సి.కె.బాలగోపాలన్
సి.కె.బాలగోపాలన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | చెరువత్తూర్ , కేరళ | 1939 సెప్టెంబరు 4
మరణం | 2019 ఆగస్టు 24 | (వయసు 79)
సంగీత శైలి | నాట్యం |
వృత్తి | భరతనాట్యం గురువు |
సి.కె.బాలగోపాలన్ భరతనాట్య కళాకారుడు, నాట్యాచార్యుడు.[1]
విశేషాలు
[మార్చు]ఇతడు 1939, సెప్టెంబర్ 4వ తేదీన కేరళ రాష్ట్రం, ఉత్తర మలబార్ జిల్లా, చెరువత్తూర్ గ్రామంలో జన్మించాడు.[2] ఇతని తండ్రి పి.కొమన్ నాయర్ ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయుడు. అతడు నాటకాలలో హాస్యపాత్రలను ధరించేవాడు. అతడిని "మలబార్ చార్లీ చాప్లిన్" అని పిలిచేవారు. బాలగోపాలన్ తన 14 యేళ్ళ వయసులో 1953లో మద్రాసులోని కళాక్షేత్రలో అడుగుపెట్టాడు. ఇతడు భరతనాట్యాన్ని రుక్మిణీదేవి అరండేల్ వద్ద, కథాకళి నృత్యాన్ని టి.కె.చందు పణికర్ వద్ద నేర్చుకుని నాట్యంలో డిప్లొమా పొందాడు. ఇతడు కళాక్షేత్రలో రుక్మిణీదేవికి సహాయకుడిగా కొనసాగి 2000లో భరతనాట్యం ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశాడు.
ఇతడు కళాక్షేత్ర ప్రదర్శించిన నృత్యరూపకాలలో దాదాపు అన్నింటిలో నటించాడు. వాటిలో చెప్పుకో తగినవి "గీత గోవిందం"లో కృష్ణుడు, "పాదుకా పట్టాభిషేకం"లో భరతుడు, "అభిజ్ఞాన శాకుంతలం"లో విదూషకుడు, "సీతాపహరణం"లో 'కపట సన్యాసి ' (రావణ), రామాయణం సిరీస్‌లో హనుమంతుడు, "పాంచాలీ శపథం"లో శకుని, "సీతా స్వయంవరం"లో లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, "కన్నప్పర్ కురవంజి"లో కన్నప్ప మొదలైనవి.[3]
కళాక్షేత్రలో ఇతడు నాట్యాచార్యుడిగా అనేక మందికి భరతనాట్యం నేర్పించాడు.
ఇతనికి భారత ప్రభుత్వం కథాకళి నేర్చుకోవడానికి మూడు సంవత్సరాలు ఉపకార వేతనం ఇచ్చింది. 2003లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి సంగీత నాటక అకాడమీ అవార్డును ఇచ్చింది.[4]
ఇతడు 2019, ఆగష్టు 24వ తేదీన చెన్నైలో తన 79వ యేట మరణించాడు. ఇతని జీవిత చరిత్రను ఇతని శిష్యురాలు ఎలీజా లూయీస్ "లీప్ ఆఫ్ ఫెయిత్" పేరుతో రచించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ web master. "C. K. Balagopalan". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 26 April 2021.
- ↑ 2.0 2.1 V.P. Dhananjayan (3 September 2020). "C.K. Balagopalan: As devoted as Hanuman". The Hindu. Retrieved 26 April 2021.
- ↑ Jyotsna (29 August 2019). "Balagopal — tapasvi who walked the talk". The Hindu. Retrieved 26 April 2021.
- ↑ web master. "CK BALAGOPALAN". SRUTI MAGAZINE. THE SRUTI FOUNDATION. Retrieved 26 April 2021.