Jump to content

వీర్ల దేవాలయం (కారంపూడి)

వికీపీడియా నుండి
(వీర్లదేవాలయం (కారంపూడి) నుండి దారిమార్పు చెందింది)
కారెంపూడి గ్రామంలోని వీర్లదేవాలయం

వీర్లదేవాలయం (వీరులగుడి) 11వ శతాబ్దంలో పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు ఆశయసిద్ది కోసం యుధ్దంలో మరణించిన 66 వీరనాయుకులకు గుర్తు[1]లుగా 66 వీరకల్లును ప్రతిష్ఠించి వీరాచారపీఠం స్థాపించి, దానికి పిడుగు వంశంవారిని పీఠాధిపతిగా నియమించాడు. ఆ వీరకల్లులు, వీరాచారపీఠం ఉన్నదే వీరులగుడి (వీర్లదేవాలయం). ఈ గుడి పల్నాడు జిల్లా లోని కారంపూడి పట్టణంలో నాగులేరు ఒడ్డున ఉంది. యుద్ధంలో మరణించిన వీరులకు దైవత్వాన్ని ఆపాదించి, వారు ఉపయోగించిన ఆయధాలకు పూజల చేసి ఉత్సావాలు జరపటం అనే సాంప్రదాయం ప్రపంచంలో రోమ్ తరువాత ఒక్క కారంపూడి లోని వీరురగుడిలోనే జరుగుతుంది.[2]

చరిత్ర

[మార్చు]

మహాభారత యుద్ధంలో ఘట్టాల్లా పల్నాటి యుద్ధానికి అనేక కారణాలున్నాయి. అనుగురాజు పల్నాట గురజాలను రాజ్యంగా చేసుకొని బ్రహ్మనాయుని మంత్రివర్గంలో పాలించిన సమయంలో నాగమ్మ ఆతిధ్యం స్వీకరించి కానుకను కోరుకోమనటం, అనంతర కాలంలో అనుగురాజు కొడుకైన నలగాముడి పరిపాలనలో కానుకగా మంత్రి పదవిని నాగమ్మ అడగటంతో పల్నాడు చరిత్రకు అంకురార్పణ జరిగింది.అప్పటికే వైష్ణవం ద్వారా ప్రజల్లో సమసమాజ స్థాపనకు బ్రహ్మన్న సుస్థిరస్థానం పొందాడు.ఇదే క్రమంలో శైవాన్ని ప్రబోధిస్తూ నాగమ్మ పల్నాట ముఖ్యస్థానం సంపాదించింది. ఈ క్రమంలో పల్నాడు రాజ్యం రెండు ముక్కలైంది. అనుగురాజు మొదటి భార్య సంతానమైన నలగామునికి గురజాల, రెండో భార్య సంతానమైన మలిదేవాదులకు మాచర్ల రాజ్యంగా పంపకాలు జరిగాయి. ఇరురాజ్యాల మధ్య కోడిపోరుతో కక్షలు మొదలయ్యాయి.ఈ క్రమంలో మండాది వద్ద ఆలుమందలను అంతమొందించే క్రమంలో లంకన్న ఒరగటం, నలగాముని అల్లుడు అల్లరాజు మృతి పల్నాటి యుద్ధానికి దారి తీసింది. బ్రహ్మన్న దత్తపుత్రుడు కన్నమనీడు నేతృత్వంలో బాలచంద్రుడు తదితర 66 మంది నాయకులు ఈ పల్నాటి యుద్ధంలో అసువులు బాశారు. చివరి అంకంలో బ్రహ్మన్న, నాగమ్మలు కత్తులు దూసినప్పటికీ వైరాగ్యంతో బ్రహ్మన్న గుత్తికొండ బిలంలోకి ప్రవేశించటం, దుర్మార్గపు నాగమ్మను చంపకుండా వెలి వేసాడు. వరంగల్లు దగ్గర దారుణంగా చనిపోయింది. నలగామునితో రాజ్యం చేయించటంతో పల్నాటి యుద్ధం ముగిసింది.

