Jump to content

శ్రీ గురు రాఘవేంద్ర చరితం

వికీపీడియా నుండి

శ్రీ గురు రాఘ‌వేంద్ర‌ చ‌రితం ప‌ద్య‌నాట‌కం 2012లో విద్యాధ‌ర్ మునిప‌ల్లె ర‌చించారు. దీనిని పెద‌కాకాని గంగోత్రి నాట‌క స‌మాజంవారు ప్ర‌ద‌ర్శించారు. అనేక చోట్ల ప్ర‌ద‌ర్శ‌న‌లు అందుకున్న ఈ ప‌ద్య‌నాట‌కానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. సాక్షాత్తు రాఘవేంద్రస్వామి ఆవాస‌మై కొలువైన మంత్రాల‌యం పుణ్య‌క్షేత్ర శ్రీ‌మ‌ఠ ప్రాంగ‌ణంలో ఈ ప‌ద్య‌నాట‌కాన్ని ప్ర‌ద‌ర్శించి పీఠాధిప‌తుల మ‌న్న‌న‌లు అందుకున్నారు విద్యాధ‌ర్ మునిప‌ల్లె. రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రంలో జరిగిన నంది నాటక పరిషత్తు - 2013లో ఉత్తమ తృతీయ ప్రదర్శన, ఉత్తమ సంగీతం విభాగంలో నంది బహుమతులు వచ్చాయి.

రంగ‌రంగ వైభ‌వం గురు రాఘ‌వేంద్ర‌ చ‌రితం

[మార్చు]

తొలిసారిగా ఈ ప‌ద్య‌నాట‌కాన్ని గంగోత్రి స‌మాజ నిర్వాహ‌కులైన నాయుడు గోపికి వినిపించ‌గా ఆయ‌న ముగ్దులై ఈ నాట‌కం నిర్మించుట‌కు ముందుకు వ‌చ్చారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే రూపుదిద్దుకున్న ఈ ప‌ద్య‌నాట‌కం మొద‌టిసారిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ నందినాట‌కోత్స‌వ ప్రాధ‌మిక ప‌రిశీల‌న‌కు గుంటూరులోని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర విజ్ఞాన మందిరం క‌ళాక్షేత్రంలో ప్ర‌ద‌ర్శించారు. పుర‌ప్ర‌ముఖులు వీక్షించి నాట‌క ర‌చ‌యిత‌ను, ద‌ర్శ‌కుడిని, బృందాన్ని అభినందించారు. అటుపై తెనాలి పోస్టల్ డిపార్ట్‌మెంట్ వారు నిర్వ‌హించిన పోటీల్లో విద్యాధ‌ర్ కు చిరుస‌త్కారం చేశారు. అదే విధంగా అప్ప‌టికే రంగ‌స్థ‌ల దిగ్గ‌జంగా కొనియాడ బ‌డుతున్న ద‌ర్శ‌కుడు నాయుడు గోపిని య‌స్‌.వి.రంగారావు జీవిత సాఫ‌ల్య పుర‌స్కారంతో గౌర‌వించారు. అటుపై ఒంగోలులో భార‌తీయం క‌ళార్చ‌న‌లో భాగంగా ఈ ప‌ద్య‌నాట‌కం రెండుసార్లు ప్ర‌ద‌ర్శించారు. గుంటూరులోని బృందావ‌న్‌ గార్డెన్స్ శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యంలో ప్ర‌ద‌ర్శించి ప్రేక్ష‌కుల ర‌సానుభూతుల‌ను మూట‌గ‌ట్టుకున్నారు. అటుపై అనేకానేక ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆంధ్ర‌దేశంలో ప్ర‌ద‌ర్శించి, ప్ర‌ద‌ర్శించిన ప్ర‌తిచోటా నాట‌కాభిమానుల నీరాజ‌నాలు అందుకున్నారు గంగోత్రి నాట‌క స‌మాజంవారు.

