శ్రీ భూ సమేత దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయం, అమరావతి
దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 16°20′58″N 80°29′25″E / 16.349425°N 80.490177°E |
పేరు | |
ప్రధాన పేరు : | దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయం |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | గుంటూరు జిల్లా |
ప్రదేశం: | నంబూరు,అమరావతి (రాష్ట్ర రాజధాని) |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | వేంకటేశ్వరస్వామి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ.. 2018 |
సృష్టికర్త: | లింగమనేని రమేశ్ |
శ్రీ భూ సమేత దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయం విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి ఆనుకొని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా సువిశాల మైదానంలో సుందరంగా, రమణీయంగా నిర్మితమైన ఆలయం. ఈ ఆలయంలో శ్రీ దశావతార వేంకటశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిలోనే దశావతారాలను వీక్షించే మంగళస్వరూపంగా కొలువై ఉన్నాడు. ప్రపంచంలో మరెక్కడా మనకు ఇలాంటి మంగళ స్వరూపం కనిపించదు. అందుకే శ్రీ భూసమేత దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయం నవ్యాంధ్ర రాజధాని అమరావతికే తలమానికంగా పేర్కొంటున్నారు[1]. ఈ ఆలయంలో మహాలక్ష్మి, మహాగణపతి, గరుడ అళ్వార్, విష్వక్షేన విగ్రహాలను కూడా ప్రతిష్టించారు.
ఆలయ విశేషాలు
[మార్చు]ఈ ఆలయం గుంటూరు జిల్లా లోని పెదకాకాని మండలంలోని నంబూరు పంచాయతీ పరిధిలోని లింగమనేని ఎస్టేట్స్‌లో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ ఆలయంలోని దశావతార వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠను 2018, జూన్ 22న అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయానికి మరో నాలుగు ఉపాలయాలు మహాలక్ష్మి, గణపతి, గరుడ ఆళ్వార్, విష్వక్సేనుడు ఉండటంతో దీనిని శ్రీ దశావతార శ్రీనివాస క్షేత్రంగానూ పిలుస్తున్నారు. ఏడుకొండలపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని అమరావతి లో నిర్మించడానికి 18 ఏళ్ల కఠోర శ్రమతో లింగమనేని రమేశ్ కుటుంబం కృషి చేసింది[2]. తిరుమల వెంకటేశ్వరుని మరో దివ్య అవతారమే ఈ దశావతర వేంకటేశ్వరస్వామి. ఆ శక్తి స్వరూపుని ప్రతిష్ఠాత్మక ఆలయం నంబూరు రెయిన్ ట్రీ పార్కు పక్కన అత్యంత వైభవోపేతంగా నిర్మితమైంది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య ఆశిస్సులతో ఈ ఆలయ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. లింగమనేని పూర్ణభాస్కర్, లింగమనేని వేంకట సూర్యరాజశేఖర్, లింగమనేని రమేశ్, గద్దె శ్రీలక్ష్మి గార్లు అత్యద్బుత ఆలయం నిర్మించాలన్న ఆశయంతో గణపతి సచ్చిదానంద స్వామివారిని సంప్రదించి ఈ మహత్తర సంకల్పాన్ని చేపట్టారు. కలియుగ దేవదేవుని నిత్యం దర్శించుకునే లింగమనేని కుటుంబ సభ్యులకు 2000 సంవత్సరంలో కలిగిన ఈ ఆలోచన 2006లో కార్యకరూపానికి వచ్చింది.[3] 2006లో గణపతి సచ్చిదానంద అనుమతితో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2012లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.
