Jump to content

కమ్యూనిజం

వికీపీడియా నుండి
(Communism నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసము కమ్యూనిజం అనే రాజకీయ , సామాజిక సిద్ధాంతము గురించి మాత్రమే. కమ్యూనిస్ట్ సంస్థలు/కమ్యూనిస్ట్ పార్టీల గురించి కాదు.

కమ్యూనిజం(Communism) అనునది ఒక రాజకీయ, సాంఘిక, ఆర్థిక సిద్ధాంతం. కమ్యూనిజం అనే పదం 'అందరికీ చెందిన' అనే అర్థం వచ్చే కమ్యూనిస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఉమ్మడి యాజమాన్యపు ఆస్తి అనే భావన గ్రీకుల కాలం నుండి ఉంది. కమ్యూనిజం యొక్క ముఖ్య ఆశయం వర్గ, ఆర్థిక, సామాజిక తారతమ్యాలు లేని ఒక నూతన సమాజ స్థాపన. ఉత్పత్తికేంద్రాల, వనరుల ఉమ్మడి యాజమాన్యం అనేది కమ్యూనిజం మూలసూత్రం. కమ్యూనిజం అనునది సోషలిజం యొక్క అత్యుత్తమ దశ అని కూడా ఒక అభిప్రాయం ఉంది. ఇది ఒక జీవన విధానమని చెప్పవచ్చును. మానవ చరిత్రలో జీవన విధానాన్ని పూర్తిగా మార్చాలని ప్రతిపాదించిన మొట్టమొదటి సిద్ధాంతమని చెప్పవచ్చు. ఇటువంటి ప్రతిపాదన 19వ శతాబ్దంలో చేయబడినా, ఆచరణలోకి 20వ శతాబ్దపు మొదటి రోజులలో వచ్చింది. కమ్యూనిజం అనేది మొదట యూరప్ ఖండమునందు అవిర్భవించింది. మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్నిక అయిన సభ్యులు ప్రాన్స్ దేశానికి చెందినవారు. అలా ఎన్నికయిన కమ్యూనిస్ట్ ప్రతినిధులు, శాసన సభలో స్పీకరుకు ఎడమ వైపున కూర్చుండేవారట. అందుకని వారిని "లెఫ్టిస్టులు" (వామ పక్షాలు) అని కూడా పిలవటం పరిపాటైనది. ఇప్పటికీ కమ్యూనిస్టులను "లెఫ్టిస్ట్" లనే వ్యవహరిస్తున్నారు.ఇక తెలంగాణలో 1940 నుండి 1952 వరకు తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటం చెయ్యడం ద్వారా కమ్యూనిజం తెలంగాణలో భారతదేశంలో బాగా బలపడింది.


కమ్యూనిజం అంటే ఏమిటి

[మార్చు]

సామాజికముగా, మానవుడి జీవన విధానాలు అనేక రకాలు. అవి అన్నీ కూడా మానవుడి సంఘ జీవన విధానానం మీద ఆధారపడి ఉంటాయి. మానవుడు సంఘ జీవిగా పరిణామ క్రమానికి మూలం శ్రమ విభజన. అందరూ అన్ని పనులు చెయ్యలేరు, తమకు కావలిసిన వస్తువులు వసతులు తమకు తామే సమకూర్చుకోలేరు. అందువలన, సమాజం క్రమంగా శ్రమ విభజన అంతర్లీనంగా పరిణామం చెందినది. ఈ పరిణామ క్రమంలో అనేక అసమానతలు ఏర్పడతాయి. ఇటువంటి అసమానతలను పొగొట్టే అవకాశాలను పొందుపరిచి తద్వారా మానవుడి సంఘ జీవన విధానాన్ని సంస్కరించే ప్రయత్నమే కమ్యూనిజం అని చెప్పుకోవచ్చు. అటువంటి 'సంస్కరణకు ' సామాజిక జీవన విధానం, పరిపాలనా విధానం, ఆర్థిక విధనాలలో మౌలిక మార్పులు తప్పనిసరిగా తీసుకుని రావాలని, తద్వారా సమాజంలోని అనేక అసమానతలను ఎలా తొలగించవచ్చునో చేయబడిన ప్రతిపాదనల రూపమే కమ్యూనిజం. ఈ ప్రయత్నంలో కావలిసిన మార్పులు 'ప్రజా విప్లవం' ద్వారానే సాధ్యం అని కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తలు అభిప్రాయపడతారు. ఏతా వాతా, కమ్యూనిజం సామాజిక/ఆర్థిక అసమానతలను పోగొట్టటానికి మార్గాలను సూచించిన ఒక సిద్ధాంతము.

ఎవరు ప్రతిపాదించారు

[మార్చు]
కార్ల్ మార్క్స్
ఫ్రెడ్రిక్ ఎంగెల్స్

క్రీ.పూ.300లో గ్రీకు తత్వవేత్త అయిన ప్లేటో తన 'ద రిపబ్లిక్' గ్రంథంలో ఈ విధమైన భావన గురించి చర్చించాడు. శతాబ్దాలనుండి అనేక మంది తత్వవేత్తలు, సంస్కర్తలు ఉమ్మడి యాజమాన్యం, శ్రమకు తగ్గ ప్రతిఫలం లాంటి సామ్యవాద ఆదర్శాల గురించి విస్తృతంగా వ్రాశారు చర్చ చేశారు. ఈ భావాలన్నింటినీ జర్మనీకి చెందిన కార్ల్ మార్క్స్, ఫెడ్రిక్ ఏంజిల్స్ 1848లో రచించిన కమ్యూనిష్టు ప్రణాళిక (కమ్యూనిస్ట్ మానిఫెస్టో) లో మొట్టమొదటిసారి వెల్లడించారు.