క‌వి గురించిన విశేషాలు

[మార్చు]
నాట‌క ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు : విద్యాధ‌ర్ మునిప‌ల్లె

విద్యాధ‌ర్ 1981 జూలై 4న తెల్ల‌వారు ఝామున 4.57కు గుంటూరు అరండ‌ల్‌పేట‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జ‌న్మించారు. తండ్రి సూర్య‌నారాయ‌ణ, త‌ల్లి ప‌ద్మ‌ల‌కు తొలిసంతానంగా జ‌న్మించారు. తండ్రి సూర్య‌నారాయ‌ణ కూడా చిరుక‌విత‌లు, వ్యాసాలు రాసేవారు. ఆయ‌న ప్రభావం చిన్న‌నాటినుండే విద్యాధ‌ర్‌పై వుండేది. సూర్య‌నారాయ‌ణ ఒక కాన్వెంటు న‌డిపేవారు. విద్యార్థుల‌లో సృజ‌నాత్మ‌క‌త‌ను పెంచేదిశ‌గా ఆయ‌న వ్యాస‌ర‌చ‌న, క‌థార‌చ‌న వంటి పోటీలు పెడుతుండేవారు. అలా విద్యాధ‌ర్ కు కూడా ర‌చ‌న చిన్న‌నాటినుండే ప‌ట్టుబ‌డింది. అయితే కాలక్ర‌మంలో చ‌దువుపై ఏకాగ్ర‌త పెరిగి ర‌చ‌నా వ్యాసంగాలు ప‌క్క‌న పెట్ట‌టం జ‌రిగింది. అయితే విద్యాధ‌ర్ త‌న 10వ ఏట రాసిన ఓ క‌విత ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మ‌వ్వ‌టం, మ‌రిన్ని ర‌చ‌న‌ల‌వైపుకు అడుగులు వేయ‌టానికి దోహ‌దమ‌య్యాయి. త‌ర్వాతికాలంలో మ‌తుకుమ‌ల్లి పార్థ‌సార‌ధిరావు అనే మాస్టారి ద్వారా మైత్రి అనే బాల‌ల నాటిక‌తో రంగ‌స్థ‌లంపై అడుగుపెట్టారు. త‌ర్వాత పార్ధ‌సార‌ధి మాస్టారి ర‌చ‌నా, ద‌ర్శ‌క‌త్వంలోనే ఖ‌బ‌డ్దార్ అనే బాల‌ల నాటిక‌లో ప్ర‌ధాన పాత్ర‌ను పోషించి ర‌క్తిక‌ట్టించారు. అటుపై పాదుకాప‌ట్టాభిషేకం బాల‌ల పద్య‌నాట‌కంలో ద‌శ‌ర‌థుని పాత్ర పోషించి పౌరాణిక ప‌ద్య‌నాట‌క రంగ దిగ్గ‌జాల‌తో శ‌హ‌బాస్ అనిపించుకున్నారు. అలా నిండా 13 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే నాట‌క రంగంతో ఇత‌నికి ఎన‌లేని బంధం ఏర్ప‌డింది. త‌న తండ్రి స్వీయ‌ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న స‌మైఖ్య‌భార‌తి సాంఘిక నాటిక‌లో రాజ‌కీయ‌నాయ‌కునిగా, గుర‌జాడ అప్పారావుగా న‌టించారు. వ‌ర‌విక్ర‌యం నాటకంలో సింగ‌రాజు బ‌స‌వ‌రాజుగా, ఆడ‌పిల్ల నాటిక‌లో తండ్రిపాత్ర‌, ఆశ‌ల‌ప‌ల్లెకి (2004 నంది నాట‌కోత్స‌వాల్లో 6 నందులు సొంతం చేసుకుంది) నాటిక‌లో ప్ర‌తినాయ‌కునిపాత్ర పోషించి ప్రేక్ష‌కుల‌ను స‌మ్మోహితుల‌ను చేశారు. అటుపై ఆయ‌న నాట‌క‌రంగ జీవితం వెనుదిరిగి చూసుకోకుండా న‌టునిగా ఎంకిపెళ్ళి, ఆప‌రేష‌న్‌, ఒహోం ఒహోం భీం నాటిక‌లలో న‌టునిగా కొన‌సాగారు. త‌ద‌నంత‌ర కాలంలో త‌న‌లోని ర‌చ‌యిత‌ను వెలికితీస్తూ గంగోత్రి నాట‌క స‌మాజం వారికి శ్రీ‌గురురాఘ‌వేంద్ర చ‌రిత్ర ప‌ద్య‌నాట‌కం ర‌చించారు. త‌ర్వాత ర‌చ‌న‌గా గ‌మ‌నం సాంఘిక నాటిక‌ను కూడా గంగోత్రి స‌మాజం వారికి అందించారు.