ఆగమశాస్త్రం ప్రకారం నిర్మాణం
[మార్చు]మొత్తం ఆలయ నిర్మాణం ఆగమ శాస్త్రం ప్రకారం గణపతి సచ్చిదానందస్వామి పర్యవేక్షణలో జరిగింది. విగ్రహాలు మలిచే స్థపతి, ఆలయాన్ని నిర్మించే శిల్పి ఇలా ప్రతీ ఒక్కరూ ఆగమశాస్త్ర ప్రకారం పనులు పూర్తి చేశారు. శిల్పి రమణ, స్వామి వారి రూపాన్ని చిత్రలేఖనం ద్వారా గీయగా, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన శిల్పి వి. సుబ్రమణ్య ఆచార్యులు రాతితోనే ఈ ఆలయం నిర్మించడం విశేషం. కోయంబత్తూరు సమీపంలోని తిరుమురుగన్ పూండి వాస్తవ్యులు స్థపతి ఎస్. కనకరత్నం భూసమేత దశావతార వేంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గణపతి, విష్వక్సేనాళ్వార్, గరుడాళ్వార్, హయగ్రీవాచార్యుల విగ్రహాలను అద్భుతంగా మలిచారు. వేంకటేశ్వర స్వామికి ఎదురుగా ధ్వజస్తంభం సమీపంలో గరుడాళ్వార్, గణపతి ఉపాలయం సమీపంలో విష్వక్సేనాళ్వార్ విగ్రహాలు రమణీయంగా కనిపిస్తాయి. ఈ మండపంలో లక్ష్మీదేవి ఉపాలయం ఎదురుగా మత్స్య, కూర్మ, వరహా, నరసింహ, వామన అవతారమూర్తులను, గణపతి ఉపాలయానికి ఎదురుగా పరుశురామ, బలరామ, రామ, కృష్ణ, కల్కి అవతారాల మూర్తులను, ఆలయ మండప సాలాహారంలో కేశావాది చతుర్వింశతి మూర్తులను అందంగా అమర్చారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా అంగర గ్రామానికి చెందిన వీరబాబు సప్తదళ రాజగోపురాన్ని, 60 అడుగుల 9 అంగుళాల ఎత్తైన ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా నిర్మించారు. దేవాలయానికి దిగువ భాగంలో స్వామీజీ ప్రవచనాల నిమిత్తం వేదికతో కూడిన విశాలమైన హాలును సిద్ధం చేశారు[1].
ఏకశిలా విగ్రహం
[మార్చు]వేంకటేశ్వర, నృసింహ, వరాహ ముఖాలతో వామన, పరశురామ, రామ, బలరామ, కల్కి అవతారములు ఆయుధాలుగా, నెమలి పింఛమును శిరస్సును ధరించి మత్స్య, కూర్మ అవతారములు దేహంగా దాల్చిన విలక్షణమైన ఏకశిలా విగ్రహం శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి మంగళ స్వరూపం. ఇది 11 అడుగుల ఎత్తు కలిగి ఉంది.
శ్రీవారి పాదాలతోనూ, మోకాళ్ల వరకూ మత్స్యావతారంలో, నడుము వరకూ కూర్మావతారంలోనూ దర్శనమిస్తుంది. శ్రీనివాసుడు, నృసింహ, వరాహ అవతారాలతో త్రిముఖం.. విగ్రహం ఎనిమిది చేతుల్లో వామనావతారానికి సూచికగా ఒక చేత్తో గొడుగు, రామావతారానికి సూచికగా బాణం, విల్లుమ్ములు, పరశురామావతారానికి సూచికగా గండ్రగొడ్డలి, కృష్ణావతారానికి సూచికగా నెమలి పింఛం, కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం.. విష్ణుమూర్తి చేతిలో ఉండే శంఖు, చక్రాలు మరో రెండు చేతులకు అలంకరించారు[4].
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "అమరావతిలో దశావతార మూర్తి".[permanent dead link]
- ↑ "18ఏళ్ల కల నేటికి సాకారం".[permanent dead link]
- ↑ "మీరు అమరావతి కి వెళ్తే ఈ గుడిలో ఏడుకొండలవాడి దర్శనం చేసుకుని తీరాలి". Archived from the original on 2018-06-23. Retrieved 2018-06-22.
- ↑ "దశావతార వేంకటేశ్వరస్వామి విగ్రహం.. ప్రత్యేకతలివే".[permanent dead link]