Jump to content

యోగా

వికీపీడియా నుండి
(Yoga నుండి దారిమార్పు చెందింది)
పద్మాసనంలో ధ్యాన నిమజ్ఞుడైన శివుడు.

యోగా (సంస్కృతం: योगः) అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు. వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. హఠయోగంలో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది. బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను దీని ప్రాధాన్యత కనిపిస్తుంది.

ప్రస్తావన

[మార్చు]

హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. సామాన్య శక పూర్వము 100వ శకము 500వ శకము మధ్య కాలములో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు, రామాయణము, భాగవతము, భారతము, భగవద్గీతలలో యోగా ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగసూత్రాలు గా క్రోడీకరించాడు. సూత్రము అంటే దారము. దారములో మణులను చేర్చినట్లు యోగశాస్త్రాన్ని పతంజలి ఒకచోట చేర్చాడు. హఠయోగ ప్రదీపిక, శివ సంహిత దానిలో ప్రధాన భాగాలు. అంతర్భాగాలైన కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తియోగము మొదలైనవి హిందూతత్వంలో భాగాలు. వ్యాసముని విరచితమైన భగద్గీతలో యోగాసనాలు పదినెనిమిది భాగాలుగా విభజించి చెప్పబడినవి.

యోగము అంటే ఏమిటి?

[మార్చు]

"యుజ్" అనగా "కలయిక" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" లేదా "యోగము" అనే పదం ఉత్పన్నమైంది. "యుజ్యతేఏతదితి యోగః", "యుజ్యతే అనేన ఇతి యోగః" వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము - యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయుట. మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు త్రోవచేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి. వాటిని వివిధయోగ విధానాలుగా సూత్రకారులు విభజించారు[1].

"యోగము" అంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి. భగవద్గీతలో అధ్యాయాలకు యోగములని పేర్లు.

భారతీయ తత్వ శాస్త్రంలోని ఆరు దర్శనాలలో "యోగ" లేదా "యోగ దర్శనము" ఒకటి. ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే పతంజలి యోగసూత్రాల ప్రకారం "యోగం అంటే చిత్త వృత్తి నిరోధం". స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం. అభ్యాస వైరాగ్యాల వలన చిత్త వృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా సాధించే ప్రక్రియను "పతంజలి అష్టాంగ యోగం' అంటారు. దీనినే రాజయోగం అంటారు (పతంజలి మాత్రం "రాజయోగం" అనే పదాన్ని వాడలేదు) [2].[3]

యోగంలో విధాలు

[మార్చు]

పతంజలి యోగసూత్రాలు

[మార్చు]

పతంజలి యోగసూత్రాలు నాలుగు అధ్యాయాల సంకలనము. సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అనే నాలుగు అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధికి కావలసిన యోగాలు. శరీర ధారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకి, రోగనిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగము వివరిస్తుంది.

  1. సమాధిపద ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి పరమానంద స్థితిని సాధించడము దీనిలో వివరించబడింది.
  2. సాధనపద కర్మయోగాన్ని, రాజయోగాన్నిసాధన చెయ్యడము ఎలాగో దీనిలో వివరించబడింది. ఎనిమిది అవయవాలను స్వాధీనపరచుకోవడం ఎలా అని రాజయోగములో వివరించబడింది.
  3. విభూతియోగము జాగరూకత, యోగ సాధనలో నిపుణత సాధించడమెలాగో దీనిలో వివరించబడింది.
  4. కైవల్యపద మోక్షసాధన ఎలా పొందాలో దీనిలో వివరించబడింది. ఇది యోగశాస్త్రము యొక్క ఆఖరి గమ్యము.

సంప్రదాయంలో యోగా

[మార్చు]

ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్లు పురాణాలలో వర్ణించబడి ఉంది. లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాసినియే, మహా విష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించబడింది. తాపసులు తమ తపసును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన. ఇంకా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు హిందూ సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి. బుద్ధ సంప్రదాయంలో, జైన సంప్రదాయంలోను, సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సింధు నాగరికత కుడ్య చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు. 11 వ శతాబ్డము న ఘూరఖ్స్ నాద్ శిశ్యుడగు స్వామి స్వాత్వారామ ముని హఠ్ యొగము అను యొగ శాస్త్ర గ్రంథమును వ్రాసి యున్నారు. ఇందు ఆసనములను, ప్రాణాయామ పద్ధతులను, బంధములను, ముద్ద్రలను, క్రియలను సవిస్తారముగ వ్రాసి యున్నారు. అనేక వేల ఆసనములలో 84 ఆసనములను ముఖ్యములుగ చెప్పబడెనవి. ముఖ్యముగ ధ్యానమునకు కావలసిన సుఖాసనము, సిద్దాసనము, అర్ధ పద్మాసనము, పద్మాసనములు ముఖ్యమని చెప్ప బడింది. ఇదె విధముగ పాతంజలి యొగ శాస్త్రమున - స్థిరసుఖ మాసనమ్- అని ఆసనము నకు నిర్వచనము ఉంది. ప్రాణాయామ సాధనలో - సూర్య భేదన, ఉజ్జాయి, శీతలి, సీత్కారి, భస్త్రిక, భ్రామరి, ప్లావని, మూర్చ - ఇతి అష్ట కుంభకాని ( 8 ప్రాణాయమములు) చెప్ప బడెను. జాలంధర బంధము, మూల బంధము, ఉడ్యాన బంధము - ఈ మూడు బంధములు ముఖ్యమని చెప్పబడెను. ముద్రలలో మహాముద్ర, మహాబంధ, మహాభేధ - ముఖ్య మగు ముద్రలుగ చెప్ప బడెను. శరీరమునకు బహిర్ అంతర్ శుచి చాల అవసరముగ ఈ హథయొగమున ప్రధాన అంశముగ చెప్పబడింది.-ధవుతి, నేతి, వస్తి, నొలి, త్రటకం, తధా కఫాల భాతి ఏతాని షట్ కర్మాణి - అని వివరణగలదు..

భగవద్గీతలో యోగములు

[మార్చు]

భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి "యోగము" అనే పేరు ఉంది. ఇక్కడ "యోగం" అనే పదం సామాన్య యోగాభ్యాసం కంటే విస్తృతమైన అర్ధంలో, జ్ఞాన బోధ లేదా మార్గం అనే సూచకంగా వాడబడింది.

  • అర్జునవిషాద యోగము: యుద్ధ భూమిలో తాతలు తండ్రులు, సోదరులు, గురువులు, మేనమామలు మొదలైన ఆప్తులను శత్రు సేనలో చూసిన అర్జునుడు వారిని వధించవలసి వచ్చినందుకు అర్జుని కమ్ముకున్న విషాదము గురించిన వర్ణన.



  • కర్మ యోగము:- కర్మ చేయడంలో నేర్పు, దానిని యోగములా మార్చుకోవడం ఎలా అని చెప్పే యోగము.


  • జ్ఞాన యోగము:- నర, నారాయణూల జన్మలు, భగవంతుని జన్మలోని శ్రేష్టమైన గుణాలు.జ్ఞాన సముపార్జన మార్గాల వివరణ.


  • కర్మసన్యాస యోగము:- కర్మలను ఫలితాలను సన్యసించి భగవంతునికి అర్పించి ఆయన ఇచ్చిన దానిని ప్రసాదంగా స్వీకరించడం ఎలా అన్న వివరణ.


  • ఆత్మసంయమ యోగము:- ధ్యానము, ఏకాగ్రతల ద్వారా మనోనిగ్రహము సాధించడము, ఆహారనియమాలు, సాధనా ప్రదేశము ఏర్పాటు వర్ణన.యోగి గుణగాణాల వర్ణన, భగవంతుని సర్వవ్యాఇత్వము, యోగభ్రష్టత ఫలితాల వర్ణన.



  • అక్షరపరబ్రహ్మ యోగము:- బ్రహ్మతత్వము, ఆధ్యాతకత, కర్మతత్వము, ఆది దైవతము, ఆది భూతముల వర్ణన.జీవుని జన్మలు, జీవ ఆవిర్భావము, అంతము, పుణ్యలోక ప్రాప్తి, అత్యకాలములో భగవన్నామస్మరణ ఫలం.



  • విభూతి యోగము:-భగవంతుని చేరే మార్గము.భగవంతుని విశ్వ వ్యాపికత్వము వర్ణన.



  • భక్తి యోగము:- భక్తి యోగ వర్ణన.భగవంతుని ప్రియము పొందలిగిన భక్తుని గుణగణాల వర్ణన.







వ్యాప్తి ఆదరణ ప్రయోజనము

[మార్చు]

