శ్రీలంకలో తెలుగు మూలాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీలంక ద్వీపంలో ప్రధానంగా సింహళ, తమిళ జాతులు ఉన్నప్పటికి 18-19 శతాబ్దాల కాలంలో ఈదేశ మధ్య, తూర్పు ప్రాంతాలను తెలుగు రాజులు పరిపాలించారు[1]. లభ్యమౌతున్న ఆధారాలను బట్టి క్యాండీ రాజ్యాన్ని పాలించిన కీర్తిశ్రీ రాజసింహుడు, విజయన్ రాజవంశానికి చెందిన చివరి రాజు నరేంద్ర సింహుని రాణి సోదరుని వంశానికి చెందినవాడు. రాణి విజయనగర వంశపు ఆడపడుచు. కీర్తిశ్రీ రాజసింఘె (1747-1780) రాజ్యంలో మతపరమైన పునరుద్ధరణను తీసుకువచ్చాడు. ఇతని తర్వాత ఇతని సోదరుడు రాజాధిరాజ సింహుడు కొంతకాలం మాత్రమే అంటే 1789 వరకు పరిపాలించగలిగాడు. ఇతని కాలంలో సాహిత్యం గుభాళించింది. ఇతని తర్వాత పరిపాలించిన విక్రమసింహుడు (1789-1815) ఈ రాజవంశపు చివరి రాజు. 1815 ఫిబ్రవరి 14 న క్యాండీ రాజ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఆక్రమించుకుంది. రెండవ క్యాండియన్ యుద్ధంతో శ్రీలంక పరిపూర్ణంగా స్వతంత్రాన్ని కోల్పోయింది. శ్రీలంక కడపటి చక్రవర్తి భారతదేశానికి పారిపోయాడు. ఇతని వంశస్థులు ప్రస్తుతం చిత్తూరు జిల్లా నరసింగరావు పేటలో నివసిస్తున్నారు.

చివరి క్యాండీ రాజు విక్రమసింహుడు (కన్నసామి నాయకన్)

తెలుగు రాజులు సింహళదేశాన్ని పరిపాలించిన కాలంలో తెలుగు కళలు, సంస్కృతులు వికసించినా అవి చెప్పుకోదగిన స్థాయిలో లేవు. ఆ సమయంలో తక్కువ సంఖ్యలో తెలుగువారు తంజావూరు, సేలం ప్రాంతాలనుండి శ్రీలంకకు వలస వెళ్లారు. వారిపై తమిళ సంస్కృతి, సాహిత్యాల ప్రభావం అనివార్యమైంది.

తర్వాతికాలంలో డచ్, బ్రిటీష్, పోర్చుగీసు సైన్యాల పరిపాలనలో శ్రీలంకలోని అల్పసంఖ్యాకులైన తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్న తమిళ జాతితోను, సింహళీయులతోనూ కలిసిపోయి తమ అస్తిత్వాన్ని కోల్పోయారు. వారిలో ఎక్కువమందికి తమ మాతృభాషయైన తెలుగు చదవడం, వ్రాయడం, మాట్లాడటం తెలియకపోవడం శోచనీయం. అయితే కారుచీకటిలో కాంతిరేఖ మాదిరిగా త్యాగయ్య, క్షేత్రయ్య కృతులు, భగవాన్ సత్యసాయిబాబా, శివబాలయోగి మహరాజ్‌ల ఆధ్యాత్మికత కొంత ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ ఆధ్యాత్మిక గురువులను అనుసరించేవారి సంఖ్య ఈ దేశంలో అధికంగా ఉంది. వారిలో కొంతమంది తమ గురువుల ప్రసంగాలను అర్థంచేసుకోవడానికి వీలుగా తెలుగు భాషను నేర్చుకోవడానికి కుతూహలం చూపిస్తున్నారు.

ప్రపంచ తెలుగు మహాసభ సెక్రెటేరియేట్ స్థానికంగా ఏర్పడిన తెలుగు సంఘం ద్వారా శ్రీలంకలోని తెలుగు ప్రజానీకానికి ఈ క్రింది అంశాలలో సహకరించడానికి ప్రయత్నాలను చేస్తోంది.

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రముఖ ప్రచురణకర్తల సహకారంతో తెలుగు సాహిత్య పుస్తకాలు, పత్రికలు పంపిణీ చేయడం.
  • తెలుగు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం.
  • సాంస్కృతిక, సాంఘిక విలువలు కలిగిన పాత కొత్త తెలుగు చలనచిత్రాలను ప్రదర్శించడం
  • తెలుగు తరగతులను నిర్వహించడం
  • తెలుగు పండితులను, కళాకారులను శ్రీలంక పంపి వారిచే ఉపన్యాసాలను ఇప్పించడం
  • తెలుగు పిల్లలకు కళలలో శిక్షణ ఇప్పించడం
  • తెలుగు యువతకు స్కాలర్ షిప్ మంజూరు చేయడం మొదలైనవి.

సామాజిక, ఆర్ధిక పరిస్థితులు

[మార్చు]

విజయనగర సామ్రాజ్యానికి చెందిన తెలుగు రాజులు 1747-1815ల మధ్య ఈ దేశాన్ని పాలించారు కానీ తెలుగు సంస్కృతి, కళలు, విద్యల ప్రభావం ఈ దేశ ప్రజల మీద అతితక్కువగా ఉంది. ఆ సమయానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, గ్రంథాలు లభ్యం కాకపోవడం చేత పరిశోధన ముందుకు కొనసాగడం లేదు. ఆ కాలంలో పరిమిత సంఖ్యలో ఈ రాజుల సైన్యంలో చేరడానికి తెలుగు వారు వలస వచ్చారు. చివరి రాజు కన్నస్వామి నాయకన్ (విక్రమసింహుడు) యొక్క రాజ్యం పతనమైన తరువాత ఈ సైనికుల అస్తిత్వం కోల్పోయింది. వీరు తెలుగు వారైనా శ్రీలంక తమిళులుగా రికార్డులకెక్కారు. పరిస్థితులు అనుకూలించక పోయినా ఇంకా కొంతమంది తెలుగు ప్రజలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొంటూ, కాంట్రాక్టు కార్మికులు, హోటల్ కీపర్లు, ఆలయ పూజారులు వంటి స్వల్ప ఆదాయ వృత్తులను చేసుకొంటూ కొలంబో, క్యాండీ, అనూరాధపుర, బాటికలోయా, జాఫ్నా తదితర ప్రాంతాలలో నివసిస్తున్నారు. క్యాండీ పర్వతప్రాంతాలలో కొన్ని తెలుగు సంచారజాతులు, తెలుగు జిప్సీలు నివసిస్తున్నారు వీరిని అహుకుంటికలు [2] అని వ్యవహరిస్తారు . ఈ దేశంలో 2 నుండి 3 లక్షల మంది తెలుగువారు ఉన్నట్లు ఒక అంచనా.

మూలాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]