Jump to content

సోమవారం

వికీపీడియా నుండి
1616 లో గెలీలియో గీచిన చంద్రుని కళల చిత్రాలు. చంద్రుని పేరుతో సోమవారాన్ని అనేక భాషలలో నామకరణం చేయబడింది.

సోమవారము లేదా ఇందువారము (/ˈmʌnd/ లేదా /ˈmʌndi/) అనేది వారములో రెండవ రోజు. ఇది ఆదివారమునకు, మంగళవారమునకు మధ్యలో ఉంటుంది.సాంప్రదాయంగా క్రైస్తవ కాలెండరు, ఇస్లామీయ కాలెండరు, హిబ్రూ కాలెందరులలో ఈ దినం వారంలో రెండవ రోజుగా పరిగణింపబడుతున్నది. అంతర్జాతీయ ప్రామాణిక కాలెండరు ISO 8601 లో ఈ దినం వారంలో మొదటి రోజుగా పరిగణింపబడుతున్నది. ఈ దినానికి ఆంగ్లంలో పేరు మండే (Monday) అనునది పాత ఆంగ్లం భాషలో "మొనాండే(Mōnandæg)", మధ్య కాలపు ఆంగ్ల భాషలో "మొనెన్‌డే (Monenday)" నుండి వచ్చింది. దానిఅర్థము చంద్రుని రోజు. హిందువులు సోమవారాన్ని శివునికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.

భారతదేశంలోని అనేక భాషలలో సోమవారం అనేది సంస్కృతం భాషలోని "సోమవార (सोमवार)" నుండి ఉత్పత్తి అయినట్లు తెలుస్తుంది. హిందూ మతంలో సోముడు అనగా చంద్రుడు అని అర్థం. భారతదేశంలోనికొన్ని భాషలలో ఈ రోజును చంద్రవారం గా పిలుస్తారు. సంస్కృత భాషలో చంద్ర అనగా చంద్రుడు అని అర్థము. థాయిలాండ్ లో ఈ దినాన్ని "వాన్ జాన్" అని పిలుస్తారు. దీని అర్థము " చంద్రుని యొక్క రోజు".

హిందూ మత పరంగా అర్థం

[మార్చు]

"సోమ" శబ్దానికి " చంద్రుడు" అనే అర్ధమే కాక, స+ ఉమ = ఉమా సహితుడు అని శివపరమైన అర్ధము చెప్పవచ్చు.పార్వతి సహితుడైన పరమేశ్వరునుకి ఆరధన కార్తీక సోమవారాలలో విశేషం .

శివునికి ప్రీతికరమైన రోజు

[మార్చు]

హిందూ మతంలో సోమవారం శివునికి ప్రీతికరముగ భావిస్తాము.నిజానికి ప్రతికాలము పరమేశ్వరార్చనకు ప్రాముఖ్యతనిస్తాయి. అయితే "శివ పురాణము " ప్రకారం "ఆదివారం" శివారాధనకు చాలా ప్రాధాన్యం. ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం.అయితే సోమవారం " సౌమ్యప్రదోషం"గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రథమని పురాణాది శాస్త్రాల వచనం. స్కందాది పురాణాలలో సోమవారవ్రతం గురించి విశేషముగ చెప్పారు. దీని ప్రకారం సోమవారమ్నాడు ఉదయాన్నే నిత్య కర్మలు పూర్తిచేసి, ఉపవాసముండి సాయంకాలం శివున్ని ఆరధించి, నక్షత్రోదయ సమయాన్న ఈశ్వర నివేదితమైన వంటని తినడం నక్త వ్రతం అంటారు. ఈ నియమముతో 16 సోమవారాలు చేస్తే అన్ని గ్రహదోషాలు పోవడమేకాక, అన్ని అభిష్టాలు నెరవేర్తాయి.

కార్తీక సోమవారం

[మార్చు]

హిందూ మతంలో కార్తీకమాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది.

జ్యోతిషం

[మార్చు]

సోమవారం అనునది ఖగోళ వస్తువు అయిన చంద్రునికి సంకేతం. దీని యొక్క జ్యోతిష రాశి "కర్కాటకం". దీనిని చంద్రుని యొక్క గుర్తు అయిన తో సూచిస్తారు.

ప్రముఖుల జననమరణాలు

[మార్చు]
  • కైప మహానందయ్య - అనంతపురం జిల్లాకు చెందిన సాహితీకారుడు 1984 ఫిబ్రవరి 27వ తేదీన ఏకాదశి పర్వదినాన పరమపదించాడు.

ఇతర విశేషాలు

[మార్చు]

స్వకులసాలి కులం వారి నమ్మకం ప్రకారం, ఆదిమయ అనే వాడు అందరికీ వస్త్రాలను అందిచే పుణ్య పురుషుడిని సృష్టించాల్సిందిగా శివుణ్ణి ప్రార్థించాడు. ఆదిమయ యొక్క సూచనల మేరకు శివుడు అతని నాలుక నుండి (జిహ్వ) ఒక శిశువును శ్రావణ శుద్ధ త్రయోదశి, సోమవారం నాటి ఉదయం సృష్టించాడు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సోమవారం&oldid=4391222" నుండి వెలికితీశారు