  • సంతోషకరమైన, సామరస్య పూర్వకమైన సమాజాన్ని నిర్మించుటకు శ్రామికులను విప్లవోన్ముఖులను చేయటమొక్కటే మార్గమని మార్క్స్ యోచించాడు.
  • సామ్యవాద విజయం అనివార్యమని మార్క్స్ విశ్వసించాడు.
  • చరిత్ర కొన్ని స్థిరమైన నియమాలను అనుసరించి ఒక దశనుండి తరువాత దశకు పురోగమిస్తుంది అని మార్క్స్ బోధించాడు. ప్రతి దశ సంఘర్షణల మయమై వాటి ద్వారానే ఉన్నతదశలకు చేరుకుని అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో సామాజిక అభివృద్ధి యొక్క అత్యున్నత, ఉత్కృష్ట దశ సామ్యవాదం అని మార్క్స్ ప్రకటించాడు.
  • చారిత్రక అభివృద్ధిలోని విభిన్న దశలను అర్థంచేసుకోవటానికి వస్తూత్పత్తిలోని వివిధ వర్గాల ప్రజల మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవటం అత్యావశ్యకం.
  • కర్మాగారాల వంటి ఉత్పత్తి సాధనాల యజమానులు (అంటే పాలక వర్గం) వారి ఆర్థిక శక్తితో ప్రజల మీద తమ జీవన విధానాన్ని బలవంతంగా రుద్దుతారు.
  • పాలక వర్గం తనంతట తానుగా ఎప్పుడూ తన అధికారాన్ని వదులుకోదు కనుక సంఘర్షణ, హింస అనివార్యం.
  • ప్రధానమైన ఉత్పత్తి వనరులన్నీ వ్యక్తిగత ఆస్తి రూపంలో ఉండే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను నిర్మూలించాలని మార్క్స్ పిలుపునిచ్చాడు.
  • పెట్టుబడిదారీ వ్యవస్థలో బూర్జువా వర్గానికీ, శ్రామిక వర్గానికీ మధ్యన సంఘర్షణ నెలకొని ఉంటుందని మార్క్స్ భావించాడు.
  • బూర్జువా వర్గమంటే ఉత్పత్తి వనరుల స్వంతదారులు, వాటి నిర్వాహకులు.శ్రామిక వర్గమంటే పనివారు.
  • పెట్టుబడిదారీ వ్యవస్థలో బూర్జువాలు లాభాలు స్వీకరిస్తారు కనుక పనివారికి వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కదు.
  • పెట్టుబడిదారీ వ్యవస్థలో సంపద కొద్దిమంది చేతిలో పోగుపడి మధ్యతరగతికి చెందిన అనేకమంది శ్రామిక వర్గంలోకి నెట్టివేయబడతారు. శ్రామిక వర్గ జీవన ప్రమాణాలు అంతకంతకూ దిగజారతాయి అని మార్క్స్ విశ్వసించాడు.
  • శ్రామిక వర్గం పెట్టుబడిదారీ వ్యవస్థ మీద తిరగబడి పరిశ్రమలను, ప్రభుత్వాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటుంది.
  • శ్రామిక వర్గం మొదట ఒక సోషలిష్టు రాజ్యాన్ని నెలకొల్పుతుంది.
  • అది వర్గరహిత కమ్యూనిష్టు సమాజాన్ని స్థాపించుట కొరకు పనిచేసే శ్రామికవర్గ ప్రభుత్వం.
  • ఇది శ్రామిక వర్గ నియంతృత్వంగా పిలువబడుతుంది. వర్గాలు లేకుండా పోయిన తరువాత ప్రతి ఒక్కరూ శాంతి సౌభాగ్యాలతో, స్వేచ్ఛతో జీవిస్తారు.

ఈ ప్రతిపాదనలనుండి, రష్యాకు చెందిన వి.ఐ.లెనిన్, కమ్యూనిజాన్ని ఒక రాజకీయ ఉద్యమముగా విప్లవ రూపాన్ని అభివృద్ధి చేశాడు, తద్వారా కమ్యూనిస్ట్ సిద్ధాంతమును సామాన్య ప్రజల స్థాయికి తీసుకుని వెళ్ళడంలో సఫలీకృతుడయ్యాడు.

కమ్యూనిజంలో రకాలు

[మార్చు]

కమ్యూనిజంలో తిరిగి అనేక వర్గాలు ఉన్నాయి. వీటిలో మార్క్సిజం, లెనినిజం ముఖ్యమైనవి. మార్క్సిజం అనునది జర్మనీకి చెందిన కార్ల్ మార్క్స్ ఆలోచనల నుండి పుట్టినది కాగా లెనినిజం రష్యాకు చెందిన వ్లాడిమీర్ లెనిన్ భావనలకనుగుణంగా ఏర్పాటైన సిద్ధాంతము.

మార్క్స్ భాష్యం

[మార్చు]
  • వర్గపోరాటం అనేది మార్క్స్ సిద్దాంతానికి కేంద్ర బిందువు.
  • మార్క్స్ సిద్ధాంతం ప్రకారం ప్రతి సమాజములోను పీడక(పాలక)వర్గం, పీడిత(పాలిత)వర్గం అను రెండు ముఖ్య వర్గాలు ఉంటాయి.
  • సాధారణంగా పీడక వర్గం సమాజంలోని అధిక శాతం ఆస్థులపై అధికారం కలిగి ఉంటుంది.
  • మార్క్స్ సిద్ధాంతం ప్రకారం సమాజం పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి కమ్యూనిస్ట్ వ్యవస్థకు మారుటకు కొంత కాలం పడుతుంది.
  • ఈ పరిణామదశ నే మార్క్స్ "కార్మిక వర్గ నియంతృత్వ విప్లవదశ"గా అభివర్ణించాడు.

పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి కమ్యూనిస్ట్ వ్యవస్థ అనే మార్క్స్ సిద్ధాంతం నిజ ప్రపంచములో ఆచరించబడలేదు. కానీ సాధారణంగా, కమ్యూనిస్ట్ పార్టీల పాలనలో ఉన్న దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలుగా, కార్మిక ప్రభుత్వాలుగా చెలామణి అయ్యాయి.

మార్క్స్ వాద వాస్తవం

[మార్చు]

ఐతే మార్క్స్ ఊహించిన పరిణామాలేవీ వాస్తవంలో జరగలేదు. 20వ శతాబ్దారంభానికి యూరప్ లోని పారిశ్రామిక దేశాలలో పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత విజయవంతంగా ముందుకు సాగిపోతున్నది. ఆర్థిక పరమైన ఆధునికత మధ్యతరగతిని మరింత పెంచింది. నిత్యావసరాల అధికోత్పత్తి, ప్రజాస్వామ్య అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాయి. ఈ కాలంలో మార్కిస్టులలో చాలా మంది ప్రజాస్వామ్య పరిధిలోనే సామాజిక న్యాయం సాధించబడుతుందని విశ్వసించనారంభించారు. ఇలా తమ భావాలను మార్చుకున్న మార్క్సిష్టులు ప్రజాస్వామ్య సోషలిష్టులు(సోషల్ డెమొక్రాట్స్) గా పిలువబడ్డారు. వీరంతా సామాజిక న్యాయం విప్లవాత్మకంగా కాక పరిణామాత్మకంగా వస్తుందని భావించారు.

లెనిన్ భాష్యం

[మార్చు]
వి. ఐ. లెనిన్

ఐతే ఈ పరిస్థితిని లెనిన్ మరోరకంగా వ్యాఖ్యానించాడు.