అంతేకాక ఈయ‌న ర‌చించిన స్వ‌రార్ణ‌వం, సుప్ర‌భాతం నాటిక‌ల‌కు కువైట్ తెలుగు అసోసియేష‌న్ వారు నిర్వ‌హించిన నాట‌క ర‌చ‌న‌లపోటీల్లో ప్రోత్సాహ‌క బ‌హుమ‌తులు రావ‌ట‌మే కాక అమృత‌వ‌ర్షిణి నాటిక‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి ర‌చ‌యిత‌గా విశేష స్పంద‌న పొందారు. ఈయ‌న వెలుగు-నీడ‌లు, గురుదేవోభ‌వ వంటి తెలుగు టీవీ సీరియల్స్ కూడా ర‌చించారు. దూర‌ద‌ర్శ‌న్ స‌ప్త‌గిరి ఛాన‌ల్‌ద్వారా ప్ర‌సారం చేయ‌బ‌డ్డాయి. అంతేకాక ఇప్ప‌టి వ‌ర‌కూ 28 ల‌ఘుచిత్రాల‌కు క‌థ‌, స్ర్కీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వాలు వ‌హించారు.

వీరు ర‌చించిన ర‌చ‌న‌ల‌లో గ‌మ‌నం, ఉత్తిష్ఠ‌భార‌తి నాటిక‌లు ఎన‌లేని పేరుప్ర‌ఖ్యాత‌ల‌ను తెచ్చిపెట్ట‌గా, శ్రీ‌గురురాఘ‌వేంద్ర‌చ‌రితం వీరిని అతిచిన్న వ‌య‌సులోనే ప‌ద్య‌నాట‌క ర‌చ‌న చేసిన ఇటీవ‌లి క‌విగా ఖ్యాతి తెచ్చిపెట్టింది.

నాట‌క ఇతివృత్తం

[మార్చు]
climax seen of Srigururaghavendra charitam At 2013 Nandi Natakotsawam at Rajamundry