ఆలయ విశేషాలు

[మార్చు]

11వ శతాబ్దంలో జరిగిన పల్నాటి యుద్ధానంతరం అందులో పాల్గొన్న వీరనాయకులకు ఆరాధనోత్సవాలు నిర్వహించటం పూర్వం నుండి పరిపాటిగా మారింది. బ్రహ్మన్న స్థాపించిన సమసమాజాన్ని రక్షించేందుకు ఈ ఆచారాన్ని ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో చెన్నకేశవస్వామి దేవాలయాలను మాచర్ల, కారంపూడిల్లో ఏర్పాటు చేసి చాపకూటిని ప్రవేశపెట్టాడు. అదే తీరున ప్రస్తుతం బ్రహ్మన్న ద్వారా ఆచారాన్ని పొందిన పిడుగు వంశీకులు చాపకూడు సిద్దాంతం వీరారాధన ద్వారా నిలుపుతున్నారు. ప్రతియేటా వీరారాధనోత్సవాలు ఘనంగా జరుగుతాయి[3].

వీరారాధనోత్సవాలు

[మార్చు]

శతాబ్దాల చరిత్రకు తార్కాణం వీరారాధనోత్సవాలు.దాయాదుల సమరంతో మహాభారతంతో సమానంగా చరిత్రపుటల్లో ఎనలేని ఖ్యాతి గడించింది పల్నాటి యుద్ద చరిత్ర. సంకుల సమరంలో ఎందరో వీరనాయకులు అసువులు బాసిన కార్యమపూడి నేటి కారంపూడి సమర క్షేత్రంలో అలనాటి వీరనాయకులకు ప్రతీకగా ఉన్న ఆయుధాలకు (కొణతాలు) పూజలు నిర్వహించటం, వారి పేరుతో ఆరాధనలు చేయటం పరిపాటిగా వస్తోంది. కార్తీక అమావాస్య నాడు ప్రారంభమయ్యే ఆరాధనోత్సవాలు ఐదురోజుల పాటు నిర్వహిస్తారు[4].

పల్నాట శైవ, వైష్ణవ సంప్రదాయాలను నింపటం కోసం పల్నాడు యుద్ధానికి బీజాలుపడ్డాయి. సా.శ. 1187లో పల్నాడు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో గురజాల, మాచర్ల రాజులైన నలగాముడు, మలిదేవాదులు తలపడ్డారు. శైవం కోసం నాగమ్మ, వైష్ణవం కోసం బ్రహ్మనాయుడు వర్గాలు రణక్షేత్రంలో కరవాలాలను ఝుళిపించాయి. ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటూ, ప్రజాసంక్షేమాన్ని కాపాడుతూ పల్నాటి యుద్ధానికి అతిరథులు బీజం వేశారు. ఇరురాజ్యాలకు మధ్యనున్న కారంపూడిని రణక్షేత్రంగా ఎంచుకొని కత్తులు దూశారు.పల్నాటి యుద్ధంలో గెలిచిన వీరులు తమ ఖడ్గాలను నాగులేరులో పుణ్యస్నానాలు చేసి శుభ్రపర్చుకున్నట్లుచరిత్ర చెబుతుంది[5].

మొదటిరోజు రాచగావు

[మార్చు]

రాజు ఇచ్చే బలిని (నోటితో కొరికి మేకపోతును చంపటం) రాచగావుగా పిలుస్తారు. బలిని పోతురాజుకు ఇవ్వటం ద్వారా పల్నాడు వీరారాధనోత్సవాలకు తెరలేస్తుంది. రాష్ట్రంలోని 11 జిల్లాలోని ఆచారవంతులు తమ కొణతాలు (దైవాలు) తీసుకొని కారంపూడిలోని వీర్లదేవాలయం చేరతారు.

