సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి
సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి | |
---|---|
జననం | 1897 డిసెంబరు 10 |
మరణం | 1982 అక్టోబరు 14 | (వయసు 84)
తల్లిదండ్రులు | సుబ్బయ్య, బుచ్చినరసమ్మ |
సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి (డిసెంబర్ 10, 1897 - అక్టోబర్ 14, 1982) ప్రముఖ తెలుగు పండిత కవులు.
జీవితసంగ్రహం
[మార్చు]వీరు వైదికబ్రాహ్మణులు. వీరి తల్లి: బుచ్చినరసమ్మ, తండ్రి: సుబ్బయ్య. వీరి జన్మస్థలం: గోదావరి జిల్లాలోని కండ్రిక అగ్రహారం, నివాసము: సికిందరాబాదు. జననము: డిసెంబర్ 10 1897.
వీరు తిరుపతి, మద్రాసులలోని ప్రాచ్య కళాశాలలలో చదువుకొని శిరోమణి, విద్వాన్, పి.ఒ.ఎల్. మొదలైన పరీక్షలలో ఉత్తీర్ణులైనారు. సికింద్రాబాదులోని మహబూబ్ కళాశాల ఉన్నతపాఠశాలలో 1921 నుండి 1954 వరకు ఉపాధ్యాయునిగా పనిచేశారు. తర్వాత రావు బహద్దూర్ వెంకటరామరెడ్డి కళాశాలలో 1954 నుండి 1962 వరకు సంస్కృతోపన్యాసకులుగా పనిచేశారు.
మరణం
[మార్చు]వీరు 1982, అక్టోబర్ 14 తేదీన పరమపదించారు.[1]
సాహిత్య కృషి
[మార్చు]జాతక కథాగుచ్ఛాది పద్యరచనల వలనను, తత్సమ చంద్రికాది లక్షణ గ్రంథరచనల వలనను సన్నిధానము సూర్యనారాయణ శాస్త్రి పేరు తెనుగువారు లెస్సగా విన్నదియై యున్నది. ఆయన మంచి పండితుడు. గొప్పకవి. వ్యాకరణమున, అలంకార శాస్త్రమున, వీరు ప్రధానముగా కృషిచేసిరి. వారి వ్యాకరణ కృషికి తత్సమచంద్రికయు, అలంకార శాస్త్ర కృషికి కావ్యాలంకార సంగ్రహ వ్యాఖ్యయు నిదర్శనములుగా నిలబడు గ్రంథములు. వేదాంతమున, ప్రస్థానత్రయపాఠము చేసిరి. ఇట్టి వ్యుత్పత్తి గౌరవముతో, వేలూరి శివరామశాస్త్రి గురుత్వముతో సూర్యనారాయణ శాస్త్రి సహజమైన కవిత్వమును వృద్ధిపరుచుకొని, యెన్నోకృతులు రచించిరి. .
శాస్త్రి పట్టుదల మిగుల మెచ్చదగినది. ఆయన కావ్యాలంకార సంగ్రహవ్యాఖ్య 700 పుటలు పరిమితిగల గ్రంథము. ఆలంకారికుల సర్వసిద్ధాంతములు పరిశీలన చేసి ఆయన ఆ వ్యాఖ్యను సంఘటించిరి. కావ్య స్వరూపము - రససిద్ధాంతము మున్నగు స్థలములలో మన ప్రాచీనాలంకారికులు భిన్నవిభిన్నములుగా ప్రదర్శించిన మతములు వీరు గుర్తిచి, వాని నెల్ల ఈవ్యాఖ్యలో బయలుపఱుచుట వీరి పరిశ్రమకు తార్కాణమైన విషయము.
ఆయన తత్సమచంద్రిక యు అమోఘ కృషి ఫలితము. సిద్ధాంత కౌముది, మఱి యితర పాణినీయవ్యాఖ్యాన గ్రంథములు శాస్త్రి బాగుగా బరిశీలనము చేసినారని ఈ కృతి తెలుపుచున్నది. పైన చెప్పిన రెండు లక్షణ గ్రంథములు వీరికి లాక్షణికులలో మంచి స్థానము నిచ్చుటకు జాలియున్నవి.