ఈ నాట‌కం వెంక‌టనాథుని విద్యాభ్యాసం నుండి ప్రారంభం అవుతుంది. వెంక‌ట‌నాథుడు సుధీంధ్రుని ఆశ్ర‌మంలో విద్యార్థుల‌లో మేటిగా వుంటాడు. అదే ఆశ్ర‌మంలో వెంక‌ట‌నాథుడు అంటే స‌రిప‌డ‌ని శ్యామ‌సుంద‌రుడు అత‌నిని దెబ్బ‌తీయాల‌ని త‌న స‌హ‌చ‌రుల‌తో అద‌నుకోసం ఎదురు చూస్తుంటాడు. ఇంత‌లో ఒక‌నాడు వెంక‌ట‌నాథుడు సుధాపాఠానికి భాష్యం రాస్తూ అల‌సిపోయి నేల‌పై నిదురోతాడు. అటుగా వ‌చ్చిన సుధీంధ్రుడు ఆ భాష్యం చ‌దువుకొని ముగ్ధుడై వెంక‌ట‌నాథుని స‌త్క‌రించ‌ద‌ల‌చి త‌న ఒంటిపై ఉన్న శాలువాను బ‌హూక‌రిస్తాడు. న‌గ‌ర సంకీర్త‌న బృందం అరుపులు పొలికేక‌ల‌తో నిద్ర‌మేల్కొనిన శ్యామ‌సుంద‌రుడు వెంక‌ట‌నాథునిపై ప్ర‌తీకారం తీర్చుకొనుట‌కు త‌న‌కు ల‌భించిన అవ‌కాశంగా భావించి, త‌క్కిన స‌హాధ్యాయుల‌తో క‌లిసి వెంక‌ట‌నాథుని దొంగ‌గా చిత్రించి ఆశ్ర‌మం నుండి గెంటివేసే ప్ర‌య‌త్నం చేస్తారు. అయితే సుధీంధ్రుని జోక్యంతో అస‌లు నిజం తెలుసుకొనిన స‌హాధ్యాయులు వెంక‌ట‌నాథుని నిర్దోషిగానూ, శ్యామ‌సుంద‌రుని స్నేహాన్ని పూర్తిగా విడ‌నాడి గురువుకు దాసోహ‌మంటారు. అంత అవ‌మాన భారాన్ని భ‌రించ‌లేని శ్యామ‌సుంద‌రుడు గురువునూ, ఆశ్ర‌మ‌మునూ నిష్ఠూర‌ములాడి వెడ‌లి పోవును. అనంత‌రం సుధీంద్రుడు రాఘ‌వేంద్రుని విద్యాభ్యాస‌ము ముగిసింద‌ని వివ‌రించి గ‌త రాత్రి అత‌ను ర‌చించిన భాష్యానికి గాను మూల‌రాముని అనుగ్ర‌హ‌ముతో సుధాపాఠ‌మున‌కు ప‌రిమ‌ళ‌ముల‌ద్దిన కార‌ణ‌మున ప‌రిమ‌ళాచార్య అను బిరుదుతో స‌త్క‌రిస్తాడు. ఇంటికి వెడ‌లి మంచి క‌న్య‌ను చూసి వివాహ‌మాడి గృహ‌స్తు ధ‌ర్మాన్ని నిర్వహించ‌మ‌ని ఆదేశిస్తాడు సుధీంధ్రుడు. గురువు ఆదేశంతో వెంక‌ట‌నాథుడు త‌న గృహ‌మున‌కు వెళ్ళి స‌ర‌స్వ‌తి అనే క‌న్య‌ను వివాహ‌మాడ‌తాడు. వారికి ల‌క్ష్మీనారాయ‌ణుడు అనే కుమారుడు కూడా పుడ‌తాడు. వెంక‌ట‌నాథుడు ఉపాధ్యాయ వృత్తిని స్వీక‌రించి బ్రాహ్మ‌ణ పిల్ల‌ల‌కు చ‌దువు చెబుతూ జీవ‌నం సాగిస్తుంటాడు. స‌ర‌స్వ‌తి ఉన్న చోట ల‌క్ష్మి నిలువ‌ద‌న్న నానుడిని నిజంచేస్తూ ద‌రిద్రం తాండ‌విస్తుంటుంది. ఇలా ఉన్నా కూడా వెంక‌ట‌నాథుడు వీణ‌ను అందుకొని భ‌గ‌వంతుని