రెండోరోజు రాయబారం

[మార్చు]

అలరాజు కోడిపోరులో ఓడిన మాచర్ల రాజ్యాన్ని తిరిగి మలిదేవులకు అప్పగించాలని గురజాల రాజు నలగాముని వద్దకు సంధికి వెళతాడు. ఈ క్రమంలో నాగమ్మ ప్రభావంతో తంబళ్ళ జీయర్‌ ద్వారా చర్లగుడిపాడు వద్ద హత్యకు గురవుతాడు. ఆనాటి హత్యాకాండను వీరవిద్యావంతులు ఆలపిస్తుంటారు. ఈ క్రమంలో ఆచారవంతులు అవేశపూరితంగా కత్తిసేవ చేస్తుండటం నేటికి దర్శనీయమే.[6]

మూడోరోజు మందపోరు

[మార్చు]

కోడిపోరులో రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలైన మలిదేవాదుల వద్ద ఉన్న ఆవులను అంతమొందించేందుకు నాగమ్మ పన్నాగం ద్వారా అడవి చెంచులు దాడి చేసే క్రమంలో లంకన్న అసువులు బాస్తాడు. లంకన్నకు శంఖుతీర్ధం ఇవ్వటం ద్వారా విముక్తిని బ్రహ్మన్న ప్రసాదిస్తాడు[7].

నాలుగోరోజు కోడిపోరు

[మార్చు]

అలనాడు రెంటచింతల మండలంలోని పాలువాయి వద్ద జరిగిన ఇరురాజ్యాల మధ్య కోడిపోరు దృశ్యాన్ని నేటికీ చూపుతారు. మంత్రాక్షితలతో బ్రహ్మన్న పుంజును నాగమ్మ ఓడేలా చేయటం, రాజ్యం విడిచి మలిదేవాదులు అరణ్యవాసం పట్టటం ఇందులోని ముఖ్యఘట్టం[8][9].

ఐదో రోజు కల్లిపాడు

[మార్చు]

పల్నాటి యుద్ధంలో వీరనాయకులు అసువులు బాయటమే కల్లిపాడు ఉద్దేశం. ముందుగా ఏర్పాటు చేసిన తంగెడ మండలపై కొణతాలు (దైవాలు) ఒరుగుతాయి. దేవుళ్ళు ఒరిగిన మండల కోసం ప్రజలు ఎగబడతారు. దీంతో వీరారాధనోత్సవాలుముగుస్తాయి[10].

ప్రస్తుత పీఠాధిపతి

[మార్చు]

ప్రస్తుతం వీరాచారాన్ని నిలుపుతున్న పిడుగు వంశీకులలోని పిడుగు తరుణ్‌ చెన్నకేశవ అయ్యవారు పిన్న వయస్కుడు. 13 ఏళ్ళ చిరుప్రాయంలోనే పల్నాటి వీరాచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకపక్క చదువుతూ తండ్రి బొగ్గరం విజయ్‌ నేతృత్వంలో ఆచారాన్ని కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు[11]. గ్రామంలో నేటికి అలనాటి చారిత్రక చిహ్నాలు ఉన్నప్పటికి ఆదరించే అధికారులు కానరాక శిథిలావస్థకు చేరాయి.

మూలాలు

[మార్చు]
  1. Hiltebeitel, Alf (2009-02-15). Rethinking India's Oral and Classical Epics: Draupadi among Rajputs, Muslims, and Dalits (in ఇంగ్లీష్). University of Chicago Press. ISBN 978-0-226-34055-5.
  2. Devi, Yashoda (1993). The History of Andhra Country, 1000 A.D.-1500 A.D.: Administration, literature and society (in ఇంగ్లీష్). Gyan Publishing House. ISBN 978-81-212-0485-9.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-12-04. Retrieved 2017-11-21.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-17. Retrieved 2016-11-15.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-11-21. Retrieved 2017-11-21.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-11-23. Retrieved 2017-11-21.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-11-23. Retrieved 2017-11-21.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-11-24. Retrieved 2017-11-21.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-11-24. Retrieved 2017-11-21.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-11-24. Retrieved 2017-11-22.
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-11-21. Retrieved 2017-11-21.

వెలుపలి లంకెలు

[మార్చు]