వేదుల సూర్యనారాయణ శర్మ
కళాప్రపూర్ణ డాక్టర్ వేదుల సూర్యనారాయణ శర్మ | |
---|---|
జననం | వేదుల సూర్యనారాయణ శర్మ 1911 ఫిబ్రవరి 4 పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు |
మరణం | 1999 సెప్టెంబెర్ 2 |
ఇతర పేర్లు | వేదుల సూర్యనారాయణ శర్మ |
వృత్తి | తెలుగు పండితుడిగా |
వేదుల సూర్యనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు లో జన్మింవారు.కాకరపర్రులో జన్మించిన వారిలో ఎందరెందరో గొప్ప పండితులుగా ప్రసిద్ధి చెందారు. వీరిలో ‘పండిత కవి’గా వాసికెక్కిన ‘కాకరపర్రు ముద్దుబిడ్డ’ వేదుల సూర్యనారాయణ శర్మగారు సాహిత్య, వ్యాకరణ శాస్త్రాల్లో నిష్ణాతునిగా తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1911 ఫిబ్రవరి 4 న జన్మించిన ఈయన సంస్కృతం, పాళీ, ఆంగ్ల భాషల్లో మంచి పట్టు సాధించారు. వివిధ భాషల్లో ప్రావీణ్యాన్ని సాధిస్తూనే మరో వైపు రచనలకు శ్రీకారం చుట్టారు. శర్మగారు 1936లో ‘శృంగార నళీయం’ అనే మాలికా రచన చేశారు. ఇందులో మూడు వందల చంపక మాలికా పాదాలున్నాయి. ఇది ‘ల’కార ప్రాసతో ఉంటుంది. ఈయన రచనల్లో ‘లక్ష్మీసహస్ర కావ్యం’ (1942) ఎందరి దృష్టినో ఆకర్షించి తెలుగునాట ప్రసిద్ధి చెందింది. ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు. ఇతివృత్తాన్ని బట్టి శైలీ వైవిధ్యాన్ని చూపడం తన ప్రత్యేకతగా శర్మగారు నిరూపించుకున్నారు.
‘అంబ! నీవొకతెవిడు కల్యాణఫలము
లితరు లిడలేరు వేయిమం దేకమైనఁ
బూర్ణి మాచంద్రుడిడిన సంపూర్ణ సుఖముఁ
గూర్చునే తారకల్ కోట్లకొలందియైన?’
- ఈ పద్యం ఆంధ్రీకృత ‘లక్ష్మీసహస్రం’లోనిది. ఏ మాత్రం తెలుగు పరిజ్ఞానం ఉన్నవారికైనా సులభంగా బోధపడే పద్యమిది. సంస్కృత మూలంలో కనిపించే కాఠిన్యం తెలుగులో లేదు. ఇది అసలు సిసలైన తెలుగు పద్యంలానే ఉంది. ‘లక్ష్మీసహస్ర కావ్యం’ రాసేనాటికి శర్మగారి వయసు కేవలం 25 ఏళ్లే. అందుకే ఆ కావ్యానికి జగద్దురు కంచి పరమాచార్యుల వారి ఆశీస్సులు లభించాయి. ఇంకా సాహితీస్రష్టలు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, మల్లాది సూర్యనారాయణశాస్త్రి, మంగిపూడి వేంకటశర్మ, చెన్నాప్రగడ భానుమూర్తి, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు తదితరులు పలువిధాలా శర్మగారి పాండిత్యాన్ని ప్రశంసించారు. ‘ కాకరపర్రు శతాబ్దాల నుంచి విద్యాపీఠం. అక్కడ ఇంకో పండితకవి పుట్టాడనంలో ఆశ్చర్యం లేదు. ‘లక్ష్మీసహస్రం’ ఇంత సులువుగా, శే్లషలతో, చమత్కృతులతో తెలుగులో రాయడం ఆశ్చర్యం కలిగించక తప్పదు’- అని కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు వేదుల వారి ప్రతిభకు అక్షర నీరాజనాలు సమర్పించారు. 1972 జనవరి 26న అప్పటి ముఖ్యమంత్రి పి.వి. నరసింహారావు హైదరాబాద్‌లో ‘లక్ష్మీసహస్రం’ ద్వితీయ ముద్రణ ప్రతులను ఆవిష్కరించారు.
అహింసామూర్తి బుద్ధ భగవానుడు తన శిష్యులకు పాళీ భాషలో అందించిన సూక్తిరత్నాల్లో కొన్నింటిని శర్మగారు ‘బుద్ధగీత’ పేరిట తెలుగులో తేటగీతులుగా రాశారు. ‘బుద్ధగీత’లో విషయాలు లోకోత్తరము, ఇందులో శైలి ఎంతో రమ్యంగా ఉందని ప్రథమ ముద్రణ సందర్భంగా డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ప్రశంసించారు.
