ఎల్. వి. ప్రసాద్ ఆసుపత్రి దగ్గర భిక్షాటన చేసే వ్యక్తిని ఎన్నుకున్నారు.[3]
పాటలు
[మార్చు]- అబ్బో నీ అమ్మ గొప్పదే - రచన: భువనచంద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కల్పనా రాఘవేంద్ర
- ఓం శాంతి ఓం శాంతి - రచన: చంద్రబోస్ - గానం: గంగ, శంకర్ మహదేవన్
- గుమ్మా గులాబీ కొమ్మా - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి - గానం: కార్తిక్ రాజా, షాలినీ సింగ్
- చికుబుకు పోరీ... చికుబుకు పోరీ - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి - గానం: కల్పనా రాఘవేంద్ర, శంకర్ మహదేవన్
- మానవా మానవా ఏమి కోరిక. - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి - గానం: సందీప్, సునీత
- మిరపకాయ బజ్జిలిస్తవా... - రచన: భువనచంద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రాధిక
ఇతర విశేషాలు
[మార్చు]- ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ కు జాతీయ పురస్కారం లభించింది.[4]
- చాలా పరిశోధన చేసి ఎక్కువకాలం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశం కోసం చిరంజీవి ఒకే షర్ట్ ఉతకకుండా రెండేళ్లు వేసుకోవాల్సివచ్చింది.
- చిరంజీవితో కమర్షియల్ గా ద్విపాత్రాభినయంలో ఒక కథ ఉందని దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పగా శ్యాంప్రసాద్ రెడ్డి, చిరంజీవి ఇద్దరూ గ్రాఫిక్ సినిమా వైపే మొగ్గుచూపడంతో దర్శకుడు ఫాంటసీ కాన్సెప్ట్ సినిమా కథతో సినిమా తీసాడు.
పురస్కారాలు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగము | లబ్ధిదారుడు | ఫలితం |
---|---|---|---|---|
2004 | నంది పురస్కారాలు[5] | ఉత్తమ ఛాయాగ్రహకుడు | ఛోటా కె.నాయుడు | గెలుపు |
2004 | నంది పురస్కారాలు | ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ | చంద్రరావు | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ "'అంజి' వెనుక అద్భుత రహస్యాలు". iDreamPost.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-04-01. Retrieved 2020-09-09.
- ↑ Anna, M. M. Vetticad. "Actor Tinnu Anand to play a centenarian in Telugu film". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-09-08.
- ↑ "'అంజి' కోసం ఒకే డ్రెస్ రెండేళ్లు వేసుకున్న చిరు - interesting facts about chiranjeevi anji movie". www.eenadu.net. Retrieved 2021-02-17.
- ↑ "Phani Eggone, FireFly Creative Studio, On What it Takes to Win the Indian National Award for Best Visual Effects". yourstory.com. యువర్ స్టోరీ. Retrieved 5 January 2018.
- ↑ Nandi Awards 2004