షాక్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షాక్
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం హరీష్ శంకర్
నిర్మాణం రామ్ గోపాల్ వర్మ
కథ హరీష్ శంకర్, కోన వెంకట్
చిత్రానువాదం హరీష్ శంకర్
తారాగణం రవితేజ,
రాంజగన్,
జ్యోతిక,
టబు,
సుబ్బరాజు,
బ్రహ్మానందం,
కోట శ్రీనివాసరావు,
నాగేంద్ర బాబు
సంగీతం అజయ్-అతుల్
సంభాషణలు కోన వెంకట్
ఛాయాగ్రహణం సర్వేష్
కూర్పు భానోదయ
నిర్మాణ సంస్థ రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీ అండ్ ఎంటర్టైన్‌మెంట్
విడుదల తేదీ ఫిబ్రవరి 9 2006
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన హరీష్ శంకర్ మొదటి సారిగా దర్శకత్వం వహించగా రవితేజ, జ్యోతిక ప్రధాన పాత్ర ధారులుగా రూపొందించిన ఈ సినిమా 2006 లో విడుదలైంది. ఈ కథలో ప్రతీకారం ప్రధానాంశంగా నడుస్తుంది. దీనికి రామ్ గోపాల్ వర్మ నిర్మాత.

శేఖర్ అని పిలవబడే చంద్ర శేఖర్ (రవితేజ), మధురిమ (జ్యోతిక) ప్రేమించి పెళ్ళి చేసుకుని సంతోషంగా జీవనాన్ని వెళ్ళదీస్తుంటారు. ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తుంటారు. నగేష్ (సుబ్బరాజు), దివాకర్ (రవి కాలె) పోలీస్ డిపార్ట్‌మెంట్ లో పేరొందిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులు. ఏజెంట్ తప్పుడు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు శేఖర్ ను నక్సలైటుగా పొరబడి కాల్పులు జరుపుతారు. తరువాత జరిగిన పొరపాటును దాచిపెట్టడానికి శేఖర్ నిజంగా నక్సలైటే నని తప్పుడు ఆధారాలు సృష్టించి అతన్ని జైలుపాలు చేస్తారు. శేఖర్ తరపు లాయర్ ధర్మారెడ్డి (కోట శ్రీనివాసరావు) కూడా పోలీసులతో కుమ్ముక్కయి శేఖర్ కు ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చేస్తాడు.

ఒక వైపు మధురిమకు జర్నలిస్టు యైన గీత (టబు) తో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి నిజాల్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే గీత లేని సమయంలో నగేష్, దివాకర్ లిద్దరూ కలిసి మధురిమను హత్య చేస్తారు. గీత జరిగిన విషయాన్ని శేఖర్ కు చెబుతుంది. జైల్లో తన సెల్ మేట్ అయిన లబ్బీపేట తిలక్ (రాజారవీంద్ర) సాయంతో చిన్న గొడవ సృష్టించి అక్కణ్ణుంచి తప్పించుకుంటాడు. తరువాత కథంతా హీరో తనకు అన్యాయం చేసిన వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకుంటాడనేదే. కథానాయకుడు చేసే హత్యలను విచారించడానికి వచ్చే సీబీఐ ఆఫీసర్ గా నాగేంద్రబాబు, అతని సహాయకుడుగా రాంజగన్ నటించారు.

విశేషాలు

[మార్చు]

కథనం కొత్తగా అనిపించినా కథ మాత్రం నరేష్ హీరోగా నటించిన హలో డార్లింగ్ లేచిపోదామా, జగపతి బాబు హీరోగా నటించిన మనోహరం సినిమాలకు అక్కడక్కడా పోలికలు కనిపిస్తాయి. ముఖ్యంగా హీరో జైలు నుంచి తప్పించుకుని ప్రతీకారం తీర్చుకోవడం లాంటి సన్నివేశాలు.

పాటలు

[మార్చు]

సినిమాలో ఐదు పాటలున్నాయి.

  1. మధురం మధురం , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  2. నీ వెంటే నేనే , రచన: చంద్రబోస్, గానం. ఎస్ పి. చరణ్, కౌసల్య
  3. సైకిల్ ఎక్కి, రచన: కందికొండ యాదగిరి, గానం. చక్రి, శ్వేతా పండిట్
  4. ప్రేమంటే, రచన: కోన వెంకట్, గానం. శ్వేతా పండిట్
  5. కుమ్మేసే దమ్ముంటే , రచన: పోతుల రవికిరణ్,, గానం. అజయ్, కౌసల్య