సోనార్ కెల్లా
సోనార్ కెల్లా | |
---|---|
దర్శకత్వం | సత్యజిత్ రే |
రచన | సత్యజిత్ రే |
కథ | సత్యజిత్ రే |
నిర్మాత | సమాచార, పౌర సంబంధాల శాఖ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం |
తారాగణం | కుశల్ చక్రవర్తి, సౌమిత్రీ ఛటర్జీ, సిద్ధార్థ ఛటర్జీ |
ఛాయాగ్రహణం | సౌమేందు రాయ్ |
సంగీతం | సత్యజిత్ రే |
విడుదల తేదీ | 1974 |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
సోనార్ కెల్లా (బంగారు కోట) 1974లో విడుదలైన బెంగాలీ సినిమా. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఈ వర్ణచిత్రానికి సత్యజిత్ రే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, సంగీతం సమకూర్చి దర్శకత్వం వహించాడు. 1971లో సత్యజిత్ రే వ్రాసిన నవల "సోనార్ కెల్లా" ఆధారంగా అదే పేరుతో నిర్మించబడిన సినిమా ఇది.
తారాగణం
[మార్చు]- సౌమిత్ర ఛటర్జీ - ప్రదోష్
- సిద్ధార్థ ఛటర్జీ
- మాస్టర్ కుశల్ చక్రవర్తి - ముకుల్ ధర్
- అజయ్ బెనర్జీ
- సంతోష్ దత్తా
- కామూ ముఖర్జీ
- శైలేన్ ముఖర్జీ - డా.హేమాంగ్ బిజ్రా
- హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ
- బిష్ణుపాద రుద్రపాల్
- హరధన్ బెనర్జీ
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు, సంగీతం, దర్శకత్వం - సత్యజిత్ రే
- కళ : ఆశా బోస్
- ఛాయాగ్రహణం: సౌమేందు రాయ్
- కూర్పు : దులాల్ దత్తా
- నిర్మాత : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
చిత్రకథ
[మార్చు]ముకుల్ ధర్ ఆరేళ్ళ కుర్రవాడు. అంత చిన్న వయసులోనే అందంగా బొమ్మలు గీస్తూ, తన తల్లిదండ్రులను మురిపిస్తూ వుండేవాడు. మామూలుగా కోతి, పిల్లి బొమ్మలు గీస్తూ వుంటే అందులో అంతగా ఆశ్చర్యపడడానికేమీ ఉండేది కాదు. పెద్దపెద్ద మైదానాలు, రాజప్రాసాదాలు, ఉద్యానవనాలు, నెమళ్ళు అందంగా చిత్రిస్తూ అంతటితో వూరుకోక ఒక చక్కని కోట బొమ్మ వేసి 'ఇదొక బంగారు కోట. పోయిన జన్మలో నేను అందులోనే ఉన్నాను ' అనే సరికి ముకుల్ తల్లిదండ్రుల మనసుల్లో కలవరం ప్రారంభమైంది. కొన్ని రోజులైతే ఇంకా ఏమంటాడోనని కంగారుపడుతూ డాక్టర్ బిజ్రా అనే సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్ళి, ముకుల్ మనస్తత్వాన్ని పరిశీలించవలసిందిగా చెప్పి అతనికి అప్పగించారు.
డాక్టర్ బిజ్రా, ముకుల్ మాటలను బొమ్మలను ఆధారంగా చేసుకుని అదే వాతావరణం ప్రతిబింబించే జోధ్‌పూర్‌కు తీసుకువెళితే ఫలితం ఉండవచ్చునని ముకుల్‌తో కలిసి ఆ ఊరికి బయలుదేరాడు. ఇంతలో వార్తా పత్రికలలో కలవరాన్ని రేకెత్తించే ఒక వార్త ప్రచురించబడింది. ఆ వార్త ప్రకారం జోధ్‌పూర్‌లో ఒక బంగారు కోట ఉందనీ, ఆ కోట ఉన్న ప్రాంతంలో నిధి నిక్షేపాలు ఉండే అవకాశాలున్నాయనీ అందరూ అనుకోసాగారు.
