Jump to content

వేదిక:విజ్ఞానశాస్త్రము/2012 05వ వారం

వికీపీడియా నుండి

మానవునికి రెండు చేతులు (పర్యాయపదాలు: కరము; హస్తము) ఉంటాయి. మణికట్టు, అరచేయి మరియు వేళ్ళు చేతిలోని ప్రధానమైన భాగాలు. మన రెండు చేతులు ఎముకలు, కీళ్ళు, కండరాలు, నాడులు, రక్తనాళాలు మొదలైన వాటితో చేయబడినవి. మనం భౌతికంగా ఏవిధమైన పని చేయడానికైనా చేతులు మీదుగానే చేయగలుగుతున్నాము. ఇవి శక్తివంతమైన పనులే కాకుండా సున్నితమైన కళాత్మకమైన పనుల్ని కూడా ఇవి సాధ్యపడేటట్లు చేస్తాయి. చేతివేలి కొనలలో అతి సున్నితమైన నరాల మూలంగా స్పర్శ జ్ఞానం గురించిన సంకేతాల్ని మెదడుకు పంపించేలా చేస్తాయి. చేతుల్ని వ్యతిరేక దిశలోని మెదడు నియంత్రిస్తుంది.

భారతీయ సంస్కృతిలో చేతికి ఒక విశిష్టమైన స్థానం ఉన్నది. సూర్యోదయాన్నే లేచిన వెంటనే అరచేతిని చూసుకొని దైవప్రార్ధన చేసుకుంటే ఆ రోజంతా మంచే జరుగుతుందని కొందరు నమ్ముతారు. ముద్ర అనగా హిందూ మతం లో, బౌద్ధ మతం లో చేతులతో, వేళ్ళతో చేసే సంజ్ఞలు లేదా గుర్తులు. వీటిని నృత్య రూపకాల్లోనూ, శిల్పకళ, మరియు చిత్రకళల్లోనూ గమనించవచ్చు. ముఖ్యంగా నాట్యాల్లో ప్రదర్శించే ముద్రలు, అసంఖ్యాకంగా ఉన్నాయి. శాస్త్రీయ నాట్యంలో ప్రదర్శించే హస్త ముద్రల్లో సుమారు 500 రకాలైన అర్థాలను వ్యక్తపరచవచ్చని ఒక అంచనా. భారతీయతను చాటి చెప్పే నమస్కారం ఒక ఉన్నతమైన ముద్ర. ఇది ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు పద్ధతిగా పరిగణింపబడుతుంది. గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని ప్రకటించుకొనే ప్రక్రియ. హిందువుల వివాహంలో పాణిగ్రహణము ఒక ప్రధానమైన ఘట్టం.