  • సామ్రాజ్య వాదం కారణంగానే యూరోపియన్ పారిశ్రామిక దేశాలలోని పెట్టుబడిదారీ వ్యవస్థ అపజయం పాలవకుండా మనగలిగినది అని లెనిన్ భావించాడు. లెనిన్ ఆ కాలపు వలస పాలనను దృష్టిలో ఉంచుకుని ఈ విధంగా భావించాడు.
  • సామ్రాజ్య వాదం అంటే ఒక దేశం ఇతర దేశాల మీద పెత్తనం చేయటం.
  • యూరోపియన్ సామ్రాజ్య వాద దేశాలలోని పెట్టుబడిదారులు ఆసియా, ఆఫ్రికా దేశాల మీద పెత్తనం చేస్తూ అక్కడినుండి తీసుకు వచ్చిన తక్కువ వేతనాలకు పనిచేసే శ్రామికుల ద్వారా పనిచేయించుకున్నారు.
  • దీనివలన పెట్టుబడిదారులు చవకగా వస్తూత్పత్తి చేయగలిగారు.
  • ఈ కారణంగా యూరప్ లో తక్కువ ధరలకే వస్తువులు లభించాయి.
  • ఈ తక్కువ ధరలు యూరప్ లో హెచ్చు జీవన ప్రమాణాలకు దారితీసి ఆయా దేశాలలో విప్లవజ్వాలలు పెల్లుబకకుండా నిరోధించాయి.
  • ఐతే పారిశ్రామికీకరణ జరగని దేశాలలోని శ్రామిక వర్గం దోపిడీ ఆ దేశాలలో సామ్యవాద విప్లవ సంభావ్యతను సృష్టించింది.
  • ఈ విషయం మార్క్స్ ఊహించలేక పోయాడని లెనిన్ భావించాడు.
  • హింసాత్మక విప్లవం ద్వారా మాత్రమే రాజకీయ మార్పు సంభవిస్తుందనే విషయంలో మార్క్స్ తో లెనిన్ ఏకీభవించాడు.
  • కేంద్రీకృతమైన, క్రమ శిక్షణాయుతమైన విప్లవ నాయకత్వం మాత్రమే విప్లవాన్ని ముందుండి నడపాలని లెనిన్ భావించాడు.
  • ఈ నాయకత్వాన్ని కమ్యూనిష్టు పార్టీ అందిస్తుంది.
  • శ్రామిక వర్గ నియంతృత్వం అనే మార్క్స్ భావన లెనిన్ ఆలోచనలలో కమ్యూనిష్టు పార్టీ నియంతృత్వంగా మారిపోయింది.
  • కాకపోతే ఆ కమ్యూనిష్టు పార్టీ శ్రామిక వర్గానికే ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొనబడింది.

కమ్యూనిజం-సోషలిజం

[మార్చు]
  • కమ్యూనిజం, సోషలిజం అనే పదాలు సమానార్థకాలు కావు.
  • కమ్యూనిష్టులు తమను తాము సోషలిష్టులుగా భావిస్తారు. కానీ సోషలిష్టులు తాము కమ్యూనిష్టులుగా భావించరు.
  • సోషలిష్టులూ, కమ్యూనిష్టులూ ఇరువురూ కూడా ఉత్పత్తి వనరుల ఉమ్మడి యాజమాన్యాన్నే కోరుకుంటారు.
  • సోషలిష్టులు శాంతియుత, చట్టబద్దమైన పద్ధతుల ద్వారా ఈ పరిణామం జరగాలని కోరుకుంటే, కమ్యూనిస్టులు బలవంతంగా విప్లవంద్వారా జరగాలని కోరుకుంటారు.
  • సోషలిజం మార్క్స్ బోధనల కనుగుణంగా ఉండవచ్చు ఉండకపోవచ్చు. కానీ కమ్యూనిజం మాత్రం మార్క్స్, లెనిన్ బోధనల ప్రాతిపదిక మీదే ఆధారపడుతుంది.
  • సోషలిజం చాలావరకు ప్రజాస్వామ్య విధానాలను అనుసరించి పరిపాలన జరగాలని చెప్తుంది.
  • కమ్యూనిజంలో ప్రజాస్వామ్య పద్ధతులకు (ఇంతవరకూ ప్రపంచంలో కమ్యూనిజం పేరుతో ప్రభుత్వాలు ఏర్పడిన దేశాల అనుభవంలో) అంతగా గౌరవం లేదనే చెప్పాలి

కమ్యూనిజం విస్తరణ

[మార్చు]
ప్రపంచ విస్తరణలో కమ్యూనిజం
ప్రపంచ విస్తరణలో కమ్యూనిజం

ఐరోపా ఖండములో

[మార్చు]

రెండవ ప్రపంచ యుధ్ధం వలన సంభవించిన అంతర్జాతీయ అస్థిరత్వం కమ్యూనిజం యొక్క వ్యాప్తికి దోహద పడింది. 1939, 1940లలో సోవియట్ యూనియన్ బాల్టిక్ దేశాలైన లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియాలను పూర్తిగానూ,, ఫిన్లాండ్, రుమేనియా, పోలాండ్ దేశాలలో కొంత కొంత భాగాన్ని ఆక్రమించింది. ఈ ప్రాంతాలన్నీ సోవియట్ సమాఖ్యలో కలిపివేయబడ్డాయి. కమ్యూనిస్టు భావజాలం మొదటిసారి ప్రతిపాదించబడిన జర్మనీ దేశం, మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడిన రష్యాదేశాలు మొదట సంధి చేసుకున్నా, రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రత్యర్థులుగా నిలిచాయి. రష్యా పై దాడి జర్మనీ ఓటమికి ముఖ్య కారణంగా చెప్తారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం (1939-1945) సోవియట్ బలగాలు తూర్పు ఐరోపాలోని అత్యధిక ప్రాంతాన్ని జర్మనీ నుండి విముక్తి కలిగిస్తూనే ఆక్రమించాయి. ఆ విధంగా సోవియట్ సమాఖ్యకు ఆయా దేశాలన్నింటిలో కమ్యూనిస్టులను అధికారంలోకి తేవటానికి అవకాశం దొరికింది. ఆయా దేశ ప్రజల ఇష్టాఇష్టాల ప్రమేయం ఎంత మాత్రం లేకుండా, పొలాండ్, చెకొస్లవేకియా, బల్గేరియా, రుమేనియా వంటి తూర్పు ఐరోపా దేశాలలో, రష్యా సహకారముతో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పరచబడ్డాయి. కొన్ని దేశాలలో జాతీయ ఉద్యమాలను నడుపుతున్న కమ్యూనిష్టులు యుద్ధ సమయంలో బలపడి రష్యా సహాయమేమీ లేకుండానే ప్రభుత్వాలను ఏర్పరచగలిగారు. ఆ దేశాలు అల్బేనియా, యుగోస్లావియా. రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమైన జర్మనీ దేశాన్ని, రెండవ ప్రపంచ యుద్ధానంతరం, రెండు ముక్కలుగా - తూర్పు, పశ్చిమ జర్మనీ - కింద విభజించారు. తూర్పు జర్మనీ పూర్తిగా రష్యా ప్రాబల్యంతో కమూనిస్ట్ దేశమైపోయింది. 1948లో సోవియట్ సమాఖ్య సహాయంతో చెకోస్లోవేకియాలో అప్పటికే ఏర్పడి ఉన్న కమ్యూనిష్టు ప్రభుత్వం బలపడి దేశం మీద పట్టు సాధించింది. ఫ్రాన్సు, ఇటలీ దేశాలలో కమ్యూనిజం బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. ఈ విధమైన కమ్యూనిజం వ్యాప్తి రెండవ ప్రపంచ యుద్ధము తరువాత కాలములో, అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలకు, రష్యా, రష్యా ఉపగ్రహ కూటమిగా ఏర్పడిన తూర్పు ఐరోపా దేశాలకు మధ్య అంతర్జాతీయ ఆధిపత్యం కొరకు ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీసింది

ఆసియా ఖండములో

[మార్చు]

చైనాలో కమ్యూనిష్టులు, దేశాన్ని పాలిస్తున్న జాతీయ ప్రభుత్వం రెండూ కూడా 1930వ దశకంలో దేశం మీదికి దండెత్తి వచ్చిన జపాన్ మీద పోరాడాయి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం కమ్యూనిష్టులకు, జాతీయ ప్రభుత్వానికి మధ్యన అంతర్యుద్ధం తలయెత్తినది. 1949 కల్లా కమ్యూనిష్టులు మావో జెడాంగ్ నాయకత్వంలో చైనాలోని అధిక భాగాన్ని ఆక్రమించుకుని తమ అధికారాన్ని స్థాపించారు. చైనా 1949లో చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్యుద్ధంలో గెలిచి ఆ దేశంలో అధికారంలోకి వచ్చింది.