ఇది యిటులుండగా, సప్తశతీసారము, జాతక కథాగుచ్ఛము, వివేకానందము, వాసవదత్త మొదలయిన వీరి పద్యరచనలు విద్యార్థులకు పాఠ్యములై ప్రసిద్ధిగొన్నవి. వీరి తెలుగు పలుకుబడి సుఖముగానుండును. వ్యాకరణవిశేష విశిష్టములైన ప్రయోగములు వీరి కవితలో దఱచు అన్వయములో నెడనెడ దిక్కనగారి తీరులు, యతిప్రాసలకు దడవు కొన్నటులుండదు. కాని, శాస్త్రి యతి ప్రాసబంధములు పద్యకవితకు దగిలింపరాదని ఒకప్పుడు వాదము నెఱపినవారు.
మధురమైనదియు మృదువైనదియు సాధువైనదియు నగు కవితారచనతో సూర్యనారాయణ శాస్త్రి పెక్కు కావ్యములు సంతరించిరి. నిజాం రాష్ట్రమున, ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి మాహాదరణ గౌరవములకు వీరు పాత్రులయినారు. యావదాంధ్రమున వీరి రచనలు ప్రాకు చున్నవి. మహబూబు కాలేజీలో తెలుగు పండితులై మూడు దశాబ్దులనుండి శిష్యుల నెందరినో తీర్చి దిద్దుచున్నారు. వీరు సాహిత్య శిరోమణి, విద్వాన్, పి.పి.యల్. మున్నగు పట్టములు వడసినారు. సకల సౌభాగ్య సంపన్నులై, పండిత కవులై విరాజిల్లుచున్న సన్నిధానము శాస్త్రి సారస్వత జీవితము చక్కనిది.
రచించిన గ్రంథాలు
[మార్చు]- 1. తత్సమ చంద్రిక [2]
- 2. కావ్యాలంకార సంగ్రహము (వ్యాఖ్యాన సహితము)
- 3. జాతక కథాగుచ్ఛము (2 భాగములు)
- 4. కీరసందేశము[3] - ద్వంద్వయుద్ధము.
- 5. గోవర్ధానాచార్య సప్తశతీ సారము
- 6. పువ్వులతోట[4] (ఖండకావ్యసంపుటి)
- 7. కావ్యమంజరి
- 8. నడుమంత్రపు సిరి (అధిక్షేప కావ్యము)
- 9. ఖడ్గతిక్కన
- 10. అమృతకనములు
- 11. వాసవదత్త
- 12. రేణుక విజయము
- 13. వివేకానందము.
కొన్ని పద్యాలు
[మార్చు]జాతకథా గుచ్ఛమునందలివి ' వివేకానందము ' నుండి మరి మూడు ఉదాహరణలు :-
మ. అడుగంటెన్ మన భారతీయమగు విద్యల్ ; పుచ్చిపోయెన్ గడున్
గడు ధర్మంబులు ; వేషభాషణములుం బాశ్చాత్యలోకంపు బో
కడలన్ మైలపడెన్ ; సమస్తజనలక్ష్యం బర్థకామంబులై
పెడదారింబడె; బూతిగంధియగు నీ విశ్వం బిసీ! కన్పడున్.
తినగా మూల్గుచు నెంగికులపయిన్ దీర్పంగ బెన్దప్పినిం
జనుచున్ సీ ! గవులారు గుంటలకు, వృక్షచ్ఛాయలంబండు చెం
డన్ వానన్, మెయి జింకిపాతలను మాసంబెట్లొ ! రక్షించు కొం
చును జీవించెడి పేదలం గనగ జించున్ దుఃఖ మీడెందమున్.
చాలున్ మూలము లేని సాంఘక దురాచారంబులే యయ్యె బో
మేలుబంతులు జాతికీ భరతభూమిం; దత్పురోవృద్ధికిన్
ఆలోచింపగ వేరుబుర్వులు మఠాధ్యక్షుల్ ; పురోధోగణం
బేలా, పెక్కులు ! దయ్యముల్ కరణి నెంతే బట్టిపల్లార్చెడిన్.
మూలాలు
[మార్చు]- ↑ సూర్యనారాయణశాస్త్రి, సన్నిధానం, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 1017.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో తత్సమ చంద్రిక పుస్తకం.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో కీరసందేశము పుస్తకం.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో పువ్వులతోట పుస్తకం.
- సన్నిధానం రచనలు తెలుగుపరిశోధనలో
- ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950, పేజీలు: 543-6.