Jump to content

సూర్యశతకము

వికీపీడియా నుండి

సూర్యశతకము మయూర మహాకవి సంస్కృతమున రచించిన "సూర్య శతకము" నకు తెలుగు అనువాదము. దీనిని శ్రీనాథుడు మొదలు అనేకులు తెలుగు లో అనువదించారు.

మయూరుని సూర్య శతకము

[మార్చు]

మయూరుడు క్రీ. శ. 7 వ శతాబ్దము (620 ప్రాంతము) వాడు-ఈ పదమూడు శతాబ్దులనుండియు, సంస్కృత సాహితీ ప్రపంచమున ప్రసిద్ధుడైనాడు. మయూర మహాకవి అతిభయంకర మగు కుష్ట రోగముచే, దేహ మనసియున్న సమయమున భక్తిప్రపత్తులతో సూర్యుని స్తుతించి, తనరోగమును బాపుకొని కవిత్వము నకు ఇంత మహత్త్వమున్నదని ప్రథమముగా లోకమునకు చాటినాడు. అతని సూర్య శతకము ఖండాంతర భాషలలోను ప్రచురితమయినది. ఈ శతకమునకు పదునాలుగు వాఖ్యానాలు ఉన్నట్లుగా పేర్కొన బడినది.   ఆనంద వర్ధనుని వంటి లక్షణకారులు సూర్యశతకము నుండి ఉదహరించిరని, జగన్నాధ పండితరాయలు "సుధాలహరిని" సూర్యశతకము ననుసరించి యే స్రగ్ధర లోనే రచించారని ప్రతీతి! ఈ సూర్యశతకము భారత దేశములో ఎక్కువగా తెలుగులో అనువాదాలు ఉన్నాయి అని కళాప్రపూర్ణ నిడదవోలు వెంకటరావు పేర్కొన్నాడు.[1][2]

అనువాదాలు

[మార్చు]
వికిసోర్స్ నుండి గ్రహించాను

తెలుగు కవులలో చాలామందిని మయూర మహాకవి సూర్యశతక కావ్యం ఆకర్షించింది. వారిలో శ్రీనాథుడు, పోతన, పెద్దన, రామరాజ భూషణుడు, జగన్నాధ పండితరాయలు, తర్వాత వారిలో ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రి, వడ్డాది సుబ్బరాయ కవి, మహాకవి దాసు శ్రీరాములు, పింగళి లక్ష్మీకాంతం మొదలైన వారు ముఖ్యులు. వీరిలో కొందరు సూర్యశతకాన్ని తమ రచనల ద్వారా కొందరు కొన్ని శ్లోకాలు, మరి కొందరు పూర్తి శతకాన్ని తెలుగు వారికి పరిచయం చేశారు. [2]  మొదటగా శ్రీనాథమహాకవి మయూర కవి సూర్యశతకమును కాశీఖండమున 15 శ్లోకములను తెలుగు చేసాడు. ఇంకా భీమ ఖండమున శివరాత్రి మాహాత్మ్యమున మరి రెండు శ్లోకములను నాంధ్రీకరించినాడు. క్రీ. శ. 1893 నుండియు తెలుగున సంపూర్ణానువాదములు ప్రారంభమైనవి.

  1. ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రి (1893)
  2. వడ్డాది సుబ్బారాయుడు--(1899) తెలుగులో సా.శ.1898వ సంవత్సరమున శ్రీ. వ.సు.రాయుడు సరస్వతి పత్రికలో అంధ్రసూర్యశతకమును ప్రకటించారు.
  3. మహాకవి దాసు శ్రీరాములు (1902)
  4. యామిజాల పద్మనాభస్వామి
  5. చదలువాడ జయరామ శాస్త్రి
  6. నేమాని సూర్యప్రకాశకవి[1]

1905 వ సంవత్సరమున బెరన్ హైమర్ అను పండితుడు ఇటాలియన్ భాషలోనికి అనువదించాడు. సింహళీయములోనికి కూడా దీనిని అనువదించారు.