1946లో సామ్యవాద నాయకుడైన హోచిన్ మిన్ ఫ్రెంచి వారి వలస పాలనలో ఉన్న ఇండో చైనా ద్వీపకల్పంలో జాతీయ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. 1954కల్లా ఇండో-చైనా ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం, కంబోడియా, లావోస్ అనే దేశాలుగా విడిపోయింది. ఉత్తర వియత్నాంలో కమ్యూనిష్టులు 1954లోనే అధికారంలోకి రాగలిగారు. మిగతా ప్రాంతాలైన దక్షిణ వియత్నాం, కాంబోడియా, లావోస్ లలో కమ్యూనిష్టులు తమ పోరాటాన్ని ఆయా ప్రభుత్వాల మీద కొనసాగించారు. దక్షిణ వియత్నాంలోని పోరాటం తీవ్రరూపం ధరించింది. అదే 1957 నుండి 1975 వరకు జరిగిన వియత్నాం యుద్దం. అమెరికా, కమ్యూనిష్టు తిరుగుబాటుదారులను నిరోధించుటకు ప్రభుత్వానికి అండగా సైన్యాన్ని పంపింది. దారుణ మారణ కాండ జరిగిన పిమ్మట 1973లోని ఒక ఒప్పందం ప్రకారం అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకున్నది. ఆ తరువాత కొనసాగిన పోరాటంలో కమ్యూనిష్టులు 1975 కల్లా దక్షిణ వియత్నాంలో అధికారంలోకి రాగలిగారు. 1976లో ఉభయ వియత్నాంలు కలసిపోయి ఒకే దేశంగా ఏర్పడినది. 1975లోనే కాంబోడియా, లావోస్ లలో కూడా సామ్యవాదులు అధికారంలోకి వచ్చారు. 1950లో కమ్యూనిష్టు పాలనలో ఉన్న ఉత్తర కొరియా సైన్యం, దక్షిణ కొరియా మీదికి దండెత్తినది. ఈ దండయాత్ర ఉభయ కొరియాల మధ్యన 3 సంవత్సరముల యుద్ధానికి దారితీసినది. ఈ యుద్ధంలో ఎవరికీ విజయం లభించలేదు కాని ఇప్పటికీ కొరియా రెండు దేశాలుగా విడివిడిగానే ఉన్నాయి. అందులో ఉత్తర కొరియా కమ్యూనిస్ట్ దేశముగా పిలవబడుతున్నది.

ఆఫ్ఘనిస్థాన్లో 1978లో కమ్యూనిష్టులు అధికారంలోకి వచ్చారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమంది ఆఫ్ఘన్ లు తిరుగుబాటు చేసారు. 1979లో సోవియట్ యూనియన్ సామ్యవాద ప్రభుత్వానికి మద్దతుగా ఆఫ్ఘనిస్థాన్ కు సైన్యాన్ని పంపినది. ఈ సైన్యానికి ఆఫ్ఘన్ తిరుగుబాటు దారులకు మధ్య సుదీర్ఘ కాలం పోరాటం జరిగింది. 1989లో సోవియట్ తన సైన్యాన్ని ఉపసంహరించుకున్నది. 1992లో తిరుగుబాటు దారులు సామ్యవాద ప్రభుత్వాన్ని కూలదోసారు.

ఈ విధంగా రష్యా లేదా చైనాల సహకారంతో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడినాయి, తద్వారా అయా దేశాలలో కమ్యూనిజం వ్యాపించిందని చెప్పవచ్చు.

1940 వ దశకం చివరి నుండి 1960 వ దశకం వరకు అధికారంలోకి రావటానికి అనేకదేశాలలో కమ్యూనిష్టులు చేసిన మిగతా ప్రయత్నాలు చాలావరకు విఫలమయ్యాయి. మలయా, ఫిలిప్పైన్స్ లలో కమ్యూనిష్టులు గెరిల్లా పోరాటం ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నించారు కానీ రాలేకపోయారు.

అమెరికా ఖండములో

[మార్చు]

ఈ సమయంలో కమ్యూనిష్టులు సాధించిన ఒకే ఒక్క విజయం క్యూబా లోనే సంభవించింది. 1959లో ఫీడెల్ కాస్ట్రో క్యూబాకు నియంతగా అధికారం చేపట్టాడు. రెండు సంవత్సరముల తరువాత తన ప్రభుత్వాన్ని సామ్యవాద ప్రభుత్వంగా కాస్ట్రో ప్రకటించాడు.

మిగతా ప్రాంతాలలో సామ్యవాద ప్రభుత్వాలు

[మార్చు]

ఆఫ్రికా దేశాలైన అంగోలా, మొజాంబిక్ లలో 1975లో వామపక్ష గెరిల్లా దళాలు సామ్యవాద ప్రభుత్వాలను ఏర్పరచాయి. ఇవి 1990 వరకు అధికారంలో ఉన్నాయి. మిగతా కొన్ని ఆఫ్రికా దేశాలలో కూడా 1970, 80వ దశకంలలో కొద్దికాలం మనగలిగిన సామ్యవాద ప్రభుత్వాలు ఏర్పరచబడ్డాయి. మధ్య అమెరికా ఖండపు దేశమైన నికరాగువాలో 1979లో సామ్యవాద ప్రభుత్వం ఏర్పడి 1990 వరకూ కొనసాగింది.

ఆచరణలో కమ్యూనిజం

[మార్చు]

సామ్యవాద ఆచరణలో ఒక దేశానికీ, మరో దేశానికీ భేదం ఉంది. అయితే 1980వ దశకం చివరి వరకూ కొన్ని ప్రాథమిక అంశాలలో అన్ని కమ్యూనిష్టు దేశాలకూ సారూప్యత ఉంది. ఆలా సారూప్యత ఉన్న అంశాలలో నిరంకుశత్వం (టోటలిటేరియనిజం)ఒకటి. నిరంకుశ దేశాలలో ప్రభుత్వం ప్రజల జీవితంలోని అన్ని అంశాలనూ నియంత్రిస్తుంది. కమ్యూనిష్టు దేశాలు పార్టీ రాజ్యాలు కూడా. పార్టీ రాజ్యంలో పాలక పార్టీ అన్ని ప్రభుత్వ అంగాల మీద అధికారం చెలాయిస్తుంది. ఈ దేశాలన్నీ కూడా ఉత్పత్తి వనరులు అన్నీ రాజ్యం ఆధీనంలో గల, ఆర్థిక కార్య కలాపాలన్నింటినీ ప్రభుత్వం నియంత్రించే కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటాయి. కమ్యూనిస్టు దేశాలు వ్యక్తిగత స్వేచ్ఛకన్నా సామూహిక ప్రయోజనానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చాయి. రాజ్యం, సమాజం యొక్క సంక్షేమం వ్యక్తి సంక్షేమం కన్నా ముఖ్యమైనదని అవి భావించాయి.

