వేముల కూర్మయ్య
వేముల కూర్మయ్య | |
---|---|
జననం | జూలై 15 , 1901 |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఎం.ఎ., ఎల్.ఎల్.బి. |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ్యుడు, గ్రామోద్ధరణ శాఖామంత్రి |
వేముల కూర్మయ్య (జూలై 15, 1901 - 1970) స్వాతంత్ర్య సమరయోధునిగా, రాజకీయ నాయకునిగా సుప్రసిద్ధులు. ఆయన హరిజనోద్ధరణ, దేశ స్వాతంత్ర్యోద్యమం వంటి పలు ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు.
జీవిత విశేషాలు
[మార్చు]వేముల కూర్మయ్య జూలై 15, 1901న కృష్ణాజిల్లాలో మల్లవరంలో జన్మించారు. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ప్రారంభించిన శ్యామలా ధర్మపాఠశాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్య అభ్యసించడంతో చిన్ననాటి నుంచే కూర్మయ్యకు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులతో పరిచయం, స్వాతంత్ర్యోద్యమ భావజాలం పట్ల అభినివేశం ఏర్పడ్డాయి. ఆయన ఉన్నత విద్యాభ్యాసం చేసి ఎం.ఎ., ఎల్.ఎల్.బి. పట్టా అందుకుని, కాశీ విశ్వవిద్యాలయం నుంచి ఆ విద్యార్హత పొందిన తొలి హరిజన విద్యార్థిగా చరిత్రకెక్కారు.
రాజకీయరంగం
[మార్చు]విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం వ్యక్తం చేసిన కూర్మయ్య విద్యాభ్యాస అనంతరం పార్టీకి పూర్తిస్థాయిలో పనిచేశారు. హరిజనోద్యమంలో, స్వాతంత్ర్యోద్యమంలోనూ ఆయన కృషిచేశారు. ఆయన 1936లో మొట్టమొదటిసారిగా సమష్టి మద్రాసు రాష్ట్ర శాసనసభ్యునిగా ఎన్నికై 1952లో తూర్పు కోస్తా ఎన్నికల తుఫానులో కాంగ్రెస్ కొట్టుకుపోయేవరకూ శాసనసభ్యునిగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో 1946-47ల్లో ప్రచురణ శాఖా మంత్రిగా, 1949లో గ్రామోద్ధరణ శాఖా మంత్రిగా పనిచేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకునిగా వేముల కూర్మయ్య పార్టీ పట్ల అసాధారణ నిబద్ధతను ఆనాటి పత్రికలు కొనియాడాయి. పార్టీ తీర్మానాలను అనుల్లంఘనీయమైన ప్రకృతి సూత్రాల్లా భావించేవారంటూ పాత్రికేయులు పత్రికాముఖంగానే ప్రచురించారు.[1]
స్వాతంత్ర్యోద్యమం
[మార్చు]వేముల కూర్మయ్య కాంగ్రెస్ పార్టీ నాయకునిగా స్వాతంత్ర్యోద్యమంలో కృషిచేశారు. స్వాతంత్ర్య సమరంలో భాగంగా కాంగ్రెస్ ప్రారంభించిన పలు ఉద్యమాలలో చురుకైన పాత్ర వహించారు.
హరిజనోద్ధరణ
[మార్చు]కాశీవిశ్వవిద్యాలయం నుంచి వ్యాయవాద పట్టా పొందిన తొలి హరిజన విద్యార్థిగా వేముల కూర్మయ్య రాజకీయరంగంలో కూడా హరిజనుల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు తమ కృషి సాగించారు. హరిజన విద్యార్థుల కోసం ఛాత్రాలయాలు (వసతి గృహాలు) ప్రారంభించి నిజయవంతంగా నడిపారు. హరిజనులకు నివాస స్థలాలు, వ్యవసాయ భూములు, ఉద్యోగాలు కావాలని, వాటి కోసం వీలున్నంతగా ప్రయత్నాలు చేశారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా హరిజనులు అభివృద్ధి సాధించాలని కృషిచేసినా తన ఆశయాలకు దగ్గరగా ఉన్న అంబేద్కర్ తదితరుల మార్గంలో చేరక కాంగ్రెస్ పార్టీకే నిబద్ధులయ్యారు.
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రసచిత్ర వారపత్రికలో తెలుగువెలుగులు శీర్షికలో 02-11-1960న వేముల కూర్మయ్య వ్యాసం
ఆధార గ్రంథాలు
[మార్చు]- జి. వి., పూర్ణచంద్ (2000). దీనజన బాంధవుడు శ్రీ వేముల కూర్మయ్య. విజయవాడ: శ్రీమధులత పబ్లికేషన్స్.
ఇవి కూడా చూడండి
[మార్చు]- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- 1901 జననాలు
- 1970 మరణాలు
- కృష్ణా జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- మద్రాసు ప్రెసిడెన్సీలో మంత్రులుగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- మద్రాసు ప్రెసిడెన్సీలో శాసన సభ్యులుగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- ఆంధ్ర రాష్ట్రంలో శాసన సభ్యులు