సూర్య శతకము (తెలుగు)

[మార్చు]

1902 లో మహాకవి దాసు శ్రీరాములు తెలుగు లో ఆంధ్రీకరించిన సూర్యశతకము ఈ అనువాదములలో మూడవది. శ్రీరామకవిగారును, పై రెండనువాదములు పరిశీలించియే, తాము తిరిగి దీని ననువదించుటకు పూనుకొనిరి. వ్యాసమూర్తి శాస్త్రిగారు, గొప్ప సంస్కృతపండితులగుటచే, వారియనువాదము తెనుగు కాకపోయినది-వడ్డాది సుబ్బారాయడు గారు, సహజముగా కవులగుటచేత, సంస్కృత మూలమున గల గంభీరార్థములు తెలుగులోనికి రాలేదు-అందువలన శ్రీరామకవిగారు సూర్యశతకమే గాక, వ్యాఖ్యానములను పరిశీలించి మయూర కవి కృతిని పూర్వరీతిగా-అనువాదములు గాక-తెనుగు గావించిరి. మహా గంభీరమైన మయూరకవి భావములను తెలుగువారికి తేటతెల్లము గావించిన యశస్సు, మయూర శతకానువాదకులలో నొక్క శ్రీరాములు గారికే దక్కినది - అని కళాప్రపూర్ణ నిడదవోలు వెంకటరావు అభిప్రాయపడ్డాడు.
మయూరుని మూలశ్లోకములను ఏ విధముగా శ్రీరాములు తెలుగు చేసారో చూపుటకు ప్రథమ శ్లోకానువాదములను ఉదారణకు ఇచ్చారు. [1]


"జంభారతీభకుంభోద్భవ దధతం సాంద్రసిందూరరేణుం
రక్తస్సిక్తా ఇవమైరుదయ గిరితటే ధాతుధారాద్రవస్య
ఆయాంత్యాతుల్య కాలం కమలవనరుచే వారుణావిభూత్యై
ర్భూయాసుర్భానయంతో భువన మభినవాభానవో భానవీయాః"

శ్రీరాములు అనువాదం (కిరణ వర్ణనములో మొదటి శ్లోకము):

శా. జేజేరాయని కుంభి కుంభగతమౌ సిందూరముల్ తాల్చియో
యోజం జేగురుకాంతు లయ్యుదయ శై లోపాంతమం దంటియో
రాజీపప్రభ లేకకాలమున ప్రారంభించియో యెఱ్ఱనై
తేజుల్ గ్రమ్ము నవార్కఖాను లిడు నెంతే మీకు నైశ్వర్యముల్.

సంస్కృత సూర్యశతకమున నూఱు శ్లోకములు గలవు. అవి అన్నియు స్రగ్ధరావృత్తములు. . . ఈ స్రగ్ధరావృత్తము లన్నియు, ఆశీస్సు అంతముగా గలవి. అనగా ప్రతి శ్లోకమును మీకు శ్రేయము ప్రసాదించుగాత! అన్న ఆశీస్సుతో ముగియును. ఇందువలన తెలుగుపద్యములును ఆశీస్సులతో నుండును.


ఉ. చుట్టము పక్కముం గురువు చూపును గాపును జ్ఞాతి జ్యోతియున్
పట్టగు ప్రాణదాతయును భ్రాతయు తల్లియుఁ దండ్రియున్ సదా
పెట్టని కోటయై సకల పృథ్వికి నన్నము నీళ్ళు నిచ్చుచున్
దిట్టవు వెల్లులం దనరు దేవుడు మీ కిడు వాంఛితంబులన్.100 ప.

దాసు శ్రీరాములు రచించిన సూర్యశతకమును మొదట 1902లో ముద్రించారు. ద్వితీయ ముద్రణను మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి, హైదరాబాద్ వారు ముద్రించారు. ఈ శతకము పీఠికను, శతక పద్యాలకు తాత్పర్యము కళాప్రపూర్ణ నిడదవోలు వెంకటరావు రచించాడు. దీని అవతారిక లో 5 శ్లోకాలు, కిరణవర్ణనము (43), ఆశ్వవర్ణనము (6). అనూరు వర్ణనము (12), రథవర్ణనము (11), మండలవర్ణనము (8), సూర్యవర్జనము లో 20 శ్లోకములున్నాయి. [1] మరో రెండు శ్లోకాలు ఫల శ్రుతి శ్లోకములుగా పేర్కొనెను. మొత్తం కలిపితే 102 శ్లోకముల కావ్యంగా సూర్యశతకము రూపొందింది.[1][2]