రష్యా లో కమ్యూనిజం

[మార్చు]
ఉపన్యసిస్తున్న లెనిన్

1898లో మార్క్సిష్టులు రష్యన్ సోషల్ డెమొక్రటిక్ లేబర్ పార్టీని స్థాపించారు. 1903లో ఇది రెండుగా విడిపోయింది. ఒక గ్రూపు బోల్విక్కులు. లెనిన్ వీరి నాయకుడు. క్రమశిక్షణాయుతమైన, సుశిక్షితులైన, విప్లవాత్మకమైన కొద్దిమందితో కూడిన కమ్యూనిస్టు పార్టీ ఉండాలనే లెనిన్ వాదనను వీరు సమర్థించారు. మరో గ్రూపు మెన్షివిక్కులు. పార్టీ విస్తృతమైన సభ్యత్వం కలిగి ప్రజాస్వామ్య పద్ధతులలో నిర్ణయాలు తీసుకోవాలనేది వీరి వాదన.19వ శతాబ్దంలో ఐరోపా ఖండం లోని అన్ని సోషలిస్ట్ పార్టీలు మార్క్స్ సిద్ధాంతాలతో ప్రభావితం అయినవి. కానీ కాలక్రమేణా అవి పెట్టుబడిదారీ వ్యవస్ఠనే సంస్కరించడానికి మొగ్గు చూపగా "రష్యన్ సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీ" పెట్టుబడిదారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపే దిశలో అడుగు వేసింది. ఈ పార్టీలోని ఒక శాఖే తరువాతి కాలంలో వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలో బోల్షెవిక్ పార్టీగా ఏర్పడినది. 1917లో వీరు విప్లవ పంథాలో రష్యాలో అధికారాన్ని హస్తగతం చేసుకొన్నారు. 1918లో పార్టీ పేరు కమ్యూనిస్ట్ పార్టీగా మర్చబడింది.19వ శతాబ్దపు చివరికాలంలో రష్యా ఆధునీకరణ ప్రారంభమైనది. పరిశ్రమలు పెరిగే కొలదీ నగరాలలో విస్తరిస్తున్న మధ్యతరగతి వర్గం, శ్రామిక వర్గంలో అసంతృప్తి పెరిగింది. దీనికి తోడు 1890 వ దశకంలో రష్యాలో సరిగా పంటలు పండక పోవటంతో రైతులు తిండిలేక అల్లాడిపోయారు. విప్లవ కార్యకలాపాలు పెరిగి మార్క్సిజం లాంటి సామ్యవాద భావాలు ప్రజలలో వ్యాప్తి చెందాయి.మార్క్స్ తన సిద్ధాంతాలు జర్మనీలోనో,ఇంగ్లాండ్ లోనో లేక మరేదయినా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశంలోనో ఆచరింపబడతాయని భావించాడు. కానీ ప్రధానంగా వ్యావసాయిక దేశమైన రష్యాలో కమ్యూనిస్టులు మొట్టమొదటి సామ్య వాద ప్రభుత్వాన్ని ఏర్పరచటంలో సఫలీకృతులయ్యారు. 1917లో రష్యా ప్రజలు రష్యా చక్రవర్తి జార్ ను పదవీచ్యుతుణ్ణి చేశారు. ఒక తాత్కాలిక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటుచేయబడింది. 1917 వసంతకాలంలో లెనిన్ నాయకత్వంలోని బోల్షివిక్కులు అధికారాన్ని చేజిక్కించుకుని కమ్యూనిష్టు ప్రభుత్వాన్ని స్థాపించారు.రష్యాలో కూడా కమ్యూనిజం రకరకాలుగా అనుసరించబడింది.

లెనిన్ కాలం

[మార్చు]

1917 నుండి 1924లో మరణించేవరకూ రష్యాకు లెనిన్ నాయకత్వం వహించాడు. కొద్దికాలం రైతులు ఆక్రమించుకున్న భూములను వారి ఆధీనంలోనే ఉండనిచ్చాడు.స్థానిక ప్రభుత్వాలలో ముఖ్యపాత్ర పోషించుటకునూ, ఫాక్టరీలను నియంత్రించుటకునూ కార్మికులకు అనుమతినిచ్చాడు. కానీ త్వరలోనే ప్రభుత్వం పట్టు బిగించి రైతులను వారి ఉత్పత్తిలో అధిక భాగం ప్రభుత్వానికే ఇవ్వాలని బలవంతపెట్టింది. రష్యాలోని పరిశ్రమలన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఒక కేంద్ర నిర్వాహక సంస్థను వాటిని నడపటానికి నియోగించింది. ఇంతేకాక ప్రభుత్వం చెకా అనబడే ఒక రహస్య పోలీసు బలగాన్ని సృష్టించింది. ఈ పొలీసు విభాగం, ప్రజలను చాలా బాధించి ముప్పతిప్పలు పెట్టేది. వారి చర్యలవలన 'చెకా' చాలా అపఖ్యాతిని సంతరించుకున్నది. 1918 నుండి 1920 వరకు రష్యాలో కమ్యూనిష్టులకు కమ్యూనిష్టేతరులకు అంతర్యుద్ధం చెలరేగినది. ఐకమత్యం లేని,వ్యవస్థీకృతం కాని తమ శత్రువులను కమ్యూనిష్టులు అణచివేసారు.ఆది నుండి లెనిన్ తన రాజకీయ ప్రత్యర్థుల యెడల భయానకమైన, క్రూరమైన విధానాన్నే అనుసరించాడు. 1921 కల్లా దేశమంతా పరిస్థితి దారుణంగా తయారైనది. రైతులు, నావికుల తిరుగుబాట్లు చెలరేగాయి. క్షామం తలయెత్తింది. మొదటి ప్రపంచ యుద్ధం(1914-1918), విప్లవం, అంతర్యుద్ధం ఇవన్నీ కలసి రష్యాను ఆర్థికంగా పతనం చేశాయి.1921లో లెనిన్ నూతన ఆర్థిక విధనాన్ని (న్యూ ఎకనామిక్ పాలసీ) ప్రవేశ పెట్టాడు. ఈ విధానాన్ని అనుసరించి కమ్యూనిష్టులు సామ్యవాదానికి శత్రువర్గాలుగా భావించబడే దుకాణాదారులు, మేధావులు, సైన్యాధికారులు, ఇంజనీర్లు మొదలయిన వారితోనే సహకరించవలసి వచ్చింది. ఈ నూతన ఆర్థిక విధానం వలన రష్యా ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. 1922లో సోవియట్ యూనియన్ లేక యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (USSR)గా రష్యా అవతరించింది. 1924లో లెనిన్ మరణించే కాలానికి సోవియట్ యూనియన్ ఒకే ఒక పార్టీగల రాజ్యంగా మారింది. అన్ని కమ్యూనిష్టేతర రాజకీయ పార్టీలు నిషేధించబడ్డాయి. ప్రభుత్వసంస్థలన్నీ కమ్యూనిష్టుల సాధనాలుగా మారిపోయాయి.

