హిప్నాటిజం

హిప్నాటిజం అంటే సమ్మోహన విద్య. ఇంగ్లాండ్ దేశపు డాక్టర్ జేమ్స్ బ్రెయిడ్ దీనికి శాస్త్రీయంగా వివరించాడు. హిప్నాటిజం అంటే మాటల ద్వారా, కంఠస్వరం ద్వారా, ఎదుటివారి మనస్సుపై ప్రభావాన్ని కలుగజేసి, వారి మనస్సులపైన, శరీరంపైన వారికే నియంత్రణ కోల్పోయేటట్లు చేయడమే. అలా నియంత్రణ తప్పిన వ్యక్తులు నిద్రావస్థలోకి వెళ్ళి స్పృహ లేకుండానే హిప్నాటిస్ట్ ఏం చేయమంటే అది చేస్తారు అని అనుకోవడం ఒక అపోహ. నియంత్రణ తప్పినా కూడా వారి నిబంధనల్ని దాటి ప్రవర్తించలేరు. హిప్నాటిజం ద్వారా వ్యాధులను నయం చేసే పద్ధతిని జర్మన్ దేశస్తుడైన ఫెడరిక్ ఆంటోన్ మెస్మర్ కనిపెట్టాడు. దీన్నే మెస్మరిజం అంటారు. శారీరక, మానసిక వ్యాధులను నయం చేయడానికి హిప్నోథెరఫీ వాడుకలోకి వచ్చింది.
ఎవరిని సమ్మోహితుడిని చేయాలని అనుకొంటారో ఆ వ్యక్తి తాను ఏమి చెపితే అది తప్పక పాటించే స్థితిలో ఉన్నప్పుడు సమ్మోహితుడిని చేయడం సాధ్యమవుతుంది. ‘‘నీవు మంచి నిద్రలోకి పోతున్నావు’’ అని చెపితే అతడు చాలా గాఢమైన నిద్రలోకి పోవచ్చు. ఈ నిద్ర గాఢమైనప్పుడు అది ‘‘సమాధి’’ స్థితి లాంటిది కూడా కావచ్చు. అలాంటి స్థితిని హిప్నాటిక్ ట్రాన్స్ అంటారు. గ్రీకు భాషలో హిప్నో అంటే నిద్ర. హిప్నాసిస్ అంటే సహజమైన నిద్ర వలె గాక సూచన ద్వారా నిద్ర పోయేలా చేయడం. ఈ నిద్ర సహజమైన నిద్ర కాదు. ఈ స్థితిలో వ్యక్తి ఇంద్రియాలన్నీ సహజస్థితిలో కంటే చురుకుగా పని చేస్తాయి. సాధారణంగా జ్ఞాపకం రాని ఎంతో పాత సంగతులు జ్ఞాపకం వస్తాయి. అసాధారణంగా నొప్పిని భరించగలిగే స్థితి ఉంటుంది. హిప్నటైజ్ చేసి మత్తు ఇవ్వకుండా ఆపరేషన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. హిప్నాటిజం ద్వారా వ్యాధులను నయం చేయడం హిప్నో థెరపీ.[1]
డాక్టర్ ఎన్ డైలే అనే ఆంగ్లేయుడు భారతదేశంలో హిప్నాటిజం వ్యాప్తికి విశేష కృషిచేశాడు. ఆయన 19వ శతాబ్దంలో మత్తుమందును కనిపెట్టక ముందు రోగులను హిప్నాటైజ్ చేసి, వారికి ఏమాత్రం నొప్పిలేని విధంగా శస్త్ర చికిత్సలు చేసేవాడు. ఆ పద్ధతిలో ఆయన ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 ఆపరేషన్లు నొప్పి తెలియకుండా చేసి సంచలనం సృష్టించాడు. హిప్నాటిస్ట్ నేరాలు చేయదలచుకుంటే వశీకరణకు లోబడిన వారిని దీర్ఘసుషుప్తిలోకి తీసుకుపోయి తన ఇష్టం వచ్చినట్లు చేయించగలడు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1952లో హిప్నాటిజం చట్టం రూపొందించింది. దీని ప్రకారం శాస్త్రీయ ప్రయోజనాలకోసమో, లేక రోగులకు వైద్యం చేయడానికో తప్ప వేరే దురుద్దేశాల కోసం హిప్నాటిజాన్ని వాడకూడదు. ప్రస్తుతం అనేకమంది హిప్నాటిజాన్ని వృత్తిగా స్వీకరించి, అనేక మ్యాజిక్కులు చేసి ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నారు.[2]

సెల్ఫ్ హిప్నాటిజం
[మార్చు]తమకు తామే సలహాలు ఇచ్చుకోవడం ద్వారా ప్రశాంతతను పొందడం దీని ప్రత్యేకత. ఈ ప్రక్రియ ముఖ్యంగా ధూమపానం, తాగుడు, మాదక ద్రవ్యాల సేవనం వంటి దురలవాట్ల నుంచి దూరం కావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]- ప్రముఖ తెలుగు హిప్నాటిస్టు బి.వి.పట్టాభిరాం
మూలాలు
[మార్చు]- ↑ పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-27. Retrieved 2009-07-02.
- ↑ "Gulliford, Tristan. "Music and Trance in Siberian Shamanism."". Archived from the original on 2009-02-21. Retrieved 2009-07-02.