Jump to content

సోమచంద్ర డి సిల్వ

వికీపీడియా నుండి

1942, జూన్ 11న గాలెలో జన్మించిన సోమచంద్ర డి సిల్వ (Somachandra de Silva) శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రీడాకారుడు. 1983లో దులీప్ మెండిస్ న్యూజీలాండ్ పర్యటన సమయంలో గాయపడటంతో 2 టెస్టులకు నాయకత్వ బాధ్యతలు కూడా చేపట్టినాడు. కెప్టెన్‌గా 2 అర్థసెంచరీలు కూడా సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో సాధించిన రెండు అర్థసెంచరీలు ఇదే సమయంలో కావడం గమనార్హం. స్వతహాగా లెగ్ స్పిన్ బౌలర్ అయిన సోమచంద్ర డి సిల్వ 12 టెస్టులు, 41 వన్డేలలో శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు

[మార్చు]

సోమచంద్ర 12 టెస్టులను ఆడి 36.40 సగటుతో 37 వికెట్లను సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 59 పరుగులకు 5 వికెట్లు. బ్యాటింగ్‌లో 21.36 సగటుతో 406 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్థసెంచరీలు కలవు. టెస్టులలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 61 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలు

[మార్చు]

41 వన్డేలలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సోమచంద్ర డి సిల్వ 48.65 సగటుతో 32 వికెట్లను సాధించాడు.అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 29 పరుగులకు 3 వికెట్లు. బ్యాటింగ్‌లో 19.52 సగటుతో 371 పరుగులు సాధించాడు. వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 37 నాటౌట్.

ప్రపంచ కప్ క్రికెట్

[మార్చు]

సోమచంద్ర 3 పర్యాయాలు శ్రీలంక తరఫున ప్రపంచ కప్ క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించాడు. 1975లో మొదటి సారి పాల్గొనగా, ఆతరువాత 1979, 1983లో మెండిస్ నాయకత్వంలో కూడా పాల్గొన్నాడు.

ఆవరించిన దురదృష్టం

[మార్చు]

క్రీడా జీవితంలో సోమచంద్రకు పలుమార్లు ఆవరించింది. శ్రీలంక జట్టుకు టెస్ట్ హోదా వచ్చేనాటికి సోమచంద్ర వయస్సు 40కు చేరింది. అయిననూ మరో రెండేళ్ళపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడి రిటైర్ అయ్యే నాటికి శ్రీలంక ఆడిన మొత్తం 12 టెస్టు మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. కొన్నేళ్ళ ముందే జట్టుకు టెస్ట్ హోదా వచ్చిఉంటే అతను అత్యున్నత క్రీడాకారుడిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించేవాడు. అతడు నేతృత్వం వహించిన 2 టెస్ట్ మ్యాచ్‌లలో కూడా శ్రీలంక న్యూజీలాండ్ పై 2-0 తేడాతో ఓడిపోయింది. సోమచంద్ర రెండు టెస్ట్ మ్యాచ్‌లలో రెండు అర్థసెంచరీలు సాధించిననూ ఫలితం లేకపోయింది.

బయటి లింకులు

[మార్చు]