సామవాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సామవాయి పల్లవ వంశానికి చెందిన రాజవంశీయురాలు. పల్లవులు కంచి రాజధానిగా పాలించారు. తిరుమలలో వెంకటేశ్వరునికి నిత్యారాధనా సంప్రదాయంలో సామవాయి పాత్ర చిరస్మరణీయమైనది.

సా.శ.922లో సామవాయి ఇచ్చిన దానశాసనం నేటికీ లభ్యమవుతున్నది. బహుశా అంతకు పూర్వం నిత్యపూజలకు ఏర్పాట్లు లేవు. వెంకటేశ్వరుని నిత్య పూజా నిమిత్తం తిరుచానూరులో మడిమాన్యాలను, వజ్రవైఢూర్యాలను, గోసంపదను సామవాయి సమర్పించింది. "సూర్య చంద్రులున్నంతవరకూ ఈ దానం చెల్లుబాటు అవుగాక" అని ఆశించింది. "తాను ఏయే పూజలకోసం వితరణ చేసిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి సహకరించేవారు ఎవరైనా గాని, వారి పాదములు తన శిరస్సుకు అలంకారముగా భాసించుగాక" అని దాన శాసనం వ్రాయించింది. సామవాయి శాసనం గర్భగుడి ఉత్తరంవైపు గోడపై ఉంది.[1]

ఈ పల్లవరాణి కూర్చిన సంపదతో సా.శ.966 అక్షయనామ సంవత్సరం గురువారం (ఆగస్టు 30వ తేదీన) తిరుమలేశునికి తొలి బ్రహ్మోత్సవం జరిపారు. వెయ్యేళ్ళ తరువాత ఇప్పటికీ సామవాయి నిర్దేశించిన విధానంలో "నాలుగు నాలీల ఉడికిన అన్నం" మాత్రమే గర్భగుడిలో శ్రీవారికి సమర్పిస్తారు. ఇతర నైవేద్యాలు గర్భగుడి బయటమెట్టు కులశేఖర పడి వెలుపలనే ఉంచి స్వామికి నివేదిస్తారు. ఈ రుచికరమైన నైవేద్య పదార్ధాలను "కామ్యార్ధాలు" అంటారు.

తిరుమలలో స్వయంభూమూర్తి అయిన శ్రీనివాసుని 8 అడుగుల విగ్రహాన్ని ధృవబేరం అంటారు. ఈ విగ్రహానికి నిత్య పూజలు జరుగవు. మూల విరాట్టును అర్చించే అర్హత బ్రహ్మాది దేవతలకు, మహర్షులకు మాత్రమే ఉందట. నిత్య పూజలన్నీ కౌతుక బేరం అనబడే భోగ శ్రీనివాసునికే జరుగుతాయి. ఈ భోగశ్రీనివాసుని ప్రతిమ 8 అంగుళాల వెండి విగ్రహం. ధ్రువబేరం నమూనాగా ఉంటుంది. ధ్రువబేరం ప్రక్కనే ఉన్న ఈ కౌతుకబేరంలో శ్రీనివాసుని మహిమ ఒక 32 పోగుల వెండిదారం, బంగారు గొలుసుతో ఆవాహన చేయబడ్డాయి. ఈ "సంబంధ సూత్రం" ఎప్పుడూ కలిపే ఉంటుంది. ఆరాధనలన్నీ భోగ శ్రీనివాసునికి (కౌతుక బేరం మూర్తికి), అలంకరణలన్నీ ధ్రువబేరం మూర్తికి జరుగుతాయి. 966 సంవత్సరంలో సామవాయి కాలంలో భోగ శ్రీనివాసుని ప్రతిష్ఠ జరిగిందట.

సామవై శాసనం

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]
  1. తిరుమల కొండ పదచిత్రాలు - పున్నా కృష్ణమూర్తి - ప్రచురణ : సూర్య పబ్లికేషన్స్, హైదరాబాదు (2002)
  • తిరుమల కొండ పదచిత్రాలు - పున్నా కృష్ణమూర్తి - ప్రచురణ : సూర్య పబ్లికేషన్స్, హైదరాబాదు (2002) - వ్యాసంలో అధిక భాగం ఈ పుస్తకంనుండి తీసుకోబడింది.
"https://te.wikipedia.org/w/index.php?title=సామవాయి&oldid=3495926" నుండి వెలికితీశారు