1930 మద్రాసు ప్రెసిడెన్సీ శాసనమండలి ఎన్నికలు
| |||||||||||||||||||||||||
98 స్థానాలు 50 seats needed for a majority | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||
|
1919 నాటి భారత ప్రభుత్వ చట్టం అమల్లోకి వచ్చాక, మద్రాసు ప్రెసిడెన్సీకి నాల్గవ శాసన మండలి ఎన్నికలు 1930 సెప్టెంబరులో జరిగాయి. ఎన్నికల్లో జస్టిస్ పార్టీ విజయం సాధించి, పి. మునుస్వామి నాయుడు ఫస్ట్ మినిస్టర్ (ప్రధాన మంత్రి) అయ్యాడు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన స్వరాజ్ పార్టీ, శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఎన్నికలలో పోటీ చేయలేదు.
నేపథ్యం
[మార్చు]ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. 1930 జూన్ 15 న జరిగిన జస్టిస్ పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశంలో చేసిన తీర్మానం మేరకు బ్రాహ్మణులను చేర్చుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. 1929 లో లాహోర్‌లో జరిగిన సమావేశంలో మళ్లీ ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సత్యమూర్తితో సహా 17 మంది కౌన్సిల్ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో పాల్గొననప్పటికీ, స్వతంత్రులుగా పోటీ చేసేందుకు స్వామి వెంకటాచలం చెట్టియార్, ఆర్కే షణ్ముగం చెట్టియార్ వంటి సభ్యులను అనుమతించింది. అందువల్ల, పోటీ కేవలం జస్టిస్ పార్టీకి, పి. సుబ్బరాయన్ నేతృత్వంలోని ఇండిపెండెంట్ నేషనలిస్ట్ పార్టీకీ (మాజీ మంత్రివర్గం) మధ్య జరిగింది. జస్టిస్ పార్టీ నాయకుడు, పానగల్ రాజా 1928 డిసెంబరు 16 న మరణించగా, పి. మునుస్వామి నాయుడు నాయకత్వం చేపట్టాడు. సుబ్బరాయన్ కు చెందిన స్వతంత్ర జాతీయవాదులతో దీనికి సంక్షుభితమైన సంబంధాలున్నాయి. కొన్ని విషయాలలో సహకరించుకుంటూ, మరికొన్నింటిపై బహిరంగంగా గొడవ పడుతూ ఉండేవారు.[1][2][3]
నియోజకవర్గాలు
[మార్చు]మద్రాసు శాసన మండలిలో గవర్నరు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లోని ఎక్స్ అఫిషియో సభ్యులతో పాటు మొత్తం 132 మంది సభ్యులు ఉన్నారు. 132 మందిలో, 98 మంది ప్రెసిడెన్సీ లోని 61 నియోజకవర్గాల నుండి ఎన్నికయ్యారు. నియోజకవర్గాలు మూడు విభాగాలున్నాయి - 1)మహమ్మదీతేర-పట్టణ, మహమ్మదీయేతర గ్రామీణ, బ్రాహ్మణేతర పట్టణ, మహమ్మదీయ-పట్టణ, మహమ్మదీయ-గ్రామీణ, ఇండియన్ క్రిస్టియన్, యూరోపియన్, ఆంగ్లో-ఇండియన్ 2) భూస్వాములు, విశ్వవిద్యాలయాలు, ప్లాంటర్లు వర్తక సంఘాలు (సౌత్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ & నట్టుకోట్టై నగరతార్ అసోసియేషన్) వంటి ప్రత్యేక నియోజకవర్గాలు 3) ప్రాదేశిక నియోజకవర్గాలు. 28 నియోజకవర్గాలు బ్రాహ్మణేతరులకు రిజర్వ్ చేసారు. 29 మంది సభ్యులను నామినేట్ చేసారు. వీరిలో గరిష్ఠంగా 19 మంది ప్రభుత్వ అధికారులు, 5 గురు మహిళలు, 5 గురు పరైయర్, పల్లర్, వల్లువర్, మాల, మాదిగ, సక్కిలియార్, తొట్టియార్, చెరుమాన్, హోలెయ వర్గాలకు, ఒకరు " వెనుకబడిన మార్గాలకు" చెందినవారు. కార్యనిర్వాహక మండలి సభ్యులతో సహా, శాసనసభ మొత్తం బలం 134. [1] [4] [5]
ఫలితాలు
[మార్చు]ప్రెసిడెన్సీ మొత్తం జనాభాలో దాదాపు 4% మంది ఓటర్లుండగా, వారిలో 43% మంది ఎన్నికలలో ఓటు వేశారు. (ఆస్తి అర్హతల ఆధారంగా వోటుహక్కు ఉండేది.[4] ) జస్టిస్ పార్టీ, తాను పోటీ చేసిన 45 సీట్లలో 35 సీట్లు గెలుచుకుంది. ఇండిపెండెంట్ నేషనలిస్ట్ పార్టీ, లిబరల్స్ కలిసి 10 సీట్లు గెలుచుకున్నాయి. మిగిలిన స్థానాల్లో చాలా వరకు స్వతంత్రులు గెలుపొందారు. ఎన్నికైన 98 స్థానాల్లో 35 ఏ పోటీ లేకుండానే గెలిచినవి.[1][2][3]
ప్రభుత్వ ఏర్పాటు
[మార్చు]మద్రాసు గవర్నర్, జార్జ్ ఫ్రెడరిక్ స్టాన్లీ, ఎన్నికలు ముగిసిన వెంటనే అధికారులతో సహా ఎన్నుకోబడని 32 మంది సభ్యులను నామినేట్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జస్టిస్ పార్టీని ఆహ్వానించారు. మండలి అధ్యక్షుడిగా బి.రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. 1930 అక్టోబర్ 27 న బి. మునుస్వామి నాయుడు మొదటి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రివర్గంలో పిటి రాజన్, ఎస్. కుమారస్వామి రెడ్డియార్‌లు మరో ఇద్దరు సభ్యులు. మాజీ ప్రధాన మంత్రి P. సుబ్బరాయన్, ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు.[1][2] మునుస్వామి నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే, జస్టిస్ పార్టీ ఫ్యాక్షనిజంతో చీలిపోయింది.[6] ప్రెసిడెన్సీలో అగ్రగామిగా ఉన్న ఇద్దరు భూస్వాములైన బొబ్బిలి రాజా, వెంకటగిరి కుమారరాజాలను మంత్రివర్గంలో చేర్చుకోకపోవడం పట్ల జస్టిస్ పార్టీకి మద్దతు ఇచ్చిన జమీందార్లు అసంతృప్తితో ఉన్నారు. [6] 1930 నవంబరులో, అసంతృప్తులైన జమీందార్లు MA ముత్తయ్య చెట్టియార్ నాయకత్వంలో ఒక వర్గంగా ఏర్పడ్డారు. పార్టీ నాయకత్వానికీ, ప్రధాన మంత్రి పదవికీ నాయుడు బలవంతంగా రాజీనామా చేయించడంలో ఈ వర్గం విజయం సాధించింది. 1932 నవంబర్ 5న బొబ్బిలి రాజా ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.[3][6]
ప్రభావం
[మార్చు]జస్టిస్ పార్టీ గెలిచిన చివరి ఎన్నికలు ఇవి. పార్టీలో అంతర్గత వర్గాలు, ప్రజావ్యతిరేక విధానాలు, ప్రజల్లో పెరుగుతున్న జాతీయవాదంతో కాంగ్రెస్ పునరుజ్జీవనం పొందడ్ం - ఇవన్నీ కలగలిసి, పార్టీ మరే ఎన్నికల్లోనూ గెలవలేఖ పోయింది. అధికారం కోసం పోరాడుతున్న జమీందారీ, జమీందారీయేతర వర్గాల మధ్య పార్టీ చీలిపోయింది. జమీందారీ వర్గం చివరికి గెలిచి, దాని నాయకుడు బొబ్బిలి రాజా ప్రధాన మంత్రి అయ్యాడు. మహా మాంద్యం కాలంలో అతని భూస్వామ్య అనుకూల ఆర్థిక విధానాలు ప్రజాదరణ పొందలేదు.1934, 1937 ఎన్నికలలో పార్టీ ఓటమికి అవి దోహదమయ్యాయి.[3][7]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 S. Krishnaswamy (1989). The role of Madras Legislature in the freedom struggle, 1861-1947. People's Pub. House (New Delhi). pp. 215–219.
- ↑ 2.0 2.1 2.2 Saroja Sundararajan (1989). March to freedom in Madras Presidency, 1916-1947. Madras : Lalitha Publications. pp. 347–350.
- ↑ 3.0 3.1 3.2 3.3 Rajaraman, P. (1988). The Justice Party: a historical perspective, 1916-37. Poompozhil Publishers. pp. 212–220.
- ↑ 4.0 4.1 Mithra, H.N. (2009). The Govt of India ACT 1919 Rules Thereunder and Govt Reports 1920. BiblioBazaar. pp. 186–199. ISBN 978-1-113-74177-6.
- ↑ Hodges, Sarah (2008). Contraception, colonialism and commerce: birth control in South India, 1920-1940. Ashgate Publishing. pp. 28–29. ISBN 978-0-7546-3809-4.
- ↑ 6.0 6.1 6.2 Ralhan, O. P. (2002). Encyclopaedia of Political Parties. Anmol Publications PVT. LTD. pp. 196–198. ISBN 978-81-7488-865-5.
- ↑ Manikumar, K. A. (2003). A colonial economy in the Great Depression, Madras (1929-1937). Orient Blackswan. pp. 185–198. ISBN 978-81-250-2456-9.