మహాకవి శ్రీరాములుగారు అనువదించిన సూర్య శతకమంతా ప్రసన్న రచనకు ఉదాహరణమని పండితుల అభిప్రాయ పడినప్పటికీ, మూలమున మయూరకవి వ్యక్త పరచిన గంభీర భావములను సులభ గ్రాహ్యమగు పదజాలాన్ని వాడి, తేట తెనుగులో రచించినారు.లోక కళ్యానార్థం మయూరుడను మహాకవి సంస్కృత భాషలో రచించిన నూరు శ్లోకముల ఈ స్తోత్రమును తెలుగు జాతి హితాన్ని దృష్టిలో నుంచు కొని, సుళువైన, సుబోధకమైన తెలుగు భాషలో రచించిన మహాకవి దాసు శ్రీరాములు అని రావినూతల సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.[2]

ఉదాహరణ పద్యాలు

[మార్చు]

రచయత అవతారిక (4వ పద్యము) లో మయూర సూర్య శతక అనువాదము గురించి ఈ క్రింద శ్లోకములో ప్రస్తావించాడు. [3]


చ. విలసిత సాహితీ విమలవృక్షముకొమ్మ మయూరనామ సం
కులసరఘాళి శుద్ధపదగుంభ సుమాసవ మేఱ్చుు చేర్చినన్
కలయఁగఁ గట్టు సూర్యశతకం బను కండెను దాసు రాముఁడన్
తెలుఁగునఁ గొట్టి కమ్మనగు తేనియఁ దీసితి దీనిఁ గ్రోలుఁడి!

అశ్వ వర్ణనము (మొదటి శ్లోకము)


ఉ. మేరువుమీఁద నున్ననగు మేల్మిశిలల్ నలఁగంగనీక సా
మీరజవంబుసం దుముకఁబెట్టిన గుర్తులు వేఱె లేమిచే
చారుతరార్క కాంతమణిజం బగు వహ్నియ దారి తెల్పఁగా
మీరిన సూర్యుగుఱ్ఱములు మేలుగ ముజ్జగ మేలు గావుతన్,

అనూరు వర్ణనము (మొదటి శ్లోకము)


చ. పొడుపుడుగొండ రంగమునఁ బొంకపు రేతేఱచొత్త లక్ష్మిక
న్పడ నుడుపంక్తి పేరిటి నవంబగు పూవుల దోయిలింత జొ
ప్పడ నిడి సూత్రధారత దివంబున నాలుగు జాల యంకముల్
నడపెడి లోకనాటిక ననం జను నయ్యరుణుండు మీ కగున్.

రథ వర్ణనము (మొదటి శ్లోకము)


ఉ. ఠీకుగఁ బ్రాగ్గిరి న్వెనుక డెక్కలయంచుల నిల్వ ఱొమ్ములన్
జౌకుమొయిళ్లు మేనులను సాచక యెత్తిన శబ్దహీనమై
ప్రాకెడి చక్రముం గలిగి పాఱ ననూరుఁడు లేచి మ్రొక్కినన్
వీకున సంతరిక్షమున వే జను సూర్యునితేరు మీకగున్.

మండల వర్ణనము (మొదటి శ్లోకము)


చ. పగటికి బీజమున్ తిమిర బాధక మక్షికి నంజనంబు ము
క్తిగవిని, ముజ్జగాలఁ దగు దీపము లొక్కటియైన ముద్ద వా
న గురియు హేతు వబ్ధి రశనారసపానము పెద్దచెంబు పే
ర్మి గలుగు సూర్యమండలము మీకునుఁ గోరిక లిచ్చుగావుతన్.

రవి వర్ణనము (మొదటి శ్లోకము)


చ. శ్రితవిధులై బుధుల్ క్రుతుల సిద్దులు గీతిని సౌరగాతలున్
జతురతఁ జాటు గర్భముగఁ జారణులు న్యతబుద్ధియాతుధా
నతతి ముహుర్ముహుర్నతిఘనాహులు సార్ఘ్యము సాధ్యులున్ మహా
వ్రతనియతిన్ ముముక్షువులు పక్షతఁ గొల్చు నవాద్రి మీకగున్.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 శ్రీరాములు, దాసు (1979). "పీఠిక (నిడదవోలు వెంకటరావు)". శ్రీ సూర్య శతకము (2 ed.). హైదరాబాద్: మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి. pp. Iv–xv.
  2. 2.0 2.1 2.2 2.3 సత్యనారాయణ, రావినూతల (2021). "మయూరుని సూర్యశతకం తెలుగు సేత - మహాకవి దాసు శ్రీరాములు.". వ్యాస మంజూష’. వరలక్ష్మి రావినూతల.
  3. శ్రీరాములు, దాసు (1902). శ్రీ సూర్య శతకము (PDF). హైదరాబాద్: మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి.