విద్యుద్విశ్లేషణ
విద్యుద్విశ్లేషణ (ఆంగ్లం Electrolysis) ద్రావణం ద్వారా విద్యుత్తును ప్రసరింపజేసి దానిలోని రసాయనిక మూలకాలను వేరుచేసే ఒక విధమైన రసాయనిక ప్రక్రియ.
ఒక వాహకం ద్వారా విద్యుత్ ప్రవహించడం వాహకం స్వభావం మీద ఆధారపడుతుంది. కొన్ని వాహకాలలో ఎలక్ట్రాన్లు అధిక రుణ శక్మం నుంచి తక్కువ రుణ శక్మానికి ప్రవహించడంతో బాటు ఎలక్ట్రాన్ లు వాహకాల ద్వారా ప్రత్యక్షంగా అభిగమనం జరుగుతుంది. అటువంటి వాహకాలను ఎలక్ట్రానిక్ వాహకాలు (Electronic conductors) అంటారు. మరికొన్ని వాహకాలలో విద్యుత్ ప్రవహించడం వల్ల అయాన్ లు అభిగమనం చెందడం, దీని ద్వారా ద్రవ్యం కూడా బదిలీ అవడం జరుగుతుంది. అటువంటి వాహకాలను విద్యుద్విశ్లేషక వాహకాలు లేదా విద్యుద్విశ్లేష్యాలు (Electrolytes) అంటారు. రెండవ రకం వాహకాలలో ఎలక్ట్రోడ్ ల వద్ద రసాయనిక మార్పులు జరుగుతాయి.
విద్యుద్విశ్లేషణ ప్రక్రియ
[మార్చు]విద్యుద్విశ్లేషక వాహకం ద్వారా ఒక విద్యుత్ ప్రవాహాన్ని పంపినపుడు పదార్థ రవాణా జరుగుతుంది. ఉదాహరణకు ఒక బ్యాటరీకి తగిలించిన రెండు ప్లాటినం తీగలను ఆమ్ల విలీన ద్రావణంలో ఉంచితే ప్లాటినం తీగల వద్ద హైడ్రోజన్, ఆక్సిజన్ బుడగలు విడుదలవుతాయి. దీనికి బదులుగా ప్లాటినం తీగలను కాపర్ లేదా సిల్వర్ లవణ ద్రావణంలో ఉంచితే తీగలలో ఒక దానివద్ద హైడ్రోజన్ కి బదులుగా అణురూప లోపం (కాపర్ లేదా సిల్వర్) నిక్షిప్తం అవుతుంది. ఈ దృగ్విషయాన్ని విద్యుద్విశ్లేషణ అంటారు. దీనిని మొట్టమొదట ఎమ్.ఫారడే అధ్యయనం చేసాడు. ఫారడే ఉపయోగించిన ఆచారం ప్రకారం ప్లాటినం తీగలను ఎలక్ట్రోడ్ లు (Electrodes) అంటారు. ఈ ఎలక్ట్రోడ్ ల వద్ద విద్యుద్విశ్లేషక ద్రావణంళోని విద్యుత్ వస్తుందా లేదా బయటికి పోతుందా అనే దానిని బట్టి ఏనోడ్ (Anode) లేదా కాథోడ్ (Cathode) అంటారు. ఈ ఆచారం ప్రకారం బ్యాటరీ ధన ధృవానికి తగిలించినది ఏనోడ్, రుణ ధృవానికి తగిలించినది కాథోడ్, ప్రక్రియలో హైడ్రోజన్ వాయువు లేదా లోహం కేథోడ్ వద్ద లభిస్తుంది. ఆక్సిజన్ వాయువు ఏనోడ్ వద్ద లభిస్తుంది. అయితే ఎలక్ట్రోడ్ పదార్థంతో రసాయన చర్య జరపకూడదు. విద్యుత్ ప్రవాహంతో బాటు ఆవేశిత కణాల చలనం కూడా జరుగుతుంది. వీటిని అయాన్ లు (Ions) అంటారు. ధనావేశం ఉండి, కేథోడ్ వైపు చలిస్తున్న కణాలను కాటయాన్ (Cation) లని, రుణావేశం ఉండి, ఏనోడ్ వైపు చలిస్తున్న వాటిని ఏనయాన్ (Anion) లని అంటారు. ఎలక్ట్రోడ్ లను చేరిన తరువాత అయాన్ ల ఆవేశాలు తటస్థీకరించబడి, అవి మామూలు పరమాణువులు లేదా అణువులుగా నిక్షిప్తమవుతాయి.