సాగర్ చంద్ర, మే 17న మారం రాంచంద్రారెడ్డి, సునీత దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్గొండలో జన్మించాడు. సాగర్ చంద్ర అసలు పేరు కళాసాగర్. తండ్రి నేతాజీ హైస్కూల్‌ను నడిపేవాడు, తల్లి గృహిణి. ఇంటర్ వరకు నల్గొండలోనే చదివిన సాగర్, హైదరాబాదులోనిఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఆ తరువాత మాస్టర్స్ డిగ్రీ (ఎం.ఎస్.) చదవడానికి అమెరికా వెళ్ళాడు.
అమెరికాలో తను చదివే దక్షిణ ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉన్న ఓ ఫిల్మ్ స్కూల్ లో జరిగే షూటింగ్స్ చూడడంతోపాటు, కొందరు విద్యార్థులతో ఏర్పడిన పరిచయం వల్ల సాగర్ కు సినిమా దర్శకత్వంపై ఆసక్తి కలిగింది. తను కూడా ఫిల్మ్స్కూల్లో చేరి కోర్స్ పూర్తిచేశాడు. ఎం.ఎస్. చదువులతో పెద్ద సంస్థలో ఉద్యోగం వచ్చింది. రెండేళ్ళ తరువాత ఉద్యోగాన్ని వదిలి 2009లో హైదరాబాద్‌కు వచ్చి కొంతకాలం రవిబాబు (అమరావతి సినిమా), మధుర శ్రీధర్ రెడ్డిల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. 2012లో శివాజీ, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో వచ్చిన అయ్యారే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా సరిగా ఆడలేదు. కొంతకాలం కార్పోరేట్ యాడ్స్ చేశాడు. ఆ తరువాత 2016లో శ్రీవిష్ణు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకు దర్శకత్వం వహించాడు.[4] సాగర్ కె చంద్ర తన మూడవ సినిమాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ నటించిన చిత్రానికి దర్శకత్వం వహించాడు.[5][6]