తమ పిల్లవాడి మనస్తత్వం గురించి అప్పటికే నలుగురూ నాలుగు విధాలుగా అనుకోవడం, డాక్టరుతో ముకుల్ జోధ్‌పూర్ వెళ్ళడం, అక్కడున్నట్లు పిల్లవాడు ఊహించిన బంగారు కోట నిజంగా ఉన్నట్లు పేపర్‌లో వార్తలు రావడం - ఇవన్నీ చూస్తున్న తల్లిదండ్రులు తమ కొడుక్కి ఎటువంటి ప్రమాదం వస్తుందోనని భయపడుతూ ఆ కుర్రవాడి సంరక్షణార్థం ప్రదోష్ అనే ప్రైవేట్ డిటెక్టివ్‌ను జోధ్‌పూర్ పంపించారు.
వాళ్ళు భయపడినట్లే అయ్యింది. డాక్టర్ బిజ్రాను, ముకుల్‌ను అనుసరిస్తూ, అంతకు ముందే ఇద్దరు దొంగలు జోధ్‌పూర్ చేరుకోవడం జరిగింది. సమయం చూసి, దొంగలిద్దరూ ఆ డాక్టర్‌ను ఒక అగాధంలోకి తోసేసి, ముకుల్‌ను తమతో తీసుకు వెళ్తారు. పుర్వజన్మపు వాసనలున్న ఆ కుర్రవాడు బంగారు కోటలో ఉన్న నిధి నిక్షేపాలను గురించి చెబితే, అవి తాము పొందవచ్చని వాళ్ళ ఆశ.
ముకుల్ సంరక్షణార్థం జోధ్‌పూర్ బయలుదేరిన ప్రైవేట్ డిటెక్టివ్ ప్రదోష్‌కు రైలులో ఒక డిటెక్టివ్ కథా రచయితతో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి ఆసక్తీ ఒకటే కావడంతో ఈ మిస్టరీని కలిసే ఛేదించాలన్న నిర్ణయానికి వస్తారు. జోధ్‌పూర్‌లో వాళ్ళకు అనుకోకుండా, తొందరలోనే ఆ ఇద్దరు దొంగలూ ముకుల్‌తో పాటు తటస్థపడతారు. తామెవ్వరో చెప్పకుండా అప్పటికప్పుడే ఓ ప్లాన్ రూపొందిస్తారు. ఆ దొంగలు వీళ్ళను అనుమానించలేక పోయినా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూనే ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో విడిగాను, కలిసీ ఆ నిధినిక్షేపాలను కనిపెట్టడానికి కుర్రవాడితో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.
ఆ ఇద్దరు దొంగలలో ఒకడు మామూలు ప్రయత్నాలతో లాభం లేదనుకుని ముకుల్‌ను హిప్నటైజ్ చేసి బంగారు కోటను గురించి అడిగే సరికి జై సల్మేర్ అనే ప్రాంతంలో అవి లభిస్తాయని చెబుతాడు. ప్రైవేట్ డిటెక్టివ్ ప్రదోష్, అతని మిత్రుడూ తమకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముకుల్‌ను అనుసరిస్తూనే వుంటారు.
ఈలోగా అగాధంలోకి తోసివేయబడ్డ డాక్టర్ బిజ్రా చావుతప్పి, కన్నులొట్టబోయిన స్థితిలో కూడా ఆశ చావక ముకుల్‌ను వెదికే ప్రయత్నంలో రైలెక్కుతాడు. ఆ ఇద్దరు దొంగలలో ఒకడు - తను ఎక్కిన కంపార్టుమెంట్లోనే ఉండడం చూస్తాడు. చనిపోయాడనుకున్న డాక్టర్ ఎదురుగా కనబడేసరికి, కంగారుపడిపోయిన ఆ దొంగ వెళుతున్న రైల్లోంచి దూకేస్తాడు.
అప్పటికే జైసల్మేర్ చేరుకున్న ప్రదోష్ తన మిత్రుని సహాయంతో నేర్పుగా దొంగను పట్టుకుని - ముకుల్‌ను ఆ బంగారు కోటలోంచి తప్పించి ఇంటికి తీసుకువస్తాడు.[1]
పురస్కారాలు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగము | లబ్ధిదారుడు | ఫలితం |
---|---|---|---|---|
1974 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ బెంగాలీ సినిమా | పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం | గెలుపు |
1974 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ దర్శకుడు | సత్యజిత్ రే | గెలుపు |
1974 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ బాలనటుడు | కుశల్ చక్రవర్తి | గెలుపు |
1974 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ ఛాయాగ్రహణం (వర్ణ) | సోమేందు రాయ్ | గెలుపు |
1974 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ స్క్రీన్ ప్లే | సత్యజిత్ రే | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ "సోనార్ కెల్లా". విజయచిత్ర. 10 (4): 14–15. 1 October 1975.