ఆదిశంకరుల వారి ‘వివేక చూడామణి’ని శర్మగారు ‘శ్రీ శంకర భగవద్గీత’గా 1989లో ఆంధ్రీకరించారు. సరళమైన వ్యాఖ్యానంతో హృదయానికి హత్తుకుపోయేలా తేటగీతుల్లో ఆదిశంకరుల వారి హృదయాన్ని ఇందులో తేటతెల్లం చేశారు. వ్యాసప్రోక్తమైన భగవద్గీతను ‘తెలుగు వెలుగు భగవద్గీత’గా తేటగీతుల్లో రాసి, వ్యాస హృదయాన్ని ఆవిష్కరించారు. శర్మగారు రాసిన ‘ఆర్య చాణక్యుడు’, ‘కాకతి ప్రోలరాజు’ నవలలు చారిత్రక ఇతివృత్తంతో కూడినవి. ‘ఆర్య చాణక్యుడు’లో చాణక్యుడు (అర్థశాస్త్రం), వాత్స్యాయనుడు (కామశాస్త్రం) ఒకరేనని, ఈ రెండు గ్రంథాలను వేర్వేరు పేర్లతో రాశారని పలు ఆధారాలను చూపారు. ఈ వాదనలు పండితుల ఆమోదాన్ని పొందాయి. పురాణ వాజ్మయాన్ని శాసనాధారాలతో సమన్వయం చేసి కాకతీయులు ఎవరో ‘కాకతి ప్రోలరాజు’ నవలలో తేల్చి చెప్పారు.
ఆదిశంకరుల ‘సౌందర్య లహిరి’ శర్మగారి లేఖిని నుంచి జాలువారి మరింత సౌందర్యాన్ని సంతరించుకుంది. ‘సౌందర్య లహరి’ మూలంలో ‘శిఖరిణీ వృత్తాలు’ ఉన్నందున అనువాదంలో కూడా వాటిని సమర్థవంతంగా ఉపయోగించి ఉద్ధండ కవిగా శర్మగారు కీర్తి సంపాదించారు. ‘నరేంద్రుడు’, ‘తారావళి’ వంటి రచనలు కూడా ఈయనకు ఎంతో ఖ్యాతిని తెచ్చాయి. ‘అద్వైత శివలీలామృతం’, ‘అద్వైత దీపావళి’, ‘బ్రహ్మగీతాసారం’, ‘శ్రీదక్షిణామూర్తి స్తోత్రం’ వంటి రచనలు ఈయన పాండిత్యాన్ని ప్రతిబింబిస్తాయి. సంస్కృతం నుంచే గాక ఆంగ్లం నుంచి పలు అనువాదాలు చేసి శర్మగారు విమర్శకుల ప్రశంసలు పొందారు. బిఎన్ మల్లిక్ ఇంగ్లీష్‌లో రాసిన ‘ఎ ఫిలాసఫీ ఫర్ పోలీస్’ను ‘రక్షకభట తత్త్వశాస్త్రం’ పేరిట తెలుగులో రాశారు. ఈయన రాసిన ‘అంతరార్థ రామాయణం’ గ్రంథాన్ని ఎంవి నారాయణరావు (అప్పటి రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి) ఆంగ్లంలోకి తర్జుమా చేయడం విశేషం. అప్పటి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ దీనికి ముందుమాట రాశారు.
37 ఏళ్లపాటు తెలుగు పండితుడిగా పనిచేసి పదవీ విరమణ చేసినప్పటికీ శర్మగారు తన సాహితీ వ్యాసంగాన్ని వదిలి పెట్టలేదు. సారస్వతోపాసనే సరస్వతీ ఉపాసనగా భావించి, అక్షరాన్ని పరబ్రహ్మగా భావించారు. విశ్రాంతి లేకుండా సాహితీ రంగ సేవలో సేద తీరారు. భారత, భాగవత, రామాయణాల్లోని అంతరార్థాలను బోధిస్తూ వివిధ ప్రాంతాల్లో ఉపన్యాసాలు ఇచ్చారు. ఈయన రాసిన గ్రంథాల్లోని ముఖ్య విషయాలను క్రోడీకరించిన తెలుగు అధ్యాపకుడు డాక్టర్ బాలసుబ్బయ్య (సిద్ధిపేట) ‘వేదుల సూర్యుని జ్ఞానమహస్సు- అద్వైత వేదాంత దర్పణము’ గ్రంథాన్ని రాశారు. పండిత పరమేష్ఠి అయిన శర్మగారికి ఎన్నో బిరుదులు, సన్మానాలు దక్కాయి. తణుకులోని నన్నయ భట్టారక పీఠం, నరేంద్రనాథ సాహిత్య మండలి, రామకృష్ణ సేవా సమితి, ఏలూరుకు చెందిన తెలుగుదర్బారు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, ఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సమితి వంటి సంస్థలెన్నో ఈ సాహితీమూర్తిని గౌరవించాయి. 1940లో అప్పటి ప్రభుత్వ ఆస్థానకవి శ్రీ కాశీ కృష్ణాచార్యుల వారు ‘సరస్వతీ కంఠాభరణ’ బిరుదుతో సత్కరించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం 1978లో ‘కళాప్రపూర్ణ’తో గౌరవించింది. తన జీవితాన్ని సాహితీ సేవకే అంకితం చేసిన శర్మగారు 1999 ఫిబ్రవరి 2న (కృష్ణాష్టమి రోజున) ఈ లోకాన్ని వీడారు. ‘ఎదిగినకొద్దీ ఒదిగి ఉండే వ్యక్తి’గా కీర్తినార్జించి తన జీవితాన్ని సార్ధకం చేసుకున్నారు.
మూలాలు
[మార్చు]- ఆయన జీవిత విశేషాలు[permanent dead link]
- సరస్వతీ కంఠాభరణ కళాప్రపూర్ణ వేదుల సూర్యనారాయణ శర్మ గారికి నివాళులు