Jump to content

శ్యామనారాయణ

వికీపీడియా నుండి
శ్యామనారాయణ

శ్యామనారాయణ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం, బెంగాలీ, కొంకణీ.... యిలా అన్ని భాషల్లో గల చిత్రాల పాటలను, ప్రముఖ సంగీత విధ్వాంసుల కచేరీ కార్యక్రమాల వీడియోలను, పాశ్చాత్య పాటలను సేకరించే వ్యక్తి.

ఆయన గురించి

[మార్చు]

శ్యామనారాయణది గుంటూరు జిల్లా ఫిరంగిపురం. చిన్నప్పటి నుంచి సంగీతమంటే తగని ఆసక్తి. పశుసంవర్థక శాఖలో ఉద్యోగం చేశాడు. మారుమూల అటవీ ప్రాంతానికి బదిలీ కావడంతో కొన్నాళ్లు చేసి విసుగుచెంది ఉద్యోగం మానేశాడు. గుంటూరులో చాలా కాలం ఫొటో ఫ్రేముల వ్యాపారంలో కొనసాగాడు. అందులోనూ తన సృజనాత్మకత చూపించి, ఫొటో ఆల్బమ్‌ల తయారీలో కొత్త ఒరవడి పెట్టాడు. చివరికి హైదరాబాద్ అమీర్‌పేటకు మకాం మార్చి 'రైట్ యాం గిల్' పేరుతో తనకు బాగా అనుభవమున్న ఫొటో ఫ్రేముల వ్యాపారమే ప్రారంభించాడు. జీవనోపాధిగా ఆ పని చేస్తున్నా ఆయన అభిరుచి మాత్రం సంగీతమే. చిన్నప్పుడు వాళ్లింట్లో రికార్డులు, రికార్డు ప్లేయర్ ఉండేవట. ఇంట్లో మేనత్తలు మధురంగా పాడే పాటలు కూడా శ్యామ మనస్సులో చెరగని ముద్ర వేశాయి. అప్పుడే పాటల్ని ఎలాగైనా సేకరించాలని నిశ్చయిం చుకున్నాడు.

పాటల సేకరణపై ఆయన కృషి

[మార్చు]

వ్యాపారం పనిమీద మదరాసు, బెంగళూరు, కలకత్తాలు తిరిగినప్పుడు కొత్త, పాత పాటలు సేకరించనారంభించాడు. వేనవేలుగా అపురూప గీతాలు అలా పోగుపడసాగాయి. గుంటూరులో ఉండగా పరిచయమైన MP3 సాంకేతిక పరిజ్ఞానాన్ని తన సేకరణకు వినియోగించు కోవడం మొదలుపెట్టాడు. రెండేళ్ళ కిందటిదాకా కంప్యూటర్లు, ఇంటర్నెట్ లతో పరిచయం లేదు కాని అవి చేరువైన తర్వాత ఇక శ్యామనారాయణ సంగీత సేకరణ విశ్వవ్యాప్తమై పోయింది. ఏదో ఒక సమాచారం కోసం అన్వేషిస్తూ, దారిలో ఇంకేదో తగిలితే దాని వెంబడి పోవడం, మరేదో కనిపిస్తే దాని అంతుచూడడం ఇలా సాగిపోతుంటుంది ఆయన దిన/రాత్రి చర్య. హైదరాబాద్ అమీర్‌పేట గురుద్వారా ఎదురు సందులో 'రైట్ యాంగిల్' షాపు మేడపైన ఓ గోడౌన్ లాంటి గది. దాన్నిండా నిలబెట్టిన ఫొటో ఫ్రేముల కట్టలు. వీటి మధ్య ఓ కంప్యూటర్ ముందు శ్యామనారాయణ నిరంతరం తపస్సులో ఉంటాడు.