స్థుతిస్తూ.., తాదాత్మ్య చింత‌న‌లో జీవిస్తుంటాడు. ఇంటి గురించి ప‌ట్టించుకోని భ‌ర్త‌ను చూస్తూ స‌ర‌స్వ‌తి నిర‌స‌న తెలియ‌జేస్తుంది. ఇంత‌లో అంజ‌య్య అనే గొడ్ల‌కాప‌రి వెంక‌ట‌నాథుని ఇంటికి రావ‌టం, అత‌ను తెచ్చిన‌ పాల‌ను స‌ర‌స్వ‌తి అత‌ని చేతుల మీదుగా అందుకొన‌టం యాదృచికంగా శ్యామ‌సుంద‌రుడు భువ‌న‌గిరి అ్ర‌గ‌హార‌పు అధికారిగా రావ‌టం.. జ‌రుగుతుంది. ఎప్ప‌టినుండో వెంక‌ట‌నాధునిపై ర‌గిలిపోతున్న శ్యామ‌సుంద‌రుడు అత‌నితో వాద‌న‌కుదిగుతాడు. మ‌తాచారాల‌ను మంట‌గ‌లిపావంటూ నిర‌సిస్తాడు. హీన‌కుల‌స్తునిచే స్పృసించిన పాత్ర‌ను అంటుకున్న వీరు మైల‌ప‌డ్డార‌ని కనుక వీరు మ‌త భ్ర‌ష్టులు కావాల‌ని అంటాడు. స‌ర‌స్వ‌తి శ్యామ‌సుంద‌రుని వేడుకోగా క‌నిక‌రించిన‌ట్లు న‌టించి భువ‌న‌గిరి అగ్ర‌హార‌ము నుండి మాత్రమే వారిని వెలివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టిస్తాడు. అగ్ర‌హారంలోని శుభా, శుభాల‌కు వీరిని ఎవ్వ‌రూ పిలువ‌రాద‌ని ఆదేశిస్తాడు. అంజ‌య్య జోక్యంతో వెంక‌ట‌నాథుని కుటుంబం అగ్ర‌హారం వ‌దిలి కుంభ‌కోణంలోని సుధీంధ్రుని మ‌ఠానికి ప‌య‌న‌మౌతారు. సుధీంధ్రుడికి వ‌య‌సు మీద‌ప‌డ‌టంతో మ‌ఠాన్ని నిర్వ‌హించే ఓపిక చాల‌క మ‌రో కొత్త‌పీఠాధిప‌తిని వెద‌క‌వ‌ల‌సిన స‌మ‌యం వచ్చింది. పీఠాన్ని నిరాటంకంగా న‌డ‌ప‌గ‌లిగే యోగ్యుడు ఎవ‌ర‌ని ఆలోచిస్తున్న స‌మ‌యంలో వెంక‌ట‌నాథుడు ఎదురు ప‌డ‌తాడు. గురువు ఆదేశాన్ని శిర‌సావ‌హించ‌టానికి అనేక త‌ర్జ‌న బ‌ర్జ‌న‌లు ప‌డి చివ‌రికి త‌న భార్య స‌మ్మ‌తితో స‌న్యాస దీక్ష తీసుకుంటాన‌ని వివ‌రిస్తాడు. మెల్ల‌గా ఆశ్ర‌మంలోని త‌న భార్య‌వ‌ద్ద‌కు వెళ్ళి విష‌యం ఎలా చెప్పాలో అర్ధం కాక స‌త‌మ‌త‌మౌతుండ‌గా అంజ‌య్య వ‌స్తాడు. అంజ‌య్య నిష్క‌ల్మ‌ష‌మైన మాట‌ల‌తో ప్రభావితుడైన వెంక‌ట‌నాథుడు స‌న్యాస దీక్ష తీసుకొనుట‌కు సంసిద్ధ‌త వ్య‌క్తంచేస్తూ.. భార్య స‌ర‌స్వ‌తిని పిలిచి తాన‌కు స‌న్యాస‌దీక్ష భ‌గ‌వంతుని వ‌ర‌మ‌ని, త‌న‌ను స‌ర్వ‌బంధాలు బాధ్య‌త‌ల‌నుండి త‌ప్పుకోవాలసిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని వివ‌రిస్తాడు.

