Jump to content

పార్శ్వనాథ జైన ఆలయం, గుమ్మిలేరు

వికీపీడియా నుండి
(Parshvanath Jain temple, Gummileru నుండి దారిమార్పు చెందింది)
శ్రీ శంకేశ్వర పార్శ్వనాథ జైన ఆలయం, గుమ్మిలేరు

శ్రీ శంకేశ్వర పార్శ్వనాథ జైన ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ జైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ జైన ఆలయం (తూర్పు గోదావరి) ప్రస్తుత కోనసీమ జిల్లాలో ఆలమూరు మండలంలోని గుమ్మిలేరు గ్రామంలో ఉంది. స్థానికంగా ఈ ఆలయాన్ని ‘గుమ్మిలేరు జైన ఆలయం’ అని కూడా పిలుస్తారురు. పూర్తిగా పాలరాతితో నిర్మించబడిన ఈ జైన ఆలయంలో మూలనాయకుడుగా (మూల విరాట్టు) 23 వ జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుడు నెలకొని ఉన్నాడు.

ఆలయ విశేషాలు

[మార్చు]
  • ఆలయనిర్మాణం పూర్తిగా తెల్ల పాలరాతి (White Marble) తో జరిగింది. లోహాన్ని ఎక్కడా ఉపయోగించలేదు.
  • ఈ జైన ఆలయంలో మూల నాయకుడుగా 23 వ జైన తీర్థంకరుడు అయిన ‘పార్శ్వనాథుడు’ ప్రతిష్ఠించబడ్డాడు.
  • ఈ ఆలయంలో మూల నాయకుడి విగ్రహం చారిత్రకంగా ప్రాముఖ్యత కలిగివుంది. సుమారుగా 2000 సంవత్సరాలకు క్రితం నాటి ఈ పురాతన విగ్రహాన్ని (పార్శ్వనాథుడు) మౌర్యుల కాలం నాటిదిగా భావిస్తున్నారు.[1]

ఆలయ నిర్మాణ నేపధ్యం

[మార్చు]

1977 లో ఆలమూరు మండలంలోని గుమ్మిలేరు గ్రామంలో కాలువ కోసం త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ పురాతన జైన విగ్రహం బయల్పడింది. గ్రామస్థులు తొలుత దానిని బుద్ధుని విగ్రహంగా భావించి పూజించడం మొదలుపెట్టారు. అయితే నిపుణుల పరిశీలనలో ఆ పురాతన విగ్రహం 23వ జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుడి విగ్రహంగా తేలింది. విగ్రహకాలం సుమారుగా 2000 సంవత్సరాలకు పూర్వం ఉండవచ్చని గుర్తించారు.[1] మౌర్యుల కాలం నాటిదిగా భావించబడిన ఈ తీర్థంకరుని విగ్రహం అర్థ పద్మాసన ముద్రలో ఆశీనుడిగా కనిపిస్తున్నది. ఈ పురాతన విగ్రహాన్ని రాజమండ్రికి తరలించడానికి చేసిన ప్రయత్నాలను, స్థానిక ప్రజలు గట్టిగా ప్రతిఘటించడంతో జైన సంఘం ఈ విగ్రహాన్ని గుమ్మిలేరులోనే వుంచి, అది బయల్పడిన ప్రదేశంలోనే ఒక సుందరమైన ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించింది.

ఆలయ నిర్మాణం

[మార్చు]

మండపేట-ఆలమూరు కలిపే రహదారి వెంబడి, గుమ్ములూరు గ్రామంలో చుట్టూ పచ్చని పొలాల మధ్యన ఈ ఆలయాన్ని నిర్మించారు. జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుడి గౌరవార్ధం నిర్మించబడిన ఈ ఆలయానికి నిర్మాణపరంగా ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయ నిర్మాణం కోసం రాజస్థాన్ నుంచి తెప్పించిన ఖరీదైన తెల్ల పాలరాతిని వాడారు. ఇనుము తదితర లోహాలను ఉపయోగించలేదు. 2006 లో జైన ఆచార్యుడు శ్రీ జయంతసేన సూరేశ్వర్ జీ మహరాజ్, ఈ పాలరాతి ఆలయంలో అర్ధ పద్మాసన రీతిలో వున్న పురాతన పార్స్వనాథ విగ్రహాన్ని మూల నాయకునిగా ప్రతిష్ఠించడం జరిగింది. సదూర ప్రాంతాల నుంచి వచ్చే జైన భక్తుల సౌకర్యార్ధం ఈ ఆలయం చుట్టూ వున్న ఆవరణలో వసతి గృహాలను నిర్మించారు. జైనులకు పుణ్యక్షేత్రంగా వున్న ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుండి జైనులు తరలి వస్తుంటారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

రిఫరెన్సులు

[మార్చు]
  • "జైన గోదావరి". (Andhrojyothi Bureau Network). Andhra Jyothi ePaper. 8 July 2015. Retrieved 24 September 2017.[permanent dead link]
  • "Jain Temple, Gummileru, Andhra Pradesh". Tour my India.com. Archived from the original on 5 జూలై 2017. Retrieved 24 September 2017.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Jain Temple, Gummileru, Andhra Pradesh.