Jump to content

సాయంకాలమైంది

వికీపీడియా నుండి
నవల ముఖచిత్రం

సాయంకాలమైంది గొల్లపూడి మారుతీరావు రాసిన ఒక నవల. దీనిని శ్రీ వైష్ణవ సాంప్రదాయ నేపథ్యంలో రాశారు. ఇది ఆంధ్రప్రభ వారపత్రికలో 2001 సంవత్సరంలో ధారావాహికగా వెలువడింది.

నేపథ్యం

[మార్చు]

ఈ నవల నేపథ్యమైన శ్రీవైష్ణవం గురించి గొల్లపూడి మారుతీరావు శ్రీ భాష్యం అప్పలాచార్యుల నుంచీ, శ్రీ సాతులూరి గోపాలకృష్ణమాచార్యుల నుంచీ సేకరించారు. ఈ నవలను రాయడానికి, ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురించడానికి సహాయపడింది వల్లూరు రాఘవ రావు.

పద్మనాభం అనే ఊర్లోని పరమ నైష్ఠిక వైష్ణవ బ్రాహ్మణుల ఇంట జన్మించిన చిన తిరుమలాచార్యుల చుట్టూ కథ పరిభ్రమిస్తూ ఉంటుంది. అతని తల్లిదండ్రులు సుభద్రాచార్యులు, వరదమ్మ. అదే ఊళ్ళోని కుంతీనాథ స్వామిని ఆరాధిస్తూ జీవనం సాగిస్తుంటారు. మొదట్లో తండ్రి అడుగు జాడల్లోనే అర్చకత్వం నేర్చుకుంటున్న చిన తిరుమలాచార్యుల ప్రతిభను గుర్తించిన వెంకటాచలం అతనికి ఆంగ్లవిద్య మీద ఆసక్తిని కలిగిస్తాడు. సుభద్రాచార్యులు మొదట్లో ఇందుకు అంగీకరించలేకపోయినా కొడుకు ఆసక్తిని గమనించి, వరదమ్మ, వెంకటాచలం, తదితరుల ప్రోద్భలంతో అందుకు అంగీకరిస్తాడు. చిన తిరుమలాచార్యులు నెమ్మదిగా పాఠశాల విద్య దాటి కళాశాలకు చేరుకుంటాడు. అక్కడి తన ప్రతిభకు ముగ్ధుడైన ఆచార్యులు అమెరికాలోని జెనరల్ ఎలక్ట్రిక్ సంస్థకు ఈ ప్రతిభను చేరవేస్తారు. చదువు పూర్తి కాగానే అమెరికాలో ఉద్యోగం వస్తుంది. అలా చిన తిరుమలాచార్యుల అందరినీ వదిలి అమెరికాకు ప్రయాణవుతాడు. ఇక్కడ తల్లిదండ్రులకు కుమారుడి మీద బెంగ మొదలౌతుంది. కానీ బయటకు చెప్పుకోలేరు. చివరకు తల్లిదండ్రుల ఆఖరి చూపుకు కూడా నోచుకోలేక పోతాడు.

పాత్రల చిత్రీకరణ

[మార్చు]

ఈ నవలలో గొల్లపూడి కొన్ని బలమైన పాత్రలు సృష్టించారు. నిజజీవితంలో ఇలాంటి పాత్రలు ఉంటాయా? అన్న మీమాంసను పక్కన పెడితే, నవనీతం, సంజీవి,కనబడ్డది కాసేపే అయినా మనసులో నిలిచిపోయే రేచకుడు, కొన్ని సంఘటనల్లో కూర్మయ్య, వెంకటాచలం – అద్భుతంగా చిత్రీకరించారు గొల్లపూడి గారు. దాదాపు ప్రతి ప్రాత్రా ఏదో ఒక సందర్భంలో తనదంటూ‌ ఒక ప్రత్యేక ముద్ర వేస్తుంది.

కొన్ని సన్నివేశాలు

[మార్చు]

"మార్పు కొందరిని భయపెడుతుంది. కొందరిని జోకొడుతుంది. కొందరిని ఆనందింపజేస్తుంది" ఇవి కూడా నవలలో వాక్యాలే. ఈ మార్పే 'సాయంకాలమైంది' నవలలో కథా వస్తువు. ప్రాణం కన్నా సంప్రదాయాన్ని కొనసాగించడాన్ని మిన్నగా భావించే ఓ శ్రీవైష్ణవ కుటుంబంలో నాలుగు తరాల కాలంలో అనివార్యంగా వచ్చి పడిన మార్పుని వ్యాఖ్యాన సహితంగా చిత్రించిన నవల ఇది. కథాస్థలం విజయనగరం జిల్లాలో, గోస్తనీ నదీ తీరంలో ఉన్న పద్మనాభం అనే పల్లెటూరు. స్వస్థలం కాకినాడ సమీపంలో ఉన్న సర్పవరం అగ్రహారంలో ఆచారం సాగడంలో జరిగిన చిన్న పొరపాటు, పండితుడైన కుంతీనాధాచార్యుల వారిని కుటుంబ సహితంగా పద్మనాభం తరలి వచ్చేలా చేస్తుంది.

పద్మనాభంలో కుంతీమాధవ స్వామి, కొండమీది అనంతపద్మనాభ స్వామి ఆలయాల్లో అర్చకత్వం మొదలుపెడుతుంది ఆ కుటుంబం. కుంతీనాధా చార్యుల కుమారుడు పెద్ద తిరుమలాచార్యులు తండ్రి ఇష్టానికి విరుద్ధంగా ఆయుర్వేద వైద్యం చేయడం మొదలుపెట్టి, కేవలం సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం అనివార్య పరిస్థితిలో ప్రాణత్యాగం చేస్తారు. పెద్ద తిరుమలాచార్యుల కుమారుడు సుబాధ్రాచార్యులు నూటికి నూరుపాళ్ళు తాతకి తగ్గ మనవడు. శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని కొనసాగించడాన్ని మించినదేదీ లేదాయనకి. భర్తకి తగిన భార్య వరదమ్మ. పద్మనాభం అనే ఓ చిన్న పల్లెటూరినే తమ ప్రపంచంగా చేసుకున్న ఆ దంపతుల కొడుకు చిన్న తిరుమలాచార్యులు ఉద్యోగం కోసం విదేశాలకి వలస వెళ్ళిపోగా, కాలేజీలో చేరిన కూతురు ఆండాళ్ళు - కుండలు చేసుకుని జీవించే సానయ్య కొడుకు కూర్మయ్యని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. ఈ విపర్యయాలకి ఆ వృద్ధ దంపతులు ఎలా స్పందించారన్నది తర్వాతి కథ.

సూచికలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]