At 2013 Nandi Natakotsawam at Rajamundry

భ‌ర్త మాట‌లు వింటూనే స‌ర‌స్వ‌తి నిర‌స‌న వ్య‌క్తం చేస్తుంది. ఒప్పుకోనంటూ రాద్దాంతం చేస్తుంది. చివ‌ర‌కు వెంక‌ట‌నాథుని వేదాంత ధోర‌ణికి ఆమె విసుగు చెంది త‌న‌ను వ‌దిలి వెళ్ళిపొమ్మ‌ని ఆదేశించి స్పృహ‌కోల్పోయి ప‌డిపోతుంది. అంజ‌య్య వ‌చ్చి వెంక‌ట‌నాథుని రాక‌కోసం గురువు సుధీంద్రుడు ఎదురు చూస్తున్నాడ‌ని బ‌ల‌వంతంగా తీసుకొని వెళ‌తాడు.అటుపై వెంక‌ట‌నాథునికి స‌భాస‌దుల స‌మ‌క్షంలో సుధీంద్రుడు శ్రీ‌రాఘ‌వేంద్ర‌తీర్థ అని నామ‌క‌ర‌ణం చేస్తాడు. తాను తీర్థాట‌న చేయుట‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని వివ‌రించి రాఘ‌వేంద్రునికి క‌ర్త‌వ్య‌మును బోధించి మ‌ఠ‌మును అప్ప‌గిస్తాడు సుధీంద్రుడు. భ‌ర్త దూర‌మ‌వ్వ‌టంతో భ‌రించ‌లేని స‌ర‌స్వ‌తి ఆత్మ‌హ‌త్య‌చేసుకొని ప్రేత రూపంలో మ‌ఠంలో ప్ర‌వేశించాల‌ని చూస్తుంది. ఆశ్ర‌మ ర‌క్ష‌క దేవ‌తామూర్తులు ఆమెను వారించ‌గా రాఘ‌వేంద్రుడు ప్రేత‌జ‌న్మ‌నుండి ఆమెకు విముక్తి క‌ల్పిస్తాడు. రాఘ‌వేంద్రుడు శిష్య‌బృందంతో దేశాట‌నం చేస్తూ ఆధోని ప‌ట్ట‌ణానికి వెళ‌తాడు. ఆథోని న‌వాబుల ఏలుబ‌డిలో వుంటుంది. అనేక‌మంది రాఘ‌వేంద్రుని మ‌హిమ‌ల‌ను చూసి దాసుల‌వుతారు. ఇది న‌చ్చ‌ని మ‌హ‌మ్మ‌దీయ పెద్ద‌లు రాఘ‌వేంద్రుని ప‌రీక్షించాల‌ని, విషం తినిపించి చంపాల‌ని కుట్ర‌ప‌న్నుతారు. త‌మ ప్ర‌భువు సిద్ధిక్ మొస్‌జిద్‌ఖాన్‌ను సంప్ర‌దించి వారి కొలువులో దివానుగా ప‌నిచేస్తున్న వెంక‌న్న‌పంక్తుని రాఘ‌వేంద్రుని వ‌ద్ద‌కు వ‌ర్త‌మానం పంపుతారు. అప్ప‌టికే రాఘ‌వేంద్రుడు త‌న ఉప‌న్యాసాల‌తో ఎంతో మందిని ఆక‌ట్టుకొని శిష్యులుగా చేసుకొంటాడు. అత‌ని శిష్యుల‌లో ముందుగా చెప్పుకోద‌గిన వాడు అప్ప‌ణాచార్యులు. అత‌ను పాండిత్యం క‌ల‌వాడు. రాఘ‌వేంద్రుని పై అమితమైన భ‌క్తి క‌ల‌వాడు. రాఘ‌వేంద్రునికి ఏకాంత సేవ‌చేయుచూ త‌న పాండిత్యాన్ని ప్ర‌ద‌ర్శించి మెప్పు పొందాల‌ని ప్ర‌య‌త్నిస్తూ, త‌న త‌ప్పుల‌ను దిద్దుకుంటూ వుంటాడు. న‌వాబు పంపిన వ‌ర్త‌మాన‌ము తీసుకొని వెంక‌న్న‌పంక్తు మ‌ఠానికి వ‌స్తాడు. ఇత‌ను కూడా రాఘ‌వేంద్రుని భ‌క్తుడే. నిజానికి రాఘ‌వేంద్రుని కృప‌తోనే ఇత‌ను విద్యావంతుడై, ఆంధోని సంస్థానంలో దివానుగా ఉద్యోగం సంపాదిస్తాడు. వెంక‌న్న పంక్తు తెచ్చిన సందేశాన్ని విన్న అప్ప‌ణ్ణ న‌వాబుపై ఆవేశం ప్ర‌క‌టిస్తాడు. రాఘ‌వేంద్రుడు త‌ప్ప‌ని మంద‌లిస్తాడు. చిన్నబుచ్చుకున్న అప్ప‌ణ్ణ‌ త‌న గ్ర‌హ‌చార‌ము కొల‌దీ తీర్థాట‌న చేయుదున‌ని కోర‌తాడు. రాఘ‌వేంద్రుడు అంగీక‌రిస్తాడు. రాఘ‌వేంద్రుని మ‌హిమ‌లు ఆనోటా ఈనోటా విన్న శ్యామ‌సుంద‌రుడు ఆయ‌నను ద‌ర్శించి త‌న దారిద్ర్యం నుండి, పాప‌క‌ర్మ‌ల నుండి బ‌య‌ట‌ప‌డాల‌ని భావించి మ‌ఠాన్ని చేర‌తాడు. అయితే అక్క‌డ త‌న స‌హ‌పాఠీ అయిన వెంక‌ట‌నాథుడే రాఘ‌వేంద్రుడ‌ని గ్ర‌హించి అత‌నిని క్ష‌మాప‌ణ‌లు వేడ‌తాడు. భ‌గ‌వంతుని ఇచ్ఛానుసారం అత‌నికి రాఘ‌వేంద్రుడు ప్రాణేశాచార్యుడ‌ని నామ‌క‌ర‌ణం చేస్తాడు. అనంత‌రం ఆధోని సంస్థానంలో మ‌త‌పెద్ద‌లు పెట్టిన ప‌రీక్ష‌లలో రాఘ‌వేంద్రుడు గెలిచి వారిని మ‌త‌స‌హ‌నానికి పాటుప‌డ‌మ‌ని కోర‌తాడు. త‌మ మ‌త‌పెద్ద‌లు చేసిన త‌ప్పుకు గాను ఏదైనా స్వీక‌రించ‌మ‌ని న‌వాబు సిద్ధిక్‌మొస్‌జిద్‌ఖాన్ కోర‌టంతో తుంగ‌భద్రా తీరాన ఉన్న మంచాల‌ను శ్రీ‌మ‌ఠం పేరుతో రాసివ్వ‌మ‌ని కోర‌తాడు రాఘ‌వేంద్రుడు. అంగీకరించిన న‌వాబు వెంక‌న్నపంక్తుచే ప‌ట్టాను సిద్ధంచేయించి రాఘ‌వేంద్రునికి స‌మ‌ర్పించుకుంటాడు. ఆథోని హిందూ రాజుల పాల‌న‌లో ఉండ‌గా మంచాల మ‌ఠంకింద‌నే ఉంద‌ని తిరిగి మ‌ఠంకింద ఉన్న భూమిని సంపాదించి ఇచ్చిన వెంక‌న్న‌పంక్తును రాఘ‌వేంద్రుడు అభినందిస్తాడు. ఇక్క‌డ త‌న‌కన్నా ముందుగా అనేక‌మంది గురుమూర్తులు త‌ప‌శ్శ‌క్తి ధార‌పోశార‌ని, పురాణ‌పురుషుల పాద‌ధూళితో ప‌విత్ర‌మైన మంచాల‌ను తిరిగి మ‌ఠానికి అప్ప‌గించావ‌ని, త‌న బృందావ‌న నిర్మాణం కూడా వెంక‌న్న పంక్తు ఏర్పాటు చేయాల‌ని రాఘ‌వేంద్రుడు వెంక‌న్న‌పంక్తుని ఆదేశిస్తాడు. ఇదే స‌మ‌యంలో త‌న‌తో వెన్నంటివుండి జీవితాన్ని దిశానిర్దేశం చేసిన అంజ‌య్య సాక్షాత్తూ ఆంజ‌నేయ‌స్వామిగా తెలుసుకుంటాడు రాఘ‌వేంద్రుడు. ఆంజ‌నేయ‌స్వామి దివ్య‌ద‌ర్శ‌నం అయినంత‌నే రాఘ‌వేందుడు బృందావ‌న ప్ర‌వేశ‌ఘ‌డియ‌లు స‌మీపించెన‌ని తెలుసుకుంటాడు. అనంత‌రం బృందావ‌న ప్ర‌వేశం జ‌రుగుతుంది. అప్ప‌ణాచార్య త‌ను లేకుండా బృందావ‌న ప్ర‌వేశం చేసినందుకు గుండెలు ప‌గిలేలా రోధిస్తాడు. స్పృహ‌కోల్పోయి బృందావ‌నం ముందు ప‌డిపోతాడు. రాఘ‌వేంద్రుడు అప్ప‌న్న‌తో బృందావ‌నం నుండి మాట్లాడి ద‌ర్శ‌న‌మిచ్చి క‌ర్త‌వ్య‌బోధ చేయ‌టంతో నాట‌కం ముగుస్తుంది.

http://kinige.com/book/Sri+Guru+Raghavendra+Charitam[permanent dead link]