స్టాలిన్ హయాం

[మార్చు]

స్టాలిన్ యుగం సోవియట్ సమాఖ్య గొప్ప ముందడుగు వేసింది. స్టాలిన్ నాయకత్వంలో వ్యవసాయాన్ని సమిష్ఠీకరించడం జరిగింది, వేగవంతమైన పారిశ్రామికీకరణ కూడా జరిగింది. స్టాలిన్ యుగంలో ప్రైవేట్ మార్కెట్ ను పూర్తిగా రద్దు చేశారు. వ్యవసాయ సమిష్ఠీకరణని భూస్వాములు, మధ్య తరగతి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిఘటించిన భూస్వాములు, రైతుల్ని అరెస్ట్ చెయ్యడం లేదా బలవంతంగా పని చెయ్యించడం జరిగింది. సోవియట్ సమాఖ్యలో వ్యవసాయ సమిష్ఠీకరణ తరువాత గణణీయంగా ఆహారోత్పత్తి పెరిగింది. కానీ రష్యన్ జైళ్ళలో మాత్రం ఖైదీలకి సరైన ఆహారం, మందులు అందక చనిపోయారు. సోవియట్ సమాఖ్య నుంచి ఇతర దేశాలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. 1940 కాలంలో ప్రపంచం మొత్తంలోని 40% ఆహారం సోవియట్ సమాఖ్యలోనే ఉత్పత్తి అయ్యేది. రెండవ ప్రపంచ యుధ్ధ సమయంలో నాజీ జర్మనీ రష్యన్ వ్యవసాయ క్షేత్రాల పై బాంబులు వెయ్యడం వల్ల వ్యవసాయానికి భారీ నష్టం వచ్చింది. స్టాలిన్ చనిపోయిన తరువాత ప్రపంచ ఆహార ఉత్పత్తిలో సోవియట్ సమాఖ్య వాటా 40% నుంచి 20%కి తగ్గిపోయింది.

నికితా కృశ్చెవ్ కాలం

[మార్చు]

1953లో జోసెఫ్ స్టాలిన్ మరణానంతరం నికితా కృశ్చెవ్ అధికారంలోకి వచ్చాడు. ఇతను స్టాలిన్ విధానాలను తీవ్రంగా విమర్శించాడు. రచయితలు, కళాకారులు, మేధావులు మొదలైన వారి మీద అప్పటి వరకు ఉన్న రాజకీయ నిర్బంధాన్ని తొలగించాడు. ఆర్థిక వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని, ఉత్పాదకతను పెంచడానికి సంస్కరణలను చేపట్టాడు. ఐతే అవి సత్ఫలితాలను ఇవ్వలేదు.1964లో కమ్యూనిష్టు పార్టీ ప్రముఖుల బలవంతంతో కృశ్చెవ్ పదవి నుండి తప్పుకున్నాడు.

కృశ్చెవ్ తదనంతరం బ్రెజ్నెవ్ అధికారం లోకి వచ్చాడు. బ్రెజ్నెవ్ స్టాలిన్ యొక్క ఆర్థిక, సాంస్కృతిక విధానాలను చాలావరకు పునరుద్ధరించాడు. ఐతే బ్రెజ్నెవ్ స్టాలిన్ లా మారణ కాండకు మాత్రం పాల్పడలేదు.1982లో బ్రెజ్నెవ్ మరణించిన తరువత ఆండ్రపోవ్, చెర్నెంకోలు వరుసగా అధికారంలోకి వచ్చారు కాని, అతి కొద్దికాలం మాత్రమే వీరి పరిపాలన జరిగింది. వీరి కాలంలో చెప్పుకోదగ్గ మార్పులేవీ రాలేదు. వీరు ఇరువురు కూడా ఒకరి తరువాత ఒకరిగా కొద్దికాలంలోనే మరణించటంతో 1985లో మిఖాయిల్ గోర్బచెవ్ అధికారంలోకి వచ్చాడు.

మిఖాయిల్ గోర్బచెవ్ కాలం

[మార్చు]
మిఖాయిల్ గోర్బచెవ్ 1990లో

1985 మార్చి‌లో మిఖాయిల్ గోర్బచెవ్ సోవియట్ కమ్యూనిష్టు పార్టీ అధినేత అయ్యాడు. ఇతను అధికారంలోకి వచ్చే సమయానికి మితిమీరిన మిలటరీ వ్యయంతో సోవియట్ యూనియన్ ఆర్థిక వ్యవస్థ క్షీణ పథంలో ఉంది. తూర్పు యూరప్ దేశాలలో సైనిక దళాల మోహరింపు,వర్థమాన దేశాలలో ప్రజాదరణ లేని వామ పక్ష ప్రభుత్వాలకు సహాయ సహకారాలు అందించడం, పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఆయుధ పోటీలో పాల్గొనడం ఇత్యాది కారణాలన్నీ ఈ క్షీణతకు దారితీసాయి. కమ్యూనిష్టు వ్యవస్థతో అసంతృప్తి చెందిన ప్రజలు పాశ్చాత్య జీవన విధానం వైపు ఆకర్షితులయ్యారు. గోర్బచెవ్ లాంటి కమ్యూనిష్టు పార్టీ ప్రముఖులు పాశ్చాత్య జీవనశైలిని ఆయా దేశాలను సందర్శించినపుడు గమనించారు. సామాన్య ప్రజలు మీడియా ద్వారా కమ్యూనిష్టేతర దేశాల ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి తెలుసుకున్నారు. సోవియట్ యూనియన్ ఎదుర్కొంటున్న సమస్యలకు విరుగుడుగా గోర్బచెవ్ సంస్కరణలకు పూనుకున్నాడు. మొదటగా సోవియట్ యూనియన్ యొక్క రాజకేయ, ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడానికి పెరిస్త్రోయికా అనే సంస్కరణను ప్రవేశపెట్టాడు. దీనిప్రకారం కమ్యూనిష్టేతర పార్టీలకు,వ్యక్తులకు చట్టబద్దతను కల్పించాడు. కొన్ని విధులతో,అధికారాలతో ఒక పార్లమెంటును ఏర్పరచాడు. వ్యక్తులు, కుటుంబాలు నిర్వహించే ప్రైవేటు వ్యాపారాలమీద నిషేధం ఎత్తివేసాడు. కేంద్ర ప్రణాళికా వ్యవస్థలో(Central Planning System) మార్పులు చేసాడు. సంస్కరణలకు, అవి అమలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజా మద్దతు పొందటానికి గోర్బచెవ్ ప్రజల యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పెంచే గ్లాస్‌నోస్త్ అనే మరో సంస్కరణను కూడా ప్రవేశపెట్టాడు. గోర్బచెవ్ అప్పటివరకు సోవియట్ యూనియన్‌కు శత్రువులుగా భావించబడిన దేశాలన్నింటితో సత్సంబంధాలకై కృషి చేశాడు.1987లో అమెరికా ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ తో కలసి ఇరు దేశాలు మోహరించిన అణ్వస్త్ర క్షిపణులను తొలగించటానికి ఒప్పందం చేసుకున్నాడు.1989లో ఆఫ్ఘనిస్థాన్ నుండి సోవియట్ దళాల ఉపసంహరణ అనంతరం అమెరికాతో సోవియట్ యూనియన్ సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. గొర్బచెవ్ విధానాలు సోవియట్ కమ్యూనిష్టు పార్టీలోని కొందరు కరుడుగట్టిన కమ్యూనిష్టు ప్రముఖులకు నచ్చలేదు. సోవియట్ యూనియన్ లోని 15 రిపబ్లిక్స్ కు గోర్బచెవ్ మరింత స్వాతంత్ర్యం ఇవ్వదలచటంతో వీరు మరింతగా ఆగ్రహం చెందారు. 1991 ఆగస్టులో ఈ సాంప్రదాయ సామ్యవాద ప్రముఖులంతా కలసి గోర్బచెవ్ కు వ్యతిరేకంగా కుట్ర చేసి అతడిని పదవి నుండి తొలగించారు. ఐతే ఈ తిరుగుబాటు విఫలమై గోర్బచెవ్ తిరిగి తన అధికారాన్ని పునరుద్దరించుకున్నాడు. తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే గోర్బచెవ్ తన పార్టీ నాయకత్వ పదవికి రాజీనామాచేసి కేవలం ప్రభుత్వ అధినేతగానే కొనసాగాడు.కమ్యూనిష్టు పార్టీ కార్య కలాపాలన్నింటినీ స్తంభింపచేశాడు.1991 చివరికల్లా సోవియట్ యూనియన్ లోని రిపబ్లిక్కులలో చాలావరకూ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాయి. డిసెంబరులో మొత్తం పదకొండు రిపబ్లిక్కులు స్వతంత్ర దేశాల సమాఖ్యగా ఏర్పడ్డాయి. ఈ పరిణామాల తరువాత గోర్బచెవ్ ప్రభుత్వ పదవికి కూడా రాజీనామా చేయటంతో సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలసి పోయింది.

