సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
సింగోటం లక్ష్మీనరసింహస్వామి దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | నాగర్ కర్నూల్ జిల్లా |
ప్రదేశం: | కొల్లాపూర్ మండలంలోని సింగోటం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | హిందూ |
సింగోటం లక్ష్మీనరసింహస్వామి దేవాలయంనాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ మండలంలోని సింగోటంలో ఈ దేవాలయం ఉంది.లక్ష్మీనరసింహస్వామి లింగరూపంలో స్వయంభువుగా వెలసిన దివ్యక్షేత్రం.
ఆలయ నిర్మాత
[మార్చు]ఈ ఆలయాన్ని సా.శ. 13 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సురభి శ్రీ నరసింగభూపాలుడు నిర్మించినట్లు చెపుతున్నారు.
స్థల పురాణం
[మార్చు]ఈ ప్రాంతాన్ని సురభి శ్రీ నరసింగ భూపాలుడు పరిపాలించే రోజులవి. ఒక రైతు ఇప్పుడున్న ఆలయానికి ఎడమవైపున (అప్పుడు చెరువు ఏర్పడలేదట) ఉన్న పొలంలో నాగలితో పొలం దున్నుతున్నాడు. హఠాత్తుగా నాగేటి కర్రుకి రాయిలాంటిది అడ్డం పడింది. దాన్ని తీసి గట్టు పైకి విసిరేసి, మళ్లీ దున్నడం కొనసాగించాడు. కాని మళ్లీ అదే పరిస్థితి. తీసి బయటకు విసిరేశాడు. కాని ఆ రాయి మళ్లీ అడ్డం పడేది. కొన్నిరోజులు అలాగే జరిగింది. ఆ రైతుకు విసుగుతో పాటు భయం కూడా వేసింది. శ్రీ మన్నారాయణుని భక్తుడైన ఆ రైతు ఏమి చేయాలో తెలియక పగలు, రాత్రి, మనసులో ఆ భగవంతుని వేడుకుంటూనే ఉన్నాడు. కరుణించిన ఆ దైవం ఒకనాటి రాత్రి శ్రీ నరసింగ భూపాలునికి కలలో కన్పించి, “పాపం తన వలన ఆ రైతు ఇబ్బంది పడుతున్నాడని, తాను అక్కడే ఉండ దలచాను, కాబట్టి అందుకు కావలసిన నిర్మాణం చేపట్టి నీ జన్మను చరితార్ధం చేసుకోవలసిందని “ రాజుని ఆజ్ఞాపించాడు. సహజంగానే దైవభక్తుడైన శ్రీ నరసింగ భూపాలుడు వెంటనే ఆలయ నిర్మాణం చేసి, స్వామిని సేవించి కృతార్థుడైనాడు.
ఈ నృసింహాలయంలో అర్చకులుగా స్మార్తులను ఆ కాలంలోనే నియమించారు. అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. అంటే శ్రీ లక్ష్మీనరసింహస్వామి విష్ణురూపుడైనా శైవులు పూజారులుగా ఉంటూ ఆనాటినుండి శివకేశవాద్వైతాన్ని పరిరక్షిస్తున్నామని ఆలయ పూజారి చెప్పారు. అనంతర కాలంలో శ్రీ నరసింహస్వామికి కుడి వైపు ఉపాలయంలో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. కావున ఇది శివకేశవాలయంగా కూడా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయ చరిత్ర అర్చకులు చెప్పిందే కాని లిఖిత పూర్వకంగా ఎక్కడా లభించక పోవడం భక్తులకు నిరాశ కల్గిస్తుంది.
ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక కి.మీ. దూరంగా ఉన్న కొండమీద శ్రీ రత్నలక్ష్మీ ఆలయం ఉంది. సా.శ. 1875ప్రాంతంలో రాణీ రత్నమాంబా దేవి ఈ ఆలయాన్నినిర్మింపజేసి, చెన్నపట్నం నుండి లక్ష్మీదేవి విగ్రహాన్ని తెప్పించి ప్రతిష్ఠించినట్లు చెప్పబడుతోంది.
అంతరాలయం, ముఖమండపం మాత్రమే నిర్మించబడ్డాయి. ప్రక్కనే వివాహాది కార్యక్రమాల కొఱకు గదులు నిర్మించబడ్డాయి. దానిముందే శ్రీ స్వామి వారి కళ్యాణ మండపం ఉంది. వివాహ, చౌల, ఉపనయనాది వేడుకల నుండి వాహన పూజల వరకు భక్తులు తమ తమ మొక్కులను యథాశక్తి సమర్పించుకుంటూ కన్పిస్తారు. సింగోటం అని పేరున్నవారు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువమందే ఉన్నారు. ఆలయానికి ఎడమ వైపు నృసింహసముద్రం అనే పెద్దచెరువు, కుడి వైపు రత్న పుష్కరిణి అనే కోనేరు ఉన్నాయి. కోనేట్లోకి మెట్లమార్గం ఉంది. చెఱువు నుండి అలుగు ద్వారా పుష్కరిణి లోకి నీరు వస్తూ ఉంటాయి. ఆలయ ముందుభాగంలో శ్రీ లక్ష్మీ గణపతి మందిరం, నవగ్రహమండపం. ఉట్లస్తంభం, కొంచెం దూరంలో పొంగళ్ల శాలలు దర్శనమిస్తాయి.
- రామకోటి స్తంభం: థ్వజస్తంభానికి ప్రధాన ద్వారానికి నడుమ శ్రీ రామకోటి స్తంభం ప్రతిష్ఠించబడింది.
- శ్రీ రాజావారి భవనం: శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయానికి కుడి వైపు రాజా వారి విడిది భవనం కన్పిస్తుంది.[1]
శ్రీ స్వామి వారి దివ్య రూపం
[మార్చు]ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు కొత్తవాళ్లైతే నరసింహస్వామి ఎక్కడ ఉన్నాడోనని వెతుక్కుంటారు. ఎదురుగా దివ్యమైన లింగరూపంలో ఉన్నస్వామిని చూడగానే ముందు ఆశ్చర్యాన్ని, తరువాత ఆనందాన్ని పొందుతారు. అడుగు, అడుగున్నర ఎత్తున ఉన్న లింగరూపంలో ఊర్థ్వపుండ్రాలు, త్రిపుండ్రాలు ధరించి (పంగనామాలు, విభూతిరేఖలు) చక్కగా వెనుకకు మెలితిప్పిన మీసాలతో స్వామి ధీరగంభీరంగా కనిపిస్తాడు.
ఉత్సవాలు
[మార్చు]ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇక్కడ బ్రహ్మోస్త్సవాలు పది రోజులపాటు జరుపుతారు.
రవాణా సౌకర్యం
[మార్చు]కొల్లాపూర్ నుండి తొమ్మిది కి.మీ. దూరంలో ఈ పుణ్యక్షేత్రం విలసిల్లుతోంది. N.H. 7 లో కల పెబ్బేరు నుండి 38.5 కి.మీ దూరంలో కలదు
మూలాలు
[మార్చు]- http://manatelangana.news/singotam-sri-laxmi-narasimha-swamy-temple/ Archived 2022-05-21 at the Wayback Machine
- ↑ "Sri Lakshmi Narasimha Swamy Temple Singotam, Kollapur, Mahabubnagar Details". templesinindiainfo.com. Retrieved 2020-05-29.[permanent dead link]