  • శ్యామనారాయణ సేకరణ కేవలం తెలుగు సినిమా పాటలే అనుకొంటే పొరబాటు. ఆయన సేకరించిన వేలాది గీతాల్లో హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, కొంకణి...ఇలా అనేక భారతీయ భాషా గీతాలు, ఇంగ్లీషు వంటి పాశ్చాత్య భాషల పాటలు కోకొల్లలు.
  • ఆయన దగ్గర వందల వందల శాస్త్రీయ సంగీత కచేరీలు ఉన్నాయి. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, బాలమురళి, ఎం.ఎల్. వసంతకుమారి.. ఇలా.. కొన్ని కచేరీల వీడియోలు కూడానూ ఉన్నాయి.
  • 1959లో వచ్చిన 'బెన్‌హర్' చిత్రం మనకు తెలుసు. కాని 1907లో, 1925లో కూడా 'బెన్‌హర్' పేరుతో చిత్రాలు వచ్చాయని తెలుసా? అలాంటి కొన్ని వందల చిత్రాల వీడియోలు ఉన్నాయి శ్యామనారాయణ కంప్యూటర్లో.
  • కొన్ని వందల (ప్రాచీన) గ్రంథాలను తన కంప్యూటర్లో భద్రపరిచాడీ పెద్దమనిషి. 1844 నాటి "కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో ప్రతిని చూసి అవాక్కవుతాము!.
  • వందకు పైగా శ్రవ్య (ఆడియో) పుస్తకాలను (చార్లెస్ డికెన్స్, జూల్స్ వెర్న్...) సేకరించాడు.
  • పుస్తకాలు "చదివే శ్రమ లేకుండా తీరిగ్గా వీటిని విని ఆనందించవచ్చునట.


ప్రస్తుతం ఈయన హైదరాబాదునుంచి గుంటూరుకు మారారు. మనసు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే పాత పుస్తకాల స్కానింగ్, రచయితల సంపూర్ణ రచనల ప్రచురణకు సహకరిస్తూ, తన హాబీకి పూర్తి కాలాన్ని వెచ్చిస్తున్నారు.

అభిరుచులు

[మార్చు]

అప్పుడప్పుడు క్విజ్‌లా చిక్కు ప్రశ్నలు వేయడం ఆయనకో సరదా. 'శాంత బాలనాగమ్మ' అనే చిత్రం 1942లో వచ్చింది. అందులో ఎస్.రాజేశ్వర్రావు-ఎస్.వరలక్ష్మి పాడిన పాట వినాల్సిందే మనం. భానుమతి తన పాటలు తనే పాడుకునేదని మనకు తెలుసు. కానీ 'మంగళ'(1950ల్లో వచ్చింది) చిత్రంలో ఆమెకు గీతా దత్ నేపథ్యగానం చేసింది! 'చల్ ఉడ్ జారే పంఛీ' పాట పాడింది ఎవరు? అంటే ఆ మాత్రం తెలీదా మహ్మద్ రఫీ అంటాం. తలత్ మహమూద్ కూడా 'చల్ ఉడ్ జారే పంఛీ' పాటపాడాడని చెపుతాడు. తలత్ మలయాళంలో పాడిన పాటలు కూడా శ్యామనారాయణ దగ్గర ఉన్నాయి. అలనాటి అందాలనటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తెలుగులోనూ, తమిళంలోను సొంతంగా పాడిన పాటలు, టి.ఆర్.మహాలింగంతో ఎస్.వరలక్ష్మి పాడిన యుగళగీతాలు; బాలమురళీకృష్ణ వాణీజైరాంతో కలిసి 'నవరత్నం' సినిమా (1977-తమిళం)లో 'సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ' బాణీలో సరదాగా పాడిన పాట, సలిల్ చౌదరి సంగీతంలో జేసుదాసు పాడిన బెంగాలీ పాటలు...ఇలా పాటపాటకీ ఆశ్చర్యంలో మునిగిపోతాం.

ఆధ్యాత్మిక పాటల సేకరణ

[మార్చు]

ఎక్కిరాల, ఉషశ్రీ మొదలు చాగంటి దాకా ఎంతో మంది ఆధ్యాత్మిక ప్రపచనాలు కొన్ని వందల గంటలపాటు వినగలిగినవి ఉన్నాయి శ్యామ దగ్గర. స్టేజీ నాటకాలు, రేడియో నాటకాలు కూడా చాలానే సేకరించాడు.

మోనోగ్రాఫ్ లు

[మార్చు]

సైగల్, పంకజ్ మల్లిక్, కె.సి.డే, సలిల్ చౌదరి వంటి గాయకులు, సంగీత దర్శకులపై సర్వస్వాల్లాంటి మోనోగ్రాఫ్‌లు సంకలనం చేశాడు. అంతేనా? అంటే- ఇప్పుడు కర్నాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితర్‌పైన మోనోగ్రాఫ్ సంకలనం చేయడంలో తలమునకలై ఉన్నాడు

మూలాలు

[మార్చు]
  • (Source: ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం 22 August 2010)