చైనాలో

[మార్చు]

1949లో మావో నాయకత్వంలో కమూనిస్ట్ ప్రభుత్వం చైనాలో ఏర్పడింది. 1949 నుండి మావొ మరణించేవరకూ ప్రభుతాధినేతగానే ఉన్నాడు. అతని హయాంలో అనేక సంస్కరణలు జరిగినాయి. సాస్కృతిక విప్లవాన్ని కూడా తీసుకుని వచ్చి సంగీత సాహిత్య రంగాలలో కూడా కమూనిజాన్ని జొప్పించాడు. స్టాలిన్ వలెనే మావోకూడా నియంత. చైనాను కమూనిస్ట్ పంధాలో పరిపాలన కొనసాగించాడు. వ్యావసాయిక రంగంలో చాలావరకు అభివ్రుధి జరిగింది.

మావో తదనంతరం చైనా

[మార్చు]

1976లో మావో మరణించే సమయానికి చైనా ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనమైనది.1950 వ దశకంలో ఆరంభమైన కేంద్రీకృత ఆర్థిక కార్యక్రమమే ఈ వైఫల్యానికి కారణం. మావో మరణం తరువాత డెంగ్ జియావో పింగ్ నాయకత్వంలోని ఆర్థిక సంస్కరణాభిలాషుల బృందం చైనా కమ్యూనిష్టు పార్టీ మీద నియంత్రణ సాధించింది. ఈ కొత్త నాయకత్వం ప్రైవేటు రంగంలో వ్యవసాయాన్ని, చిన్న చిన్న వ్యాపారాలను అనుమతించింది. అప్పటి వరకు తిరస్కరించిన విదేశీ పెట్టుబడులను అనుమతించింది. విదేశీ పెట్టుబడిదారులు పరిశ్రమలు స్థాపించి వస్తూత్పత్తి, ఎగుమతులు చేయుటకు సముద్రతీర ప్రాంతాలలో అనేక ప్రత్యేక ఆర్థిక మండళ్ళను నెలకొల్పినది.ఈ సంస్కరణలన్నీ చైనా ఆర్థిక వ్యవస్థ క్రమేణా అభివృద్ధి చెందటానికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి దోహదంచేశాయి. కాని ఇన్ని సంస్కరణలు జరిగినా కూడా రష్యాలో వలే కాక చైనాలో డెంగ్ నాయకత్వంలోని కమ్యూనిష్టు పార్టీ రాజకీయంగా తన పట్టును నిలుపుకోగలిగింది. ఐతే 1980 వ దశకం చివరిలో అనేక చైనా విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఈ ఆర్థిక సంస్కరణలకు తోడుగా రాజకీయంగా కూడా సంస్కరణలు జరగాలని కోరనారంభించారు. 1989లో వేలమంది విద్యార్థులు, కార్మికులు బీజింగ్ నగరంలోని లోని తియానన్మెన్ స్క్వేర్‌లో, అనేక ఇతర నగరాలలో ప్రదర్శనలు జరిపి మరింత ప్రజాస్వామ్యం కొరకు, ప్రభుత్వంలో అవినీతి నశించాలని పిలుపునిచ్చారు. ఐతే చైనా సైన్యం ప్రదర్శనకారులను ఉక్కు పాదంతో అణచివేసింది.

కమ్యూనిజం క్షీణత

[మార్చు]