ఇతర వ్యాయామాకంటే భిన్నమైన యోగాభ్యాసము దానిలో నిబిడీకృతంగా ఉన్నఆద్ధ్యాత్మిక భావం కారణంగా దేశవిదేశాలలో విశేషప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. ముఖ్యముగా పాశ్చాత్యదేశాల యోగా ప్రాచుర్యము, ఆదరణ అమోఘమైనది. పాశ్చాత్య దేశీయులకు యోగా మీద ఉన్న విశేషమైన మక్కువ, ఆకర్షణ లోక విదితం. బుద్ధ ఆరామలాలో ఇచ్చేశిక్షణలో యోగా కూడా ఒక భాగమే. వారి వేషధారణ క్రమశిక్షణ ప్రపంచ ప్రాముఖ్యత ఆకర్షణ సంతరించుకున్నది. భారతీయ సంప్రదాయిక యోగశిక్షణా తరగతులను అనేక దేశాలలో నిర్వహిస్తున్నారు. ఇతర వ్యాయాయములు శరీరదారుఢ్యాన్ని మాత్రమే మెరుగు పరచడములోదృష్టిని సారిస్తాయి. యోగాభ్యాసము ధ్యానం, ప్రాణాయామం లాంటి ప్రక్రియలు మానసిక ఏకాగ్రత వలన మానసిక ప్రశాంతతను కలిగించి మానసిక ఆరోగ్యానికి కూడా దోహద పడుతుంది. మానసిక వత్తిడులు, హృద్రోగము, రక్తపోటు లాంటి వ్యాధుల తీవ్రత తగ్గించటానికి తోడ్పడుతుందని పలువురి విశ్వాసం. సనాతన సంప్రదాయమైన యోగా అధునిక కాలంలో కూడా అనేకమంది అధునికుల అభిమానాన్ని చూరగొన్నది.

కొన్ని విశేషాలు

[మార్చు]
బౌద్ధ సంప్రదాయంలో యోగా

4వ 5వ శతాబ్దంలో బుద్ధ సంప్రదాయిక పాఠశాల యోగాచార తత్వము, భౌతికము బోధించబడినవి. జెన్ (చెన్) మహాయాన బుద్ధిజమ్ పాఠశాలలలో చెన్ అంటే సంస్కృత ధ్యాన రూపాంతరమని భావిస్తున్నారు. ఈ పాఠశాలలను యోగా పాఠశాలలుగానే పాశ్చాత్యులు గుర్తిస్తున్నారు.

టిబెటన్ బౌద్ధం

టిబెట్ బుద్ధిజమ్ యోగాను కేంద్రీకృతము చేసుకొని ఉంది.నిగమ సంప్రదాయంలో సాధకులు మహాయోగముతో ప్రారంభించి, అను యోగము నుండి అతి యోగము వరకు యోగశాస్త్ర లోతులను చూడటనికి ప్రయత్నిస్తారు. షర్మ సంప్రదాయాంలో అనుత్తర యోగము తప్పనిసరి.తాంత్రిక సాధకులు త్రుల్ కోల్ లేక ప్రజ్ఞోపాసన సుర్య, చంద్రులను ఉపాసించినట్లు దలైలామా వేసవి దేవాలయ కుడ్య చిత్రాలు చెప్తున్నాయి.

తాంత్రిక శాస్త్రంలో యోగము

తాంత్రికులు మాయను ఛేదించి భగవంతునిలో ఐక్యము (మోక్షము) కావడానికి షట్చక్రోపాసన చేస్తారు.దీనికి ధ్యానయోగము ఆధారము.దీనిని కుండలినీ ఉపాసన అంటారు.మార్గము ఏదైనా యోగశాస్త్ర లక్ష్యము మోక్షము.


ముస్లిములలో యోగం

మలేసియాలో ముస్లిములు మంత్రాలతోకూడిన యోగా ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకమన్న ఉద్దేశంతో ఫత్వా కౌన్సిల్‌ నిషేధించింది.ప్రధాని అబ్దుల్లా బడావీ మంత్రాలు పఠించకుండా యోగాభ్యాసం చేసుకోవచ్చని అక్కడి ముస్లింలకు కొన్నిమినహాయింపులు ప్రకటించారు.ప్రార్థనలు లేకుండా శారీరక ప్రక్రియ మాత్రమే చేసేటట్లయితే ఇబ్బంది లేదు. ముస్లింలు బహుదేవతారాధనకు అంత సులభంగా మొగ్గుచూపరని నాకు తెలుసు అని ఆయన అన్నారు.

క్రైస్తవులలో యోగం

హిందూమంత్రాలకు బదులు క్రైస్తవులు జీసస్ మేరీ ల స్తోత్రపాఠాలతో కూడిన ధ్యానంతో యోగసాధన చేస్తున్నారు.


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నిత్యజీవితంలో యోగ - రచన : బి. వేణుగోపాల్ - ప్రచురణ: శ్రీ రాఘవేంద్ర యోగ పబ్లికేషన్స్, ఆదోని, కర్నూలు జిల్లా (1999, 2000)
  2. యోగ సర్వస్వము - రచన : చెరువు లక్ష్మీనారాయణ శాస్త్రి- ప్రచురణ: తిరుమల తిరుపతి దేవస్థానములు (2008)
  3. "యొగ యొక్క ఫలితాలు". Archived from the original on 2017-11-12. Retrieved 2017-11-14.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=యోగా&oldid=4345125" నుండి వెలికితీశారు