కమ్యూనిజం ఒక జీవన పద్ధతిగా విఫలమైనది. కమ్యూనిస్ట్ ప్రభుత్వం రష్యాలో ఏర్పడిన తరువాత గట్టిగా 100 సంవత్సరాలు నిలబడలేకపోయినది, 74 సంవత్సరములకే విఛ్ఛిన్నమయినది. మానవ సహజమయిన సంఘ జీవన పద్ధతికి వ్యతిరేక పద్ధతులలో మానవుడు ఎక్కువకాలం మనజాలడని నిరూపించబడింది. దీనికి ముఖ్య కారణం, కమ్యూనిస్ట్ జీవన పద్ధతిలో వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోవటమే కారణమని విశ్లేషకుల అభిప్రాయం. ప్రపంచములో అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలలో ఒకటయిన అమెరికాలో, తొలి నుంచి కమ్యూనిజం గట్టి సాంఘిక వ్యతిరేకతను ఎదుర్కొన్నది. పూర్తిగా నియంతల పాలనలుగా మారిన కమ్యూనిస్ట్ పాలనలు(ఉదాహరణకు రుమేనియా, బల్గేరియా మొదలగునవి), 1990ల మొదటి సంవత్సరాలలో అనేక తూర్పు ఐరోపా దేశాలలో పడిపోయినవి. ఈ మార్పునకు బీజం పోలెండ్ లో 1980లలో పడినది. అక్కడ, ఒక ఓడల తయారీ వ్యవస్థలో స్వేచ్ఛ గలిగిన శ్రామిక సంఘం ఏర్పరుచుకోవటంకోసం, శ్రామికులు లెహ్ వలీజా నాయకత్వంలో ఉద్యమించవలసిన గతి పట్టింది. ఆ ఉద్యమం క్రమంగా పెరిగి పెద్దదయి, కమ్యూనిస్ట్ ప్రభుత్వాల పునాదులను కుదిపివేసి, కుప్ప కూలేటట్లు చేసింది. 1991 చివరలో సోవియట్ యూనియన్ విచ్చినంతో కమ్యూనిజం ప్రాభవం పూర్తిగా పడిపోయినది, ఆ జీవనపద్ధతి 'ఎగుమతి' చేయటం ఆగినది. ప్రస్తుతానికి చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా దేశాలలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉన్నాయి.1970 వ దశకం చివరికల్లా ప్రపంచంలోని అనేక దేశాలలో సామ్యవాదం సంక్షోభంలో పడింది. మావో కాలంలో కమ్యూనిష్టు చైనా జనాభా రెట్టింపయ్యింది. చైనా ప్రభుత్వం ప్రజలకు చాలినంత ఆహారాన్ని సరిగా అందివ్వలేక పోయింది. సోవియట్ నియంత్రణలోని తూర్పు యూరప్ లో కమ్యూనిజం యెడల అసంతృప్తి ప్రబలిపోయింది.తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, మధ్య తరగతి ప్రజలలో అసంతృప్తి, రాజకీయ ప్రముఖులలో కమ్యూనిష్టు వ్యవస్థ మీద తలయెత్తిన నిరసన ఇత్యాది సమస్యలన్నీ స్వయంగా సోవియట్ యూనియన్ లోనే ఆరంభమయ్యాయి. అనేక సంవత్సరాల నుండి సోవియట్ యూనియన్ లోని వివిధ జాతుల మధ్యన శత్రుత్వం నివురు గప్పిన నిప్పులా ఉంది. రష్యనేతర జాతులు తమమీద రష్యన్ల పెత్తనాన్ని వ్యతిరేకించి స్వతంత్రాన్ని అభిలషించాయి. కమ్యూనిష్టు పార్టీ అధికారులలో అవినీతి పెరిగిపోయింది. 1970 వ దశకం చివరికల్లా పశ్చిమ యూరప్‌లో కమ్యూనిష్టు పార్టీలకు ఎన్నికలలో ఓట్ల శాతం తగ్గిపోయింది. 80వ దశకం చివరికల్లా అనేక సామ్యవాద దేశాలలో ఆర్థికాభివృద్ధి దాదాపు స్తంభించింది. వారియొక్క కేంద్రీకృత ఆర్థిక ప్రణాళికలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగకుండా నిరోధించి అసమర్థంగా తయారయ్యాయి. దీనివలన అనేక సామ్యవాద దేశాలు కమ్యూనిష్టేతర పారిశ్రామిక దేశాలతో ఆర్థికంగా పోటీపడలేక పోయాయి.

తూర్పు యూరప్‌లో

[మార్చు]

తూర్పు యూరప్‌లో ప్రజలనేకులు మొదటినుండి కమ్యూనిజాన్ని వ్యతిరేకించారు. సోవియట్ పెత్తనాన్ని కొందరు కమ్యూనిష్టులే నిరసించారు.

  • 1956లో హంగేరిలో కొందరు కమ్యూనిష్టు సంస్కరణవాదులు కమ్యూనిష్టేతరులతో కలసి సోవియట్ రష్యా నియంత్రణకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. సోవియట్ దళాలు హంగేరి పై దండెత్తి తిరుగుబాటును అణచివేసి సరికొత్త సామ్యవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి.
  • సోవియట్ దళాలు తూర్పు జర్మనీలో కూడా 1953లో సమ్మెలను, నిరసనలను అణచివేసాయి.
  • చెకోస్లోవేకియాలోని కమ్యూనిష్టు ప్రభుత్వం 1968లో కొన్ని రాజకీయ, ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టింది.ఈ సంస్కరణలు నచ్చని సోవియట్ యూనియన్ తన సైన్యాన్ని చెకోస్లోవేకియా పైకి నడిపింది. దానితో చెకోస్లోవేకియా కమ్యూనిస్టు పార్టీ 1969లో ప్రభుత్వాధినేత డ్యుబెక్ ను తొలగించి సోవియట్ అనుకూలుడైన వ్యక్తికి బాధ్యతలు అప్పచెప్పినది.
  • 1980లో పోలండ్‌లో అనేక నగరాలలోని కార్మికులు కలసి సాలిడారిటీ అనబడే ఒక స్వేచ్ఛా కార్మిక సంఘ సంస్థను స్థాపించారు.1981లో దీని కార్యకలాపాలు నచ్చని పోలండ్ ప్రభుత్వం సంస్థను నిషేధించింది. 1989లో సాలిడారిటీ సంస్థ మీద పోలండ్ ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది.ఆ సంవత్సరం ఈ సంస్థకు, పోలండ్ ప్రభుత్వానికి మధ్యన జరిగిన చర్చల ఫలితంగా జరిగిన ఎన్నికలలో ఈ సంస్థ, ఇతర కమ్యూనిష్టేతర అభ్యర్థులు మెజారిటీ సాధించారు. 1989 వేసవిలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో పోలండ్‌లో కమ్యూనిజం అంతమైనది.
  • అదేసంవత్సరం తూర్పు జర్మనీలో సామ్యవాద వ్యతిరేక ప్రదర్శనలు జరగటంతో కమ్యూనిష్టు నాయకులు రాజీనామా చేసారు. నవంబరు నెలలో తూర్పు, పశ్చిమ జర్మనీల సరిహద్దులు తెరవబడ్డాయి.
  • తూర్పు జర్మనీలోని ఈ పరిణామాలతో చెకోస్లోవేకియాలో కమ్యూనిష్టు పాలనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు వెల్లువెత్తాయి. దానితో చెకోస్లోవేకియా ప్రభుత్వం కూలిపోయింది.
  • రుమేనియాలో తిరుగుబాటు చెలరేగి కమ్యూనిష్టు నియంత నికోలాయ్ షావ్ సెస్కు తన భార్యతో పారిపోతున్నపుడు పట్టుకుని కాల్చి చంపివేయటం జరిగింది. ఈ ఘటన తరువాత అక్కడ నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది.
  • బల్గేరియాలో కూడా సంస్కరణవాదులు అధికారంలోకి వచ్చారు,

కమ్యూనిజం ప్రాతిపదికగా ప్రభుత్వాలు ఎక్కడైనా ఏర్పడినవా?

[మార్చు]

కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పరిచిన ప్రభుత్వాలయితే చాల దేశాలలో ఏర్పడినాయి కాని, నిజమయిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం, అంటే ఆ భావజాలం పూర్తిగా నిబద్దతో ఆచరించగలిగిన ప్రభుత్వాలు, ప్రపంచంలో ఎక్కడా ఏర్పడలేదనే చెప్పాలి. కమ్యూనిస్ట్ పేరుతో ప్రభుత్వాలు ఏర్పరిచినవారందరూ, ఆ భావజాలంలో ఏదో ఒక పార్శం పట్టుకుని పాకులాడేరేకాని, పూర్తిగా అవగాహన చేసుకుని, మానవ జీవన అభివృద్ధికి కృషి జరపలేకపొయ్యారు. ఏదో రకంగా ఈ భావజాలంతో, ముఖ్యంగా హింసతో, ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవాలనే తొందరపాటు కనపడుతుంది, అటువంటి వ్యక్తిగాని, వ్యక్తుల బృందంగాని అధికారాన్ని ఒకసారి కైవసం చేసుకున్న తరువాత ఆ అధికారాన్ని నిలుపుకోవటం కొరకు నియంతలుగా మారటమే ఎక్కువగా జరిగింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]